బాలచందర్ తీసిన "ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)" ఓసారెప్పుడో టివీలో చూసాను. ఆసక్తికరంగా మొదలుపెట్టి ఉత్కంఠంతో చివరికి ఏమౌతుంది.. అని చివరిదాకా చూస్తే.. చివరికి తన సహజ ధోరణిలో మనసుని భారం చేసేస్తారు బాలచందర్ :( నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో బాలచందర్ ఒకరు. ఆయన తీసినవి దాదాపు అన్ని సినిమాలు చూసాను. ఈ క్లైమాక్స్ విషయంలోనే నాకు ఆయనతో పేచీ :) సినిమా అంతా చక్కగా తీసి క్లైమాక్స్ చెడగొట్టడమో లేదా దు:ఖ్ఖాంతం చెయ్యటమో బాలచందర్ కు ఉన్న మహా చెడ్డ అలవాటు.
ఈ సినిమా కథలో నాకు బాగా నచ్చినది దర్శకుడు స్త్రీ కి ఇచ్చిన విలువ. మగవాడి పతనం వెనుకే కాదు విజయం వెనుక కూడా స్త్రీ పాత్ర ఉంటుంది. రాక్షసుడు లాంటి మనిషిని కూడా ఉన్నతుడిలా తీర్చిదిద్దగల ఓర్పూ, నేర్పు స్త్రీకి ఉన్నాయి అని చెప్తుంది ఈ కథ. నర్సింహ మృగంలా మారటానికి కారణం అతని తల్లి. మళ్ళీ అతను మనిషిగా మారటానికీ, అతని జీవితాన్ని అనురాగంతో నింపటానికీ ఇద్దరు స్త్రీలు కారణం. ఈ సినిమా కూడా ఎంతో చక్కగా ఉంటుంది సగానికి పైగా. జయసుధ నటన నిజంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో ఉన్న మిగతా నటిమణులంత గ్లామరస్ గా లేకపోయినా, సహజ నటిగా, చాలావరకు చీరకట్టులోనే కనిపిస్తూ, ఆనాటి నటీమణుల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది తాను ఎంచుకున్న పాత్రల ద్వారా నిరూపించుకుంది ఆమె. ఈ చిత్రంలో నర్సింహులు లాంటి కిరాతకుడ్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన రాణి పాత్రకు జయసుధ ప్రాణం పోసిందని చెప్పాలి. నాకెంతో ఉన్నతంగా కనబడుతుందా పాత్ర. చదువురాని 'దబ్బపండు' పాత్ర కూడా ఎంతో ఉదాత్తంగా ఉంటుంది.
కృష్ణంరాజు సినిమాలు చాలా తక్కువ చూసానేమో.. ఇందులో అతని నటన నన్నాశ్చర్యపరిచింది. ఎంతో చిన్న చిన్న హావభావాలను కూడా సమర్థవంతంగా అభినయిస్తాడతను. కౄర స్వభావం లోంచి చదువుకున్న వివేకవంతుడిగా అతను పాత్రలో నటనలో తీసుకువచ్చిన మార్పులు మనల్ని మెప్పిస్తాయి. రాణి చెప్పే "ఆరడుగుల విగ్రహానికి ఆవగింజంతైనా నిగ్రహం లేదు", "నువ్విలా చూస్తే నే నీరుగారిపోతా" అన్న నర్సింహ డైలాగులు; సారాకొట్టు దబ్బపండు పాత్రలో వై.విజయ, "క" భాష మాట్లాడే చలాకి పిల్లగా సరిత పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.
"ఎవరికి ఎవరూ సొంతం కాదు. ఇద్దరిదీ ఇచ్చిపుచ్చుకునే బేరం.. అంతే " అనే 'దబ్బపండు' పాత్ర వై.విజయకు లభించిన నటనకు ఆస్కారం ఉన్న అతి తక్కువ పాత్రల్లో ఒకటి. ఇప్పటి మోడ్రన్ 'లివ్ఇన్ రిలేషన్ షిప్' ను నర్సింహులు-దబ్బపండుల సహజీవనం ద్వారా అప్పట్లోనే చూపెట్టాడు దర్శకుడు.
చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు !
ఈ సినిమాను యూట్యుబ్ లో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://www.youtube.com/watch?v=tUULiZT3AbI
ఇందులో ఒక పాట ఉంటుంది.. "ఆడవాళ్ళూ మీకు జోహార్లు " అని. నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం. పైన యూ ట్యూబ్ సినిమా లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం.
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్
పాడినది : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం:
ఆడాళ్ళూ మీకు జోహార్లు
ఓపిక ఒద్దిక మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళూ
((ఆడాళ్ళూ))
ఒకరు దబ్బపండు, ఒకరు పనసపండు
ఒకరిది కనబడే పచ్చదనం
ఒకరిది కానరాని తీయదనం((ఒకరు..))
ఇద్దరి మంచితనం నాకు ఇస్తుంది చల్లదనం
ఇది తలుచుకుంటే మతి పోతుందీ దినం
((ఆడాళ్ళూ))
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం, మనిషి చేయడం
మనసు నిదరలేపడం, మమత నింపడం((గోరంత))
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మర్చుకోవడం
ఇదే పనా మీకు..? ఊ..? ఇందుకే పుట్టారా?
((ఆడాళ్ళూ))