సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, January 1, 2013

ఈరోజు..




క్రిందటి సంవత్సరం ఈరోజున సందడి, సంబరం లేకుండా పాదానికి కుట్లతో,కట్టుతో మంచం మీద ఉన్నా! ఈ ఏడు మా గేటెడ్ కమ్యూనిటీ తాలూకూ బిల్డర్స్ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీలో సరదాగా కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టా. రెండు స్థితులకీ ఎంత తేడానో !! ఈ తేడానే ఏదో ఆశనీ, కొత్త ఉత్సాహాన్నీ నింపింది నాలో. 


అసలు న్యూ ఇయర్ పార్టీలో పాల్గొనటం ఇదే మొదలు మాకు. ప్రతి న్యూ ఇయర్ కీ ఎప్పుడూ ఇంట్లోనే గడుపుతాం. ఈసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మా బిల్డర్స్  ఆహ్వానాలన్నింటికీ తప్పనిసరిగా హాజరుకావాల్సి వస్తోంది. మా కమ్యూనిటీలో మొత్తం ఎనిమిది బిల్డింగ్స్ ప్లాన్ లో ఉన్నాయి. ఆరు పూర్తయ్యాయి. మిగిలినవాటి నిర్మాణం జరుగుతోంది.  ఒకో బిల్డింగ్ కీ ఐదు ఫ్లోర్లు, ఫోరుకి పధ్నాలుగు ఫ్లాట్లు... అంటే దాదాపు ఐదువందలఏభై పైగా కుటుంబాలు ఇక్కడ చేరబోతున్నాయి. ఇదో పల్లెటూరన్నమాట. పిల్లలకీ,పెద్దలకీ స్విమ్మింగ్ పూల్స్; బేడ్మెంటన్ కోర్ట్, ఓపెన్ యెయిర్ పార్టీ ప్లేస్ కాక ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టారు. జిమ్నాసియం, క్లబ్ హౌస్, లైబ్రరీ, బ్యూటీ పార్లర్, యోగా రూమ్ మొదలైన ఎన్నో ఎమినిటీస్ తో షాపింగ్ కాంప్లెక్స్ తయారైంది. నిన్న రాత్రి మా షాపింగ్ కాంప్లెక్స్  ఇనాగరల్ ఫంక్షన్, ప్రస్తుతం ఇక్కడ నివాసముంటున్న రెండువందల కుటుంబాలకి డిన్నర్ ఏర్పాటు చేసారు. ఆ తర్వత న్యూ ఇయర్ పార్టీ అన్నారు.


ఎందుకొచ్చిన గోల.. పోదాం పదవే అంటే "నేనిప్పుడే కదా ఇలాంటి పార్టీ చూడటం.. నా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు..ఉందాం.." అని మా పాప పేచీ. ఇక తన కోసం మేమూ తప్పనిసరిగా కూచుండిపోయాం. రోజూ తనతో ఆడుకునే పిల్లలు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే తనకూ చూడాలని ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి ఐదునెలలౌతున్నా నాకు గట్టిగా అరడజను మంది కూడా తెలీదు. రోజూ ఆడుకుంటారు కాబట్టి పిల్లలందరూ ఫ్రెండ్స్. ఏమిటో మా ఇద్దరికీ ఈ గోల.. పార్టీ హడావుడి పడదు. పాప కోసం తను ఉండిపోయారు కానీ మధ్యలో రెండుమూడు సార్లు నేను ఇంటికి వచ్చి వెళ్ళా. ఆ గోలలో ఉండేకన్నా ఓ పుస్తకం చదువుకుందాం అని కూచున్నా కానీ టైం పావుతక్కువ పదకండు అయ్యాకా.. ఒక్కదాన్ని ఇంట్లో ఎందుకు అని మళ్ళీ తాళం పెట్టి అక్కడికే వెళ్పోయా.


ఏవో సినిమాపాటలకీ, పాప్ సాంగ్స్ కీ పిల్లలు, కొందరు పెద్దలు డాన్సులు చేసారు. మాకు వాటిల్లో ఒకటి అరా తప్ప ఏమీ తెలీవు. పైగా గుండెలదిరిపోయేలా సౌండ్. సరే డాన్సులు అయ్యాకా పన్నెండు దాకా తంబోలా ఆడారు అంతా. చివర్లో మ్యూజిక్ పెట్టి పిల్లలను స్టేజ్  మీద డాన్స్ చెయ్యమంటే అంతా వెళ్ళి గెంతులు మొదలెట్టారు. మా పిల్లనీ వెళ్లమన్నాం కానీ అది వెళ్ళలే. క్రిందనే కూచుని చీర్ చేసింది స్నేహితులని. ఆ పిల్లలేమిటో...ఆ డాన్సులేమిటో !! 'వీళ్ళు పిల్లలా..' అనిపించింది. పిల్లని వెళ్లమన్నానే కానీ ఎక్కడ అది కూడా వాళ్లందరితో పిచ్చి గంతులు వేస్తుందో అని బెంగపడ్డా. అది వెళ్లనందుకు మేమిద్దరం సంతోషించాం. పన్నెండు కొట్టగానే కేక్ కోసి పిల్లలంతా కలిసి చుట్టూరా కట్టిన బెలూన్స్ అన్నీ ఒక్కటి మిగల్చకుండా పగులగొట్టేసారు. 


ఆ సందడి, ఫ్లాట్స్ లో ఉండే వాళ్లందరూ ఒకరినొకరు గ్రీట్ చేసుకోవటం బాగా నచ్చింది నాకు. ఇంతవరకూ పరిచయంలేని వాళ్ళు కూడా పలకరించి విషెస్ చెప్పారు నాకు. పెద్దలు కూడా పిల్లల్లా పరిగెట్టి, ఒకరికొకరు కేక్ పూసుకుని నవ్వుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. అదంతా శుభసూచికంగా, ఎంతో ఐకమత్యం, స్నేహభావం ఉన్న వీళ్లందరి మధ్యా మా జీవనం తప్పక సరదాగా గడుస్తుందని నమ్మకం కలిగింది. పిల్ల పేచీ పెట్టకపోతే ఈ ఆనందం, ఆశాభావం మిస్సయ్యేదాన్నేమో అనుకున్నా ! ఒంటిగంట దాటాకా అందరం మా మా ఇళ్ళు చేరి నిద్రలో మునిగిపోయాం. 


ఇవాళ పొద్దున్న కూడా సమీప బంధువుల ఆగమనం,  నే వండినది వాళ్ళు ఆనందంగా కడుపునిండా తినటం కూడా నన్నెంతో సంతృప్తి పరిచాయి. కొత్త సంవత్సరారంభంలో నాలాంటి సామాన్య జీవికి ఇంతకు మించిన ఆశావాద ప్రారంభం మరేముంటుంది ?

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.