నేను బ్లాగు రాయటం మొదలెట్టినప్పటి నుండీ ఎందరో బ్లాగ్మిత్రులు తమ టపాల్లో "పాపికొండలు" అందాలు చూపించి, వారి అనుభూతిని పంచి.. ఊరించి ఊరించి... ఎలాగైనా పాపికొండలు చూడాలి అనే కోరికను బలపరిచేసారు..:) కానీ ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకని అటువైపు వెళ్తున్నా కూడా ఉన్న రెండురోజుల్లో ఈసారి పాపికొండలు ప్రయాణం కుదరదులే అని అసలు ప్లాన్ చేసుకోలేదు మేము. కానీ మేము యానాం దగ్గర ఉళ్ళో ఉండగా మా పిన్నత్తగారు ఫోన్ చేసి నేను టికెట్లు బుక్ చేస్తాను. శెలవుల టైమ్ కాదు కాబట్టి రష్ తక్కువగానే ఉంటుంది అందరం సరదాగా వెళ్దాం అని వత్తిడి చేసేసరికీ సరేననేసాం. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి "అనుకోకుండా బంధువులు వస్తున్నారు మాకు కుదరదు.." అనేసారు. మా అత్తగారు కూడా రాలేననేసారు. అనుకున్నాం కదా మనం వెళ్ళొచ్చేద్దాం అని శ్రీవారిని ఒప్పించాను.
అసలు రాజమండ్రి నుండి భద్రాచలం దాకా బోటులో వెళ్ళాలి అనేది మా కోరిక. సమయాభావం వల్ల పేరంటపల్లి వరకే టికెట్ తీసుకున్నాం. పొద్దున్నే ఏడున్నరకే రావాలని టూరిజం వాళ్ళు చెప్పారు. మేం వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆ రాత్రికి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి రాజమండ్రి చేరేసరికి పదకండు అయ్యింది. పొద్దున్నే లేచి ఏడున్నరకల్లా పుష్కరాల రేవు వద్దకు చేరాం. హైదరాబాద్ లో చలి చంపుతోంది కానీ ఇక్కడ చలి జాడే లేదు. పొద్దున్నే చుర్రున ఎండ. ఎనిమిదిన్నరక్కూడా మమ్మల్ని ఎక్కించుకోవాల్సిన టూరిజం వాళ్ల బస్సు రాలేదు. టిఫిన్, భోజనం వాళ్ళే బోటులో పెడతానన్నారు. పిల్లకి ఇంట్లోనే తిఫిన్ పెట్టేసి, దారిలో అది తినడానికి బిస్కెట్లు,బ్రెడ్ మొదలైనవి కూడా కొని తెచ్చాను. బస్సు రాలేదు కదా అని ఈలోపూ రేవులోకి వెళ్ళి కాసేపు గోదారిని చూసి వచ్చాం..:) తొమ్మిదవుతూండగా వచ్చింది బస్సు. బస్సులో వెళ్తుండగా ఫోటోలు తీద్దాం అని బ్యాటరీలు వేసేసరికీ కెమేరా "లో బ్యాటరీ" అని బ్లింక్ అవ్వటం మొదలెట్టింది. రాత్రంతా చార్జ్ చేసా కదా..ఏమయ్యిందో తెలీలే...:( ఇంతదూరం రాకరాక వచ్చి ఫోటోలు తీసుకోలేకపోతే...నా ప్రాణం గిలగిలలాట్టం మొదలెట్టింది. పాపికొండలు ఫోటోలు తీసాకా అప్లోడ్ చెయ్యమని ఎంతమంది చెప్పారో ! బస్సువాడు పురుషోత్తపట్నం రేవుకి తీస్కెళ్ళి అక్కడ బోటు ఎక్కించాడు. ఆ రేవులో డ్యూరాసెల్ బ్యాటరీలు దొరకలేదు. దారిలో గండి పోచమ్మ గుడి వద్ద దొరుకుతాయి అనిమాత్రం చెప్పారక్కడ. ఏడుపుమొహం వేసుకుని బోటెక్కి కూచున్నా.
బోట్ లోపల ఏసి ఉన్నా, పైన అయితే బాగా చూడచ్చని పైనే కూచున్నాం. కడుపు నకనకలాడుతుంటే పదకొండింటికి తిఫిన్ పెట్టాడు. పెద్ద బాలేకపోయినా ఆకలి మీద తినేసాం. గండి పోచమ్మ గుడి ఎప్పుడు వస్తుందా...అని నిమిషాలు లెఖ్ఖేసుకుంటూ కూచున్నా. వచ్చింది. శ్రీవారు బ్యాటరిల కోసం వెళ్లారు. ఊళ్ళో బయల్దేరేప్పుడు మా మొబైల్ ఛార్జర్స్ తేవటం మర్చిపోయా :( రైల్లో అది గమనించాకా కూడా సుభ్భరంగా పాటలు పెట్టుకు వినేసా. రైలు దిగేసరికీ మా ఇద్దరి ఫోన్లు ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు తిరిగి బోట్లోకి అంతా వచ్చేసారు కానీ తను రాలేదు. ఫోన్ చెయ్యటానికి ఇద్దరి వద్దా ఫోన్లు లేవు. ఎందాకా వెళ్లారో తను... నా కంగారుకి తోడు అన్నీ ఇలాగే అవుతాయి అని నన్ను నేను బాగా తిట్టేసుకున్నా ! "మావారు రావాలి..కాసేపు ఆపమని బోటువాడికి చెప్పా.." చేతులూపుకుంటూ వస్తున్న మావారిని చూసి నా కంగారు ఎక్కువయ్యింది. మెట్లెక్కి పైకి వచ్చి "హాయిగా ట్రిప్ ఎంజాయ్ చెయ్యి. ఫోటోల గురించి మర్చిపో..." అన్నారు. మరో నిమిషంలో కుళాయి కారుతుంది అనగా జేబులోంచి బ్యాటరీలు తీసారు. వెంఠనే వెయ్యి వాట్లు బల్బ్ లా నా మొహం వెలిగిపోయింది. అమాంతం బ్యాటిరీలు లాగేసుకుని కెమేరాలో వేసేసి కరువుతీరా ఫోటోలు తీసేయటం మొదలెట్టేసా :)
దారిలో వచ్చే గిరిజన పల్లెల వివరాలు, షూటింగ్ స్పాట్స్ (సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి మొదలైన సినిమాలు) అన్నీ చూపిస్తూ మధ్య మధ్య కాటన్ దొర గారి గురించి, గోదావరి నది గురించీ, పోలవరం ప్రాజక్ట్ గురించి కబుర్లు చెప్పాడు గైడ్. మధ్యాన్నం భోజనాలు బానే ఉన్నాయి. కాస్త కడుపు నిండకా చుర్రున ఎండ మండిస్తుంటే క్రింద ఏసి హాల్లోకి వెళ్ళి సేదతీరాం. దాదాపు రెండింటికి "పాపికొండలు" మొదలయ్యాయి. అసలు అక్కడ నుండే బోటు ప్రయాణం ఆస్వాదించాం అని చెప్పాలి. నెమ్మదిగా బోటు కదులుతుంటే, బయట నడవలో నిలబడి ప్రవహించే గోదారినీ, అటుఇటు పచ్చని చెట్లతో మనల్ని దాటి వెన్నక్కు వెళ్తున్న పాపికొండల అందాలనూ చూసి తీరవలసిందే. అక్కడ కోండల్లో ఉండే గిరిజనవాడల గురించి వింటుంటే నాకు వంశీ "మన్యంరాణి" గుర్తుకు వచ్చింది. దారిలో నైట్ స్టే ఉండే వెదురు కాటేజీలు అవీ చూపించాడు.
తిరుగు ప్రయాణంలో మళ్ళీ పైన బావుంటుందని పైకి చేరాం. ఈసరికి చాలా మంది క్రిందనే కునికుపాట్లు పడుతుండటంతో పైన బోటు గోడ పక్కనే కుర్చీలు వేసుకుని కూచోవటానికి వీలయ్యింది. సాయంత్రం అరగంట సేపు గుప్పున వాసనలు తెప్పించి ఓ గుప్పెడు పకోడీలు, కస్తంత టీ ఇచ్చాడు. చక్కని సాయంత్రం, చల్లని గాలి, వేగం తగ్గి సద్దుమణిగిన నది ప్రవాహం, ముసురుతున్న చీకట్ల నడుమ అక్కడక్కడ ఒడ్డునున్నగూడాల్లో మిణుకు మంటున్న దీపపు కాంతులు, కాసేపటికి నిర్మలంగా ఉన్న ఆకాశంలోంచి తోడొచ్చిన తెల్లని చందమామ... షాల్ కప్పుకుని ఆ బోట్ డెక్ మీద ఎంత ప్రశాంతతని ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను. అయితే ఆ ఆనందాన్ని పరిపూర్ణం చెయ్యటానికి వెనకాల ఏ సంతూరో, ఫ్లూటో.. వాద్య సంగీతం వినిపించి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. పేద్ద సౌండ్ లో సినిమా పాటలు పెట్టి, వాటికి నృత్యం చెయ్యటం, పొద్దు గడపటానికి అన్నట్లు హౌసీ మొదలైన గేమ్స్, బోట్లో ఉన్న మనుషులతో డాన్సులు చేయించటం మొదలైనవి మా ఇద్దరికీ అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా, ఆనందానికి అంతరాయంగా తోచింది వారి ఎంటర్టైన్మెంట్.
ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా, ప్రకృతి ఒడిలో ఓ రోజంతా గడపటానికి, మనం రీఛార్జ్ అవ్వటానికీ ఆ బోటు ప్రయాణం చాలా ఉపయోగపడుతుంది. బోటులో ఉండి ప్రకృతిని ఆస్వాదించకుండా ఈ కార్యక్రమం ఎందుకో, పనిగట్టుకుని మా పొద్దు గడపటానికి వాళ్లంత శ్రమ పడ్డం ఎందుకో తెలీలే. టివీ చూపినట్లు అక్కడ కూడా డాన్స్, గేమ్స్ ఎందుకో అర్థం కాలేదు. అవి ఒడ్డున ఉండి కూడా చేయచ్చు. బోట్ ఎక్కటం ఎందుకు? ఆ ఇద్దరు అబ్బాయిలూ చాలా కష్టపడి ఆ డాన్సులు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్దవాళ్ళు బోట్లలో వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు వస్తాయని, టిప్స్ వస్తాయని అలా చేస్తున్నాం అని వాళ్లు చెప్పటం, డబ్బులు అడగటం విచిత్రంగా తోచింది. ఇంకో విచిత్రం ఏంటంటే దాదాపు అందరూ వాళ్ల డాన్సులు ఎంజాయ్ చేసి, వాళ్ళు డాన్స్ చేయిస్తే కూడా పులకించిపోతూ, మెలికలు తిరిగిపోతూ డాన్సులు చేసేసి ఆనందించేయటం ! బహుశా మేమే ఆదివాసుల్లాగానో, గ్రహాంతరవాసుల్లాగానో ఉన్నమేమో. అందుకే మేము అందరిలా ఎంజాయ్ చెయ్యలేకపోయాం. అసలు అంత చక్కటి నిశ్శబ్దాన్ని ఆస్వాదించే అవకాశం ఊళ్లల్లో జనజీవనస్రవంతిలో వస్తుందా? ప్రకృతిని అంత నిశ్శబ్దంగా ఆస్వాదించగల అవకాశం ఎక్కడుంది? నేల మీద దొరకని అందమైన నిశ్శబ్దాన్ని ఆ కొండలు, నదీప్రవాహం అందిస్తుంటే జనాలు ఎందుకు ఆస్వాదించలేరో తెలీలేదు..:((
మరొక నచ్చని విషయం.. బోటు ప్రయాణం పేరుతో గోదావరిని చెత్తతో నింపటం. వద్దంటున్నా ప్లాస్టిక్ గ్లాసులు, తినేసిన చిప్స్ తాలుకూ ప్లాస్టిక్ కవర్లు నదిలో పారేయటం. నదేమన్నా డస్ట్ బిన్నా? ఇంకా ఘోరమేమిటంటే తుక్కు పాడేయద్దని చెప్పిన బోటువాళ్ళే మాకు భోజనం పెట్టిన ప్లేట్లు, గిన్నెలూ, డబ్బాలూ అక్కడే కడిగేస్తున్నారు. ఆ సబ్బునీళ్ళన్నీ గోదావరిలో కలిసిపోతున్నాయి...:(( ఇలా రోజుకి ఎన్ని బోట్లవాళ్ళు ఎన్ని ప్లాస్టిక్ గ్లాసులు, ఎన్ని తినేసిన ఖాళీ కవర్లు, ఎంత సబ్బు నీరు గోదావరిలో కలిపేస్తున్నారో కదా...!!! ఇక బోటు మీదున్న రెండు బాత్రుమ్స్ తాలూకూ నీళ్ళు ఎటు పోతాయో పరమాత్మకే ఎరుక ! విహారం పేరుతో నన్ను ఇన్నిరకాలుగా అపవిత్రం చేస్తున్నారేమని గోదావరితల్లి అడగలేదని అలుసు కదూ ??! నా మాట ఈ బ్లాగులో కల్సిపోయేదే అయినా.. విహారం వెళ్ళే చోట్ల ఒడ్డున బాత్రూమ్స్, బోటులో కాక ఒడ్డునే ఆగిన చోటనే తినే ఏర్పాట్లు, బోటులో వినటానికి కేవలం వాద్య సంగీతం ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రయణం అంత అద్భుతమైనది మరోటి ఉండదు.
చివర చివరకి పురుగులు వచ్చేస్తున్నాయని అందరం క్రిందకు చేరిపోయాం. రాత్రి ఏడుంపావుకల్లా ఒడ్డు చేరి, మేం మళ్ళీ రాజమండ్రి చేరేసరికీ ఎనిమిదిన్నర అయ్యింది.
పాపికొండలు తాలుకూ మరిన్ని ఫోటోలు "ఇక్కడ" చూడండి...
(రేపు చివరిరోజు ప్రయాణం 'పట్టిసీమ' కబుర్లు..)