కాకినాడ - యానాం - రాజమండ్రి - పాపికొండలు - పట్టిసీమ..
పడవలు -
రేవులు - గోదావరి - కొబ్బరిచెట్లు..
రెల్లుపూలు - ఇసుక - సూర్యుడు -
వెన్నెల..
అన్నింటితో మరోసారి చెలిమి చేసి..
నేను ఈమట్టిలో పుట్టినదాన్నే..
అని..
ప్రతి చెట్టుపుట్టకీ గుర్తుచేసి..
తిరిగి తిరిగి.. అలసి సొలసి.. వచ్చా
!!
బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో వెళ్ళిన "తూర్పుగోదావరి ప్రయాణం" కబుర్లు సిరీస్ రాసాను. అప్పుడు బిక్కవోలు, ద్వారపూడి, ద్రాక్షారామం, కోటిపల్లి, యలమంచలి మొదలైన చోట్లకి వెళ్ళాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో అటువైపే వెళ్ళినా మరికొన్ని చూడని ప్రదేశాలు చుట్టి వచ్చాం ...
శిర్డీ ప్రయాణం అనుకోనిదే కానీ మొన్నవారంలో వెళ్ళివచ్చిన ప్రయాణానికి మాత్రం రెండునెలల క్రితమే రిజర్వేషన్లు చేయించాము. ఈ ప్రయాణంలో కాకినాడ, యానాం, రాజమండ్రి, పాపికొండలు, పట్టిసీమ చుట్టివచ్చాం. అసలు యానాం దగ్గర్లో ఉన్న ఒక ఊరికి ముఖ్యమైన ఫంక్షన్ నిమిత్తం వెళ్ళాము. ముందుగా కాకినాట్లో దిగి అత్తయ్యగారిని మా పెద్దత్తగారి దగ్గర దిగపెట్టి, మా కోసం పంపిన కారులో యానాం దగ్గర ఉన్న బంధువుల ఊరికి బయల్దేరాం.
చాలా చిన్న పల్లెటూరు అది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. బహుశా పల్లెటూర్లన్నీ ఇలానే ఉంటాయేమో. దేశంలో ఇటువంటి రిమోట్ పల్లెలు ఎన్ని ఉన్నాయో అనిపించింది. ప్రతి ఇంటికీ చక్కని పెరడు, అందులో బోలెడు మొక్కలు, కొందరి ఇళ్ళల్లో ఓ పక్కగా ఆవులు, గేదెలు. మేం వెళ్ళిన ఇంట్లో మందారాలు, పనస, బత్తాయి, మామిడి, అరటి, ఉసిరి, పొగడ చెట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లు ఎంత సౌకర్యంగా, అధునాతనంగా ఉన్నా ఇలా మొక్కలు వేసుకుందుకు ఇంటి చూట్టూ జాగా ఉండే ఇల్లే ఇల్లు కదా..! మా పాప అయితే "అమ్మా ఇక్కడే ఉండిపోదాం.. బావుంది" అని గొడవ. పెరట్లో నుయ్యి చూసి శ్రీవారు అక్కడే ఆగిపోయారు. వాళ్ల నూతిలో నీళ్ళన్నీ మీరే పోసేసుకునేలా ఉన్నారు ఇక రండి...అని పిలవగా పిలవగా కదిలారు :) నాకు మా కాకినాడ ఇల్లు గుర్తుకు వస్తే, తనకి ఏలూరులో ఉన్న వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు గుర్తుకొచ్చిందట. అలా ఇద్దరం ఎవరి స్మృతుల్లో వాళ్లం తిరగాడుతూ ఉండిపోయాం..!
ఆ సాయంత్రం కాసేపు ఆ ఊరు చూసిన తర్వాత యానాం బయల్దేరాం. యానాం ఫెర్రీ రోడ్డులో photos..
యానాం ఫెర్రీ రోడ్డులో కాసేపు గడిపి, తిరిగి ఊరు వెళ్తూంటే దారిలో ఒకచోట అచ్చం వంశీ సినిమాల్లో సీన్ లాగ బావుందని ఆగాం. గోదావరి ఒడ్డు, పడవలు, జాలరులు, ఇసుకతిన్నెలు, సూర్యాస్తమయం... ఆ సాయంత్రం మాకందించిన అనుభూతి నిజంగా మరువలేనిది. లోతులేని గోదారినీళ్ళలో కాళ్ళు పెట్టుకుని నించోవటం భలేగా అనిపించింది. చేపల కోసం అప్పుడు వెళ్ళి, వల పన్ని రాత్రంతా గోదారి పైనే ఉండి, మళ్ళీ పొద్దున్నే వస్తారుట. అక్కడి జాలరులు చెప్పారు. అందుకే నిద్ర వచ్చినా ఇబ్బంది లేకుండా ఒక్కో పడవలో ఇద్దరుంటారుట.
పిల్లతో పోటీపడి అక్కడున్న ఇసుకతిన్నెలు ఎక్కిదిగటం, ఆ ఇసుకతిన్నెలపై నిలబడి దూరంగా ఉన్న బ్రిడ్జి నీ, సూర్యాస్తమయాన్నీ, ఆ కిరణాలవల్ల మిలామిలా మెరుస్తున్న గోదారినీ చూడటం గొప్ప అనుభూతి. రైలు అందుకోవటానికి వెనక్కి వెళ్పోవాలని అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కువ సేపు గడపాలని గాఠ్ఠిగా అనుకున్నాం. రోడ్డు మీదకి వచ్చేసరికీ కన్నులకింపైన దృశ్యం.
వెనక్కెళ్ళే దారిలో కొబ్బరి చెట్లతో పాటూ అరటిచెట్లు, వాటికి వేళ్ళాడుతున్న గెలలు, అరటిపూలూ కన్నులపండగ చేసాయి. అయితే, ఈసారి కూడా నా చిరకాల కోరిక తీరలేదు..:( ఎక్కడా కూడా తామరపూలున్న కొలనేది కనబడనేలేదు. మేము వచ్చామని తెలిసి మా పిన్నత్తగారు పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేసారు అప్పటికప్పుడు. ఎలాగూ పొద్దున్నే బోట్ దగ్గరకు వెళ్లాలి కదా అని ఆ రాత్రికి రాజమండ్రి చేరుకున్నాం. కానీ అనుకోకుండా బంధువులు వచ్చారని పాపికొండలు ట్రిప్ కు మా పిన్నత్తగారు వాళ్ళూ డ్రాప్ అయిపోయారు. అనుకున్నాం కదా మానేయటం ఎందుకని, మేం మాత్రమే వస్తామని ట్రావెల్స్ వాళ్లకి చెప్పేసాం.
మొదటిరోజు ప్రయాణం తాలూకూ మరిన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/blog-post_28.html
(తదుపరి టపాలో పాపికొండలు ప్రయాణం కబుర్లు...)