క్రితం వారాంతంలో అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు కొనుక్కుని శిర్డి బయల్దేరాం. Waiting లేకుండా టికెట్స్ కన్ఫార్మ్డ్ టికెట్లు దొరకటం అదృష్టం. రిటర్న్ టికెట్లు వీలుపడవు కాబట్టి తీసుకోలేదు. ఏదో ఓ బస్సులో దీపావళి రోజుకన్నా వచ్చేద్దాం అననుకున్నాం. మనకు దసరా శెలవుల్లాగ మహారాష్ట్ర లో దీపావళికి శెలవులు ఉంటాయి. అందువల్ల శిర్డీలో జనం ఎక్కువగా ఉంటారేమో పిల్ల ఇబ్బంది పెట్టడం ఎందుకని దాన్ని అమ్మ దగ్గర ఉంచి బయల్దేరాం.
ట్రైన్ లో మా ఎదురుగా ఒక తల్లీ,తండ్రీ, ఆరేళ్ళ పిల్లాడు కూర్చున్నారు. ఆ పిల్లాడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతిదానికీ ఒకటే నస, సణుగుడు, పేచీ. రాత్రి నిద్రలో కూడా మెలుకువ వచ్చేసింది వాడి పేచీకి. ఆ తల్లీదండ్రీ సముదాయిస్తూ నచ్చజెప్తున్నారే తప్ప కేకలేయకపోవటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మాకూ ఒక్కతే పిల్ల. గారమే. కానీ మరీ ఇంత నెత్తికెక్కించుకోము. ఏం పెంపకాలో ఏమిటో ! ఇక అవతలవైపు విండో సీట్ దగ్గర ఇద్దరు+ఇద్దరు ఓ సన్న ఫ్యామిలీ. అంటే నలుగురూ ఒకేలా సన్నగా అంటే సన్నగా ఉన్నారు. ఆ తల్లి మాత్రం ఇంత గొంతేసుకుని దిగేదాకా ఆపకుండా బడాబడా వాగుతూనే ఉంది. అందరూ నిద్రోతున్నారనన్నా లేకుండా పొద్దున్నే నాలుగింటికే లేచి కూచుని పేద్ద గొంతుతో కూతురితో కబుర్లాట్టం మొదలెట్టింది. ఇక నేనూ లేచి మొహం కడిగి రాత్రి ఆపిన పుస్తకం చదువుకుంటూ పడుకున్నా.(పైనవాళ్ళు లేచేదాకా కూచోవటానికి ఉండదు కదా:))
నాగర్సోల్ లో దిగి శిర్డీ చేరి, ఎప్పుడూ దిగే హోటల్లో దిగి, తయారై, టిఫిన్ తిని సాయిమందిరం క్యూలో నిలబడేసరికీ ఎనిమిదిన్నర. ఆశ్చర్యంగా జనం ఎక్కువగా లేరు, క్యూ కూడా ఫాస్ట్ గా కదులుతోంది. తొమ్మిదింపావుకల్లా చక్కటి, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. అంత త్వరగా, పైగా కావాల్సినంత సేపు బాబాను చూసుకునే దర్శనం చాలా ఏళ్ల తరువాత దొరికిందనే చెప్పాలి. ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి దర్శనం దొరికింది. అప్పుడు ఇలా క్యూ సిస్టం లేదు. బాబావిగ్రహానికి ఫోటోలు కూడా తీసుకోనిచ్చేవారు. ద్వారకామాయి లో కూడా బాబా కూచునే రాయిని చేత్తో ముట్టుకోనిచ్చేవారు. తిరుపతిలోలాగా ఇంత జనప్రవాహం అప్పుడు లేదు మరి. బయటకు వచ్చేసి విభూతి పొట్లాలు కూడా నాలుగైదుసార్లు మళ్ళీ మళ్ళీ క్యూలో వెళ్ళి తీసుకుని బయటకు వచ్చేసాం.
ఘృష్ణేశ్వర్ :
దేవాలయ నిర్మాణం అంతా త్రయంబకం గుడి నిర్మాణాన్ని పోలి ఉంది. కాకపోతే అది నల్ల రాయితో చేస్తే ఘృష్ణేశ్వరాలయానికి ఎరుపు రంగు రాయిని వాడారు. విశాలమైన ప్రాంగణం. గర్భగుడి బాగా క్రిందుగా ఉంది. లోపల నల్లని పెద్ద శివలింగం. గర్భగుడి బయట మండపంలో నల్లని పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంది. మగవారు చొక్కా తీసివేసి లోపలికి వెళ్లాలి. లోపల జ్యోతిర్లింగాన్ని మనం స్వయంగా పువ్వులతో, బిల్వాలతో పుజించుకోవచ్చు. గుడి బయట ఆవుపాలు అమ్ముతున్నారు. అవి తెచ్చుకుని మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు. హడావుడి, జనసందోహం లేని ఆ ప్రశాంత వాతావరణం మాకు బాగా నచ్చింది. ఆవుపాలు తెచ్చుకుని అభిషేకం చేసుకుని, పువ్వులతో, బిల్వాలతో తృప్తిగా అర్చించుకుని బయటకు వచ్చాం. నాలుగైదేళ్ల క్రితం కాశీలో కూడా ఇలానే పాలతో అభిషేకం చేసుకున్నాం. మధ్యలో శ్రీశైలం, త్రయంబకం వెళ్ళినా స్వయంగా అభిషేకించుకునే అవకాశం దొరకలేదు. ఈ గుడి నిర్మాణం చాలా పాతదే కానీ పధ్ధెనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిగిందిట.
ఆలయానికి సంబంధించి రెండు మూడు కథలు స్థలపురాణంలో ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే ఒక బ్రాహ్మణుడి మొదటి భార్యకు సంతానం లేకపోతే ఆమె భర్తను బ్రతిమాలి తన చెల్లెలితో వివాహం జరిపించిందట. అయితే పోనుపోనూ అక్కాచెల్లెళ్ల మధ్యన ఈర్ష్యాసూయలు తలెత్తాయిట. ఈర్ష్య వల్ల చిన్న భార్యకు పుట్టిన కుమారుడిని పెద్దభార్య హతమార్చి, చెరువులో పారవేసిందిట. అంతదు:ఖంలో కూడా శివభక్తుర్తాలైన బ్రాహ్మణుడి చిన్నభార్య రోజూలానే చెరువు గట్టుకెళ్ళి నూరు శివలింగాలను చేసి పూజించి నదిలో విసర్జించి వెనక్కు తిరిగేసరికీ కొడుకు సజీవుడై కనబడ్డాడుట. అప్పుడామెకు శివుడు ప్రత్యక్ష్యమై కనబడగా తన అక్క పాపాన్ని క్షమించమని, తన భక్తికి ప్రసన్నుడైతే గనుక అక్కడ వెలవమని ప్రార్థించిందిట. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా అక్కడ వెలసాడుట. సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం అని ఒక కథ ఉంది. కథ ఏదైనా జ్యోతిర్లింగం మహిమాన్వితమైనది. భక్తితో అర్చించవలసినది.
ఎల్లోరా గుహలో శివలింగం |