చిన్నప్పుడు దూరదర్శన్ లో వేసే సినిమాలన్నీ వదలకుండా చూసేవాళ్ళం. వాటిల్లో చాలా బాగున్న సినిమాలు కొన్ని గుర్తుండిపోయాయి. పుస్తకాల షాపులో "సూర్యుడి ఏడో గుర్రం" పుస్తకం చూడగానే నాకు చిన్నప్పుడు చూసిన "सूरज का सातवाँ घोड़ा" గుర్తుకు వచ్చింది. ఆ సినిమాకు గానూ ఉత్తమనటుడి పురస్కారాన్ని అందుకున్న 'రజత్ కపూర్' గుర్తుకువచ్చాడు. జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా అందుకుందీ సినిమా. చిన్నప్పుడు శ్యామ్ బెనెగల్ తీసిన సినిమాగా మాత్రమే ఇది పరిచయం. నవల గురించి ఏమీ తెలీదు. ఈ తెలుగుఅనువాదం ఆ సినిమాదే అని తెలిసి ఎగిరి గంతు వేసాను. "వేమూరి ఆంజనేయశర్మ" గారు అనువదించిన ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ. ఇప్పుడు నవల కొని చదవగానే సినిమా చూద్దామనిపించి నెట్లో వెతికితే యూట్యూబ్ లో సినిమా దొరికింది. సినిమా చూసాకా నవల ఇంకా బాగ అర్థం అయ్యింది. తెరపై దృశ్యరూపం నవల కన్నా అందంగా ఉండగలదని ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాకు రెండు ప్రాణాలు. ఒకటి శ్యాం బెనెగల్ దర్శకత్వం, రెండోది వన్రాజ్ భాటియా నేపథ్యసంగీతం. ముందు నవల గురించి చెప్తాను..
"ధర్మవీర్ భారతి". ఈ పేరు వింటేనే ఏదో ఉత్తేజం కలుగుతుంది. తను సాహిత్యానికి చేసిన సేవలకు ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" బిరుదు పొందిన ప్రముఖ హిందీ కవి, రచయిత, నాటక కర్త, సామ్యవాది ధర్మవీర్ భారతి. "ధర్మయుగ్" అనే పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేసారు. నాటక కర్తగా "సంగీత నాటక అకాడమీ" పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన మొదటి నవల "గునాహోం కా దేవతా" గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత రాసిన నవలే "సూఅజ్ కా సాత్వా ఘోడా". ఈయన 1952 లో, అంటే దాదాపు అరవై ఏళ్ల క్రితం వైవిధ్యభరితమైన శైలితో ఇంత చక్కని ప్రయోగాత్మకమైన నవల రాసారంటే ఆశ్చర్యం కలిగింది. అసలింత చిన్న నవలలో ఎంత గొప్ప ఆంతర్యాన్ని ఎలా కుదించారో! అప్పట్లో ఈ నవల హిందీ నవలాసాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించి ఉండాలి.
కథనానికి విభిన్నమైన శైలి వాడారు ధర్మవీర్ గారు. ఆంగ్ల సాహిత్యంలో దీనిని "మెటాఫిక్షన్" అంటారు. ఒకరకంగా ఇది పంచతంత్రం కథలు, విక్రమార్కుడి కథలు మొదలైన కథల శైలి అన్నమాట. అంటే ఒకే కథలో మరికొన్ని కథలు ఉంటాయి. అయితే ఈ నవలలో చిత్రం ఏంటంటే ఈ కథలన్నీ మళ్ళీ ఒకే కథలో కలుస్తాయి. కథకుడు మనకు చెప్పే ఒక కథలో "మాణిక్ ముల్లా" అనే పాత్ర చెప్పే మరిన్ని కథలుంటాయి. విడివిడిగా చెప్పినా ఇవన్నీ అంతర్లీనంగా ఒకే దారంతో ముడిపడిఉంటాయి. నవల చివరికొచ్చేసరికీ మనకి ఒక కథలోంచి మరోకథలోకి ఎలా లంకె ఏర్పడిందో తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. అవే కథలను మనం ఇతర పాత్రల దృష్టితో చూస్తూంటే, తద్వారా వివిథపాత్రల స్వభావాలు మారిపోవటం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కథలన్నీ మాణిక్ ముల్లా జీవితంలో అతనికి ఎదురైన ముగ్గురు స్త్రీల చుట్టూ తిరుగుతాయి. వీటన్నింటి నేపథ్యం "ప్రేమ" అని మాణిక్ ముల్లా చెప్తాడు కానీ వాటి వెనుక ఉన్న దిగువ మధ్యతరగతి జీవితాలలోని సంఘర్షణ,నిస్పృహ, దు:ఖమయ వేదన మనల్ని కల్లోలపరుస్తాయి. ఈ కథల వల్ల మనిషి మనస్థత్వాన్ని విభిన్నకోణాల్లోంచి చూసే అవకాశం కూడా మనకు కలుగుతుంది.
నవలలో కొన్నిచోట్ల శరత్ "దేవదాసు" గురించిన ప్రస్తావన తెస్తాడు రచయిత. ఆ ప్రస్తావనల ద్వారా అప్పటిదాకా సాహిత్యంలో చిత్రించబడిన భగ్నప్రేమికుడి స్వరూపం తప్పనీ, సాకారమైనా, విఫలమైనా నిజమైన ప్రేమ మనిషి వికాసానికి తోడ్పడుతుందనే ఉద్దేశాన్ని తెలుపుతాడు. "ఇది ప్రేమ కాదు ఇది ప్రేమ కాదు అని అని ప్రేమను గురించి వ్యాఖ్యానిస్తూనే జీవితంలో ప్రేమకు గల స్థానాన్ని నిరూపించటమే ఈ కథల ఉద్దేశం. ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం". "ప్రేమను గురించి కథల్లో, కవితల్లో, పత్రికల్లో ప్రచురించబడేదంతా శుధ్ధ అసత్యం. ప్రేమ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి." అంటాడు ప్రధాన పాత్రధారి మాణిక్ ముల్లా.
మాణిక్ ముల్లా మాటల్లో ప్రేమకు తన నిర్వచనం చెప్తాడు రచయిత. "ప్రేమించాలి. కానీ ఆ ప్రేమ సంకుచితంగా ఉండకూడదు. దాని వల్ల సంఘానికి మేలు కూడా జరగాలి. కానీ ప్రేమ ఆర్థిక సంబంధాలవల్ల అనుశాసితమౌతుంది." అంటాడు. మళ్ళీ మరోచోట నిజమైన ప్రేమ ఎటువంటిదో చెప్తూ " ప్రేమ ఆత్మ లోతుల్లో నిద్రించిన సౌందర్యాన్ని మేల్కొలుపుతుంది. మానవునిలో విచిత్రమైన పవిత్రతనూ, నైతిక నిష్ఠనూ, వెలుతుర్నీ నింపుతుంది....కానీ సంప్రదాయం, సాంఘిక పరిస్థితులూ వగైరాల వల్ల ఆ ప్రేమను సరైన రూపంలో దర్శించలేకపోతున్నాం. సంఘర్షణ చెయ్యలేక నిస్సహాయత, పిరికితనమనే బంగారు నీరు పోసి దానిని మెరిసేట్టు చేయటానికి ప్రయత్నిస్తున్నాము. కల్పనా జగత్తులో మెదిలిన భావాలలో ఇంద్రధనస్సులూ, పూవులు, స్వప్నాలూ ఉంటాయి గానీ సాహసం, పురుషార్థం ఉండవు. ఆ స్వప్నాలను యదార్థమైన సాంఘిక జీవితంలోకి దింపాలి. సాంఘిక జీవితపు పునాదులూ ఎరువూ లేని భావన నిలువలేదు. ఎండిపోతుంది." అంటాడు.
కథాక్రమానికి మాణిక్ ముల్లా ఇచ్చే వివరణ:
ఏడు రోజులపాటు మాణిక్ ముల్లా చెప్పే కథాక్రమం నడుస్తుంది. అతని మాటల్లోనే చెప్పాలంటే - అవి సూర్యుడి ఏడు గుర్రాలకు ప్రతీకలు. అయితే ఇవి ఒట్టి ప్రేమ కథలు కాదు. నిమ్న మధ్యతరగతి జీవనచిత్రాలు. మధ్యతరగతి జీవితాల్లో ప్రేమ కంటే ఆర్థిక సంఘర్షణ, నైతికమైన విశృంఖల విహారం వ్యాపించి ఉన్నాయి. అందువల్లనే అనాచారం, నిరాశ, చీకటి మధ్యతరగతి జీవితాల్లో నిండిపోయాయి. ఏడు గుర్రాలు సూర్యుని రథాన్ని ఏ విధంగా ముందుకు లాక్కు పోతున్నాయో అదే విధంగా విశ్వాసము,సాహసము,సత్య నిష్థ మొదలైనవి ఆత్మను ముందుకు లాక్కుని పోతున్నవి. కానీ ఈ అనైతిక భ్రష్టమైన జీవితపు సందుల్లో నుండి నడవటం వల్ల రథం శిధిలమైపోయింది. అయినా ఈ సూర్యుని రథం ముందుకు పోవలసిందే. ఆరుగుర్రాలు గాయపడినా ఏదో గుర్రం మాత్రం మిగిలే ఉంది. అదే భవిష్యత్తును సూచించే గుర్రం. తన్నా, జమున, సత్తి..ఈ ముగ్గురికీ కలిగిన ఏ పాపమెరుగని పిల్లలే ఆ ఏడో గుర్రానికి ప్రతీకలు. ఆ బిడ్డల జీవనాలు సుఖమయం కావాలి. వాళ్ల జీవితాల్లో వెలుతురు, అమృతం నిండాలి. ఆ ఏడో గుర్రం మన కనురెప్పల్లోకి స్వప్నాలను పంపిస్తుంది. మనం దోవ బాగు చేస్తే ఆ దోవన ఆ గుర్రం పయనిస్తుంది. అ గుర్రం మీద మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అంటాడు మాణీక్ ముల్లా.
ఈ విషయాలన్నీ గుర్తుంచుకునే తను చెప్పే కథా క్రమానికి సూర్యుని ఏదో గుర్రం అని నామకరణం చేసాడు మాణిక్ ముల్లా" అంటాడు కథకుడు.
ఇంతకు మించి కథ గురించి చెప్తే ఉత్సాహం తగ్గిపోతుంది. అరవైఏళ్ల తరువాత చదివినా కూడా సమకాలీనంగా అనిపించటంమే ఈ రచనలోని గొప్పతనం. సినిమాచూసాకా ఈ నవలను ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చిన శ్యామ్ బెనెగల్ ను ప్రశంసించకుండా ఉండలేము. రచయిత శైలి ఏమాత్రం పాడవకుండా, పాత్రల మనోభావాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చిత్రికరణ జరిగింది. నటీనటులందరూ డీడీ సీరియల్స్ లో మనం చిన్నప్పుడు చూసినవాళ్ళే అవటం వల్ల పాత్రలన్నీ పరిచితమైనవే అనిపిస్తాయి. ముఖ్యంగా రజత్ కపూర్ నటన, వాయిస్ రెండూ చాలా బావుంటాయి. చిత్రం చివరలో అతను చెప్పే ఒక చిన్న కవిత చాలా బావుంది..
"मैं क्या जिया
मुझकॊ तो जिंदगी नॆ जिया
बुंद बुंद कर पिया..
पीकर..पथ पर खाली छॊड दिया "
యూట్యూబ్ లో ఈ చిత్రం తాలూకూ రెండు భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.
చిత్రం మొదటిభాగం:
http://www.youtube.com/watch?v=OAj4C4lYmms
చిత్రం రెండవ భాగం:
http://www.youtube.com/watch?v=4Kun9KGul9s&feature=relmfu