తెలుగువారికి మాత్రమే సొంతమైన "పద్య"సంపద గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తనివితీరదు. మాధుర్యం, తెలుగుతనం ఉట్టిపడే మీగడతరకలు మన తెలుగుపద్యాలు. గతంలో "తెలుగు పద్యాలా? బాబోయ్ !" అని చక్కని తెలుగు పద్యాల గురించిన పుస్తకం గురించి రాసాను కదా.. ఇప్పుడు అలాంటిదే మరిన్ని ఎక్కువ తెలుగు పద్యాలతో ఉన్న మరో మంచి పుస్తకం దొరికింది. ప్రముఖ కథకుడు, కవి, విమర్శకుడు శ్రీ పాపినేని శివశంకర్ గారి "తల్లీ! నిన్ను దలంచి". అమెరికాలో "తెలుగునాడి" పత్రికలో ధారావాహికంగా సాహిత్యాభిమానులను అలరించిన ఈ పద్య విశ్లేషణలకు మరిన్ని పద్యవిశ్లేషణలను జోడించి "తల్లీ! నిన్ను దలంచి" పుస్తకం తయారుచేసారుట.
ప్రముఖ ప్రాచీనకవులు నుండీ ఇరవైయ్యవ శతాబ్దం తొలిపాదం వరకూ రచింపబడిన పద్యాల్లో కొన్ని, కొన్ని చాటువులు, కొన్ని చమత్కార పద్యాలు కలిపి మొత్తం ఓ నూటపది మధురమైన పద్యాలకు అర్థవిశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి పద్యానికీ అర్థవిశ్లేషణలతో పాటూ పద్యరచన సంబంధిత కొన్ని చారిత్రక విశేషాలను కూడా తెలిపారు శివశంకర్ గారు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, భర్తృహరి, శ్రీనాథుడు, పోతన, శ్రీకృష్ణదేవరాయులు, తెనాలి రామకృష్ణుడు, వేమన మొదలైనవారి పద్యాలను మనము ఈ పుస్తకంలో చూస్తాము. అట్ట ముందువెనుల భాగాల్లో బాపూ గీసిన అందమైన చిత్రాలతో, ప్రతి పద్యానికీ శ్రీ కొల్లోజు గారు వేసిన అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం కాపీలు "విశాలాంథ్ర"లో దొరుకుతున్నాయి. వెల: రెండువందల ఏభై రూపాయిలు.
"ప్రాచీన భాషగా తెలుగుకు గౌరవం లభించిన సందర్భంగా ఈ చిరుకానుకను తెలుగు రసజగత్తుకు సమర్పిస్తున్నాము" అన్నారు ముందుమాటలో వల్లూరు శివప్రసాద్ గారు. అప్పట్లో ఈ పద్య విశ్లేషణలను ప్రోత్సాహించిన జంపాల చౌదరి గారికీ, ఈ పుస్తకం ప్రచురణకు కారణమైన మిత్రులు శ్రీ వల్లూరు శివప్రసాద్ గారికీ, గ్రంథసేకరణలో సహాయ పడిన ఇతర మిత్రులందరకూ శివశంకర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, పద్యకవిత్వాన్ని ఎక్కువ మంది ఎందుకు ఆస్వాదించలేరో చెప్తూ, ప్రాచీన కవిత్వంలోని విశేషగుణాలను కూడా తెలిపారు తన ముందుమాటలో. "ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దేవియమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్థిత్వవేదన నిజం.ఆత్మనివేదనలో నుంచి వచ్చిన ఏ భావోద్వేగాన్నీ మనం తక్కువ చేసి చూడనక్కరలేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించటానికి అడ్దం కాబోదని నా అవగాహన" అంటారు పాపినేని శివశంకర్ గారు.
పుస్తకంలోని కొన్ని మధురపద్యాలు: (అర్థాలు రాయటం లేదు)
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి, జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ ! భగవతీ ! పూర్ణేందుబింబాననా !
(చాటువు)
(-ఎవరు రాసారో తెలియని పద్యాన్ని చాటువు అంటారుట. చాటువు అంటే 'ప్రియమైన మాట' అని అర్ధంట. )
శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హారపమ్క్తులం
జారుతరమ్బులయ్యె, వికసన్నవ కైరవ గమ్ధబంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధామ్శు వికీర్యమాణ క
ర్పురపరాగ పాండురుచిపూరము లంబర పూరితంబులై
(నన్నయ, శ్రీమదాంధ్రమహాభారతము)
--శరత్కాల రాత్రులను వర్ణించే పద్యమిది.
కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితర వైభవముల్ పదివేలు మానసమ్
బంటునె? మానుషమ్బు గలయట్టి మనుష్యున కెట్టి వానికిన్
కంతకుడైన శాత్రవుcడొకండు తనంతటివాcడు గల్గినన్
(శ్రీనాధుడు, కాశీఖండము)
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వొన్నతిం బొందరే
వారేరీ సిరి మూటకట్టుకుని పోవంజాలరే భూమిపై
పేరైనం గలదే శిబి ప్రముఖులున్ బ్రితిన్ యశ:కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
(బమ్మెర పొతన, శ్రీమహాభాగవతము)
- పలురాజుల గర్వాన్ని, భయాన్నీ, స్వార్థాన్నీ , వాళ్ళు చివరకు ఏం పట్టుకెళ్లారు? అని ప్రశ్నించే ఈ పద్యం నాకు బాగా నచ్చింది.
చనవిచ్చినాడని - సకియరో నీవు
పలుమాటలకు నెట్లు - పాలుపడ వద్దు
పొలతి నమ్మగరాదు - పురుషుల నెపుడు
పలురీతి కృష్ణ స - ర్పమ్ములై యుండ్రు
కొంచక కృష్ణకు - కూర్మితో నుండు
వంచన సేయకు వనిత యెప్పుడును
(తాళ్ళపాక తిమ్మక్క, సుభద్రా కల్యాణము)
- ఇవి రుక్మిణి సుభద్రకు అప్పగింతల సమయంలో చెప్పిన మాటలట.
నారదులైరి సన్మునులు, నాక మహీజములయ్యె భూజముల్
శారదలైరి భామినులు, శంకర శైలములయ్యె గోత్రముల్
పారదమయ్యె నీరధులు, పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సితవర్ణములయ్యెను బండు వెన్నెలన్
(మెల్ల, రామాయణము)
-- శరత్కాలపు వెన్నెలలో మునులు, చెట్లు, స్త్రీలు, కొండలు, సముద్రాలూ, పాములూ, మబ్బులు మొదలైనవి ఎలా మారిపోతాయో తెలిపే అందమైన వర్ణన ఇది.
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
(మారన వెంకయ్య, భాస్కర శయకము)
-- చదువు ఎలా చదువుకోవాలో తెలిపే పద్యం ఇది.
తప్పు లెన్నువారు తండోపతందము
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరో
విశ్వదాభిరామ! వినురవేమ!
(వేమన)
బొంకనివాcడె యోగ్యుc డరిబృందము లెత్తినచోటc జివ్వకున్
జంకనివాcడె జోదు, రభసమ్బున నర్థి కరంబు సాcచినన్
గొంకనివాcడె దాత, మిముc గొల్చి భజించిన వాcడె పో నిరా
తంక మనస్కుc డెన్నcగను దాశరథీ! కరునాపయొనిథీ!
(కంచర్ల గోపన్న, దాశరథి శతకము)
- యోగ్యత, వీరత్వం, భక్తి, దానగుణం మొదలైన మానవగుణాలకు నిర్వచనాలు చెప్తాడు గోపన్న ఈ పద్యంలో.
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
(తిరుపతి వేంకటకవులు, పాండవోద్యోగము)
ఆశ్చర్యం కలిగించిన విషయం:
"సిరికిం జెప్పడు.." పద్యం విశ్లేషిస్తూ శ్రీనాధుడికీ, పోతనకూ జరిగినట్లుగా చెప్పుకునే సంభాషణ తాలూకూ కథ గురించి కూడా చెప్తారు శివశంకర్ గారు. కానీ ఈ కథకు కాళ్ళే కాదు కళ్ళు కూడా లేవంటారు ఆయన. శ్రీనాధుడికి దగ్గుబల్లి పోతన, దుగ్గన అనే బావమరదులున్నట్లు వేరే గ్రంథాల వల్ల తెలిసిందనీ; శ్రీనాధుడి కాలానికీ, పోతన కాలానికీ నడుమ దశాబ్దాల కాలవ్యవధి ఉందనీ, అంత కాలవ్యత్యాసం ఉంటే ఈ పద్యం గురించి వారిద్దరూ ఎలా సంభాషించుకున్నరో శ్రీమహావిష్ణువుకే తెలవాలి అని చమత్కరిస్తారు శివశంకర్ గారు. తెలుగు సాహిత్యచరిత్ర గురించి ఏమీ తెలియనందున ఈ సంగతి నన్ను ఆశ్చర్యపరచింది.