రేపు శెలవు అంటే ఇవాళ రాత్రి ఏవన్నా సిడీలు(సినిమాలు) పెట్టుకుని చూడటం మాకు అలవాటు. పొద్దున్నే లేచి పరుగులు పెట్టక్కర్లేదని. అలాగ మొన్న వికెండ్ లో ఒక రోజు రాత్రి ఏదన్నా సీడీ పెట్టండి కాసేపు చూద్దాం.. అని నేను వంటింట్లోకి వెళ్పోయా.
త్వర త్వరగా వంటిల్లు క్లీన్ చేసేసుకుని హాల్లోకి వచ్చేసరికీ అయ్యగారు సీరియస్ గా "Rudali" సినిమా చూసేస్తున్నారు. ఇదేమిటీ విధివైపరీత్యం అని హాచ్చర్యపడిపోయేసా. భాషాభేదం లేదు కానీ అసలు సీరియస్ సినిమాల జోలికే తను పోరు. "సినిమా అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి" అన్నది తన సిధ్ధాంతం. అలాంటిది Rudali లాంటి గంభీరమైన సినిమా..అదీ వీకెండ్ లోనా? నాకే చూడాలనిపించలేదు. పాటలు బావుంటాయి కదా అని పెట్టాను అన్నారు. అది నిజమేననుకోండి కానీ ఇప్పుడా... అని నేను నిరాసక్తంగా కూచున్నా. సరే ఏదోఒకటిలే..ఆయనతో కలిసి చూడాలనే కదా నా కోరిక అని సగం అయిపోవస్తున్న సినిమాని నేనూ చూడ్డం మొదలెట్టా.
"దిల్ హూం హుం కరే.." పాట మొదలయ్యింది. జై భూపేన్ హజారికా.. అహా..ఓహో... అనేసుకున్నాం. "ఝూటి మూటి మితవా ఆవన్ బోలే..", "బీతేనా..బీతేనా రైనా..", "సమైయో... ధీరే చలో.." అన్నీ అయిపోయాయి. రాజ్ బబ్బర్ గురించీ, రాఖీ గురించీ, డింపుల్ టేలెంట్ గురించీ చర్చలు అయిపోయాయి. సినిమా అయిపోవచ్చింది. అదేమిటీ ఇంకా ఆ పాట రాలేదు అన్నారు తను. "ఏ పాట?" అన్నా నేను. అదే లతా పాట "యారా సీలీ సీలీ.." అన్నారు తను. "నేనొచ్చేసరికీ సినిమా సగం అయిపోయింది. మీరు ఏవన్నా సీన్స్ ఫాస్ట్ చేసేప్పుడు మిస్సయి ఉంటారు. వెనక్కి తిప్పి చూడండి.." అన్నా. అయ్యో నేను ఆ పాట కోసమే ఈ సినిమా పెట్టాను. ఏం పాట అసలు..ఏం పాట అసలు... లతా ఎంత అద్భుతంగా పాడుతుంది.." అంటూ మళ్ళీ సినిమా మొదటినుంచీ పెట్టారు. కాస్త కాస్త ఫాస్ట్ చేస్కుంటూ ఇద్దరం మళ్ళీ సీరియస్ గా సినిమా రెండోసారి చూట్టం పూర్తిచేసాం. సినిమా రెండోసారి అయిపోయింది కానీ పాట కనబడలేదు.
"ఇదేమిటీ పాట లేదు.." అన్నాన్నేను. కాసేపాగి..."అసలా పాట ఏ సినిమాలోదో కూడా మర్చిపోయావు నువ్వు?" అన్నారు. నాకప్పటికి కూడా గుర్తు రాలేదు. "యారా సీలీ సీలీ..పాట "Lekin" సినిమాలోది కదా..ఎలా మర్చిపోయావు? ఇంత సీరియస్ సినిమా రెండోసారి కూడా చూపించేసావు" అన్నారు. "ఇది మరీ బావుంది. ఈ సినిమా కావాలని పెట్టుకున్నది మీరు... పోనీలే అని చూస్తూ కూర్చున్నందుకు నన్నంటారేం?" అన్నా నేను. "రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడైనా గుర్తుకు రాలేదా నీకు? పాటలన్నీ నా నోటిమీదుంటాయి అంటావుగా.." అన్నారు. "అవునవును.. అలానే ఉండేవి పెళ్లయ్యేవరకూ..." అన్నాను. "సరేలే ఇప్పుడు చరిత్రలెందుకు.. వీకెండ్ పూటా ఇలాంటి సినిమా నాకు రెండుసార్లు చూపించేసావు.." అన్నారు. "అసలు రెండిటిలోనూ "డింపుల్.." ఉంది అందుకే కన్ఫ్యూజ్ అయ్యా.." అన్నా నేను. అలా నీవల్లే.. నీవల్లే.. అని కాసేపు అనేసుకున్నాకా.. మళ్ళీ Rudali సినిమా గుర్తుకొచ్చి ఇద్దరం పడీ పడీ నవ్వుకున్నాం.
అయినా నిజంగా అంత ఇష్టమైన పాట ఏ సినిమాలోదో కూడా గుర్తులేనంత మరపు వచ్చేసిందా? అని నాలో నేనే కాసేపు మధనపడిపోయా! ఈ చిలిపిజగడానికి మూలకారణమైన ఆ అద్భుతమైన పాట ఇదే...