సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 24, 2012

శ్రావ్యమైన గజల్ "బర్ఫీ"





మంచి గజల్ వినటానికి శ్రావ్యంగా ఉంటుంది. కానీ ప్రతి గజల్ సాహిత్యంలోనూ అంతర్లీనంగా ఒక వేదన దాగి ఉంటుంది. అయినా కూడా ఏదైనా మంచి శ్రావ్యమైన గజల్ విన్నంత సేపూ హాయిగా ఎక్కడెక్కడో తేలిపోతాము. అచ్చం అలాంటి భావనే "బర్ఫీ " సినిమా చూస్తున్నంతసేపూ నాకు కలిగింది.
శ్రావ్యమైన గజల్ లా..
 ఐస్క్రీం అంత చల్లగా
వెన్నలాగ స్వచ్ఛంగా తెల్లగా
పట్టులాగ మృదువుగా
నెయ్యి అంత కమ్మగా 
చాక్లేట్ లాగ తియ్యగా..
ఉంది సినిమా.

హాయిగా తమదైన లోకంలో తిరగాడే బర్ఫీ,ఝిల్మిల్,శ్రుతి లతో పాటూ వెనక వెనకే తిరుగుతూ, బర్ఫీ చేసే చిలిపి పనులను చూస్తూ నవ్వుకుంటూ గడిపేసా నేనూ. ఒక భారమైన కథను ఎంతో హృద్యంగా, మన మనసులు బరువెక్కకుండా కథనానికి హాస్యపు రంగు వేసి lighter vein లో చూపించటం ఈ దర్శకుడిలోని అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి సబ్జెక్ట్ తో కోషిష్, ఖామోషీ, బ్లాక్ మొదలైన సినిమాలు వచ్చినా, మనకు నచ్చినా ఆ సినిమాలు చూస్తే మనసులు మరింత భారం అవుతాయి తప్ప తేలికవ్వవు. బర్ఫీ సినిమా చూస్తే మాత్రం కళ్ళు చెమ్మగిల్లినా మనసు తేలికౌతుంది. రెగులర్ ఫార్ములాసినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ వైవిధ్యమైన సినిమాలు నచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతితో, ఆనందంతో హాల్ లోంచి బయటకు వస్తారు.


 అనురాగ్ తీసిన సినిమాల్లో "Kites"  నన్ను చాలా disappoint చేసినా "Life in a... Metro", "Gangster" రెండూ కూడా నాకు బాగా నచ్చాయి. Gangster చూసిన కొన్నిరోజులపాటు అసలు నేను అదే సినిమా గురించి ఆలోచించాను. ఇతని గురించిన మరిన్ని వివరాల కోసం వికీ లోకి వెళ్లిన నేను అనురాగ్ ఆరోగ్యం గురించిన విషయాలు చదివి షాక్ అయ్యాను..! great guy..


And apart from all the other things in the film, Ranbir is amazing ! షమ్మీకపూర్ చిలిపితనాన్ని,అల్లరిని; రాజ్ కపూర్ నటననూ; శశికపూర్, రిషి కపూర్ నీతూసింగ్ ల అందం,హావభావాలు అన్నీ తనలో కలిపేసుకున్న ఈ ప్రతిభావంతుడైన కుర్రాడికి ఉజ్వలమైన భవిష్యత్తు తప్పక ఉందని మరోసారి గట్టిగా అనిపించింది. మొదటి సినిమా(Saawariya) ఫ్లాప్ అయినా అందులో కూడా పరిణితి ఉన్న నటుడిలానే కనిపించాడీ కుర్రాడు. "Rockstar" అయితే పూర్తిగా ఇతని సినిమానే. ఇక బర్ఫీ లో మూగ,చెవిటి కుర్రాడిలాక ఇతను కనబరిచిన నటన అత్యుత్తమం అనే చెప్పాలి. Silence speaks volumes అన్నట్లుగానే కేవలం facial expressions తోనే ఒక పేరాగ్రాఫ్ డైలాగ్ ఇవ్వగలిగిన ఇంప్రెషన్ ని ఇతను ప్రేక్షకుల్లో కలిగించాడు. 





 

పొగరు నిండిన కళ్ళతో నాకస్సలు నచ్చేది కాదు ప్రియాంక. అలాంటిది "What's Your Raashee?" లో పన్నెండు పాత్రల్లో జీవం నింపి నన్ను ఆశ్చర్యపరిచింది. "Fashion" లో మోడల్ గా నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె "Don 2" లో ఏక్షన్ హీరోయిన్ గా అందరినీ(నన్నూ) ఆకట్టుకుంది. ఇక "బర్ఫీ"లో ఒక డీగ్లామరైజ్డ్ పాత్రలో ఆమె నటనకు huge applause ఇవ్వాలనిపించింది. అందం,నటన,గ్లామర్ మూడూ ఉన్న చోట మరి ఆ మాత్రం గర్వం,పొగరు ఉండవా అనుకున్నా..!”వసంతకోకిల ’ సినిమాలో శ్రీదేవి పాత్ర కన్నా కష్టమైనది, ఎక్కువ లోతైనది బర్ఫీలో ’ఝిల్మిల్ ’ పాత్ర.. అటువంటి చాలెంజింగ్ పాత్రలో ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేకుండా ఒదిగిపోయింది ప్రియాంక.


చాలీచాలని బట్టలతో, హీరోతో డాన్సులు మాత్రం చేసే టిపికల్ తెలుగు హీరోయిన్ లాగ, ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో మాత్రమే ఇన్నాళ్ళు చూసిన ఇలియానా ను బర్ఫీలో ఒక బరువైన పాత్రలో చూడటం ఓ పేద్ద సర్ప్రైజ్ నాకు. నటీనటుల నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తెలిసిన దర్శకులు ఉండటం కూడా చాలా ముఖ్యమని మరోసారి ఇలియానా ఋజువు చేసింది. ఎర్రని బొట్టు, కళ్లనిండా కాటుక ఆ అమ్మాయి మొహానికి ఎంత అందాన్ని ఇచ్చిందో! కాటుక నిండిన ఆ పెద్ద పెద్ద కళ్ళని చూస్తే బాపూ ఈ అమ్మయితో ఓ సినిమా తీసేస్తాడేమో అనిపించింది. బస్సులో బర్ఫీ,ఝిల్మిల్ ల మధ్యన కూచున్నప్పుడు తన మొహంలో చూపిన భావాలు, బర్ఫీ మనసులో ఝిల్మిల్ ఉందని అర్ధమైనప్పుడు ఆమె కళ్ళతో కనబరిచే భావాలు నిజంగా ప్రశంసాపూర్వకంగా ఉన్నాయి.

 

గుర్తుండిపోయే కొన్ని సన్నివేశాల గురించి: 

చిన్నదైనా రూపా గంగూలీ(టివీ మహాభారత్ సీరియల్లో ద్రౌపది) పాత్ర గుర్తుండిపోతుంది. ఆమె కూతురికి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సన్నివేశం; బర్ఫీ మొదటిసారి శృతిని చూసే సన్నివేశం; శృతి ని పెళ్ళాడతానని అడగటానికి వచ్చి మళ్ళి తనంతట తానే వెళ్పోతూ ఆమెకు తాను తగనని బర్ఫి చెప్పే సన్నివేశం; బర్ఫీ ఝిల్మిల్ కోసం వచ్చి నిరాశతో వెనుతిరిగినప్పుడు ఝిల్మిల్ పిలుస్తోందని శృతి చెప్పే సన్నివేశం; ఝిల్మిల్ 'ముస్కాన్' తాతగారి వేలు వదిలాకా మళ్ళీ బర్ఫీ వేలు పట్టుకునే సన్నివేశం; చివరలో బర్ఫీ పక్కన ఝిల్మిల్ ఒదిగి పడుకునే సన్నివేశం.. మొదలైన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ గుర్తుండిపోతాయి. నాకు బాగా నచ్చింది బర్ఫీ తనకు ముఖ్యమని నమ్మిన మిత్రులందరినీ ల్యాంప్ పోస్ట్ దగ్గర పరీక్షించే సన్నివేశం. శృతి కూడా బర్ఫీ వేలు వదిలి ఆమడ దూరం పరిగెడుతుంది కానీ ఝిల్మిల్ అలానే నించుంటుంది. నిజంగా కళ్ళు చెమర్చాయి ఆ సన్నివేశంలో నాకు. స్వచ్ఛమైన ప్రేమకీ, స్నేహానికీ నిదర్శనం ఈ సన్నివేశం. మిన్ను విరిగి మీదపడ్డా మనల్ని వదిలివెళ్లని ఒక్క స్నేహం ఉన్నా చాలు కదా జీవితానికి అనిపించింది!! సినిమా చివరలో శృతి చెప్పే మాటలు కూడా అవే కదా. "నాది షరతులతో నిండిన పిరికి ప్రేమ... వాళ్ల ప్రేమ స్వచ్ఛమైనది.. నిబంధనారహితమైనది(Unconditional)...అందుకే వాళ్ల ప్రేమ గెలిచింది..." అంటుంది. 


 డైలాగులు ఎక్కువగా లేని ఈ సినిమాకి నేపధ్యసంగీతమే ప్రాణం. ప్రతి ఫ్రేం లోనూ కూడా వెనుక నుంచి వినబడే నేపథ్యసంగీతం మనసును ఆకట్టుకుంటుంది. ప్రీతమ్(సంగీత దర్శకుడు),అనురాగ్ ల జోడీ ఇంతకు ముందులాగనే బాగా కుదిరింది. "గేంగ్ స్టర్" కూడా ప్రీతమ్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందించాడు. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అసలు స్టన్నింగ్ విజువల్స్ అన్నమాట. వెంఠనే డార్జలింగ్ కి వెళ్పోవాలి అన్నంత అందమైన లొకేషన్స్ చూపెట్టారు. కథ ఎలాంటిదైన ప్రేక్షకుల్లో ఉత్సాహం,ఆతృత తగ్గకుండా ఉండేలాంటి కథనం ఉంటేనే సినిమా ఆకట్టుకుంటుంది. దర్శకుడివే కథ,స్క్రీన్ ప్లే కూడా. అందువల్ల మూడు విభాగాల్లోనూ కూడా అనురాగ్ సమతుల్యం చూపెడుతూ వచ్చాడు. మొత్తమ్మీద ఇది ఒక్కరి సినిమా కాదు.. పూర్తి టీమ్ వర్క్ ఈ సినిమా విజయానికి కారణం. 


బర్ఫీ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యిందని తెలిసాకా, ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈ దర్శకుడి ఆరోగ్యం బాగుండి, ఇతను మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని మనసారా కోరుకున్నా!