ఊ.....ఎక్కడ నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు... అసలు నా బ్లాగ్ నేను మళ్ళీ ఇన్నాళ్లకు.. దాదాపు రెండు నెలల తర్వాత చూసుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది ! మూడేళ్ళ మూడు నెలల ప్రియమైన బుజ్జాయి నా ఈ బ్లాగ్. అసలు ఇన్నాళ్ళు రాయకపోవటం అటుంచి అసలు చూసుకోవటం కూడా కుదరలేదు :( ఆ మధ్యన ఒకసారి నెట్ సెంటర్ కి వచ్చినా బ్లాగ్ చూసుకోవటం కుదరలేదు. జీవితం ఎంతో చిత్రంగా మలుపులు తిప్పుతూ వేగంగా తనప్రవాహంతో పాటుగా ఎటు తీసుకుపోతోందో తెలీకుండా రోజులు గడిచిపోతున్నాయి. బ్లాగ్ రాయలేకపొతున్నానన్న బాధ ఉన్నా.. బావుంది.. ఇలానే బావుంది.
గడిచిన మూడు నెలల కాలంలో రకరకాల సమస్యలు; ఆ తర్వాత ప్రియబ్లాగ్మిత్రుడు, తమ్ముడు శంకర్ హఠాన్మరణం... అన్నీ ఒక్కసారిగా జీవితాన్నీ,మనసునీ కుదిపేసాయి. ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేసాయి... ఏం జరుగుతోందో తెలీని అయోమయంలో,వేదనలో కొట్టుకుపోతున్న సమయంలో చీకటి వెనుక ఓ వెలుగురేఖ కనపడింది. కష్టకాలంలో అభయమిచ్చి నేనున్నానని తెలిపే భగవంతుడు నిజంగా మాకొక వరాన్నే అందించాడు. ఎటువంటి రికమెండేషన్ లేకుండా మేము నాలుగునెలలుగా ఎదురుచూస్తున్న మంచి స్కూల్ లో పాపకు సీట్ వచ్చింది. అప్పటికి మేము ఆశ వదిలేసుకుని పాపను పాత స్కూల్లోనే చేర్చేసాము. చేర్చిన పదిరోజులకి, చివరిసారి రిజల్ట్ కోసం చాలా నిస్తేజంగా నేను ఆ స్కూల్ కి వెళ్ళాను. నోటీస్ బోర్డ్ లో చివరి సీట్ మా పాపకు వచ్చినట్లు చూడగానే కళ్లవెంట నీళ్ళు జలజలా కారాయి..! తనకు ఫోన్ చేసాను కానీ నోట మాట రావట్లేదు చెప్పటానికి.. ఆ ఆనందం మరవలేనిది ! ఇక పాప భవిష్యత్తు గురించిన బెంగ లేదు !
ఆ తర్వాత జీవితంలో ఎంతో కాలంగా మేము ఎదురుచూస్తున్న మార్పులన్నీ ఒకదాని వెనుక ఒకటి వాటంతట అవే జరిగిపోయాయి. మరో పదిరోజుల్లో పాపస్కూల్ కు దగ్గరగా ఇల్లు మారటం, పాపని కొత్త స్కూల్లో చేర్చటం, పొద్దుటే నాకు కేరేజీలు కట్టే హడావుడి.. మొదలైపోయింది. అయితే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వీలయినన్నాళ్ళు ఇంటర్నెట్ కానీ, కేబుల్ కనక్షన్ కానీ పెట్టించుకోకూడదు అని. న్యూస్ పేపర్ మాత్రం వేయించుకుంటున్నాం. పని చేసుకుంటూ వినటానికి రేడియో, ఎఫ్.ఎంలు ఉన్నాయి. ఖాళీ దొరికితే చూడటానికి సీడిలు, చదవటానికి పుస్తకాలు ఉన్నాయి. ఇక టివి,నెట్ కనక్షన్ అనవసరం అనిపించింది. నెట్ సెంటర్ కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కావాలన్నా వెళ్లలేనంత దూరం. నేనయితే ఆలోచనలకు కూడా ఖాళీ అనేది ఉండకూడదు అని పనిమనిషిని కూడా పెట్టుకోలేదు. రోజంతా పనులతోనే గడిచిపోతోంది. ప్రస్తుతానికి పాప వచ్చాకా మిస్సయిన రెండు నెలల పాఠాలూ, హోంవర్క్ చేయించటం సరిపోతోంది. కొన్నాళ్ళపాటు ఇలానే ఉండాలని కోరిక. అయితే అమ్మావాళ్ళే నలభై కిలోమీటర్ల దూరం అయిపోయారు. తరచూ వెళ్లటం చాలా కష్టం ఇకపై..!
నా మొక్కలు ఓ పదిహేను కుండీలు తెచ్చుకున్నాను. ఇంక లారీలో పట్టలేదని మరో పదో పన్నెండో ఉండిపోయాయి... ఎప్పటికి తెచ్చుకుంటానో అని వాటిని రోజూ తలుచుకుంటూ ఉంటాను. మొత్తం సామానంతా కొత్తింట్లో సర్దేసరికీ విరక్తి వచ్చింది. అసలు ఎందుకు ఇంత సామాను పెంచుకున్నానా అని నన్ను నేనే తిట్టేసుకున్నాను. ఏదీ పడేయలేను...ఉంచలేను. నిజం చెప్పాలంటే మూడొంతులు సామానంతా నేను పోగేసినదే!! నాలుగైదు పెద్ద అట్టపెట్టల పుస్తకాలు అన్నీ నావే. పుస్తకాల అట్టపెట్టెలు తెరవకుండా ఇంకా అలానే ఉంచేసాను. అసలు నేను చనిపోతే నా తాలూకు సామానంతా ఏమౌతుందా అని ప్రశ్న కలిగింది..?! పాకల్లో ఉండేవాళ్లకు ఇంత సామాను ఉండదు కదా? అయినా వాళ్ళు బ్రతకటం లేదా? మరి నాకెందుకు ఇంత సామాను? ఈసారి సమయం లేకపోయింది కానీ మళ్ళీ ఇల్లు మారే సమయానికి వీలయినంత సామాను ఎలిమినేట్ చేసేయాలని నిర్ణయించుకున్నాను.
ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం అవటం వల్ల మా ఇంటి చుట్టురా చాలా వరకూ పెద్దపెద్ద చెట్లు, పొలాలు, కూరగాయల పొలాలు ఉన్నాయి. అసలు సిటిలో ఉన్న భావనే లేదు. ఇటువంటి ప్రశాంత పల్లెవాతావరణంలో ఉండగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాకింగ్ కి ఆదివారాలు కూడా మానకుండా తప్పనిసరిగా వెళ్తున్నాను. పొద్దుటే కాలుష్యంలేని చల్లని గాలి, చుట్టూరా పచ్చదనం చూస్తుంటే అసలు కొత్త ఉత్సాహం మనసంతా నిండిపోతుంది. చుట్టురా బోలెడు రకల మొక్కలు.. అన్నీ ఆకుపచ్చ రంగువే కానీ అందులోనే ఎన్ని రంగులో.. అసలు ఆకుపచ్చ రంగులో ఇన్ని షేడ్స్ ఎలా ఉన్నాయబ్బా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ చుట్టుపక్కలమొక్కలన్నీ చూస్తుంటే. "ఎన్నెన్నో వర్ణాలు.." అని పాడాలనిపిస్తుంది. క్రమం తప్పని ఉదయపు నడక, రోజంతా శరీరానికి కావాల్సినంత శ్రమ ఇక నిద్రలేమిని దూరం చేసేసాయి. నిద్రపోయే సమయానికి ఆటోమెటిక్ గా కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు. టివీ, ఇంటర్నెట్ ఉంటే ఎంత సమయం వృధా అయిపోయేదో కదా అనుకుంటూ ఉంటాము మేమిద్దరమూ.
ఇప్పుడు మాదేమో గేటేడ్ కమ్యూనిటీ. ఇక్కడి మనుషులనూ, ఫ్లాట్స్ ని చూసినప్పుడల్లా బ్లాగ్మిత్రులు కృష్ణప్రియ గారి గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు గుర్తుకువస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనుషులను వారివారి ఫ్లాట్ల నంబర్లతోనే గుర్తిస్తారు. అవన్నీ మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే కబుర్లు ! మా ఇంటి చుట్టూరా ఉన్న పొలాల ఫోటోలు కొన్ని తీసాను అవి ఇక్కడ -http://lookingwiththeheart.blogspot.in/2012/08/blog-post.html చూడండి.. ఇంకా తీద్దామంటే ఇల్లుమారిన తర్వాత కెమేరా ఛార్జర్ ఇంకా దొరకలేదు..:( అది దొరికితే మరికొన్ని తీయగలుగుతాను. ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఇంకా ఎక్కువ కాయగూరల పొలాలు ఉన్నాయి. చాలా బావున్నాయి. మొన్నసారి వెళ్ళినప్పుడు కెమేరా మర్చిపోయాను. మళ్ళీ ఎప్పుడన్నా బ్లాగ్ రాసినప్పుడూ ఆ ఫోటోలు పెడతాను..
ఇదీ కథ ! ఇందుమూలంగా నాకర్ధమైందేమిటంటే మనకి జీవితంలో ఏది ఎప్పుడు అవసరమో అది భగవంతుడే ఇస్తాడు. అవసరం లేనిది ప్రాకులాడినా రాదు. మనకు అవసరం ఉన్నది వద్దన్నా మనకు దక్కకుండా ఎక్కడికీ పోదు..!! రాసే అలవాటు పోయి వేలు నెప్పెడుతోంది టైప్ చేస్తుంటే..:) ఇలా పచ్చదనంతో పాటుగా సాగుతోంది జీవితం... ఇక్కడ మజిలీ ఎన్నాళ్ళో..ఏమో.. !!