సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 28, 2012

పుచ్చా పూర్ణానందం గారూ - మీసాల సొగసులు



ఒకప్పుడు మనకున్న అతితక్కువ హాస్య రచయితల్లో ఒకరు పుచ్చా పూర్ణానందంగారు. మేము వారిని పూర్ణానందంతాతగారు అనేవాళ్ళం. విజయవాడలో పేరుమోసిన లాయరైన వీరు నటులు, హాస్యరచయిత కూడానూ. పూర్ణానందం గారి అల్లుడు శ్రీ జె.వి.నారయణమూర్తిగారు నాన్నకు ప్రాణ స్నేహితుడు. ఇప్పటికి ఏభైఏళ్ళు వాళ్ల స్నేహానికి. ముందర అలా పూర్ణానందంగారు పరిచయంట. తర్వాత నాన్న రేడియోలో చేరాకా వారితో స్నేహం బలపడిందిట. విజయవాడలో వాళ్ళ పెద్దబ్బాయి ఇల్లు మా ఇంటి దగ్గర ఉండేది. వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అటువైపే ఉన్న మా ఇంటికి వస్తూండేవారు పూర్ణానందంతాతగారు మా చిన్నప్పుడు. అప్పటికి గుబురు మీసాల తాతగారిలానే తెలుసు. పూర్ణానందం గారు గొప్ప హాస్య రచయిత అనీ, ఎంతో సాహితీవిజ్ఞానం గల సరస్వతీపుత్రులని పెద్దయ్యాకా వారి పుస్తకాలు చదివాకా కానీ తెలీలేదు. "మీసాల సొగసులు" ఇంకా 'ఆవకాయ - అమరత్వం', ’ఆషాఢపట్టి’ మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. జంధ్యాల సినిమాలైన ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, హైహై నాయికా, శ్రీవారి శోభనం మొదలైన సినిమాల్లో కూడా నటించారు.





విజయవాడ ఆకాశవాణి కోసం ఆయన రాసి, చదివిన హాస్య ప్రసంగాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మీసాల సొగసులు". అన్నింటికన్నా ముందు ఈ పుస్తకానికి వారు రాసిన మున్నుడి(ముందుమాట) చాలా బావుంటుంది. మనిషి జీవితంలో హాస్యం ఎంత ప్రధానమైనదో, హాస్యం వాల్ల కలిగే ఉపయోగాలేమిటో..అన్నింటి గురించీ ఎందరో మహానుభావుల ఆంగ్ల ఉల్లేఖనాలతో చక్కగా చెప్తారు పూర్ణానందంగారు. పుస్తకం చదువుతుంటే సార్ధక నామధేయులు అనిపించకమానదు. మొత్తం పదిహేను వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం కూడా ఒక విజ్ఞానగని అనిపిస్తుంది నాకు. వ్యాసాల్లో ఉదహరించిన పద్యాలూ, ప్రాచీన కవుల,రచయితల ఉల్లేఖనాలు.. అన్నీ కూడా వారికున్న విద్వత్తునీ, సాహితీ జ్ఞానాన్నీ తెలుపుతాయి. తాంబూలమ్, అతిథుల బెడద, పిల్లి ఎదురొచ్చింది, కాకిగోల, నల్లకోటు, భార్యతో బజారుకెళ్ళకు - మొదలైన ఈ వ్యాసాల పేర్లన్నీ కూడా హాస్యభరితమైనవే. ఈ పుస్తకం ముఖ చిత్రం బాపూ వేసినది. పుస్తకంలోని బొమ్మలు వేసినది కార్టునిస్ట్ శ్రీ బాలి. పుస్తకంలో అక్కడక్కడా చెప్పిన కొన్ని జోక్స్ క్రింద రాస్తున్నాను.. భలే ఉంటాయి..

1) ఒక శిష్యుడు గురువుగారిని భోజనానికి పిలిచాడట. ఎందుకో అతని గయ్యాళి పెళ్ళానికి పులుసుకుండ అతని నెత్తినకొట్టి పగులకొట్టి, కుండ ఖరీదు కుడా ఇమ్మన్నదట.అప్పుడా గురువుగారు
"భాండాని శతసహస్రం భగ్నాని మమ మస్తకే,
అహో గుణవతి భార్యా భాండమూల్యంన యాచతే"
అన్నాడట.
అంటే 'నా నెత్తిన లక్ష కుండలు పగిలాయి కానీ, మా ఆవిడే గుణవంతురాలు,కుండ ఖరీదు అడగలేదూ అని.


2)ఓ గృహస్తు తనని కుమ్మిందని కోపం వచ్చి వాళ్ల పాడి ఆవుని అమ్మేసాడుట భార్య ఊళ్ళో లేనప్పుడు. వాళ్లావిడ వచ్చాకా "ఇదేమిటండి,కొమ్ము విసిరినంత మాత్రాన రెండుపూటలా పాలిచ్చి ఇల్లు గడుపుతున్న పాడిగేదెను అమ్ముకుంటారా? నేను మీతో సర్దుకుపోవటం లేదు?" అందట.


3)పండక్కి వచ్చిన కొత్త అల్లుడ్ని అత్తగారు, "నాయనా, భోజనం పొద్దు పోతుందేమో. అరిశెలు,మినపసున్నుందలూ తీసుకుంటావా?పిల్లలతో చద్ది అన్నం తింటావా? లేదా మీ మామగారి దేవతార్చన అయ్యేసరికీ పన్నెండు దాటుతుండి..వారి పంక్తిన భోంచేస్తావా? అని అడిగితే, "అత్తగారు, మూడూ చేస్తాను" అన్నాడట.


4)ఒక పిచ్చాసుపత్రి సూపరింటెండెంట్ ఓ విజిటర్ కి హాస్పటల్ చూపిస్తున్నాడట.వీళ్ళు వెళ్ళిన చోటికల్లా ఓ ఆడమనిషి వచ్చి చేతులు ఊపుతూ,భయంకరమైన చూపులతో వెంబడిస్తోందట. అప్పుడా విజిటర్ "ఏమండి, ఈమె కొత్త పేషంతా? వాలకం చూస్తే భయమేసేలా ఉంది..ఈమెపై మీకు కంట్రొలు లేదా? " అనడిగాడుట.
అప్పుడు సూపరింటేండెంట్ "లేదండి" అన్నాడుట. విజిటర్ ఏం? అని ప్రశ్నించాడుట..
"ఆమె నా భార్యండి" అన్నాడుట సూపరింటేండెంట్.


*************************************************


"మీసాల సొగసులు" పుస్తకంలో ప్రతీ వ్యాసానికి మొదట్లో ఒక కార్టూన్ ఉంది. ఆ కార్టూన్లు చాలా బాగున్నాయి. వ్యాసాల సారాంశం తెలపటం కన్నా ఈ కార్టూన్లు పెడితే బావుంటుందనిపించింది నాకు. మొత్తం పదిహేను కార్టూన్లు చూసి ఆనందించండి..

































*** *** ***


రేడియోకి పూర్ణానందంగారు చదివిన ఈ పుస్తకంలోని వ్యాసాలు రెండింటిని ఆయన సొంత గళంలో ఇక్కడ వినేయండి:

తాంబూలమ్ :


పిల్లి ఎదురొచ్చింది:


*** *** ***

పూర్ణానందంగారి శత జయంతి సందర్భంగా శ్రీ సుధామ గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.