సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, May 24, 2012

"రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు



రేడియో చరిత్ర తెలిసిన నిన్నటితరం వారందరికీ
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు చిరపరిచితులు. సహస్రచంద్ర దర్శన సౌభాగ్యం కలిగిన వీరు వేంకట పార్వతీశకవులలో ఒకరైన శ్రీ వేంకటరవుగారి కుమారులు. రజనిగారి గొప్పతనం గురించి నేనెంత చెప్పినా చంద్రునికో నూలుపోగు చందానే ఉంటుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభాశాలి మన తెలుగువారవ్వటం మన అదృష్టం. ఆయన ఏ బెంగాలీవారో అయ్యుంటే ఇంతకు నాలుగురెట్లు ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చి ఉండేదేమో కూడా..! నా దృష్టిలో రజని గారి సేవలను అందుకున్న "ఆకాశవాణి" అదృష్టవంతురాలు. రేడియోలో ఉదయం ప్రసారమయ్యే "భక్తిరంజని"ని వీరి పేరున "భక్తరజని" అనేవారంటే అందుకు వారి కృషే కారణం. ఇక లలిత సంగీతానికీ, గేయరూపకాలకూ రజనిగారి చేసిన సేవ అనంతం. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతసాహిత్యాలు ఆయన ఉఛ్వాసనిశ్వాసాలు ! సంగీతంలో ఎన్నో రకాల పరిశోధనలూ, ప్రయోగాలు చేసారు. రజనిగారు రవీంద్రసంగీతాల్ని తెలుగులోకి అనువదించి, స్వరపరిచిన విశేషాలు, వారికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చిన విషయం సంగీతప్రియ బ్లాగ్లో ekla chalo re పాట గురించి రాసినప్పుడు రాసాను.


రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao




కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న
"ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర", "శతపత్ర సుందరి", "మువ్వగోపాలపదావళీ", పిల్లల కోసం రాసిన "జేజిమావయ్య పాటలు" మొదలైనవి రజనిగారు సాహిత్య ప్రపంచానికి అందించిన కలికితురాయిలు. "కొండ నుండి కదలి దాకా" అని గోదావరీనది మీద రజనిగారు చేసిన సంగీత రూపకం జపాన్ దేశ పురస్కారాన్ని అందుకుంది. ఇంతటి గొప్ప వ్యక్తి తన స్వీయచరిత్రను ఇంత ఆలస్యంగా రాయటమేమిటో అని ఆశ్చర్యం వేసినా ఇప్పటికైనా వారు పుస్తకం రాసినందుకు చాలా సంతోషించాను నేను.


ఈ ఏటి ఉగాది నాడు(23-3-12) రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు. పుస్తకంలో రజనిగారు తన బాల్యం, పిఠాపురం కవిపండితులు, రేడియో అనుబంధాలు అనుభవాలూ; సాలూరి రాజేశ్వరరావు, శ్రీ గోపీచంద్, బాల సరస్వతి, ఓలేటి, చలం, విశ్వనాథ, శ్రీపాద పినాకపాణి మొదలైన మహామహులతో తనకున్న జ్ఞాపకాలు, తన రచనలు, సత్కారాలూ పురస్కారాలు మొదలైన అంశాలను గురించి తెలిపారు. రేడియో పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.



గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:




భట్టుగారి ప్రసంగం:




చిన్ననాటి నుండీ ఇంట్లో మనిషిలాగ రజనిగారి చుట్టు తిరిగగలగటం, ఇవాళ ఆయన స్వీయచరిత్రను గురించి బ్లాగ్లో రాయ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకం కాపీల కోసం అడ్రస్:

సత్యం ఆఫ్సెట్ ఇంప్రింట్స్
బృందావనం,డో.నం.49-28-5,
మధురానగర్, విశాఖపట్నం -16.
ph-0891-2735878,9849996538