సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 2, 2012

ఒంటరి మరణం..





ఒంటరి జననం.. ఒంటరి మరణం. ఇది మనిషి ప్రతి నిత్యం గుర్తుంచుకోవాల్సిన సత్యం. మరణమెంత అనివార్యమో తన రాక కూడా అంత ఊహింపరానిది. తెలివిలో ఉన్నా తెలివిలో లేకపోయినా ఎవరు తోడుగా కానీ పక్కనగానీ లేని ఒంటరి మరణం దుర్భరం. ఇవాళ న్యూస్ పేపర్లో బాలీవుడ్ సినిమాల్లో ఒకప్పటి ప్రఖ్యాత తల్లి పాత్రధారి "అచలా సచ్ దేవ్" మరణవార్త విని మనసు చిన్నబోయింది.. !


బాల నటిగా నటన ప్రారంభించిన ఆమె ఆమె పెద్ద హీరోయిన్ ఏమీ కాదు కానీ చాలా మంది హీరోలకు తల్లిగా నటించింది. అయితే చివరి రోజుల్లో ఇంట్లో కాలుజారి పడిపోయాకా తెలివి కోల్పోయి తెలియని స్థితిలోకి వెళ్పోయిందిట. మరణ సమయంలో అమెకు తోడుగా బంధువులు ఎవరూ లేరుట. కొడుకు,మనవలు..అంతా ఎక్కడో ఇతర దేశంలో ఉన్నాడుట. గతంలో తమకు ఆమె పెద్ద మొత్తాని డొనేట్ చేసినందుకో ఏమో ఒక సంస్థవారు ఓ మనిషిని తోడుగా పెట్టారుట ఆమెను చూసుకోవటానికి. ఆమె ఇచ్చిన డబ్బుతో ఆ సంస్థ "అచలా సచ్ దేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యూకేషన్" పేరుమీద ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారుట. అందులో గిరిజన విద్యార్ధులకు హాస్పటల్లో రోగులను ఎలా చూసుకోవాలో నేర్పిస్తారుట. ఒక రకంగా నర్స్ కోర్స్ లాంటిదన్నమాట. ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన శ్రీమతి సచ్ దేవ్ కు చివరిలో అదే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మనిషి తోడుగా నిలబడింది.


పేపర్లో ఈవిడ గురించి చదవగానే నాకు మా నాన్నమ్మ గుర్తుకు వచ్చింది. తనూ అలానే బాత్రూమ్ లో రెండవసారి జారిపడిన తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలివిలేని స్థితికి వెళ్పోయి కోమాలోనే పది పదిహేను రోజులు హాస్పటల్లో ఉంది. అయితే అప్పుడు మేమంతా నాన్నమ్మ పక్కనే ఉన్నాము. నేను రోజూ వాక్ మాన్ లో భజనలు పెట్టి ఇయర్ ఫోన్స్ తన చెవిలో పెట్టేదాన్ని. రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ నవ్వుతూ ఉండేవారు.. "ఆవిడ వింటారనేనా పెడుతున్నారు?" అని. తను సబ్కాన్షియస్ గా వింటుందని ఏదో పిచ్చి నమ్మకం నాకు. చివరివరకు అలానే పెట్టాను. తనకు చేయాల్సిన మిగతా పనులన్నీ అమ్మ ఎంతో జాగ్రత్తగా చేసేది. అదో చేదు జ్ఞాపకం..
చివరి క్షణాల్లో మా నాన్నమ్మకు మేమున్నాము. పాపం ఆవిడకు ఎవరూ లేరే అని బాధ కలిగింది ఇవాళ ఈ వార్త చూడగానే.

to lighten the heavy mood.. 'అచలా సచ్ దేవ్' గుర్తుగా చాలా పాపులర్ అయిన ఈ పాట విందామేం..