Rainbow FM లో "సరదాసమయం" శీర్షిక లో ఈ Feb 21న ప్రసారమైన డా. జంపాల చౌదరి గారి రేడియో ఇంటర్వ్యూ అనుకోకుండా నేను వినటం జరిగింది. పుస్తకం.నెట్లోనూ, నవతరంగం లోనూ ప్రచురితమైన వారి వ్యాసాల ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి డా. జంపాల గారు బ్లాగ్మిత్రులకు పరిచితులే.
తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్మన్, తానా ప్రచురణల కమిటీ కి చైర్మెన్, చికాగో మెడికల్ స్కూల్లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరి గారు ఈ ఇంటర్వ్యూలో చర్చించిన అనేక అంశాలు చాల ఆసక్తికరంగా ఇంటర్వ్యును పూర్తిగా వినేలా చేసాయి. అంతేకాక నేను మిస్సయిన మొదటిభాగాన్ని కూడా సంపాదించి వినాలనిపించింది. అడిగిన వెంఠనే ఈ కార్యక్రమం నాకు అందించిన ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతిరెడ్డి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ఇంటర్వ్యూలో డా. జంపాల గారు తన స్వస్థలం, చదువు, అమెరికా, సినిమాలు, సైకియాట్రీ, సామాజిక సేవ, రాజకీయాలు, సాహిత్యం, పుస్తకాలు, పుస్తకం.నెట్, తానా కార్యకలాపాలు, భారత్-అమెరికా సంబంధాలు... మొదలైన ఎన్నో విభిన్న అంశాలను గురించి మాట్లాడారు. ఈ చర్చలో డా. జంపాల గారి మిత్రులు శ్రీ నవీన్ వాసిరెడ్డిగారు కూడా పాల్గొన్నారు. పరిచయకర్త ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతి రెడ్డి గారు.
ఇంటర్వ్యూ మొత్తం పదకొండు bits ఉంది. వరుసగా విన్నా సరే, లేదా ఏ అంకె మీద కిక్ చేస్తే ఆ భాగం వినబడుతుంది.
డా. జంపాల చౌదరి గారి గురించి... ( పుస్తకమ్.నెట్ సహాయంతో)
చికాగో మెడికల్ స్కూల్లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.