పుస్తకం మూసిన తరువాత కూడా ఆ అక్షరాలు మన వెనుకెనకే పెరిగెడుతుంటాయి
అచేతనమై మస్థిష్కంలో ఏ మూలో పడి ఉన్న అలోచనలు నిద్ర లేస్తాయి
వరుస క్రమంలో వెళ్ళే చీమకు తెలిసిన గమ్యమైనా నీకు తెలుసా అని నిలేస్తాయి
ఆ అక్షరాలు... పాఠకుడికి ఎక్కడ తగలాలో తెలిసిన వాడి చురకత్తులు
కాశీభట్ల వేణుగోపాల్ గారి "దిగంతం" నవల చదివాకా నా మనసులోంచి వచ్చిన వాక్యాలు అవి. ఇంతకు ముందు చదివిన "తపన" కన్నా ఇది నాకు బాగా నచ్చింది. సాధారాణంగా ఏ ఇతర రచనలోను కనబడని తెగువ, ధైర్యం వేణుగోపాల్ గారి రచలల్లో కనబడుతుంది. ఆలోచింపజేస్తుంది. ఒకోసారి భయపెడుతుంది. చదివిన ప్రతిసారి నేను ఆ అక్షరాల్లోని, వాక్యాల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. వారి రచనలో కేవలం ఒక కథ మాత్రమే కాక అంతర్లీనంగా మరేదో... ప్రతికోణంలోనూ మరో కొత్త చిత్రంలా కనబడే ఒక abstract painting లా కనబడుతుంటుంది నాకు.
వేణుగోపాల్ గారి రచనల్లోని ఇతివృత్తం ఏదైనా, మనిషి ఆలోచనాపరంపరలోని అనావిష్కృత పార్శ్వాలను, మనిషిలోని వ్యతిరేక అంతర్భాగాన్ని తనదైన శైలిలో అక్షరీకరించటమే వీరి రచనల్లోని ముఖ్యోద్దేశమేమో అని మరోసారి బలంగా అనిపించింది. కొన్ని వాక్యాల్లో వేణుగోపాల్ గారు వాడే సంయుక్తాక్షరాలు (అంత అలవోకగా ఎలా వాడేస్తారో కానీ) చదవటానికి కష్టంగానే కాదు గమ్మత్తుగా కూడా ఉంటాయి. ఈ నవలలో కథానాయకుడి మాటల్లో తప్ప ఎక్కడా కనబడని అతని మూగ, అవిటి ముసలి తల్లి నాకు భలే నచ్చేసింది. చాలాచోట్ల అతను వర్ణించే ఆమె 'గాజుకళ్ల నిర్వికారమైన చూపు' నన్ను వెంటాడుతూనే ఉంది...ఇంకా...!
"దిగంతం" గురించి ఇంకేమీ రాయాలని నాకు అనిపించటంలేదు. నవలలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు :
" ఏ ముఖమూ లేని నేను నా ముందు పరిగెడుతున్నాను. ముఖమే లేని ఇంకో నేను... నన్నే తరుముతున్నాను."
"కోపం జ్ఞానాన్ని తొక్కి ముందుకు పోయింది."
"ఇళ్ళ చూరుల్లోంచీ పైకి లేచి రకరకాల ఆకారాలతో ఒళ్ళు విరుచుకుంటున్న పొగలూ...సర్రుసర్రుమని ఎప్పటికీ పోని దుమ్ముని ఊడుస్తూ ఆడవాళ్ళూ..."
"అన్నింటికీ...ఆ శూన్యం నిండిన చూపులే జవాబులు...! ఆమె మొహమ్మీద మడాతలన్నీ నాకు మూసేసిన పుస్తకాలు."
"జీవితం ఒక వ్యసనం...!
జీవించటానికి బానిసైనవాళ్ళే అంతా...!!
వ్యామోహవృక్షపు చిరు చిగురుకొమ్మలీ అలవాట్లు. "
"పగటి వెలుగులో గుర్తింపు దొరకని సామాజికులంతా ప్రవాస కాందిశీకుల్లాగా తరలిపొయే గుంపులో ఒకణ్ణైన నాకూ....ఓ ప్రవాసిక గుర్తింపు !"
"నేను కరెక్టు అయినా కాకపోయినా నా అభిప్రాయం మీద నాకు హక్కు ఉంటుంది కదా !"
"మనిషి మీదో మనిషికి కలిగే కృతజ్ఞత మోతాదు మిరితే బంధమై కూర్చుంటుందేమో...లేకపోతే ప్రతీది ఒక వ్యాపార సంబంధం కాదూ...?!"
"...కూరగిన్నెలో కాడ విరిగిన అల్యుమినియం గరిటే... కుంటికాలు అమ్మా ఒక్కలాగే ఉన్నారు.
ఇద్దరు సుఖాన్ని పంచేవాళ్ళే మరి."
"మనుషులు కూచునే చోట నాలుగు గోనెపట్టాల్తో గూడులా కట్టి ఉంది. ఓ ముసలి బిచ్చగత్తె తన సామాన్తో ఆ గూట్లో కాపురముంటోంది.
కాదేది ఆవాసానికి అనర్హం ఈ భారతదేశంలో...!"
"శ్రీరంగం ఎంతమంది బిచ్చగాళ్ళకి ఎన్ని పదిపైసలు నానేలు దానం చేసుంటాడు....? అడుక్కుతిఏ ముసల్దాని మీదో గొప్ప కవిత సృష్టించాడు."
"మనకు నచ్చని ప్రపంచాన్ని కూడా అలా వెనక్కి నెట్టేస్తూ మనకు నచ్చే లోకాల అంచులకు నడుచుకుంటూ మనం వెళ్లగలిగితే..."
"రకరకాల పుస్తకాల్లోంచి ఒక్కో పేజీ చించుకొచ్చి అన్నిటినీ కలిపి కుట్టిన పుస్తకం లాంటి మ్లిష్ట భావన... !"
"యే రోజుకారోజు ఒక జీవితాన్ని గడిపినట్లు గడిపేయటమేనా...?"
"దేన్నించీ యెవర్నించీ పారిపోయినా అలోచనల్నుంచి మనిషి పారిపోలేడు కదా....!"
"ఆయన చూసినట్లుగానే ప్రపంచం లో జనాలందరూ చూసుంటే...ఇన్ని వందల వేల కోట్ల రూపాయిల పువ్వులమ్ముడుపోతాయా రోజూ...?
అందుకే...అందరూ జంధ్యాలలు కాలేరు. ఆయనకు పుష్పవిలాపం...కోట్లాది జనాలకి పుష్పవిలాసం..."
"పరిపూర్ణమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు...! సంపూర్ణత్వం ఓ మిధ్యాభావన మాత్రమే."
**** **** ****
ఈ నవల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే భాను గారి "నేను-మీరు" బ్లాగ్లో ఇక్కడ చూడవచ్చు..