సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 15, 2011

ఆ కుటుంబంతో ఒక రోజు


మొదట వేణువు బ్లాగ్లోనూ, మళ్ళీ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలోనూ, ఆ తర్వాత "పుస్తకం.నెట్" లోనూ ఈ పుస్తకం గురించి చదివాకా కొందామని వెతికితే నాకు ఈ పుస్తకం దొరకలేదు. ఈ మధ్యనే "నవోదయా"లో దొరికింది. అది జె.యు.బి.వి.ప్రసాద్ గారు రాసిన "ఆ కుటుంబంతో ఒక రోజు". ఇరవై కథల సంపుటం. ముందరే నవోదయాలో వెతికితే మరి దొరికేదేమో.




చాలా ఆత్రంగా పుస్తకం తెలిచిన నాకు ముందుమాటలో "చిన్నతనంలో గట్టి భక్తుడిని.. నాస్తికుడిగా మారిపోయాను...ఇప్పుడు భక్తి అంటే నాకు హాస్యం... ఈ కథలన్నింటికీ నా అనుభవాలు, జ్ఞాపకాలు, స్వయంగా చూసినవీ, విన్నవీ...." అని చూసి భయమేసింది. ఇంతకాలానికి కొన్నాను..ఈయన నాస్తికులుట.. కథలెలా ఉంటాయో... అని. కానీ మొదటి కథతోనే నా సందేహాల మబ్బులన్నీ విడిపోయాయి. రెండు, మూడు కథలు చదివేసరికీ రచయిత అంటే అభిమానం పుట్టుకొచ్చేసింది. ఏకబిగిన పుస్తకమంతా చదివేసా.

పుస్తకం లోని కథలన్నీ ఇదివరకూ రకరకాల వెబ్ పత్రికలలో అచ్చయినవే. కథలన్నింటిలోనూ మధ్యతరగతి జీవితం, దిగువ మధ్యతరగతి జీవనం, మనలో మనం వేసుకునే ఎన్నో రకాల ప్రశ్నలు మొదలైనవి కనబడతాయి. రచయిత వాటన్నింటినీ కథా రూప మిచ్చిన తీరు ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. ఎవరో మిత్రులు తమ అనుభవాలు మనతో చెప్తున్నట్లే. మొదటి కథ "ఆ కుటుంబంతో ఒక రోజు" కథలో అమెరికా వెళ్ళిన కొత్తలో, అనుకోకుండా ఓ ఇంటర్నెట్ స్నేహితుడి ఇంటికి వెళ్ళిన వైనం, వారింట్లో వాతావరణం చూసి, చదివి మనం కూడా ప్రసాద్ గారితో పాటూ చివర్లో చెవులు మూసుకుంటాం..:))

"నాస్తిక భర్త" కథలో భార్య శ్రావణమంగళవారం నోము నోచుకుంటూంటే, ఇబ్బందిపడుతూనే ఆమెకు వంటలోనూ ,పూజలోనూ సాయం చేసే ఓ నాస్తికుడైన భర్త ను చూసి నవ్వుకుంటాం. "ఏ సాయమూ చేయని ఆస్తిక మొగుడి కన్నా అన్ని సాయాలూ చేసే నాస్తిక మొగుడే బెటర్" అన్న సునంద మాటలు నిజమేనేమో అనిపిస్తాయి. "అంజనం", "అభిమానం", "ప్రశ్న" మొదలైన మరికొన్ని కథలు చిన్న పిల్లల్లో ఎన్ని రకాల భయాలు, నమ్మకాలు, ఆలోచనలూ ఉంటాయో, ఇంట్లోని ఆర్ధిక పరిస్థితులు వాళ్లలో ఎంతటి సంఘర్షణను రేపుతాయో కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. 'అభిమనం' కథలోని పిల్లవాడి ఆకలి బాధ, 'పుస్తకం' కథలో కాళ్ళకి లేని చెప్పులకోసం కన్నా ఓ పుస్తకం కొనుక్కోవటానికి ఓ దిగువమధ్య తరగతి కాలేజీ విద్యార్థి పడే ఆరాటం కంట తడిపెట్టిస్తాయి.

'మైల' , 'విధాయకం', 'మరణానంతరే..', 'ఇదేనా దీపావళి ? ', 'మంత్రాలకు శక్తి ఉందా?' మొదలైన కథలు అనాదిగా వస్తున్న కొన్ని ముఢనమ్మకాలనూ ప్రశ్నిస్తాయి. మనలో మనం ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వేసుకుంటామో కదా అనుకునేలా చేస్తాయి. ఇక చివరిగా నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన కథ 'అమెరికాలో రుబ్బురోలూ, కందిపచ్చడీ!'. "ఈ దరిద్రపు ఎలక్ట్రిక్ గ్రైండర్లలో చేసుకునే పచ్చళ్ళు ఏం బాగుండేడుస్తాయి? రుబ్బురోట్లో రుబ్బున పచ్చడే పచ్చడి. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు పాట పాడుతూ పిండి రుబ్బుతుంటే...ఆ రుబ్బురోలునే తన్మయంగా చూసేవాడిని.....రుబ్బురోలు లేని జీవితం వృధా...." డైలాగు, ఆ తర్వాత రుబ్బురోలు కొనటం కోసం పడిన పట్లు, కొన్నాకా మొదట రుబ్బిన పచ్చడి తినిపించడానికి మిత్రులందరినీ ఇంటికి భోజనానికి ఆహ్వానించటం చదివి నవ్వాపుకోలేం. నేనైతే మా ఇంటికి ఈ పుస్తకం పట్టుకెళ్ళి, "భోజనం కూడా ప్రశాంతంగా తిననియ్యవా వాళ్ళనీ..." అని శ్రీవారు వేళాకోళం ఆడుతున్నా ఉడుక్కుంటూనే లేటుగా మూడింటికి మధ్యాన్నం భోజనం చేస్తున్న మా అన్నయ్యకు పక్కన కూచుని మరీ చదివి వినిపించేసా.

'వేణువు' బ్లాగ్ లో ఈ పుస్తకం గురించిన టపా 'ఇక్కడ'. అక్కడ సుజాతగారి ప్రశ్నలకు JUBV(రచయిత) గారి సమాధానం, మరి కొంత చర్చ కూడా చూడవచ్చు. 'పుస్తకం.నెట్లో' జంపాల చౌదరి గారి వ్యాసం '
ఇక్కడ' చూడవచ్చు .