గత రెండు వారాల్లో ఇద్దరు ముగ్గురు ఫెండ్స్ మైల్ చేసారు. వారి మైల్స్ లో ఒకటే మెసేజ్..."సర్దుకోవటం అయ్యిందా? రోజూ చూస్తున్నా...బ్లాగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నావ్?" అని. ఏం రాయాలో తెలియక జవాబే రాయలేదు. నిన్నమరో ఫ్రెండ్ ఫోన్ చేసింది "ఎక్కడున్నావ్? ఏంటి సంగతులు?" అని. ఇక చెప్పక తప్పలేదు... " లేదు. మేం ఇక్కడే ఉన్నాం...వెళ్ళనే లేదు.." అని. 'అదేమిటి చెప్పావు కాదే...' అని ఆశ్చర్యపోయింది నా మిత్రురాలు ! అప్పుడేమైందంటే... అని చెప్పుకొచ్చాను..
చుట్టాలకూ, స్నేహితులకూ, బ్లాగ్మిత్రులకూ అందరికీ డప్పు కొట్టేసాను.. వెళ్పోతున్నాం.. వెళ్పోతున్నాం... అని. సామాను సగం సర్దేసాం. టికెట్స్ బుక్ చేసేసాం. పేకర్స్ వాడిని మాట్టాడేసాం. కొత్త ఊర్లో పాపకు స్కూలు మాట్టాడేసాం. నెల ముందే అక్కడ ఇంటికి అద్దెతో పాటూ ఏడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇంక నాల్రోజుల్లో ప్రయాణం అనగా అప్పటిదాకా మౌనంగా ఉన్న పాత ఆఫీసు బాసుగారి బుర్రలో బల్బు వెలిగింది. ఓహో ఇతగాడు వెళ్పోతే ఎలా...అని కంగారు పుట్టింది. ఇక మొదలుపెట్టాడు నస. రిలీవ్ చెయ్యటానికి రావటం కుదరట్లేదన్నాడు. ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకొమ్మన్నాడు. మాదసలే ఆఫీసు కం రెసిడెన్స్. అతగాడికి మేమన్నీ అప్పజెపితే కానీ కదలటానికి లేదు. అలాగలాగ మరో పదిరోజులు గడిచాయి. ఈలోపూ నా దసరా పుజలు ఇక్కడే అయిపోయాయి. శెలవులు అయి స్కూళ్ళు మొదలైపోయాయి. ఇక తను కదిలినా నేను,పాప కదలటానికి లేదు. ఎలాగెలాగ అని టెన్షన్. అక్కడ కొత్తాఫీసువాళ్ళు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని శ్రీవారిని తొందరపెట్టేస్తున్నారు.
ఈలోపూ మరో రెండు దారులు రారమ్మంటూ ఎదురయ్యాయి. అదీ, ఇదీ కాక మరో రెండు దారులా .... బాబోయ్... అనుకున్నాం. ఎటువైపు వెళ్లాలో తెలియదు. అసలు ఎక్కడికైనా వెళ్తామో వెళ్ళమో తెలియదు. గడిచిన రెండు నెలల కాలం ఎంత ఉద్వేగంతో, సంఘర్షణతో నడిచిందో... పరిస్థితులు మాలో ఎంత చికాకునీ, అనిశ్చింతనీ పెంచి పోషించాయో మా మనసులకు తెలుసు. చుట్టుతా అయోమయం, అసందిగ్ధం తప్ప మరేమీ కనబడేది కాదు.
చివరకు కొన్ని మాటలు జరిగాకా వాళ్ళ పాత ఆఫీసువాళ్ళు ఉండిపొమ్మని అడిగారు. సరే అయినవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. పొరుగు రాష్ట్రం పోయి నా..అనేవాళ్ళు లేక, అర్ధంగాని ఆ అరవభాషను భరించటం కన్నా ఇక్కడ ఉండటమే మేలని నిర్ణయించుకున్నాం. సరేనని ఒప్పేసుకున్నాం. లేకపోతే ఈ కార్తీకమాసం అంతా మద్రాసు మహనగరంలో గడపవలసిన మాట..!! ఊరు మారలేదు కాబట్టి ఇంత త్వరగా మళ్ళీ నా బ్లాగ్ ముహం నేను చూడగలిగాను. లేకపోతే ఇహ ఇప్పట్లో మరో ఆరేడు నెలలు దాకా ఇటువైపు రాలేనని బెంగ పడిపోయా !
ఇలాంటివి సంఘర్షణలు, నిర్ణయాలు జరిగినప్పుడే మరీ బలంగా అనిపిస్తుంది..."అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్నీ మంచికనీ అనుకోవటమే మనిషి పని..." అని.