సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, November 20, 2011

Speilberg - టిన్ టిన్


Steven Speilberg. ప్రపంచంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ప్రముఖ దర్శకుల్లో ఒకడు. నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకడు. ఊళ్ళోకి స్పీల్ బర్గ్ సినిమా వచ్చిందంటే మాకు తప్పకుండా చూపించేవారు నాన్న. అలాగ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాల్లో సగం పైనే సినిమాలు చూడగలగటం వల్ల అతనంటే ఒక విధమైన ఆరాధన. మా ముగ్గురికీ(siblings) సుపరిచితుడు. ఒక చిరకాల నేస్తం. ఒక యుధ్ధ నేపధ్యంతో తీసిన "షిండ్లర్స్ లిస్ట్" కు ఆస్కార్ అవార్డ్ రావటం అనందకరమే అయినా ,కెరీర్ ప్రారంభించిన ఎన్నో ఏళ్ల తరువాత ఆస్కార్ రావటం ఆశ్చర్యకరం. చాలా సినిమాలు నేను చూడటం కుదరనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు విచిత్రంగా మేం ముగ్గురం, నాన్నతో కలిసి ఇవాళ స్పీల్ బర్గ్ తీసిన " The Adventures of Tintin " 3D చూడటం మధురమైన అనుభూతిని మిగిల్చింది నాకు.

విశ్వ విఖ్యత కార్టూన్ కేరెక్టర్ "టిన్ టిన్" గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. ఎన్నో యేనిమేషన్ సిరీస్ లూ, కార్టూన్ పుస్తకాలూ, టివీ సీరియళ్ళూ. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, "టిన్ టిన్" కేరెక్టర్ స్పీల్ బర్గ్ కి చాలా ఇష్టమని... సినిమా తీయాలని కొన్నేళ్ళ క్రితమే స్క్రిప్ట్ రెడి చేసుకున్నాడని...అది ఇప్పటికి కార్య రూపం దాల్చిందని. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక
performance capture చిత్రం. అంటే సినిమాలోని పాత్రలను ఒక పధ్ధతి ద్వారా యేనిమేట్ చేస్తారు. గతంలో మొదటిసారిగా ఇలాంటి ప్రయోగంతో 2004 లో వచ్చిన చిత్రం "The Polar Express". 3D గానే కాక ఐమాక్స్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసారు ఈ చిత్రాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈ టిన్ టిన్ సినిమా తీసారు. 3Dలో ఈ చిత్రాన్ని చూడటమే ఒక ఆనందం అనుకుంటే, performance capture technique లో చూడటం ఇంకా గొప్ప అనుభూతి.



గతంలో స్పీల్ బర్గ్ సినిమాలకు సంగీతాన్ని అందించిన జాన్ విలియమ్స్ ఈ సినిమాకు కూడా ఆకర్షణీయమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు. చిత్రకథ ఒక సాహసోపేతమైన రిపోర్టర్ కథ. టిన్ టిన్ అనే ఒక చిన్న రిపోర్టర్ ఒక చోట అందంగా కనబడ్డ ఒక పాత ఓడ నమూనాను కొంటాడు. ఆ బొమ్మ లో ఏదో రహస్యం దాగి ఉందని అది తన ఇంటి నుండి దొంగలించబడ్డాకా అనుమానం వస్తుంది టిన్ టిన్ కి. దానిని వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అలాంటివే మరో రెండు ఓడ నమూనాలు ఉన్నాయనీ, వాటి వెనుక ఎన్నో ఏళ్ళ క్రితం సముద్రం పాలైన ఒక గుప్తనిధి తాలూకూ వివరాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.


టిన్ టిన్ చివరికి ఆ రహస్యాన్ని చేదింఛగలుగుతాడా? నిధి అతనికి దొరుకుతుందా? అన్నది మిగిలిన కథ. కథలో మరో ముఖ్య పాత్ర టిన్ టిన్ పెంపుడు కుక్క "స్నోయీ"ది. టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమా నాకయితే బాగా నచ్చేసింది.

పిల్లలు చాలా బాగా ఆనందిస్తారని అనిపించింది. కార్టూన్లూ, యేనిమేటెడ్ ఫిల్మ్స్ ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది.


స్పీల్ బర్గ్ ప్రేమికులెవరైనా ఉంటే వారికి మరో ఆనందకరమైన వార్త ఏంటంటే తను దర్శకత్వం వహించిన "War Horse" అనే సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోందొహోయ్ !!!