సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, November 19, 2011

బాపు-రమణల మ్యాజిక్ "శ్రీ రామరాజ్యం"


బాపూగారు తమ "శ్రీ రామరాజ్యం"తో నయనానందం, శ్రవణానందం, రసానందం మూడూ కలిగించారు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. తన సినిమా ద్వారా ప్రేక్షకుడికి నయనానందాన్ని అందించటం బాపూగారి సినిమాల్లోని ప్రత్యేకత. ఆ ఆనందానికి రమణ గారి సంభాషణలు శ్రవణానందాన్ని కూడా జోడిస్తాయి. ఈ రెండు కలిసి ప్రేక్షకుడికి శాశ్వత రసానందాన్ని మిగులుస్తాయి. అదే బాపు-రమణల మ్యాజిక్. ఆ మ్యాజిక్ మళ్ళీ జరిగింది. చాలా ఏళ్ల తరువాత. నెట్ బుకింగ్ కుదరక, చాలా రోజుల తర్వాత నిన్న గంట ముందు వెళ్ళి నిలబడి కౌంటర్లో మొదటి టికెట్టు నేనే కొన్నా. కష్టానికి ఫలితం దక్కింది. శాశ్వత రసానందం మిగిలింది.

చిన్నప్పుడు ఎన్నిసార్లో బాపూ బొమ్మలతో ఉన్న బొమ్మల రామాయణం పుస్తకాన్ని తిరగేస్తూ, ఆ బొమ్మలను చూస్తూ ఉండేవాళ్ళం. వాటిల్లో కొన్ని బొమ్మలు మా తమ్ముడు వేసాడు కూడా. ఆ బొమ్మలను టైటిల్స్ లో మరోసారి మళ్ళీ చూసి బాల్య స్మృతుల్లోకి వెళ్పోయా ప్రారంభం లోనే. ఎర్రటి కేన్వాస్ మీద తోరణంలో కదులుతున్న పచ్చటి మామిడిఆకులు చిత్రమైన ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఓ "సంపూర్ణ రామాయణం", ఓ "సీతా కల్యాణం", ఓ "శ్రీరమాంజనేయ యుద్దమో" చూస్తున్న భావన. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరపై పూర్తినిడివి రంగుల చిత్రాన్ని గీసాడే బాపూ అని మనసు మురిసిపోయింది. రాముడి ద్వారా, వాల్మీకి ద్వారా చెప్పించిన కొన్ని రమణ గారి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టినట్లు, చికాకుగాను అనిపించలేదు. టకా టకా సీన్ పై సీన్ వెళ్పోయింది. నటీనటులందరూ తమ వంతు నటనా బాధ్యతను సమర్ధవంతంగా పోషించేసారు. డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఫ్రేం లోనూ కనబడింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇదే టెక్నాలజీ అందుబాటులో ఉండిఉంటే స్పీల్ బర్గ్ సినిమాలను మించిన చిత్రాలను మన విఠలాచార్య వంటివారు అందించేవారు కదా అనిపించింది.

ఇళయరాజా కూడా చాన్నాళ్ళకు ఏకాగ్రతతో పనిచేసినట్లు నేపధ్య సంగీతం తెలుపకనే తెలిపింది. ముఖ్యమైన సన్నివేశాల వెనకాల వచ్చిన వయోలిన్స్ మొదలైనవి ఇళయరాజా మార్క్ సంగీతాన్ని అద్భుతంగా వినిపించాయి. పాటలు కూడా విడిగా వినేకన్నా సినిమాలో చూస్తూంటే ఇంకా బాగున్నాయి అనిపించాయి. "జగదానంద", "ఎవడున్నాడీ లోకంలో", "రామ రామ రామ అనే రాజమందిరం" మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు గళం చాన్నాళ్ళకు ఖంగుమంది.బాపూగారు ముందే చిత్రం గీసేసి, సన్నివేశాన్ని అలానే చిత్రీకరిస్తారని వినికిడి. ప్రతీ సన్నివేశానికీ బాపూ గారి ఫ్రేమింగ్, రాజు గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. కొని దాచుకున్న పౌరాణిక చిత్రాల సీడీలకు ఈ చిత్రాన్ని కూడా జోడించాలి అని బలంగా అనిపించేలా ఉంది చిత్రం.

బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్ మొదలైన నటులను వారి పాత్రలలో చూసి ప్రేక్షకుడి మనసు తృప్తి పడిందంటే అది ఆ యా నటుల కృషి తో పాటుగా, వారితో అలా నటింపజేసిన ఘనత దర్శకుడిదే. సునీతా డబ్బింగ్ వాయిస్ సీత పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఏ.ఎన్.ఆర్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణ. వశిష్ఠులవారిగా నటించిన బాలయ్యగారు డైలాగులు చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించగా, ఇంత వయసులో కూడా అంత స్పష్టంగా, పూర్వపు ధాటితో ఆయన డైలాగు చెప్పటం ఆశ్చర్యపరిచింది. నాగేశ్వరరావు సినీప్రస్థానంలో మరో మైలు రాయిగా ఈ వాల్మీకి పాత్ర నిలిచిపోతుంది. హనుమంతుడి పాత్రధారి నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోయపిల్లవాడు బాలరాజుగా చేసిన పిల్లవాడు నాకు లవకుశుల కన్నా బాగా నచ్చేసాడు. లవకుశలుగా వేసిన పిల్లలిద్దరూ కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ నటనలో ఎక్కడా ఓవరేక్షన్ వగైరాలు లేకుండా బహుచక్కగా చేసారు. పాటలు పాడేప్పుడు కూడా లిప్ సింక్ బాగా కుదిరింది.

అయితే అన్నీ ప్రశంసలేనా? లోపాలే లేవా సినిమాలో అంటే ఉన్నాయి. నటనా పరంగా ఒకటి రెండు చెప్పలంటే నయనతార ఎంత వంకపెట్టలేనటువంటి అత్యుత్తమ నటన కనబరిచినా "సీతాదేవి" వంటి శక్తివంతమైన పౌరాణిక పాత్రలో అంజలీదేవిలో, చంద్రకళనో, జయప్రదనో, బీ.సరోజాదేవినో మరచి నయనతార ను కూర్చోబెట్టలేకపోయాను నేను. బహుశా ఆమె బాపు మార్క్ పెద్ద కళ్ళ హీరోయిన్ కాకపోవటం కారణం కావచ్చు. ఇక వీపుపై ఎన్.టి.ఆర్ లాగనే పుట్టుమచ్చను పెట్టుకున్నా కూడా రాముడన్న, కృష్ణుడన్నా ఎన్.టి.ఆర్ మాత్రమేనన్న నానుడిని అధిగమించటం మరెవరివల్లా కాదేమో అనిపించింది. ఎన్.టి.ఆర్ లోని గాంభీర్యం కూడా బాలకృష్ణ నటనలో లోపించిందేమో అని కూడా అనిపించింది. అయినా చంద్రుడి అందాన్ని చూస్తామే కానీ మచ్చలు వెతుకుతామా మరి? ఇదీ అంతే. రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో.




కాకపోతే ఈ విజయానందాన్ని అనుభూతి చెందటానికీ, పంచుకోవటానికీ "రమణ" గారు బాపుగారితో, మనతో లేరన్నదొక్కటే విచారకరమైన విషయం. మొత్తమ్మీద రమణగారికి అంకితమిచ్చిన ఈ చిత్రం బాపురమణల కీర్తిప్రతిష్ఠలకు మరో కలికి తురాయి.