మేం ఇప్పుడున్న ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా పక్కన ఒక అపార్ట్ మెంట్ కడుతున్నారు. నాలుగునెలల క్రితం అది పూర్తవటం జనాలు అద్దెకు రావటం జరిగింది. వేసం శెలవుల్లో మా పిల్లని సంగీతంలో చేర్చాను. నాతో పాటే ఆ అపార్ట్మెంట్లో ఒకావిడ కూడా వాళ్ల అబ్బాయిని తీసుకువచ్చి దింపేవారు. ఆవిడను ఎక్కడో చూసినట్లు, బాగా తెలిసినట్లు అనిపించేది.
నెమ్మదిగా మాటలు కలిసాకా పాపని మాఇంటికి పంపండి బాబుతో ఆడుకుంటుంది అనడిగేవారు. అప్పటిదాకా ఒక్కర్తే ఉండటం వల్ల మా అమ్మాయి కూడా వెళ్తానని పేచీ పెట్టేది.నాకేమో కొత్తవాళ్ళింటికి పంపటం ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి కొన్నాళ్ళు దాటేసాను. సంగీతం క్లాసులో వాళ్ళ బాబుతో బాగా స్నేహం కలిసాకా మాపిల్ల ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి ఆడుకుంటానని బాగా మారాం చేస్తే ఇక తప్పక తీసుకెళ్ళాను. కాసేపు మాటలయ్యాకా చుట్టాలను గురించిన మాటలు వచ్చాయి. నువ్వు ఫలానావాళ్ల అమ్మాయివా...నువ్వా? అంది ఆశ్చర్యంగా? వాళ్ళాయన కూడా ఫలానానా ? అని ఆశ్చర్యపోయారు. తీరా తెలిసినదేమిటంటే మా అమ్మకు పెద్దమ్మ మనవరాలు ఈవిడ. నాకు "అక్క" వరస అవుతుంది. అదీగాక వాళ్ళన్నయ్య మా మేనమామకు అల్లుడు.
కాకినాడలో అక్కావాళ్ల అమ్మనాన్నలు ఉంటారు. మేం చిన్నప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి పేరంటాలకు వెళ్ళేవాళ్లం. అలా వాళ్ళు బాగా తెలుసు నాకు. అమ్మావాళ్ల పెద్దనాన్నగారు (అంటే అక్కా వాళ్ల తాతగారు) ఒకప్పుడు కాకినాడలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు. చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళ నుంచి వైద్యానికి మనుషులు వచ్చేవారుట. ఇక వాళ్లయనేమో మా నాన్నగారి అమ్మమ్మగారి వైపు చుట్టాలు. బంధుత్వాలు దూరమే అయినా రాకపోకలుండటం వల్ల బాగా పరిచయస్తులమే.
మేమెవరం ఊరు వెళ్ళినా ఒకరు వచ్చేదాకా ఒకరు కాలుగాలిన పిల్లిలా తిరుగుతారు ఇద్దరూ. పొద్దున్నొకసారి, స్కూలు నుంచి వచ్చాకా ఒకసారిఊకర్నొకరు చూసుకోవాల్సిందే. ఇక వాళ్ళ స్నేహం ఎంత పెనవేసుకుపోయిందంటే రోజూ దెబ్బలాడుకునేంత. ఫోవే ఫో..అంటాడు వాడు. ఇదేమో నాలిక బయట పెట్టి వెక్కిరిస్తుంది. పెద్దవాళ్లం దగ్గర లేకపోతే కొట్టేసుకుంటారు కూడా. మళ్ళీ అంతలోనే కలిసిపోయి కబుర్లాడేసుకుంటారు. ’వీళ్ళ వేవ్ లెంత్ బాగా కలిసిందే.." అంటుంది అక్క. ఫెండ్షిప్ బాండ్ కట్టుకున్నారు. రాఖీ కి బుల్లికృష్ణుడి బొమ్మ ఉన్న రాఖీ దొరికితే కట్టించాను. మొన్న గణేశుడి పందిట్లో వాళ్ళ టీచర్ పిల్లలందరితో శ్లోకాలు అవీ పాడించారు. అప్పుడు చూడాలి వీళ్ళిద్దరి అల్లరినీ..!!
భగవద్గీత శ్లోకాలు చెప్తున్న కృష్ణ |
స్టేజ్ మీద పాడుతూండగా |
విడదియలేనంతగా అల్లుకుపోయిన వాళ్ల అనుబంధాన్ని చూస్తే కళ్ళు చెమరుస్తాయి. మరో తోడుని పిల్లకు అందించలేకపోయానన్న బాధ మనసుని మెలిపెడుతుంది. భగవంతుడి లీలలు అర్ధం కానివి కదా...వీళ్ళిద్దరూ విడిపోవాల్సిన సమయాన్ని కూడా దగ్గర పడేస్తున్నాడు...! ఇకపై దూరాల్లో ఉన్నా ఎప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలానే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను.
Subscribe to:
Posts (Atom)