మా వాటా వైపు పొడువాటి సందు ఉండేది. రెండు కొబ్బరి చెట్లు, ఒక పెద్ద రేక నందివర్ధనం చెట్టు ఉండేవి. నందివర్ధనం చెట్టు ఎక్కటానికి వీలుగా ఉండేది. రోజూ పొద్దున్నే నేనో తమ్ముడో చెట్టేక్కి గోడ మీద కూచుని సజ్జ నిండా పూలు అమ్మకి కోసి ఇచ్చేవాళ్లం. మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది. మా ఇంటి గోడకూ, ఎదురుగుండా ఇంటికి మధ్య నాలుగైదు అడుగుల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ పిచ్చి మొక్కలు, బోలెడు ఆముదం మొక్కలు, బొప్పాయి మొక్కలు ఉండేవి. పిచ్చుకలు, గోరింకలూ, అప్పుడప్పుడు కోయిలలు వచ్చి ఆ చెట్లపై వాలుతూ ఉండేవి. ఆముదం మొక్కల వల్ల ఎప్పుడూ నల్లని గొంగళీ పురుగులే. కొన్ని ఇంటి గోడమూలల్లో గూళ్ళు కట్టేసుకుని ఉండేవి. అవి సీతాకొకచిలుకలు అవుతాయని నాన్న చెప్తే ఆశ్చర్యం వేసేది. గొంగళీలతో పాటూ వర్షాకాలంలో గుంపులు గుంపులుగా ఎర్రని రోకలిబండలు తిరుగుతు ఉండేవి. పుట్టలు పుట్టలుగా ఎన్ని పుట్టేసేవో అవి. ఇక వర్షం వస్తే వీధి గుమ్మం దాకా మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి. మా ఇంట్లోని చిన్నగదిలో ఎత్తుగా ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ గూట్లోకి ఎక్కితే కాళ్లు తన్నిపెట్టుకుని కూర్చోటానికి కుదిరేది. వాన వస్తూంటే సన్న తుంపరలు మీద పడేలా ఆ కిటికీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉండేది.
ఇంటి వెనుక వైపు చాలా పెద్ద పెరడు ఉండేది. అందులో ఓ పక్కగా పెద్ద సపోటా వృక్షం, దానికి చుట్టుకుని గురువింద గింజల తీగ ఉండేవి. ఎరుపు నలుపుల్లో ఉండే గురువింద గింజలు కోసుకుని దాచటం నా ముఖ్యమైన పనుల జాబితాలో ఉండేది. పెరటిలో సపోటా చెట్టునానుకుని డా.జంధ్యాల శంకర్ గారి ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు పేరంటాలకు పిలిచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళింట్లో పొడుగ్గా రెండు యూకలిప్టస్ చెట్లు ఉండేవి. ఒకటో రెండో ఆకులు అందుకుని వాసన చూస్తే భలేగా ఉండేది. (ఆ తర్వాత డా.శంకర్ గారు విజయవాడ మేయర్ గా కూడా చేసారు) మా వెనుక పెరడులో ఇంకా పారిజాతం, కర్వేపాకు, గోరింటాకు, రెండు మూడు గులాబీ చెట్లు ఉండేవి. అవికాక ఒక పక్క విరజాజి పందిరి, మరో పక్క సన్నజాజి పందిరి, వాటి మధ్యన రెండు మూడు మల్లె పొదలు(కోలవి, గుండ్రంటివి ఇలా మల్లెల్లో రకాలన్నమాట), ఒక కాగడా మల్లె పొద కూడా ఉండేవి. ఇవి కాక అద్దెకున్నవాళ్ళు పెంచుకునే మొక్కలు. ఇలాగ వెనుకవైపు పెరడులోకి వెళ్ళాడానికి చాలా ఆసక్తికరమైన సంగతులన్నీ ఉండేవి. అమ్మ ఎప్పుడు బయటకు వదులుతుందా అని మా వరండాలోని కటకటాలతలుపులు పట్టుకుని జైల్లో ఖైదీల్లాగ ఎదురు చూసేవాళ్ళం. అమ్మ తాళం తియ్యగానే పరుగున వెనుకవైపుకు వెళ్పోయి చీకటి పడేదాకా అక్కడే అడుకుంటూ గడిపేవాళ్లం.
పొరపాటున ఎవరి చెయ్యైనా చెట్ల మీద, పువ్వుల మీదా పడిందో పై నుండి ఎప్పుడు చూసేదో భాస్కరమ్మగారు ఒక్క కేక పెట్టేది..ఎవరదీ అని..! అన్ని పూలు పూసినా ఒక్క పువ్వు కూడా మా ఎవ్వరికీ ఇచ్చేది కాదు ఆవిడ. పొద్దుటే ఆవిడ పనిమనిషి వచ్చి అన్ని పువ్వులు కోసుకుని వెళ్ళిపోయేది. దేవుడికి పెట్టుకునేదో ఏమో...! నేను కొత్తిమీర వేస్తే మాత్రం కాస్త కొత్తిమీర కోసివ్వవే అని జబర్దస్తీ గా కోసేసుకునేది. నాకు ఒళ్ళు మండిపోయేది. పువ్వులు కోసుకోనివ్వకపోయినా నేనైతే ఎప్పుడూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఆ పచ్చదనం నన్నెంతో ముగ్ధురాలిని చేసేది. మొక్కలన్నింటి మధ్యనా ఉండే మెత్తటి ఆకుపచ్చటి గడ్డి మొక్కలు కూడా నాకు అందంగా కనబడిపోయేవి. అలా మొక్కలతో నా సావాసం ఊహ తెలిసినప్పటి నుండీ ఏర్పడిపోయింది.
వీధివైపు ఉన్న రెండిటిలో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం. రెండోదాన్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అవివాహితుడైన ఆయనతో ఆయన చెల్లెలు, ఆవిడ ముగ్గురు పిల్లలు ఉండేవారు. వారితో నామమాత్రపు పరిచయమే తప్ప మిగిలిన సంగతులు ఎక్కువ ఎవరికీ తెలియవు. మా వాటాలో వరండా, చిన్నగది, వంటిల్లు, హాలు,బెడ్రూము ఉండేవి. ఇంకా ఓ రెండు గదులు ఉంటే, అవి మాకు అనవసరం అని అద్దెకు ఇచ్చారు నాన్న. దాన్లో కొన్నేళ్ళు భట్టుమావయ్యగారు(పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు) ఉన్నారు. తరువాత మేమున్నన్నాళ్ళు సూరిసేన్ మావయ్యగారు, వాళ్ళ తమ్ముడు శంకర్ గారు ఉండేవారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదెందుకో మరి. సూరిసేన్ మావయ్యగారికీ నాకూ భలే స్నేహం ఉండేది. ఆయన రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూంటే కావాలని కదిలిస్తూ, ఆయనతో ఆడుతూ..కబుర్లు చెప్తూ ఎప్పుడూ వాళ్ల రూంలోనే ఎక్కువ ఉండేదాన్ని. వీళ్ల రూంకే తరచూ సాయంత్రాలు ఉషశ్రీతాతగారు పలు మిత్రులను కలవటానికి వస్తూండేవారు.
మా వాటాసందు చివరగా చిన్న వీధి గుమ్మం ఉండేది. గుమ్మానికి పక్కగా రాధామనోహరలు తీగ అల్లుకుని ఉండేది. రాత్రయ్యేసరికీ లేత గులాబి,తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా రాధామనోహరాలు విచ్చేవి. ఆ పరిమళం ఇంకా తలపుల్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఒకే తీగకు రెండు రంగుల్లో పులెలా పూస్తాయీ అని ఇప్పటికీ సందేహమే నాకు. సాయంత్రం ఆ పూలు విచ్చే సమయానికీ, పొద్దున్నే లేవగానే కాసేపు ఆ వీధి గుమ్మంలో కూచోపోతే నాకు తోచేది కాదు. పొద్దున్నే వీధి తుడిచేవాళ్ళు, అటువెళ్ళే బళ్లవాళ్ళు అందరూ ఓ చిరునవ్వుతో పలకరించేసేవారు. నిర్మలా కాన్వెంటు స్కూలు బస్సు మా ఇంటి ఎదురుగా ఆగేది. సూరిబాబుమావయ్యగారి పిల్లలు ఆ బస్సు ఎక్కటానికి రోజూ వచ్చి అక్కడ నిలబడేవారు. ఇప్పుడు వాళ్ళు సంగీత విద్వాంసులు "మల్లది బ్రదర్స్" గా మంచి పేరు తెచ్చుకున్నారు.
మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు. తాతగారు నాకూ, మా తమ్ముడికీ కొబ్బరి ఆకులతో, తాటాకులతో బుట్టలు అవీ అల్లి ఇస్తూండేవారు. కొత్త కొత్త కబుర్లు ఎన్నో చెప్పేవారో. వాళ్ళబ్బాయి శ్రీనుమావయ్య మృదంగం నేర్చుకునేవాడు. రోజూ పొద్దుట సాయంత్రం సాధన చేస్తూండేవాడు. మేము కిటికీ ఎక్కి అబ్బురంగా చూస్తూండేవాళ్లం. నాగమణక్క కాలేజీలో చదువుతూ ఉండేది. అమ్మమ్మగారికి వినబడేది కాదు. చెవికి మిషన్ పెట్టుకునేవారు. కాలేజీ నుంచి రాగానే ఆ రోజు జరిగిన విశేషాలన్నీ గట్టిగా అమ్మమ్మగారికి చెబుతూ ఉండేది అక్క. అన్ని వాటాలవాళ్ళకీ వినబడేవి ఆ కబుర్లు. ఇక వెనుకవైపు మరోవాటాలో ఇంకో తాతగారు, అమ్మమ్మగారు వారి ఆరుగురు సంతానం ఉండేవారు. తాతగారికి నేనంటే వల్లమాలిన అభిమానం. ఆఫీసు నుండి రాగానే ఎంత రాత్రయినా నన్ను తీసుకురమ్మని బొజ్జపై పడుకోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పేవారు. తెలుగు తిథులు,నెలలు, పద్యాలు,పాటలూ ఎన్నో నేర్పించేవారు. నా ఊహ తెలిసేసరికీ ఇరువైపుల తాతగార్లు లేకపోవటంతో ఈ తాతగారు బాగా దగ్గరైపోయారు. అమ్మ కూడా పిన్నిగారు,బాబయ్యగారు అని పిలిచేది వాళ్ళిద్దరినీ. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలవాళ్ళమూ. కొన్నేళ్ళకు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళు వెళ్పోయారు వాళ్ళు. ఊళ్ళు మారినా, దూరాలు పెరిగినా ఇప్పటికీ ఆ అనుబంధం అలానే ఉంది. మా పాప పుట్టాకా తాతగారికి విజయవాడ తీసుకువెళ్ళి చూపించి వచ్చాను. తాతగారు కాలం చేసి ఏడాదిన్నర అయిపోతోంది అప్పుడే !!
తాతగారూవాళ్ళు ఖాళీ చేసాకా ఆ ఇంట్లోకి ఉషశ్రీగారి సహోదరులు పురాణపండ రంగనాథ్ గారు వచ్చారు. పిల్లలందరం కల్సి గోడలెక్కి దూకి..రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. శెలవుల్లో ఎండిన కొమ్మలు విరిచి బాణాలు చేసుకునేవాళ్ళం. రంగనాథ్ మావయ్యగారు అమ్మవారి ఉపాసకులు. దసరా పూజలు ఎంతబాగా చేసేవారో. విజయవాడలో ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా నవరాత్రుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. భాస్కరమ్మగారు "ఇల్లు బాగుచేయించాలి.." ఖాళీ చెయ్యమంటే అన్ని వాటాలవాళ్ళమూ ఒకేసారి ఆ ఇంట్లోంచి కదిలాము. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ప్రపంచం తెలీని బాల్యపు అమాయకత్వం, చలాకీతనం, అరమరికలు లేని స్నేహాలు, పచ్చదనంతో సావాసం...మరువలేనివి. ఆ రోజులు గుర్తుకు వస్తే...ఒక అద్భుతలోకంతో బాంధవ్యం అప్పటితో తెగిపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధురస్మృతులన్నింటినీ ఒకచోట పోగేసి దాచుకోవాలన్న ఆలోచనే ఈ టపా.