(బ్లాగర్ ప్రాబ్లం వల్ల ఈ టపా మొన్న పెట్టిన కాసేపుకి డిలీట్ అయిపోయింది. ఆ కాసేపులో వచ్చిన నాలుగు వ్యాఖ్యలు కూడా డిలీట్ అయిపీఓయాయి. అందుకని ఈసారి ఫోటోతో పెడుతున్నాను...:))
పట్టుమని పది మావిడికాయలతో ఈసారి ఆరు రకాలు:
వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
మాగాయ
తురుము మాగాయ !!
(ఇది 12thన రాసినది..:))
పొద్దున్నుంచీ బయటకు వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చీ, వెళ్ళి వచ్చీ...
డాబాపై ముక్కలు పెట్టి..మళ్ళీ తీసుకువచ్చి..
కారం, ఉప్పు , ఆవ కొలుచుకుని
పెసరపొడి జల్లించి
మెంతులు, ఆవాలు వేయించి.. చల్లర్చి
ఇంగువ నూనె కాచి
ఒక్కొక్కటీ కలిపి...
అన్నీ మూతలు పెట్టి
గోడకి జారలబడి
ఎందుకో ఈ ఊరగాయలు పెట్టడం?
దండిగా తింటే పడేనా?
అసలివన్నీ అరోగ్యానికి ఏం మంచి చేస్తాయని?
పక్షానికో నేలకో ఓసారి నాలిక్కి రాసుకోటానికి
ఇన్ని తంటాలు అవసరమా?
కూర్చున్న చోట్నుంచి లేచాకా ఫోన్ దగ్గరకు పరుగు
అమ్మకి, అన్నయ్యకీ డప్పు కొట్టడానికి
'ఉరేయ్ నేనూరగాయలు పెట్టేసానోచ్' !!
'సాంపిల్ ఎప్పుడు తెస్తావు' అని వాడు..
'నన్నడిగితే పెట్టివ్వనా? ఎందుకన్ని తంటాలు పడటం?' అని అమ్మ...
అంటూంటే
'మరి నా సరదా తీరేదెలా?' అని నేను.
'అమ్మా, మెంతికాయ ఎలా చెయ్యాలో చెప్పవే
మళ్ళీ ఏడు చేస్తాను...'!
...దీన్ని 'ఊరగాయ వైరాగ్యం' అంటారు !!
__________________________________
జయగారు, మీరు శ్రమ తీసుకుని మళ్ళీ వ్యాఖ్య రాసినా ఇలా రెండవసారి టపా పెట్టటం వల్ల అది కూడా పోయింది...ఏమీ అనుకోవద్దండీ..! ఒకటో రెండో కాక, ఇన్నిరకాలు పెట్టడం ఇదే మొదటిసారి నాకూనూ. అన్నీరకాలు కూడా బాగా కుదిరాయి. టేస్ట్ చేసినవాళ్ళందరూ బాగుందనే అన్నారు !!