సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 6, 2011

నాకిష్టమైన నటీమణుల్లో ఒకరు...సుజాత !



ఒక మంచి నవ్వు...కల్మషరహితమైన స్వచ్ఛమైన నవ్వు, సదాసీదా రూపం, ఆర్భాటం హంగులు లేని ప్రవర్తన, నటించే ప్రతి పాత్రలో లీనమైనట్లుండే సహజ నటన, ముఖ్యంగా మొహంలో అనితరసాధ్యమైన హావభావాలు..."సుజాత" అనగానే ఇవీ నాకు గుర్తుకొచ్చేవి. నాకు బాగా నచ్చే అతికొద్దిమంది నటీమణుల్లో ఒకరు సుజాత. అంత స్వచ్ఛమైన చిరునవ్వు కానీ అమాయకమైన నవ్వు చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తుంది. సుజాత నటనలో నాకు బాగా నచ్చేది ఆ నవ్వే. ఆ తర్వాత భావగర్భితమైన ఆవిడ ముఖ కవళికలు. అవి ఎంత అనుభవపూర్వకంగా ఉంటాయంటే చెప్పలేను. పాత్రల్లో జీవించారు అని కొద్దిమంది నటననే చెప్పుకోగలం. అలాంటి కొద్దిమందిలో సుజాత ఒకరు.


సుజాత నటించిన ఏ సినిమా రిలీజైనా మా ఇంట్లో అందరం వెళ్ళేవాళ్ళం. నాకు హాల్లో చూసిన సినిమాల్లో బాగా గుర్తున్నవి గోరింటాకు, బంగారు కానుక, గుప్పెడు మనసు, ఏడంతస్తుల మేడ, సర్కస్ రాముడు. కొత్తవాటిల్లో కూడా తల్లి పాత్రలు అవీ చేసారీవిడ. వాటిల్లో గుర్తున్నవి సూత్రధారులు, చంటి, పెళ్ళి, మాధవయ్యగారి మనవడు, బాబా, శ్రీరామదాసు మొదలైనవి. సుజాత కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేసారని విన్న గుర్తు.


ఇప్పుడంటే తెలుగు నటులే తెలుగు పలకలేక, తమ డబ్బింగ్ తాము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ మాతృభాష మళయాళం అయినా సరే తెలుగు నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు సుజాత. ముద్దు ముద్దుగా ఆవిడ పలికే కొన్ని తెలుగు మాటలు, డైలాగులు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవి. "బంగారు కానుక"(ఏ.ఎ.ఆర్,సుజాత, శ్రీదేవి) అనే సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం డైలాగులు ఎందుకనో రికార్డ్ చేసారు ఇంట్లో. చిన్నప్పుడు చాలా సార్లు ఆ డైలాగులు వింటూ ఉండేదాన్ని. అందులో సుజాత అనే "తప్పమ్మా!" అనే మాట భలే గమ్మత్తుగా ఉండేది.


ఇందాకా టివీలో ఆవిడ మరణవార్త నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంఠనే టివీ ఆపేసా. ఇక రాబోయే సంతాపాలు వినే శక్తి లేక. మొన్న రమణ గారు, నిన్న నూతన్ ప్రసాద్..ఇవాళ ఈవిడ..! దేవుడు ఇలా మంచివాళ్ళందర్నీ ఒకేసారి దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నాడేమిటీ అనిపించింది. ఏదేమైనా మరణం అనివార్యం. సత్యం. సినీపరిశ్రమ ఒక ఉత్తమ నటిని కోల్పోయింది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.