సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 24, 2010

స్వాతంత్ర్య గృహం


హమ్మయ్య....ఇంక ఇవాళ అత్తయ్యగారి గదిలో ఉన్న పెట్టెలు కూడా సర్దేస్తే బట్టలు సర్దటం అయినట్లే. ఇంకా అసలైన పెద్ద పెట్టెలు, కొన్ని చిన్నాపాటి పెట్టెలు ఉన్నాయి. పెద్ద పెట్టెల్లోవన్నీ కేసెట్లు, పుస్తకాలు. చిన్నవాటిల్లో ఉత్తరాలు, గ్రీటింగ్స్, కుక్కరీ బుక్స్ గట్రా..! అదంతా నా సామానే. అసలు ఆ మాటలు వస్తే, ఇంటి సామానులో సగానికి పైగా అంతా నా సామానే. వాటిలో మూడొంతులు చెత్త అనీ, ప్రపంచంలో ఎక్కువ చెత్త పోగేసేవాళ్లకు ఏదైనా అవార్డ్ ఇవ్వల్సి వస్తే అది మొదట నాకే వస్తుందని మావారి ప్రగాఢ నమ్మకం కూడా. నా పెళ్ళై వచ్చేసాకా వాళ్ళ ఇల్లు సగం ఖాళీ అయిపోయిందని మా అమ్మ సంతోషించింది. ఈ సామానంతా ఎక్కడ సర్దుకుంటుంది? అని మా అత్తగారు కంగారు పడ్డారు. తర్వాత ఊరు మారినప్పుడు సగం సామాను అటక మీద పెట్టేసి వెళ్ళాము. మళ్ళీ వచ్చినా క్రిందకు దింపేందుకు చోటు లేక అలానే ఉంచాము సామాను ఇన్నాళ్ళూ. పెళ్ళైన ఇన్నాళ్ళకు ఇప్పుడే వాటికి మోక్షం వచ్చింది. ముఖ్యంగా నా సామానుకి...:)

ఇంతకీ నా సామానుకి మోక్షం ఒక "స్వాతంత్ర్య గృహం"లోకి మారినందువల్ల వచ్చినది. ఇది "ఇండిపెండెంట్ హౌస్" కు నేను పెట్టిన ముద్దు పేరు. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయాకా విడిగా ఉండే ఇంటి పోర్షన్స్ లోకి అద్దెకు వెళ్ళటం తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా సిటీల్లో మరీను. అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే అపార్ట్మంట్ల వైపే అందరూ ఆకర్షితులౌతూంటారు. చిన్నప్పుడు విజయవాడలో ఉండగా ఇలా సెపరేట్ గా ఉన్న పోర్షన్స్ లోకి అద్దెకు వెళ్ళేవాళ్ళం. కాలేజీ సమయానికి క్వార్టర్స్లోకి మారిపోవటంతో, అందులోనూ అది గ్రౌండ్ ఫ్లోర్ అవటంతో అది సొంత ఇంటి మాదిరిగానే ఉండేది. అయినా అప్పుడంతా అమ్మ చూసుకునేది కాబట్టి ఇల్లు మైన్టైన్ చేసే వివరాలు పెద్దగా తెలియవు. పెళ్ళి తరువాత అంతా అపార్ట్మెంట్లే. కాబట్టి గట్టిగా చెప్పాలంటే మొదటిసారిగా ఇప్పుడే ఒక ఇంటిదాన్నయ్యాను.

ఇప్పుడు ఈ ఇంటి మార్పువల్ల నేను తెలుసుకున్న కొన్ని విషయాలు సరదాగా చెబుదామని. అంటే చిన్నప్పుడు స్కుల్లో లాగ అపార్ట్మెంట్ కూ, ఇండిపెండెంట్ హౌస్ కు మధ్యన గల తేడాలూ, ఉపయోగాలూ, లాభాలూ నష్టాలూ వివరించబడతాయన్న మాట. అపార్ట్మెంట్ లలో అద్దె ఒక్కటే మనం ఇచ్చేది. మిగతావన్నీ మైన్టైనెన్స్ వాళ్ళు, వాచ్ మాన్ చూసుకుంటారు. గుమ్మం ముందర ఉండే కాసింత ప్లేసే మనది. ఆ పైన కారిడార్,మెట్లు అంతా వాచ్ మేన్ క్లీన్ చేస్తాడు. పండగలు పబ్బాలు వస్తే మనం బూజులు దులపక్కర్లేదు. రోజులో మంచినీళ్ళు ఎప్పుడు వచ్చినా వాచ్ మేన్ తెచ్చి లోపల పోస్తాడు. మనం లేకపోయినా మన రెండు బిందెలూ గుమ్మంలో పెటి వెళ్పోతాడు కాబట్టి, టేప్ ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలీదు. చెత్తను గుమ్మం బయట కవర్లో పెట్టేస్తే ఎప్పుడోఅప్పుడు చెత్తబ్బాయి వచ్చి తీసుకుపోతాడు. పేపరు,పాలు అన్నీ అందరికీ వేసేవాళ్ళే వచ్చి వేసిపోతారు. గ్రిల్ ఉంటుంది కాబట్టి బట్టలు రాత్రికి తియ్యకపోయినా నష్టం లేదు. రాత్రుళ్ళు క్రింద వాచ్మేన్ ఉంటాడు కాబట్టి సెక్యూరిటీకి ఢోకా లేదు. మైన్టైనెన్స్ కు ఫిక్స్ చేసిన మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళకు ఇస్తే చాలు. అదీగాక మా అదృష్టం వల్ల ఇన్నాళ్ళు ఎక్కడకు మారినా అన్నీ కొత్త అపార్ట్మెంట్లు, పైన ఇళ్ళు అవటం వల్ల రిపేర్లూ, టేప్ లీకేజ్లూ గట్రా తెలియవు. హాయిగా దర్జాగా కొత్త ఇంటి అందాన్నీ ఆనందంగా అనుభవించేసాము.

"ఇంటి" కోసం మావారు తిరిగిన తిరుగుడు సంబంధాల వేటలో తిరిగిఉంటే ఈపాటికి నలుగురు అమ్మాయిలకు పెళ్ళిలైపోయి ఉండేవి అనిపించింది. మొత్తానికి ఒక ఇండిపెండెంట్ హౌస్ దొరికింది. చూడటానికి వెళ్ళినప్పుడు ఇంటి చూట్టూ పరుచుకున్న ఎండను చూసి, గుమ్మిడి వడియాలు రెండురోజుల్లో ఎండుతాయి, బట్టలు గంటలో ఆరతాయ్ మొదలైన శుభలక్షణాలు కనిపించి ఆ ఇంటికి మార్కులు వేసేసాను. ఓ కార్తీకమాసపు శుభముహుర్తాన ఇంట్లో చేరిపోయాం.ఇన్నాళ్ళకు గాలీ,వెలుతురు,ఆకాశం చూస్తున్నాం అని తెగ సంబర పడిపోయాను. చుట్టుతా మట్టి లేదు కాబట్టి దుమ్ము,ధూళి ఉండదు. నీళ్ళు, ఓపిక ఉండాలే కానీ కావాల్సినన్ని మొక్కలు కుండిల్లో పెంచేసుకోవచ్చు.. అనేసుకున్నా. ఓపిక లేకపోతే ఇంటివాళ్ళు వదిలేసిన పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు మొక్కలు పదో పన్నేండో ఉండనే ఉన్నాయి. అయినా ఇంట్లో చేరిన రోజే బయట వచ్చిన సైకిలు మొక్కలబ్బాయి దగ్గర రెండు మొక్కలు కొనేసాను. నెలకోసారి వస్తాడుట. నా మొక్కల పిచ్చి ఇన్నాళ్ళకు చిగురులు తొడిగబొతోందని సరదాపడిపోయి వచ్చినప్పుడల్లా కనబడమని అతనికి చెప్పేసా.

ఇక దిగాకా నెమ్మదిగా ఓ వారానికి చాలా సంగతులు అవగాహనలోకి వచ్చాయి. ఇది "స్వాతంత్ర్య గృహం". అన్నింటికీ మనదే బాధ్యత. పైన పోర్షన్లో మరొకళ్ళు ఉన్నా క్రింద ఇంటివాళ్ళకు ఉన్నంత బాధ్యత వాళ్లకు ఉండదు. పొద్దున్నే వీధి గుమ్మంలో ముగ్గు పెట్టుకోవటం దగ్గర నుంచీ, రాత్రి గేటు వేసేదాకా పూర్తి స్థాయిలో శ్రధ్ధ వహించాలి. ఆరిన బట్టలు రేపు తీయచ్చులే అని బధ్ధకించకూడదు. ఎవడైనా గోడ దాటి వచ్చి ఎత్తుకెళ్లగలడు. ఇక కిటికీలన్నీ ముఖ్యంగా వంటింటి కిటికీ రాత్రిళ్ళు, ఇంట్లో లేనప్పుడూ జాగ్రత్తగా మూసేస్తూ ఉండాలి. ఎదురింటి గోడ మీద కనిపించిన పిల్లి ఇటుగా వచ్చే ప్రమాదం కనబడింది. మా ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో చుట్టుతా ఉన్న అందరూ చెత్త పోసేస్తున్నారు. నేను సైతం అలా చెయ్యలేను కాబట్టి, అర్జెంట్గా వలపన్ని నాలుగురోజుల్లో ఆ వీధిలో చెత్త పట్టుకెళ్ళే అబ్బాయిని పట్టుకుని సిక్సర్ కొట్టినంత ఆనందపడిపోయాను. రాత్రి బయట పెట్టిన చెత్త కవరు పొద్దున్నే చిందరవందరవగానే అర్ధమైంది బయట పెట్టకూడదని(మూత ఉన్న డస్ట్బిన్ బయట పెడదామంటే అవి ఎలకలు కావు పందికొక్కులు ట). ఇక రోజూ పొద్దున్నే ఠంచనుగా ఐదున్నర ఆరు మధ్యలో వచ్చే చెత్తబ్బాయే నాకు "అలారం" అయ్యాడు. ఇక మిగిలిన దైనందిన సౌకర్యాలన్నీ కుదిరాయి. పాలు మాత్రం పక్క సందులోనే ఉండటంతో ఎవరో ఒకరం వెళ్ళి తెచ్చుకుంటున్నాము.

కాస్త పాత ఇల్లు కావటంతో బాత్రూమ్స్ లోపలే ఉన్నా వాటికి కాసిని పగుళ్ళు ఉండటంతో సన్నటి ఎర్రటి వానపాము టైప్ జీవులు, బొద్దింకలూ నన్నూ, పాపనూ భయ పెట్టాయి. ఇక పగలు పూట కూడా పాపకు బాత్ రూమ్ లోకి సాయానికి వెళ్లవలసివస్తోంది. అవి కాక వంటింట్లో ఎర్ర చీమలు, గదుల్లో అక్కడక్కడ బల్లులు, బయట మొక్కల కుండీల దగ్గర జెర్రిలు లాంటి చిన్నపాటి క్రీచర్స్ అన్నీ మేమూ మీతో నివసిస్తాము ఇక్కడ అని "హలో" చెప్పాయి. హిట్, లక్ష్మణ్ రేఖా, చీమల మందు గట్రా ఉన్నా ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిందే అని నిర్ణయించటం జరిగింది. ఇంట్లో వచ్చేవన్నీ మంచినేళ్ళేట ఉప్పు నీళ్ళ బాధ తగ్గింది. జుట్టు కాస్తైనా నిలిస్తుంది అన్న ఆనందం ఎక్కువ నిలవలేదు. మున్సిపల్ టాప్ టైమింగ్స్ ఇచ్చేవాడిష్టం. పొద్దున్నే గనుక నీళ్ళు రాకపోతే, ఎంత రెండు బిందెలే అయినా సంపులోకి దిగి పట్టడానికి అయ్యగారి సాయం కూడా ఉండదు అని అనుభవమైపోయింది. ఈ కొత్తల్లోనే రెండు రోజులు అయ్యగారి ఆఫీసుటూర్. ఇక చిన్నపాటి శబ్దాలకు కూడా ఉలిక్కిపడి లేవటం. పక్కనే హనుమాన్ చాలీసా,దండకం, స్వామి వీభూతి అన్నీ పెట్టుకుని కూడా బెదిరిపోవటం...ఇంత పిరికిదానివేమిటీ అని వెక్కిరింతలు కూడా అయ్యాయి.

ఇంటి సర్దుడు వల్ల మూడు దఫాలుగా సాగిన ఈ పోస్ట్ ఇప్పటికి ముగింపుకి వచ్చింది. రాస్తూంటే ముక్కు పుటాలు పనిచేసి పరిగెత్తుకు వెళ్ళటం వల్ల పొయ్యి మీద కూర మాడిపోయి ఇక ఈ టపాను ముగించాల్సిన సమయం వచ్చిందని తెలియజేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇల్లు మారటం మీద ఓ పుస్తకమే రాసేయచ్చేమో. మొత్తమ్మీద తేలినదేమనగా సెపరేట్ ఇల్లైనా, అపార్ట్మెంట్ అయినా లభాలు, నష్టాలూ రెంటికీ ఉన్నాయి. ఇల్లు బాగున్నప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు కాబట్టి సర్దుకుపోవాలి మరి. ఏదేమైనా కొత్త కొత్త అనుభవాలతో ఈ "స్వాతంత్ర్య గృహం" నాకొక విచిత్రమైన అనుభూతిని మాత్రం ఇస్తోంది.