సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 22, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 2 !!


మొదటిభాగం తరువాత
..

Oct 21,11.30p.m
ఫోటోలో భాస్కర్ తో పాటూ ఉన్నది అతని సన్నిహిత మిత్రుడు "నారయణమూర్తి". ఇతను ప్రముఖ న్యాయవాది, హాస్య రచయిత, రంగస్థల,సినీ నటులు అయిన శ్రీ పుచ్ఛా పూర్ణానందంగారి అల్లుడు. నలభై ఐదేళ్ళు అయినా చెక్కు చెదరని వాళ్ళ స్నేహం గాఢానురాగాలతో ఇప్పటికీ కొనసాగుతోంది.

అక్కగారి వివాహం అవ్వగానే బావగారు బాగా చేరువయ్యారు. బావ, అతనింటి సభ్యులు అందరూ అతన్ని "ఖండవిల్లి రామం" అని పిలిచేవారు. తండ్రి లేని లోటు అప్పటికి తీరింది. బావ ప్రోత్సాహంతో డిగ్రీ అవ్వగానే మద్రాసులోని గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు అప్లై చేసాడు భాస్కర్. తను గీసిన పైంటింగ్స్, మిగిలిన ఆర్ట్ వర్క్లో ఉన్న టేలంట్ చూసి ఇంటర్వ్యూ లో "డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్" బాగా ఇంప్రెస్స్ అయ్యి ’ఇతనికి తప్పకుండా సీత్ ఇవ్వండి" అని చెప్పి వెళ్ళాడు. దాదాపు అరగంట సేపు సాగిన ఇంటర్వ్యూలో తన దగ్గరున్న ఆర్ట్ మెటీరియల్ చూపించటానికే ఎక్కువ టైం పట్టింది. ఫోటోగ్రఫీ అంటే భాస్కర్ కు ఎంతో ఇష్టం. ఒక మామూలు హేండ్ కెమేరాతో ఎన్నో రకాల ట్రిక్ ఫోటోలు తీసేవాడు. అవన్నీ చూసి బోర్డ్ సభ్యులందరూ ఫొటోగ్రఫీ సెక్షన్ లో సీట్ తీసుకోమని బలవంతపెడితే, నాకు సంగీతం మీద ఆసక్తి ఎక్కువ. అందుకని సౌండ్ రికార్డింగ్ సెక్షన్ లోనే చేరతానని భాస్కర్ పట్టు పట్టాడు. ఎప్పటికైనా విజయా గార్డెన్స్ లో సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ లాగ మంచి పేరు తెచ్చుకోవాలని అప్పట్లో తన కోరిక. (ఆ కోరిక రేడియోలో జాతీయ బహుమతులు సంపాదించుకున్న తరువాత కొంతవరకు తీరింది.) అతని ఆశయాలు, కోరికలు తీరేలాగ 1965లో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో D.F.Tech(sound recording & sound engineering) లో సీటు వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళో గోడ మీద మూగ బొమ్మలు వేసుకునే కుర్రాడికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీటు రావటం ! తన అదృష్టానికి తానే మురిసిపోయాడు భాస్కర్. అక్కడికి కూడా తోడుగా ఉండి వండిపెట్టటానికి వాళ్ళ అమ్మమ్మ వస్తానని పట్టుపట్టింది. కానీ మద్రాసు లాంటి మహానగరంలో చిన్నపాటి ఇల్లు అది సంసారానికి అనువుగా దొరకక రాలేకపోయింది. అక్కడితో హాస్టల్లో ఒంటరి జీవితం మొదలైంది.
Madras film Institute van

1968 దాకా మూడేళ్ళు ఒక అద్భుత ప్రపంచంలో విహరించాడు అతను. హాస్టల్లో మొదటిరోజే తన వాయిద్యాలతో, సంగీతంతో తమిళ స్నేహితులను, అభిమానులనూ సంపాదించుకున్నాడు. వాళ్ల ఇన్స్టిట్యూట్ కేంపస్ లోనే ఉన్న "కేటరింగ్ ఇన్స్టిట్యూట్" లో కూడా స్నేహితులను సంపాదించుకున్నాడు భాస్కర్. ఇక్కడ స్నేహితులందరూ "శ్రీరామ్మూర్తి" అనే పిలిచేవారు. కాలేజీమిత్రులందరూ కలిసి ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ తయారుచేసుకున్నారు. బుల్బుల్ వాయించటమే కాక గ్రూప్ కు సారధ్యం కూడా వహించి మద్రాసు అనేక చోట్ల ప్రోగ్రామ్లు ఇచ్చేవారు.

playing Bulbul

ఒకసారి మద్రాస్ ఐ.ఐ.టి.లో అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు జరిగినప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీరామ్మూర్తి బుల్బుల్ తీసుకుని సంగీత విభాగంలో పోటికి వెళ్ళాడు. మద్రాసు మహానగరంలోని అనేక కాలేజీల నుంచి సంగీత కళాకారులు పియానో, ట్రంపెట్, సాక్సోఫోన్, జాజ్ డ్రమ్స్ లాంటి పెద్ద పెద్ద ఇస్ట్రుమెంట్స్ తీసుకువచ్చారు. అప్పటికి ఊళ్ళో 'లవ్ ఇన్ టోక్యో' హిందీ సినిమా విజయవంతంగా ఆడుతోంది. తాను ఆశా పారేక్ ఫాన్ కావటం వల్ల ఆ సినిమాలోని "సాయోనారా.." పాట రేడియోలో వచ్చినప్పుడల్లా విని నేర్చుకుని ఆ పాటే ఐ.ఐ.టి లో బుల్బుల్ మీద వాయించాడు. గొప్ప అప్లాజ్ వచ్చింది. ఐటమ్ అయిపోగానే వెళ్పోతుంటే ఆడియన్స్ "వన్స్ మోర్" అని కేకలు వేసారు. కాంపిటీషన్లో వన్స్ మోర్ ఏంటీ అని వెళ్పోతుంటే, ఆడియన్స్ ఊరుకోలేదు. అప్పుడు నిర్వాహకులే మళ్ళీ రిక్వస్ట్ చేసి రెండోసారి ఆ పాట వాయించమన్నారు. అప్పుడూ గ్రేట్ అప్లాజ్ వచ్చింది. అదో తీపి జ్ఞాపకం.

cover page painted by ramam


ఫైనల్ ఇయర్లో థీసీస్ సమర్పించాల్సివచ్చినప్పుడు, తనకి బాగా ఇష్టమైన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" మీద థీసీస్ సబ్మిట్ చేసాడు శ్రీరామ్మూర్తి. ప్రముఖ సౌండ్ రికార్డిస్ట్, మన తెలుగువారైన "వల్లభ జోస్యుల శివరాం"గారు ఎగ్జామినర్గా వచ్చారు. థీసీస్ చాలా బాగుందని 75% (డిస్టింక్షన్) ఇచ్చారు. ఫైనల్ ఇయర్ పరీక్షలో భాగంగా స్టూడేంట్స్ మూడు షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సి వచ్చేది. వాటిల్లో ఒక దానికి కోసం శ్రీరామ్మూర్తి "థ హౌస్" అనే కథ రాసి, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా కూడా అవార్డ్ తీసుకున్నాడు అతను. దానికి ఆధారం హాస్టల్ పరిసరాల్లో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇల్లు, షూటింగ్ తాలుకు ఫోటోలు.


with students shooting for 'The House'

'The house' behind the tree'

House in a different angle

అలా సౌండ్ రికార్డింగ్ లో డిప్లొమా పూర్తి చేసాడు. మద్రాసు ఫిలిం చాంబర్ హాల్లో ఏ.వీ.ఎం.చెట్టియార్ చేతుల మీదుగా "బెస్ట్ స్టూడెంట్" అవార్డ్ అందుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రకరకాల భాషల, ప్రాంతాల వీ వందలకొద్దీ సినిమాలు చూసి చూసి అతనికి ఎన్నో ఆలోచనలు వస్తూండేవి. ఓ పాకెట్ నోట్ బుక్స్ పెట్టుకుని తనకు వచ్చిన ఆలోచనలనీ, ఐడియాలనీ వాటిల్లో రాసుకునేవాడు. సినిమాలు చూస్తూ కూడా మధ్యలో వచ్చిన ఏవో ఏబ్స్ట్రాక్ట్ ఐడియాస్ జేబులోని చిన్న స్పైరల్ నోట్ బుక్లో ఆ చీకట్లోనే రాసుకునేవాడు. ఫిల్మ్ కోర్స్ పూర్తయ్యాకా సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాలనే కోరికతో ఓ ఏడుగురు స్నేహితులు మద్రాసులోనే ఒక ఏడాది ఉండిపోయారు. ఆ మిత్రులు అంతా కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిన్న కవిత ఆధరంగా "క్లౌడ్స్ అండ్ వేవ్స్" అని ఒక చిల్డ్రెన్స్ షార్ట్ ఫిల్మ్ తీసారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు మొదలైనవారంతా వచ్చి చూసి ప్రశంసలందించారు. అతని జీవితంలో అదొక స్వర్ణయుగం.


Oct 22, 11.45a.m
ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోయిన వాళ్ల గ్రూప్ ఆశలు నిరాశలే ఐనాయి. అప్పట్లో దూరదర్శన్ లాంటి సంస్థలు కూడా లేవు. సినీ పరిశ్రమలో అప్రంటిస్ గా చేరితే రెండొందలు కన్నా జీతం రాదు. ఉద్యోగం లేకున్నా అప్పటికే ఒక సంవత్సరం పాటు బావగారు ధన సహాయం చేస్తు వచ్చారు. ఆ పై ఆర్ధికంగా పోషించటానికి వెనుక ఎవరూ లేని నిస్సహాయత ఏదో సాధించాలన్న శ్రీరామ్మూర్తి ఉత్సాహాన్నీ, సృజనాత్మకతనూ నీరుకార్చేసాయి. భాస్కర్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో కుటుంబరీత్యా స్థితిమంతుడైనప్పటికీ అతనికి పెద్దగా స్థిరాస్థులేమీ అందలేదు. బావగారు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. అక్క, బావ అక్కడ ఉన్నారని, పిల్లవాడి వంతు వచ్చిన డబ్బుతో కాకినాడలో ఇల్లు కొని స్థిరపడ్డారు అమ్మ, అమ్మమ్మ. అలా కాకినాడ తో అనుబంధం మొదలైంది.


ఇంటి నుంచి వచ్చేయమని వత్తిడి ఎక్కువవటంతో ఎటూ తోచని పరిస్థితిలో బలవంతాన1968లో పెట్టె,బేడా సర్దుకుని కాకినాడ వెళ్పోయాడు శ్రీరామ్మూర్తి.. తన స్నేహితులకు మల్లె తనకు తండ్రి అండ ఉండి ఉంటే, ఇంకొన్నాళ్ళు మద్రాసులో ఉండగలిగితే వాళ్ళకు లాగే తానూ సినీ పరిశ్రమలో ఉండిపోయేవాడిని కదా అనుకుంటాడు ఇవాళ్టికి కూడా. అతని స్నేహితులు చాలా మంది గొప్ప గొప్ప స్థానాలో, పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నారు. అతని రూట్స్ ఇప్పటికీ మద్రాసులోనే ఉంటాయి. మద్రాసు పేరు చెబితేనే ఉత్సాహంతో తన మనసు అక్కడికి పరుగులు తీస్తుంది.

ఒక మహా వైభవాన్ని చూసిన మనిషికి, ఏవేవో చెయ్యాలని కలలు కన్న మనిషికి, తనది అనుకునే ప్రపంచం నుంచి వేరు పడిన మనిషికి ఇక ప్రపంచంలో ఏ మూల ఉన్నా పెద్ద తేడా కనబడదు. ఏ పనైనా ఒకటే. అదే నిర్లిప్తతతో పెద్దల తృప్తి కోసం చదువుతో సంబంధం లేని కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు కొన్నాళ్ళు చేసాడు అతను. నేనేమిటి ఇలాంటి పన్లేమిటి అనుకున్న సందర్భాలెన్నో...! తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్లుగా ఇక్కడ జీవితం రామాన్ని మరో దారిలోకి తిసుకువెళ్ళింది.
(రెండవ భాగం పూర్తి...)