ఇవాళ 'తృష్ణ'లో పొస్ట్ చేసిన శ్రీ ఎమ్.ఎస్.శ్రీరాంగారి "శ్రీకృష్ణస్తుతి" ఇక్కడ వినవచ్చు.
అ పోస్ట్ పెట్టినా తనివి తీరలేదు. అందుకని రాత్రయ్యింది కదా బజ్జోపెట్టేద్దామ్ బుల్లి కృష్ణయ్యని అని మళ్ళీ ఇక్కడ నా కిష్టమైన ఎమ్మెస్ పాడిన "జో అచ్యుతానంద.." పెడుతున్నాను.
అన్నమాచార్య విరచిత ఆ అద్భుత సాహిత్యం:
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
రావే పరమానంద రామ గోవింద ||
1. నందునింటనుచేరి నయము మీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దు రంగ
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
2. పాల వారాశి లో పవ్వళించినావు
బాలుగా మునులక భయమిచ్చినావు
మేలుగా వసుదేవుకుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
3. అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనవి యట్ట యడుగవిన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
4. గోల్లవారిండ్లకును గొబ్బునకు బోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చేల్లునామగనాండ్ర జెలగి ఈ శాయి
చిల్లితనములు సేయ జెల్లునట వోయి
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
5. రెపల్లె సతులెల్ల గొపంబుతోను
గొపమ్మ మీ కొడుకు మా ఇండ్లలోను
మాపు గానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱచె - నేమందుమమ్మ!
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
6. ఒక యాలిని దెచ్చి - నొకని కడబెట్టి
జగడముల గలిపించి సతిపతుల బట్టి
పగలు నలు జాములును బాలుడై నట్టి
మగనాండ్ర జేపట్టి మదనుడైనట్టి !
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
7. అంగజునిగన్న మాయన్న ఇటురార బంగారుగిన్నెలో పాలుపొసేరా
దొంగనీవని సతులు బొందుచున్నారా ముంగిటనాడరా మోహనాకారా
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
8. గోవధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమున నున్న కంసుబడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
9. అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీజోల
సంగతిగా సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల
జో అచ్యుతానంద జో జో ముకుందా ||
************************************
ఎమ్మెస్ పాడిన "మధురాష్టకం" కూడా నాకు బాగా ఇష్టం.
అది ఇక్కడ వినండి. విజువల్స్ కూడా చాలా మంచివి ఇచ్చారు యూట్యూబ్ లో.