సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, May 20, 2010

వేసంశెలవులు - టీ్వీ ప్రభావం ...


"అమ్మా, మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?" అడిగింది మా చిన్నారి. పేస్ట్ లో ఉప్పా? అడిగాను ఆశ్చర్యంగా. నా అజ్ఞానానికి జాలిపడుతూ "ఈసారి నీకు చూపిస్తాను ఆ "ఏడ్" టీవీలో వచ్చినప్పుడు" అంది సీరియస్ గా. శెలవులు కావటం వల్ల ఎక్కువగా అడ్డుకునే అవకాశం లేక వదిలేయటం వల్ల వాళ్ళ నాన్నమ్మతో పాటూ స్వేచ్ఛగా బుల్లితెర వీక్షించటానికి అలవాటుపడింది మా చిన్నది. నెల మొదట్లో సరుకులకు వెళ్ళినప్పుడు తోడు వచ్చింది. ఎప్పుడు వెళ్ళిందో, పేస్ట్ లు ఉన్న వైపు వెళ్ళి "కాల్గేట్ సాల్ట్" టూత్ పేస్ట్ తెచ్చేసుకుంది. "అమ్మా, నేను ఈ పేస్ట్ తోనే పళ్ళు తోముకుంటాను" అంది. పెళ్ళయేదాకా నాన్న కొనే "వీకో వజ్రదంతి", ఆ తరువాత అత్తారింట్లో వాడే "పెప్సొడెంట్" తప్ప వేరే పేస్ట్ ఎరగని నేను పిల్లదాని పంతానికి తలవంచక తప్పలేదు.

నేను సరుకులు కొనే హడావిడిలో పడ్డాను. ఈసారి మా చిన్నది "డెట్టాల్" సబ్బుతో తిరిగి వచ్చింది. "అమ్మా, నేనింకనించీ ఈ సబ్బుతోనే స్నానం చేస్తాను. ఈ సబ్బుతో రుద్దుకుంటే క్రిములు ఒంట్లో చేరవు తెలుసా?" అంది. "ఎవరు చెప్పారు?" అన్నాను అనుమానంగా చుట్టూ చూస్తూ... షాపులో ఎవరన్నా చెప్పారేమో అని. "టీ్వీ ఏడ్ లో చూశాను నేను" అంది. నేను "డవ్" తప్ప మరోటి వాడను. పాపకు 'జాన్సన్ బేబి సోప్' మానేసాకా ఇప్పటిదాకా దానికీ "డవ్" సోపే. ఇప్పుడు కొత్తగా దానికో కొత్త సబ్బు?! నాకు కాలేజీరోజులు గుర్తు వచ్చాయి...కాలేజీలో ఎవరో చెప్పారని ఇంట్లో అందరూ వాడే సబ్బు కాక "ఇవీటా"(అప్పట్లో కొన్నాళ్ళు వచ్చింది) కొనుక్కుని వాడతానని అమ్మని ఒప్పించటానికి నేను పడ్డ పాట్లు...

ఇంకా అదేదో నూనె వాడితే జుత్తు ఊడదనీ, హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూతో తల రుద్దుకుంటే డేండ్రఫ్ పోతుండనీ, "డవ్" వాళ్ళు కొత్తగా ఏదో ఒంటికి రాసుకునే క్రీమ్ తయారు చేసారనీ...అవన్నీ నన్ను కొనుక్కోమనీ పేచీ మొదలెట్టింది. నీ పేస్ట్, సబ్బు కొన్నాను కదా నాకేమీ వద్దులే అనీ దాన్ని ఒప్పించేసరికీ షాపులోని సేల్స్ గార్ల్స్ నవ్వుకోవటం కనిపించింది...!

సరుకులు కొనటం అయ్యి హోమ్ డేలివెరీకి చెప్పేసి రోడ్డెక్కాం. సిటీ బస్సొకటి వెళ్తోంది..."అమ్మా, ఆ బస్సు మీద చూడు.."అంది పాప. "ఏముంది?" అన్నాను. ఆ బస్సు మీద నాన్నమ్మ రాత్రి చూసే సీరియల్స్ లో ఒకదాని బొమ్మలు ఉన్నాయి. ఇంకా చాలా బస్సుల మీద ఇదే సీరియల్ బొమ్మలున్నాయి తెలుసా? అంది. "ఓహో..." అన్నా నేను. దారి పొడుగునా నాకా సీరియల్ తాలూకూ కధ వినక తప్పలేదు. అమ్మో దీని శెలవులు ఎప్పుడు అయిపోతాయో అనిపించింది. మా పాప పుట్టని క్రితం ఎవరి ఇంటికన్నా వెళ్తే వాళ్ళ పిల్లలు టి.వీ.సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడుతుంటే, ఆ తల్లిదండ్రులు మురిసిపోతూంటే తిట్టుకునేదాన్ని. ఇవాళ నన్నా తిట్లు వెక్కిరిస్తున్నట్లనిపిస్తోంది...

ఇక ఇలా కాదని, మా గదిలో టి.వీలో కార్టున్స్ పెట్టి చూపించటం మొదలుపెట్టాను. సీరియల్స్ చూడటం అయితే మానేసింది కానీ పోగో, కార్టూన్ నెట్వర్క్ చానల్స్కు అతుక్కుపోయింది. "పోగో" పిచ్చి అంత తేలికగా పోయేది కాదని అర్ధమైంది. కలరింగ్ బుక్స్, బొమ్మలూ,ఆటలూ...మొదలైన పక్కదారుల్ని పట్టించా కానీ "చోటా భీం", "హనుమాన్" కార్టూన్ల టైమ్ అవ్వగానే కీ ఇచ్చినట్లు టీవీ దగ్గరకు పరుగెత్తే పిల్లను ఎంతకని ఆపగలను? ఇక నా ఉక్రోషం మావారి వైపు తిరిగింది. ఆ కంప్యూటర్ బాగున్నంత కాలం పిల్ల టీవీ వైపు కన్నెత్తి చూడలేదు. కంప్యూటర్లో గేమ్స్, కౌంటింగ్ గేమ్స్, రైమ్స్ అంటూ ఏవో ఒకటి చూపిస్తే చూసేది.....అది బాగుచేయించండి...అంటూ పోరు పెట్టాను. (పనిలో పని నాక్కూడా బ్లాగ్కోవటానికి వీలుగా ఉంటుండని...) ఇక లాభంలేదనుకుని ఒక వారం రోజులు రకరకాల షాపులు తిరిగి, దొరకదనుకున్న "పార్ట్" ఎలాగో సంపాదించి మొత్తానికి మొన్ననే నా సిస్టం బాగుచేయించారు. నాలుగైదు నెలల విరామం తరువాత పనిచేస్తున్న నా సిస్టం ను చూసుకుని మురిసిపోయాను.

సిస్టం బాగయ్యాకా ఇప్పుడు టీవీ పిచ్చి కాస్త తగ్గింది కానీ పూర్తిగా మానలేదు. ఇక శెలవులు ఇంకో పదిహేను,ఇరవై రోజులుంటాయి...అంతదాకా తప్పదు అని సర్దిచెప్పుకుంటున్నాను. టీవీ ఎంత ప్రమాదకరమైన మాధ్యమమో, చిన్న పిల్లల్ని కూడా ఏ విధంగా ప్రభావితం చెయ్యగలదో అనుభవపూర్వకంగా అర్ధమైందిప్పుడు. కానీ దాని దుష్ప్రభావం పిల్లలపై పడకుండా ఎలా కాపాడుకోవటం అనేది ప్రస్తుతం నా బుర్రను దొలుస్తున్న ప్రశ్న.. కేబుల్ కనక్షన్ పీకించెయ్యటమో, టీవీని అమ్మేయటమో చెయ్యగలమా? పనవ్వగానేనో, ఆఫీసు నుంచి రాగానేనో మెకానికల్ గా టీవీ రిమోట్ పట్టుకునే మన చేతులు అంత పని చెయ్యగలవా??

ఆలోచిస్తుంటే, పిల్లల పదవ తరగతి అయ్యేదాకా టీవీ కొనకుండా, ఆ తరువాత కొన్నా, డిగ్రీలు అయ్యేదాకా కేబుల్ కనక్షన్ పెట్టుకోకుండా కాలక్షేపం చేసిన మా పిన్ని నాకు గుర్తు వచ్చింది.మనసులోనే పిన్నికి "హేట్సాఫ్" చెప్పేసాను.