సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, May 15, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 6 "


అయిదవభగం తరువాయి...

"నాకు వర్కింగ్ ఉమెన్ హెల్పింగ్ గా పసిపిల్లల కోసం ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండేలాంటి "క్రెష్" పెట్టాలని ఉందిరా..." అంటుంది కాంతిమతి. సీత బాబు గురించి తెలుసుకుని కిషోర్,మంజుల ఆశ్చర్యపోతారు. ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను, వేదనా భరితంగా ఉన్న వదనాన్ని చూసి తల్లి ఈ సంఘటనకు ఎంతకా కుమిలిపోతోందో అర్ధం చేసుకుంటాడు కిషోర్. ఆ మధ్యాహ్నం ప్రకాశరావుగారి దగ్గరకు వెళ్ళి తన అభిప్రాయం చెబుతుంది ఆమె. అంతటి కార్యభారాన్ని నెత్తిన వేసుకునే ముందు అందులోని లోటుపాట్లు, ఇబ్బందులూ అన్నింటి గురించీ వివరిస్తారు ఆయన. తన ఇంట్లో క్రింద భాగాన్ని కేర్ హోమ్ కు ఉపయోగిస్తాననీ, మంగను సాయానికి పెట్టుకుంటాననీ, పిల్లల్ని తీసుకురావటానికి రిక్షాబండి మాట్లాడుకుంటాననీ, ఒక ఎక్స్పరిమెంట్ లాగ చేస్తాను...విఫలమైతే వదిలేస్తాననీ తన పధకాన్ని వివరిస్తుంది కాంతిమతి. ఆమె ప్రయత్నం జయప్రదం కావాలని ఆశీర్వదిస్తూ ఆయన తన డిస్పెన్సరీ నుంచి ఒక ఉయ్యాలను బహుకరిస్తాననీ, తెలిసిన లేడీ డాక్టర్స్ దగ్గర నుంచి మరికొన్ని ఉయ్యాలలు ఇప్పిస్తాననీ, బండి కుదిరే దాకా తన కారును వాడుకోమని, డ్రైవ్ చేయటానికి కొడుకు సురేష్ ను పంపిస్తాననీ హామి ఇస్తారు. "అన్నయ్యా,నోట్లో మాట నోట్లో ఉండగానే ఇంత సహాయం చేస్తున్నావని... " థాంక్స్ చెప్తున్న ఆమెకు ఏనిగెక్కినంత ఆనందంతో మాటలు రావు. "ఏం చేసి ఏం లాభమమ్మా! నీ సంసారం చక్కదిద్దలేకపోయాను...అతను ఇలా చేస్తాడనుకోలేదు..." తానే కుదిర్చిన సంబంధం అలా అయ్యిందని బాధ పడతారు ప్రకాశరావుగారు.

అక్కడనుంచి వెళ్తూ వెళ్తూ మంగ ఇంటికి వెళ్ళి ఆమె సాయాన్ని అడుగుతుంది. వాళ్ళీంట్లోవాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. శారద పాప, మరిద్దరు పిల్లలతో కాంతిమతి హోమ్ మొదలౌతుంది. నెల రోజుల్లో పదిహేను మంది పిల్లలు చేరుతారు. సురేష్ సాయంతో మంగ రోజూ ఆ పిల్లలను ఇళ్ళ దగ్గరనుంచీ తీసుకువచ్చి, సాయంత్రం దింపి వస్తూంది. మంగ చెల్లెలు పూర్ణ కూడా వాళ్ళకు తోడౌతుంది. ఒకరోజు మంగ కోసం వాళ్ళీంటికి వెళ్ళిన కాంతిమతికి మంగ మామ్మగారు, ఇంకొక ముసలావిడ కనపడతారు.ఆ ముసలమ్మ వాళ్ళ ఊరు తాలూకా అనీ, కొడుకూ,కోడలూ వెళ్లగొట్టారనీ, హోమ్లో ఏదైనా పని ఇప్పించమనీ, కూడూ గుడ్డా ఇస్తే చాలనీ, జీతం భత్యం అక్కరలేదు వేడుకుంటారు వాళ్ళు. కాంతిమతికి వైజాగ్లో చనిపోయిన సుబ్బాయమ్మగారు, నీరజ అత్తగారు, రేవతి వియ్యపురాలు గుర్తు వస్తారు. మంగ మామ్మగారు కూడా మనవరాళ్ళకు సాయంగా హోమ్లో పని చేస్తానని కోరుతుంది. ఆలోచిస్తు ప్రకాశరావుగారి ఇంటికి చేరుతుంది కాంతిమతి.

ఆవిడ ఆలోచన విని "నీకు మతి పోతున్నట్లుంది. ఇవాళ ఇద్దరితో మొదలెడితే రేపు పది మంది అవుతారు. అంత మందిని పోషించటం నీ ఒక్కదానివల్లా అవుతుందా?" అని ప్రశ్నిస్తారు ఆయన. ఈ ఆలోచన ఈవాల్టిది కాదనీ, శైలు దగ్గరకు వెళ్ళినప్పుడు, మద్రాసులో ఎదురైన సంఘటనలు ఎలా ఆలోచింపజేసాయో చెప్తుంది కాంతిమతి. అంతేకాక కాలంతో వస్తున్న ఆర్ధిక,సాంఘిక రంగాల్లోని మార్పులు మనుషుల దృక్పధాల్లో మాత్రం రావట్లేదని వాపోతుంది. ఆడవారికి ఆర్ధిక స్వాతంత్ర్యం అన్నారు కానీ, వేల సంఖ్యలో ఉద్యోగాల్లో మహిళలు చేరినా వాళ్ళ సమస్యల్ని ఎవరు పట్టించుకోవట్లేదనీ, పరిష్కారమార్గాల కోసం ప్రయత్నించేవారెవరని ప్రశ్నిస్తుంది. పారిశ్రామీకరణ వల్ల సమిష్టి కుటుంబాలు విచ్ఛిన్నమై, చిన్న కుటుంబాలేర్పడ్డాయి...ఆనేకకారణాలవల్ల భద్రత కరువైన ఎందరో అభాగినులగురించి ఎవరు పట్టించుకుంటున్నారు? కవిత్వాల్లో,కథల్లో తప్ప కనిపించని ప్రేమ మీద పేజీలకు పేజీలు రాసే రచయితలు వీరిని గురించి పది పంక్తులు రాయగలరా? వేదికనెక్కే మహిళామణులూ, మహిళా సంఘాలు వీరిని గురించి పట్టించుకుంటారా? ఉద్యోగాల రీత్యా భార్యాభర్తలే ఒకచోట ఉండలేనప్పుడు కుటుంబాల్లో వయసుమళ్ళిన పెద్దలు ఎక్కడ ఉండాలి? ఒకవేళ కలసి ఉన్నా చాలీచాలని జీతాలతో సంసారం గడపటమే కష్టమైన సామాన్యమధ్యతరగతివారికి పెద్దలు భారమవటంలో తప్పులేదన్నయ్యా.....అంటూ తన ఆవేదన తెలుపుతుంది. "....అలాగని శక్తి ఉడిగినవాళ్ళంతా మరణించాలని కోరుకోము కదా. ఈ వృధ్ధాప్యం అందరూ అనుభవించే అవస్థే...వీరికి నా వంతు సహాయం చేయాలనేది నా ఆలోచన అన్నయ్యా. .." అని ముగిస్తుంది కాంతిమతి.

"అప్పుడప్పుడు నువ్విలా దుమ్ము దులిపి పెట్టకపోతే ఈ ముసలి బుర్ర ఎప్పుడో తుప్పు పట్టి ఉండేదమ్మా..." అని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటారు ప్రకాశరావుగారు. నా పరిస్థితులూ, నా చుట్టుపక్కలవారి సమస్యలు, నా సమస్యలూ నన్నిలా ఆలోచింపజేసాయి. కానీ వాటికి కార్యరూపాన్ని ఇవ్వాలంటే నీ సహాయం అవసరం...అని ఆయన అంగీకారంతో ఇల్లు చేరుతుంది ఆమె. పిల్లలను రోజూ హోమ్ కు తీసుకువచ్చే పని వల్ల సురేష్, మంగ స్నేహితులుగా, ఆత్మీయులుగా మారతారు. సురేష్ లో వస్తున్న ఒబ్బిడితనాన్ని,బాధ్యతనూ మార్పును చూసి ప్రకాశరావుగారూ, కాంతిమతి సంతోషిస్తారు. ఆపైన ఆ మార్పుకు కారణం మంగ అని తెలుసుకుని వారిద్దరిని ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు. హోమ్ లో చేస్చుకున్న వృధ్ధమహిళలతో కూరగాయల తోట, అప్పడాలు పెట్టించటం, టైలరింగ్ వచ్చినవాళ్ళతో ఆ పని, పచ్చళ్ళు పెట్టించటం మొదలైన స్వయం ఉపాధి పనుల ద్వారా హోమ్ లోని మహిళలకు ఎంతో కొంత ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తుంది కాంతిమతి. అయితే పెరుగుతున్న పిల్లల, వృధ్ధుల సంఖ్య వల్ల కొన్ని ఆర్ధిక ఇబ్బందులను, సమస్యలనూ కూడా ఎదుర్కుంటుంది ఆవిడ. పెద్దకోడలు జానకి వచ్చి ఇంటిలో వాటా ఇమ్మని గొడవ పెడుతుంది కూడా.

ఒకరోజు ప్రకాశరావుగారు కాంతిమతి హోమ్ ను చూస్తానన్న ఒక మిత్రుడు విశ్వనాధాన్ని తీసుకు వస్తారు. ఆయన హోమ్లో మగవారిని కూడా చేర్చుకోమని సలహా ఇస్తారు. పట్టుబట్టి కాంతిమతితో మద్రాసులో కూడా మరొక హోమ్ ను ఏర్పాటు చేయించి మంత్రిగారితో రిబ్బన్ కట్ చేయిస్తారు. అక్కడి పనులు కాంతిమతి తన స్నేహితురాలు రేవతి వియ్యపురాలికి అప్పగిస్తుంది. నెమ్మదిగా ఆమెలో ఎంతో మార్పు వచ్చి కోడలిని బాగా చూసుకోవటంతో దానికి కారణం కాంతిమతే అని రేవతి చాలా సంతోషిస్తుంది. "రిటైరవ్వగానే ఆశ్రమానికి వెళ్ళిపోవాలనీ,మోక్ష సాధన చేసుకోవాలని అనుకున్నాను. కుదరలేదని బాధపడ్డాను. కానీ ఇలా నా చుట్టూ ఉన్నవారి కష్టాలు పంచుకోగలిగి, నలుగురికీ మంచి చెయ్యగల జన్మనే భగవంతుడు నాకు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని" సజల నయనాలతో కోరుకుంటుంది కాంతిమతి. మద్రాసులో హోమ్ అద్దె ఇంట్లోంచి నూతన భవనం ఏర్పడి అందులోకి మారుతుంది. వైజాగ్, హైదరాబాదుల్లో కూడా హొమ్స్ పెట్టాలని చాలా మంది ముందుకు రావటంతో కాంతిమతి ప్రయాణాలూ పెరుగుతాయి.

ఒక ప్రయాణం తరువాత అలసినిద్రపోతున్న ఆమెను, హోమ్లో చేరటానికి ఎవరో వచ్చారని విశ్వనాధంగారు కబురు చేస్తే ఎవరో నిద్ర లేపుతారు. మీరు చేర్చుకోకపోయారా అంటూ వస్తుంది కాంతిమతి. ఈయన మిమ్మల్ను చూడాలని కోరుకుంటున్నారు అంటారు విశ్వనాధం గారు. దుబ్బులా పెరిగిన జుట్టు, బాగా పెరిగిన గడ్డం, జ్వరం తో నిలువెల్లా వణికిపోతూ, నిండుగా పాత దుప్పటి ఒకటి కప్పుకున్న ఆ అరవైఏళ్ళు పైబడిన మనిషిని విచిత్రం గా చూస్తారు అంతా. కిషోర్ వచ్చి పరీక్ష చేసి మందు ఇస్తాడు. నాకేమన్నా అయితే అంత్యక్రియలు నువ్వు కానీ, మీ అన్నయ్య కానీ చేస్తారా? అనడుగుతాడు ఆయన. నాకన్నయ్య ఉన్నట్లు మీకెలా తెలుసు? మీరెవరు? అనడుగుతాడు కిషోర్. "నా పేరు..గోపాల్రావ్.." అంటాడాయన అతికష్టమ్మీద. ఆశ్చర్యపోతారు అంతా. ఈ వృధ్ధాప్యంలో తనను వెతుక్కుంటూ వచ్చిన భర్తకు తానే సపర్యలు చేయటం తన కర్తవ్యమని భావిస్తుంది కాంతిమతి. పదిహేనురోజులకు కాస్త కోలుకుంటాడు అతను. కబురు చేయగానే శైలూ,కృష్ణా కూడా శెలవు పెట్టుకుని ఆయనను చూడటానికి వస్తారు.

ఒకరోజున పరీక్ష చేసి వెళ్పోతున్న కిషోర్ ను ఇన్నాళ్ళూ రాత్రి, పగలు సపర్యలు చేసిన కాంతిమతి కాస్త తగ్గగానే కనబడట్లేదేమని అడుగుతాడు గోపాల్రావ్. అదేం లేదనీ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఉపవాసం ఉందట. ఇన్నాళ్ళ కరస్పాన్డెన్స్ లు అవీ చూసుకుంటోంది...అంటాడు. మీ అమ్మకు నేను క్షమించలేని అన్యాయం చేసాననీ, చిన్న పని చేసి పెట్టమని అడుగుతాడు గోపాల్రావ్. తన వీలునామా, ఒక పేకెట్, ఇక్కడకు వచ్చేముందు తాను రాసిన ఒక ఉత్తరం కాంతిమతికి అందజేయమని ఇస్తాడు. అవి కాంతిమతికి ఇవ్వటానికి వెళ్తాడు కిషోర్. "అరవిందాశ్రమం నుండి ఉత్తరం వచ్చింది..రెండు,మూడు వేకెన్సీస్ ఉన్నాయని...హోమ్నెవరికైనా అప్పగించి వెళ్ళాలని.." అంటుంది కాంతిమతి. "ఇంతమందికి ఆశ్రయం కల్పించావు. ఇంకా ఆశ్రమం మీద మోజు పోలేదా అమ్మా? అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకో.." అని మందలింపుగా అని వెళ్పోతాడు కిషోర్. ఈ వయసులో ఏం ఉత్తరం రాసారో ఈయన అనుకుంటూ చదవటం మొదలెడుతుంది కాంతిమతి.

ప్రియమైన కాంతీ...అంటూ మొదలెట్టి, తన రెండవ భార్య రమ ఆ రోజు చెప్పినట్లు కాలేజీలో ఏ ప్రేమాయణం జరగలేదనీ..కేవలం స్నేహంతోనే ఆగిపోయిందనీ..,కాంతిమతిని తాను ఇష్టపడే వివాహం చేసుకుని ఎంతగానో ప్రేమించాననీ రాస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ట్రాన్స్ఫర్ అయిన చోట మళ్ళీ తన ఆఫీసులో టైపిస్ట్ గా కనబడిందనీ, పాత పరిచయాన్ని పురస్కరించుకుని వస్తూ వెళ్తూ ఉండేదనీ, ఒక బలహీన క్షణంలో లొంగిపోయాననీ ఇక పెళ్ళి చేసుకోక తప్పలేదనీ రాస్తాడు. ఆ రోజు ఇవన్నీ నీకు చెబుదామని వచ్చాను కానీ నీ మౌనం నా అహాన్ని దెబ్బతీసింది. నా అండ లేకుండా నువ్వు పిల్లల్ని పెంచలేవనీ మళ్ళీ నా దగ్గరకు వస్తావనే అహంకారంతో,కోపంతో వెళ్ళిపోయాననీ; కానీ ఆ తరువాత రమ తనను రానివ్వలేదనీ, తనకు వచ్చిన ఉత్తరాలను కూడా అందనివ్వలేదనీ రాస్తాడు. రమతో పంచుకున్న జీవితమంతా నరకం అనుభవించాననీ, రమ చనిపోయాకా ఆమె ద్వారా పుట్టిన ముగ్గురు ఆడపిల్లలకూ వాళ్ళ వాటా పంచి ఇచ్చేసి, కాంతిమతి హోమ్ గురించి పేపర్లో చూసి చివరి రోజుల్లో అక్కడే చేరాలనీ, కాంతిని క్షమాపణ అడగాలని వచ్చాననీ రాస్తాడు. ఆ రోజు కాంతిమతి మరచిపోయి వెళ్ళిన చీరను రమ కళ్ళ బడకుండా ఇన్నాళ్ళూ పదిలంగా దాచాననీ, తనను ఇప్పటికైనా క్షమించగలిగితే పేకెట్లో తాను పంపిన ఆ చీరను కట్టుకుని రమ్మని, లేకుంటే ఆమెకు ఇక బాధ కలిగించకుండా మరెక్కడికైనా వెళ్పోతాననీ ఉత్తరం ముగిస్తాడు గోపాల్రావ్.

ఉత్తరం చదివిన కాంతిమతి సంతోషానికి అవధులుండవు. తాను ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్య అన్న నిజమే ఆమెకు ఎనలేని తృప్తిని కలిగిస్తుంది. వెంఠనే వెళ్ళి మీరిక్కడే ఉండిపొండి అనడగాలని తొందరపడుతుంది. పేకెట్లోంచి చీర తీస్తుంది ఆమె. అదే చీర. ఆయన మనసుపడి తనకోసం కొన్న చీర. కట్టుకునే ఓపికలేక భుజాలకు కప్పుకుని మెట్లు దిగుతుంటే ఊపిరి పీల్చటం కష్టమౌతుందామెకు. లక్ష్యపెట్టక శక్తినంతా కూడదీసుకుని బలవంతాన మెట్లు దిగి గోపాల్రావ్ గదిలోకి వెళ్ళి అతని చేతుల్లో వాలిపోతుందామె. "కాంతీ.." అన్న గోపాల్రావ్ కేకకు హోమ్ అంతా అదిరిపోతుంది. కిషోర్ వచ్చి ఇంజెక్షన్ చేసినా ఫలితం ఉండదు...ఆ ముక్కోటి ఏకాదశి నాడు భర్త ఒడిలో, పిల్లల సమక్షంలో ఆఖరి శ్వాస విడుస్తుంది కాంతిమతి. తీర్థప్రజల్లా వచ్చి కన్నీరు పెట్టుకుంటారు తెలిసినవాళ్ళంతా....వెళ్తూ వెళ్తూ కృష్ణ తండ్రిని వచ్చి తనతో ఉండమంటాడు. "మీ అమ్మ ఈ హోమ్కు ఊపిరి పోసి తను ఊపిరి వదిలింది బాబూ...నాలాంటి నిర్భాగ్యులకోసమే కోసమేరా ఈ హోం..!" అంటాడు గోపాల్రావ్.

(హమ్మయ్య...అయిపోయింది. )


(ఈ నవల 35ఏళ్ళ క్రితం రాసినదైనా అప్పటికీ, ఇప్పటికీ రచయిత్రి ఎత్తి చూపిన సమస్యల్లో పెద్ద సంఖ్యల్లో బేబి కేర్ సెంటర్లు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ తప్ప మిగిలిన వాటిలో పెద్దగా మార్పు వచ్చినట్లు నాకయితే కనిపించలేదు...ఆశ్చర్యం !!)