మొదటి భాగం, రెండవ భాగం ,
మూడవ భాగం, నాలుగవ భాగం తరువాయి...
చీకటివేళ ఖాళీ చేతులతో ఇంట్లోకి అడుగుపెట్టిన కాంతిమతిని చూసి "అప్పుడే వచ్చేసావేం? అబ్బాయి ఊళ్ళో లేడా? చేతిలో సంచీ ఏది?" అని పలకరిస్తుంది అత్తగారు. అవునని తలఊపి..బ్యాగ్ రైల్లో పోయిందని చెబుతుంది కాంతిమతి. "అమ్మా నాన్న దగ్గరకు మమ్మల్ని తీసుకువెళ్ళలేదేం" అని కాళ్ళకు చుట్టుకున్న పిల్లలను చూడగానే దు:ఖ్ఖం ఆగదు అమెకు. తన కర్తవ్యం ఏమిటి? బిడ్డల మాటేమిటి? రాజీపడి ఎలా జీవించటం? మొదలైన సాగర కెరటాల్లాంటి అంతులేని ప్రశ్నలు వేధిస్తాయామెను. మరుసటి ఆదివారం గోపాల్రావ్ వస్తాడు. భర్త అదివరలో తనకు ప్రేమగా కొనిపెట్టిన, తను అక్కడ వదిలేసి వచ్చిన చీర తీసుకువస్తాడని అనుకున్న ఆమెకు నిరాశే ఎదురౌతుంది.
ఉన్న రెండురోజులు అతనికి దూరంగానే మసలుతుంది కాంతిమతి. క్షమాపణ చెబుతాడని ఎదురుచూస్తూంటే "వారం వారం వస్తూ ఉంటాలే" అన్న అతడి మాటలు ఆమెను ఇంకా కృంగదీస్తాయి. మౌనంగా,దురంగా ఉంటున్న భార్య ప్రవర్తన అతడికి అవమానంగా తోచి "ఏం చూసుకుని అంత పొగరు? నా అండ లేకుండా ఆ పంతులమ్మ ఉద్యోగంతోనే పిల్లల్ని పెద్దచేస్తావా?" అని ప్రశ్నిస్తాడు వెళ్తూ వెళ్తూ. తల వాల్చుకుని కన్నీరు దాచుకుంటున్న కాంతిమతి "ఆమెనయినా నట్టేట ముంచకుండా కాపురం చేయండి..." అని మాత్రం అంటుంది . కాసేపు నిలబడి ఒక సుదీర్ఘశ్వాస విడిచి వెళ్పోతాడు గోపాల్రావ్.
విషయం తెలీక కోడలిని మందలించబోయిన అత్తగారికి అసలు సంగతి చెబుతుంది కాంతిమతి. అవాక్కయి కూర్చుండిపోతుంది అత్తగారు. "వాడుండగా చెబితే లెంపలు వాయిద్దును. మహాలక్ష్మిలాంటి నీ ఉసురు పోసుకున్నాడు..?" అని బాధపడుతుంది ఆమె కూడా. "అబ్బాయి నచ్చిందన్నాకే ముహుర్తాలు పెట్టించామే అమ్మా..నిన్ను ఇష్టపడే చేసుకున్నాడే..." అని మాత్రం అంటుందామె. శాపంగా మారవలసిన రాత్రులను వరంగా మార్చుకుని రెండేళ్ళలో ఎమ్.ఏ ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, టీచర్ ట్రైనింగ్ చేసి అత్తగారు పట్టుబట్టి తన పేర రాసిన ఇంట్లోనే ఉంటూ, ప్రకాశరావుగారి సాయంతో అదే ఊళ్ళో లెక్చరర్ అవుతుంది కాంతిమతి. ఆ వెళ్ళిన రోజు తరువాత ఉత్తరం ముక్కయినా రాదు గోపాల్రావ్ నుంచి. తల్లి పోయినప్పుడు ఒకసారి, కూతురు పెళ్ళికి ఒకసారి వస్తాడంతే. కూతురు పెళ్ళికి వచ్చినప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిన తండ్రిని "ఆరోగ్యం బాగాలేదా" అని పిల్లలు ప్రశ్నిస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడే తప్ప మాత్లాడడు అతను. ఆ తరువాత కొడుకుల పెళ్ళిళ్ళకు ఉత్తరం రాసినా మనిషి రాడు. వాకబు చేస్తే వేరే చోటకు మారిపోయినట్లు తెలుస్తుంది. భారమైన గతం లోంచి గడియారం గంటలతో బయటకు వస్తుంది ఆమె.
మర్నాడు ఉదయం మంజులకు ముడో నెల అని తెలుసుకుని ఆనందిస్తుంది. అంతలోనే ఓపలేని పిల్లను వదిలి ఆశ్రమానికి వెళ్ళగలనా? బిడ్డ పుట్టాకా చూడకుండా ఉండగలనా? అని సందేహపడుతుంది. బిడ్ద పుడితే ఏం పేరు పెట్టాలో చెప్పి వెళ్ళమా..అని కన్నీళ్ళతో అడిగిన కొడుకుని చూసి చలించిపోతుంది ఆమె. "అరుణాచల స్వామీ, నా మనసుని ఈ ప్రాపంచిక బంధాల నుండి తప్పించి నీ సేవకనుగుణంగా మార్చుకో తండ్రీ.." అని మాత్రం వేడుకుంటుంది ఆమె. ఆ సాయంత్రం శారద ఇంటికి వెళ్దామని బయల్దేరుతుంది కాంతిమతి. తను ఊరు వెళ్ళేముందు బంతిలా ఉన్న శారద పాపకు వంట్లో బాగుండదు. శారద, పాప ఇద్దరూ చిక్కి సగమై ఉంటారు. కాంతిమతి గొంతు విని సీత వస్తుంది. గుర్తుపట్టలేనంతగా మారిన సీతను చూసి బాబేడని ప్రశ్నిస్తుంది. బాబు పోయి పదిహేను రోజులైందని సీత కన్నీళ్ళతో చెప్పిన మాటలు విని అవాక్కవుతుంది కాంతిమతి. జ్వరంతో ఉన్న బాబుని పనిపిల్ల సరిగ్గా చూడకపోవటం వల్ల అలా జరిగిందని తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. మీరు ఊరువెళ్లకుండా ఉండి ఉంటే నా బాబు నాకు దక్కేవాడని విలపిస్తున్న సీతను ఎలా ఓదార్చాలో అర్ధంకాక కాసేపుండి వచ్చేస్తుంది ఆమె.
అన్నం దగ్గర కూర్చున్నా ముద్ద మింగుడు పడదామెకు. సీత బాబే కళ్ళముందు మెదలుతాడు. తను ఆశ్రమానికి వెళ్పోయాకా రేపు మంజుకు బిడ్డ పుడితే ఇలా పనిపిల్ల సాకవలసిందేనా? అపురూపంగా పెరగవలసిన బిడ్డ పనిపిల్ల ఈసడింపులతో పెరగవలసిందేనా? శారద పాపలా చిక్కిపోయి ఉండవలసిందేనా? మొదలైన ప్రశ్నలామెను చుట్టుముడతాయి. ఈలోపూ "అమ్మా, పాపో,బాబో పుడితే చూడటానికన్నా వస్తావా...?" అని కిషోర్ అడిగేసరికీ ఇక కన్నీరాగదామెకు. అన్నం సహించటం లేదని వెళ్ళిపోతుంది. మంచం మీద వాలినా ఇవే ఆలోచనలు...ఏం చేయాలి?ఎవరిని వదులుకోవాలి? సీతా,శారద, మంజు....ఇలా ఎందరో ఉద్యోగినుల బాధలు వినేదెవ్వరు? వాళ్ళ వాళ్ళ పసిపిల్లల మూగవేదన అర్ధమయ్యేదెవ్వరికి? వాళ్ళలో కొందరి కోసమైనా తను ఏమీ చెయ్యలేదా? ఈ ప్రశ్నల ఘర్షణలో కాంతిమతి నిద్దుర చెదరిపోతుంది. నేను ఇరుగు పొరుగువారి కష్టాలను గూచి ఆలోచించకుండా ఉండలేను. భగవాన్! అసత్యము,అశాశ్వతమైనవైనా సరే సాటివారి దు:ఖ్ఖంలో పాలుపంచుకోకుండా ఉండలేను. నావల్ల కాదు స్వామీ! అనుకుంటుంది. లేచి కూర్చుని ఒక నిర్ణయానికి వస్తుందామె.
ఉదయాన్నే టిఫిన్ చేస్తున్న కిషోర్ దగ్గరకు వెళ్ళి "నా టికెట్టు కేన్సిల్ చేయించు ఈ పూట " అని చెప్తుంది. "మమ్మల్ని వదిలి వెళ్తున్నావని బాధతో ఏవో అన్నాను..మా కోసం నీ నిర్ణయం మార్చుకోవద్దమ్మా" అంటాడు కిషోర్.
(ఆఖరి భాగం త్వరలో...)