కీర్తి ప్రతిష్ఠల వెనుక ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయో అనిపిస్తుంది ఆయన జీవితచరిత్రను వింటే. 54ఏళ్ళ జీవితంలో ఆయన గడించిన కీర్తి అజరామరం. అధిరోహించిన సంగీతసోపానాలు అనేకం. ఆయన మరెవరో కాదు పంతొమ్మిదొందల ఢభ్భైల్లో,ఎనభైల్లో అద్భుతమైన సుమధురమైన సంగీతాన్ని తెలుగువారికి అందించిన స్వరకర్త రమేష్ నాయుడు.తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకుల్లో ఒకరు.
1933లో కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లిలో జన్మించారు పసుపులేటి రమేష్ నాయుడు.టీనేజ్లోనే ఇంటి నుండి పారిపోయి బొంబాయి చేరారు. అక్కడ ఒక సంగీతవాయిద్యాల షాపులో పనికి కుదిరారు.అక్కడే సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆ షాపులో పని చేయటం వల్ల హిందీ,మరాఠీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆయనకు. 14ఏళ్ల వయసులో ఆయన 'Bandval pahija' అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ లను హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈయనదే.
అరవైలలో "దాంపత్యం","మనోరమ" మొదలైన తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చాకా తిరిగి బొంబాయి వెళ్ళారు.ఆ తరువాత కలకత్తా కూడా వెళ్ళి కొన్ని బెంగాలీ సినిమాలకు సంగీతాన్ని అందించారు.అక్కడే ఒక బెంగాలి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దాదాపు ఒక పది సంవత్సరాల వరకూ బెంగాలీ,నేపాలీ,ఒరియా చిత్రాలకు సుస్వరాలనందించారు. మళ్ళీ 1972లో శోభన్ బాబుగారి "ఆమ్మ మాట" ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి ద్వితీయ ప్రవేశం చేసారు.రమేష్ నాయుడు లోని ప్రతిభను ఎక్కువగా ఉపయోగించుకుని కొన్ని అపురూప గీతాలను మనకు అందేలా చేసిన దర్శకులు జంధ్యాల,దాసరి నారాయణరావు మరియు విజయ నిర్మల గార్లు.
"మేఘ సందేశం" సంగీతం ఆయనకు 1983లో బెస్ట్ మ్యుజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ ను తెచ్చిపెట్టింది. చిత్రంలోని అన్ని పాటలూ బహుళ ప్రజాదరణ పొందినవే. శివరంజని,ఆనంద భైరవి,శ్రివారికి ప్రేమలెఖ,ముద్ద మందారం,స్వయం కృషి మొదలైన సినిమాలు ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి.రమేష్ నాయుడు గారు మంచి స్వరకర్తే కాక మంచి గాయకులు కుడా. "చిల్లర కొట్టు చిట్టెమ్మ" చిత్రంలో ఆయన పాడిన "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..." పాటకు స్టేట్ గవర్నమెంట్ ఆ ఏడు బెస్ట్ సింగర్ అవార్డ్ ను అందించింది.ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది.
మెలోడీ రమేష్ నాయుడు పాటల్లోని ప్రత్యేకత. ఎక్కువగా వీణ,సితార్ వంటి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కే ప్రాధాన్యత కనిపిస్తుంది. అలానే వయోలిన్స్,ఫ్లూట్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తాయి."శివరంజని" లోని 'జోరు మీదున్నావె తుమ్మెదా' పాటలో వయోలిన్ వాయించిన నాగయజ్ఞశర్మగారు(ఈయన మణిశర్మ తండ్రిగారు)రమేష్ నాయుడు ఆర్కెస్ట్రాలో పర్మనెంట్ మ్యుజిక్ కండక్టర్ గా ఉండేవారట.
ఇక పాట సాహిత్యాన్ని చూసాకే ట్యూన్ కట్టేవారట. సిట్టింగ్ లో కూర్చున్న పదిహేను నిమిషాల్లో పాట తయారయిపోయేదంటే ఆయన ఏకాగ్రత ఎటువంటిదో అర్ధమౌతుంది. సినీపరిశ్రమలో కూడా సత్సంబంధాలు కలిగిన మంచి మనిషి ఆయన.వేటురిగారు తన "కొమ్మ కొమ్మకో సన్నాయి" పుస్తకంలో తాను పనిచేసిన సంగీత దర్శకులు, చిత్ర దర్శకుల గురించీ రాస్తూ అందరి గురించీ ఒకో అధ్యాయంలో రాస్తే, ఒక్క రమేష్ నాయుడు గారితో తన అనుబంధాన్ని గురించి రెండు అధ్యాయాల్లో రాసారు.ఆయన చివరి చిత్రం విశ్వనాథ్ గారి "స్వయంకృషి". ఆ చిత్రం రిలీజ్ కు ముందు రోజున, 1987 సెప్టెంబర్ 8న ఆయన తుది శ్వాస విడిచారు.
రమేష్ నాయుడు స్వరపరిచిన కొన్ని మధుర గీతాల జాబితా:
చందమామ రావే - (మనోరమ)
మరచిపోరాదోయీ - (మనొరమ)
అందాల సీమాసుధానిలయం - (మనోరమ)
(ఈ పాటను ప్రఖ్యాత హిందీ గాయకుడు తలత్ మెహ్ముద్ పాడారు)
శ్రీరామ నామాలు శతకోటి - (మీనా )
మల్లె తీగె వంటిది - (మీనా )
దీపానికి కిరణం ఆభరణం -( చదువు-సంస్కారం)
స్వరములు ఏడైనా (తూర్పు-పడమర)
తల్లి గోదారికే (చిల్లర కొట్టు చిట్టెమ్మ)
జోరుమీదున్నావె తుమ్మెదా(శివరంజని)
నవమినాటి వెన్నెల నేను(శివరంజని)
గోరువెచ్చని సూరీడమ్మా(జయసుధ)
ఊగిసలాడకే మనసా ( కొత్త నీరు)
రేవులోని చిరుగాలి (పసుపు-పారాణి)
నీలాలు కారేనా కాలాలు మారేనా(ముద్ద మందారం)
(ఒరియా లో వాణీ జయరాం చేత తాను పాడించిన ఈ స్వరాన్నే తెలుగులో మళ్ళి వాడుకున్నారు రమేష్ నాయుడు.)
జో..లాలి..జోలాలి..(ముద్ద మందారం)
అలివేణీ ఆణిముత్యమా( ముద్ద మందారం)
అలక పానుపు ఎక్కనేల(శ్రీవారి శోభనం)
తొలిసారి మిమ్మల్ని(శ్రీవారికి ప్రేమలేఖ)
లిపి లేని కంటి బాస(శ్రీవారికి ప్రేమలేఖ)
మనసా తుళ్ళి పడకే(శ్రివారికి ప్రేమలేఖ)
చంద్రకాంతిలో చందన శిల్పం(శ్రీవారి శోభనం)
మెరుపులా మెరిసావు (ప్రేమ సంకెళ్ళు)
కొబ్బరినీళ్ళా జలకాలాడీ (రెండు జెళ్ళ సీత)
పిలిచిన మురళికి (ఆనంద భైరవి)
కనుబొమ్మల పల్లకిలో (నెలవంక)
కదిలే కోరికవో (మల్లె పందిరి)
కోయిల పిలుపే కోనకు మెరుపు( అందాల రాశి)
సిన్ని సిన్ని కోరికలడగా (స్వయంకృషి)
సిగ్గు పూబంతి(స్వయంకృషి)
"మేఘసందేశం"లో అన్ని పాటలు...
నాకిష్టమైన "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..." పాట సాహిత్యం:
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
పాడినది: రమేష్ నాయుడు
తల్లి గోదారికే ఆటు పోటుంటే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ..
ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి(2 )
సీకటికి దడిసేదేమిటి...
ఓ మనసా..
భగ భగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా(2 )
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ ...
అవతార పురుషుడు ఆ రామచంద్రుడు
అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు
అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ...