సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 7, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 4 "

మూడవభాగం తరువాయి.. ..


కాంతిమతిని చూసి కిషోర్,మంజూ చాలా సంతోషిస్తారు. పది రోజులని ఇన్ని రోజులు వెళ్పోతే ఎలా అనడుగుతాడు కిషోర్. కాలేజీకు వెళ్ళి ప్రావిడెంట్ ఫండ్ తీసుకుని అభిమానంగా పలకరించినవారందరితో కబుర్లు చెప్పి, అలసటగా ఉండటంతో శారదా వాళ్ళింటికి వెళ్ళి పిల్లల్ని చూడాలని ఉన్నా బడలికతో ఇల్లు చేరుతుంది ఆవిడ.

సాయంత్రం ఏదో పెళ్ళి రిసెప్షన్ కు బయల్దేరుతూంటారు కొడుకూ కోడలు. పట్టు చీరతో నిండుగా ఉన్నా, బోసిగా ఉన్న మంజు మెడను చూసి ఒక పేట గొలుసు, జత గాజులు తీసి ఇవ్వబోతుంది కాంతిమతి. "కూతురిలా చూసే మీ అభిమానం చాలు ఇవన్ని వద్దని" వారిస్తుంది మంజు. కట్నాలు తీసుకోలేదు,బంగారం కుడా పెట్టలేదు పెళ్ళీలో మీకు...శైలూకి,జానకికి ఇచ్చాను నువ్వు కూడా తీసుకొమ్మని బలవంతపెడుతుంది ఆవిడ. "మీ అభిమానం పొందటమే నాకు సొమ్ము.ఇవి మీవద్దనే ఉంచండి" అంటుంది మంజు. కడుపున పుట్టిన కూతురికీ, అయిన సంబంధం అని చేసుకున్న జానకికీ, పరాయి పిల్ల అయినా ఇంత ఆప్యాయంగా ఉన్న మంజూకీ తేడా గమనించి మంజూ అభిమానానికి మురిసిపోతుంది కాంతిమతి.

ఆ రోజు రాత్రి ఆవిడ తన చిరకాల కోరికను తీర్చమని ,శేషజీవితం ఆశ్రమంలో గడపాలని ఉందనీ,తిరువణ్ణామలై కు తికెట్టు తీసుకొమ్మని కిషోర్ ను అడుగుతుంది . అదిరిపడతారు కొడుకూ,కోడలూ. తమ తప్పేదైనా ఉంటే మన్నించమనీ,తమని వదిలి వెళ్ళద్దని ప్రాధేయపడతారు. అటువంటిదేమిలేదనీ, ఎప్పటినించో తన మనసులోని కోరిక అదనీ, జీవన్ముక్తి మార్గాన్ని సులభం చేసుకోనిమ్మనీ అడ్దుకోవద్దని అంటుంది కాంతిమతి. భారంగా సరేనంటాడు కిషోర్. పిల్లల మనసులు నొప్పించి వెళ్ళగలనా అని మధనపడుతూ నిద్రలోకి జారుకుంటుంది కాంతిమతి.

మర్నాడు ఉదయాన్నే ప్రకాశరావుగారు కాంతిమతిని పలుకరించటానికి వస్తారు. ఉభయకుశలోపరి అయ్యాకా, మంగను గురించిన విషయం చర్చకు తెస్తారు ఆయన. మంగను ఒక ఫాన్సి షాపులొ పనికి చెర్పించాననీ,ఆ షాపు ఓనరు కొడుకు మంగ తనకు లొంగలేదని ఆమెను నానా అల్లరి పెట్టాడనీ, ఎలాగైనా అతనికి బుధ్ధి చెప్పి మంగతో అతనికి వివాహం జరిపిస్తానని అంటారు ప్రకాశరావుగారు.బలవంతపు పెళ్ళి వలన మంగ సుఖపడలేదని అలా చేయవద్దని అంటుంది కాంతిమతి. మనసులేని మనువు వలన ఎంతటి ఆవేదన పడవలసివస్తుందో మీకు తెలియదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆవిడ. కాసేపు తరువాత వచ్చిన మంగ కూడా ఆవిడ వాదనను బలపరుస్తూ తన అభిప్రాయాన్ని చెబుతుంది. తనను నన్ను నానా అల్లరి పెట్టిన మనిషిపై తనకు అసహ్యం తప్ప ప్రేమ లేదని,అతడికి కూడా తనపై పగే తప్ప కనీసం జాలి కూడా లేదనీ, ఈ పెళ్ళి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ...ఈ పెళ్ళి తప్పించమనీ అంటుంది మంగ.

పధ్ధెనిమిదేళ్ళు నిండిన ఆ అమ్మాయి అంత లోతుగా ఆలోచించి నిబ్బరంగా నిర్ణయం తీసుకోవటం కాంతిమతికి ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రకాశరావుగారితో మళ్ళీ మాట్లాడతానని చెప్పి మంగను పంపించి సోఫాలో వెనక్కు వాలిన కాంతిమతికి గతం గుర్తుకు వస్తుంది...
స్కూలుకు మూడురోజులు శెలవులు వచ్చాయని ఆనందంగా ఇంటికి వచ్చిన కాంతిమతిని ట్రాన్స్ఫర్ పై పొరుగురిలో ఉద్యోగం చేస్తున్న గొపాలరావుదగ్గరకు వెళ్ళి రమ్మని,పిల్లల్ని తాను చూసుకుంటానని అంటుంది అత్తగారు. ఎంతో ఆనందంతో భర్తకు ఇష్టమైన చీర బ్యాగ్లో పెట్టుకుని కోటి కోర్కెలతో రైలు ఎక్కుతుంది కాంతిమతి.

ఇంటిలోకి అడుగుపెట్టగానే భర్త కుర్చీకోడు మీద కూర్చుని తిఫిన్ తినిపిస్తున్న యువతిని చూసి అవాక్కవుతుంది. కాంతిమతిని నువ్వెవరని ప్రశ్నించి.. తాను అతని భార్యననీ,తామిద్దరమూ కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నామనీ ఇన్నాళ్ళకు కలిసామనీ ఆ యువతి చెప్పిన మాటలు విన్న కాంతిమతి కాళ్ళ క్రింద భూమి బద్దలై అందులో తాను కూరుకుపోయినట్లనిపిస్తుంది ఆమెకు. తల గిర్రున తిరిగి, కృంగిపోతుంది ఆమె. తనను ఇష్టపడికాదు పెద్దల బలవంతం మీద పెళ్ళి చేసుకున్నారు అన్న ఆ యువతి మాటలు ఆమెకు కత్తిపొటులా తోస్తాయి.'కాంతీ' ఆగమని గోపాల్రావు పిలుస్తున్నా వినిపించుకోకుండా స్టేషన్ కు చేరి రైలెక్కేస్తుందామె.

(ఇంకా ఉంది..)