మొదటి భాగం తరువాయి....
వృత్తిరీత్యా అదే ఊళ్ళో డాక్టరు ప్రకాశరావుగారు. పేరుకు కాంతిమతికి పెదతల్లి కొడుకైనా సొంత అన్నగారి కంటే అభిమానంగా ఉంటారు. కాంతిమతికి పెళ్ళి సంబంధం కుదిర్చింది మొదలు,ఆమెకు టీచర్ ఉద్యోగం, ట్రైనింగ్, పీ.జీ., అయ్యాకా లెక్చరర్ ఉద్యోగం ఇప్పించటం వరకూ ఆమెకు ఎంతో సహాయకంగా ఉంటూ వచ్చారు. కుటుంబంలో ఆర్ధిక సమస్యలున్న మంగ అనే పధ్ధెనిమిదేళ్ళ ఒక అమ్మాయికి ఆసరా చూపించవలసినదిగా కాంతిమతి అన్నగారిని కోరుతుంది.
ప్రకాశరావుగారి ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు అమెరికాలో ఉండగా, మూడవ కొడుకు సురేష్ బాధ్యతలు విస్మరించి అల్లరిగా తిరగటం ఆయనకు ఉన్న ఏకైక చింత. చిన్న వయసులో కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయటం కోసం ఉద్యోగానికి సిధ్ధపడ్డ మంగను చూసి ముచ్చటపడతారు ఆయన. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించేవరకు తన మందుల షాపులోనే పనిలో పెట్టుకుంటానని మాట ఇస్తారు ప్రకాశరావుగారు. హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన చిన్న కొడుకు, కోడలుకూ అదే ఊళ్ళో డాక్టర్లుగా స్థిరపడటానికి కూడా ప్రకాశరావుగారి పలుకుబడే కారణం. కాంతిమతి దగ్గర ఉంటూ ఆమెను ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉంటారు అబ్బాయి కిషోర్,కోడలు మంజు.
* * * * * * * * *
రిటైరయిన మర్నాడు పొద్దున్న లేచేసరికీ వంట ప్రయత్నంలో ఉన్న కోడలును చూసి తనను లేపలేదేమని అడుగుతుంది కాంతిమతి. ఇన్నేళ్ళ తరువాత విశ్రాంతిగా పడుకున్న ఆవిడను లేపాలనిపించలేదంటుంది మంజు. ఆ రోజు శుక్రవారం ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుందామని అన్నీ అమర్చుకుని కూర్చుందామనుకునేసరికీ కొలీగ్ శారద "లెక్చర్ నోట్స్" తన హేండ్ బ్యాగ్లో ఉండిపోయిన సంగతి గుర్తు వస్తుంది ఆవిడకు. ఆ నోట్స్ ఇచ్చేసి వచ్చి పూజ చేసుకోవచ్చని, పక్కవీధిలోని శారద ఇంటికి బయల్దేరుతుంది ఆమె.
ఓరవాకిలిగా వేసిఉన్న తలుపు లోపల నుంచి పెద్దగా వినిపిస్తున్న మాటలు విని కాంతిమతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. శారదా వాళ్ళ పాపకు జ్వరంగా ఉండటం వల్ల,పనిపిల్ల మానివేసిన కారణంగాను ఆఫీసుకు శెలవు పెట్టుకునే విషయంలో ఘర్షణ పడుతున్న ఆ భార్యాభర్తల సంభాషణ వింటుంది ఆమె. తాను శెలవు పెట్టడం ససేమిరా వల్లకాదని, కావాలంటే ఉద్యోగం మానుకోమని ధుమధుమలాడుతూ కాంతిమతిని దాటుకుని బయటకు వెళ్పోతాడు శారద భర్త.
కాంతిమతి పలకరించగానే కన్నీళ్ళు పెట్టుకున్న శారద, ఇద్దరు సంపాదిస్తూంటేనే చాలని జీతాలతో ఉద్యోగాన్ని మానివేస్తే సంసారమేలా ఈదటం అని బాధ పడుతుంది. ప్రస్తుతం ఖాళీ కాబట్టి పనిపిల్ల దొరికేదాకా పాపను చూస్తానని హామీ ఇచ్చి, అవసరమైన వస్తువులు తీసుకుని శారదను కాలేజీకు పంపించి పాపతో ఇల్లు చేరుతుంది కాంతిమతి. సాయంత్రం పాపనెత్తుకుని సంతృప్తిగా వెళ్ళిపోతున్న శారదను చూసిన కాంతిమతికి ఉదయం పూజ పూజ చేసుకోలేదన్న విషయం పెద్దగా బాధించదు.
కానీ మంజు కూడా ఉద్యోగాస్తురాలు. రేపు పిల్లలు కలిగాకా వారు కూడా ఏ పనిపిల్ల చేతుల్లోనో పెరగటం, దాని వల్ల కొడుకు కోడలు కూడా ఇలాగే కిచులాడుకుంటారా అన్న సందేహం ఆమెకు కలుగుతుంది. రకరకాల ఆలోచనలతో కుదుటపడని ఆవిడ మనసుని భగవద్గీత పఠనం ప్రశాంత పరుస్తుంది.
ఆ తరువాత అనుకోకుండా శారద పక్కింట్లో ఉన్న మరో ఉద్యోగాస్తురాలు సీత బాబును కూడా చూసే బాధ్యతా తీసుకుంటుంది కాంతిమతి. పనిపిల్లల్ని పెట్టుకున్నాకా కూడా ఆ పిల్లలతో సహా పిల్లల్ని ఆవిడకే అప్పగించి వెళ్ళేవారు శారద, సీత. నెలరోజులు గడిచేసరికి పిల్లలు కాంతిమతికి బాగా చేరువయి, శ్రద్ధగా చూసుకోవటం వల్ల గుమ్మడిపళ్ళలా తయారవుతారు.
(ఇంకా ఉంది ...)