సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 2, 2010

పాత పత్రికలూ...మధుర స్మృతులు!

నేను ఊహ తెలిసేసరికీ ఇద్దరు తాతయ్యలనీ ఎరుగను. అందువల్ల నా పాపకు పెద్దల ముద్దుమురిపాలు వీలయినంత అందించాలనేది నా ఆశయం. మా మామగారు కూడా రెండేళ్ళ క్రితం కాలం చేయటంతో మా ఇంట్ళో దాని కాలక్షేపం ఒక్క "నానమ్మ"తోనే. పాపకు అమ్మమ్మ,తాతయ్యల ప్రేమను కూడా అందించాలనే కోరికతో ఈ ఊరు వచ్చినప్పటి నుంచీ స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా, వారం పదిరోజులకోసారైనా, ఓపిక ఉన్నా లేకపోయినా పాపను అమ్మావాళ్ళింటికి తీసుకువెళ్తూ ఉంటాను. కానీ ఈసారి దాదాపు నెల తరువాత ఇంటికి వచ్చాను. ఈసారి ఇంట్లోని పాత పుస్తకాలన్నీ ఓసారి చూడాలనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చదవటం అయిపోనన్ని పుస్తకాలు, వినటం అయిపోనన్ని కేసెట్లు మా ఇంట్లో. నా బాల్యం, సగం జీవితం ఈ పుస్తకాల మధ్యన, కేసెట్ల మధ్యనే గడిచిపోయింది. వాట్ని చూస్తే నా ప్రాణం లేచి వచ్చినట్లు, మళ్ళీ నాలో కొత్త జీవం ప్రవేశించినంత ఆనందం కలుగుతుంది. పాత పుస్తకాలంటే కధలూ,నవలలు...ఇతర పుస్తకాలూ కాదు. పాత పత్రికల తాలుకూ బైండింగ్స్.

మా చిన్నప్పుడు ఇంట్లో చాలా పత్రికలు తెప్పించేవారు. పూర్తి సినిమా కబుర్లతో ఉండే "విజయచిత్ర", "వనిత", "ఆంధ్ర సచిత్ర వార పత్రిక", "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ", "రీడర్స్ డైజస్ట్", 'స్పేన్"...అప్పుడప్పుడు సితార మొదలైన పొడుగాటి సినీ పత్రికలు...ఇలా రకరకాల పత్రికలు ఇంట్లో ఉండేవి. మా పిల్లల కోసం "ట్వింకిల్","బాలజ్యోతి", బాలమిత్ర", "చందమామ","అమర చిత్ర కధలు" మొదలైనవి కూడా తెచ్చేవారు నాన్న. నాకు తెలుగు చదవటం బాగా వచ్చాకా అప్పట్లో పావలాకు అద్దెకు ఇచ్చే "పగడాల పడవ","రాకాసి లోయ" లాంటి చిన్న కధల బుల్లి పుస్తకాలూ, మిగతా పిల్లల పుస్తకాలతో పాటూ అవీ ఇవీ అని లేకుండా నవలలూ,పత్రికలు కూడా చదివేస్తున్నానని అమ్మ నన్ను కంట్రోల్ చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ అమ్మ మధ్యాహ్నం నిద్రోయినప్పుడూ, శెలవు దినాల్లోనూ అమ్మకు కనబడకుండా నా చదువు కొనసాగుతూ ఉండేది.


మా అప్పటి ఇంట్లో ఒక చిన్న గదిలో బాగా ఎత్తుమీద ఒక కిటికీ ఉండేది. దానికో బుల్లి అరుగు కూడా ఉండేది. అందులోకి ఎక్కి ఎవరికీ కనపడకుండా పత్రికలన్నీ చదివేస్తూ ఉండేదాన్ని. అది కనిపెట్టిన అమ్మ నా క్షేమాన్ని కాంక్షించి అసలు వార పత్రికలు కొనటమే మానేసింది. కానీ అప్పటిదాకా తెప్పించిన పత్రికల్లోని మంచి కధలనూ, సీరియల్స్ నూ, ఇతర విషయాలనూ కొన్నింటిని కట్టింగ్స్ చేసి జాగ్రత్తగా బైండింగ్ చేయించి దాచింది. పిల్లల పుస్తకాలన్నీ కూడా భద్రంగా దాచి బైండింగ్స్ చేయించింది అమ్మ. అవన్ని నా టెంత్ క్లాస్ అయ్యాకా శెలవుల్లో,నేను కాలేజీలోకి వచ్చాకా చదవనిచ్చేది. అప్పుడు మొదలు సమయం దొరికినప్పుడల్లా ఆ బైండింగ్స్ ను ఎన్నిసార్లు చదివానో...

ఇంతకీ ఆ బైండింగ్స్ లో ఏమున్నాయంటే పురాణం సీతగారి "ఇల్లాలి ముచ్చట్లు" , మాలతీ చందూర్ గారి "ప్రమదావనం" తాలూకూ కట్టింగ్స్ ఒక బైండ్; "వనిత"లోని కధలు, సీరియల్స్ ఒక బైండ్, "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లోని కొన్ని సీరియల్స్ ఒక బైండ్, "విజయచిత్ర" పత్రికల్లోని కట్టింగ్స్ సంవత్సరం వారీగా ఒక పదేళ్ళపైగా ఉన్న కొన్ని బైండ్స్, "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ"లో ప్రచురించిన మంచి మంచి ఫొటొగ్రాఫ్స్ తో
ఒక బుక్కు, అన్నిరకాల పత్రికల్లోంచీ సేకరించిన కొన్ని మంచి కధలతో ఒక బైండ్, ఇవికాక మేం పిల్లలం ఇప్పటికీ నాకంటే నాకని దెబ్బలాడుకునే "చందమామా" "బాలజ్యోతి" "ట్వింకిల్" "అమర చిత్ర కధలు" మొదలైనవాటి బైండింగ్స్...ఇంక్లా పైంటింగ్స్, వంటా-వార్పూ, సలహాలు,సూచనలు....ఇలా రాసుకుపోతే రెండు టపాలకు సరిపోయేన్ని నిధి నిక్షేపాలను మా అమ్మ పదిలపరిచింది.

ఇవాళ పొద్దున్నే వాటిని తిరగేసి , చదవటానికి కొన్నింటిని తీసుకున్నా. ఇవన్నీ నేను ఇదివరలో చాలా సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉంటాయి. అంత మంచి కధలూ, విశేషాలూ అవన్నీ. ఇన్నాళ్ళ తరువాత వాటిని చూసాకా వాటి గురించి బ్లాగులో రాయాలని మనసైంది....ఈ టపా తయారైంది..!!