ఏది శాశ్వతం..?జీవితంలోని ఏది ఏది శాశ్వతం కాదని తెలిసినా...ఈ ప్రశ్నను ఇప్పటికి గత రెండు రోజుల్లో వేయి సార్లు వేసుకుని ఉంటాను..! కాస్త విశ్రాంతిగా ఉంటుందని అమ్మావాళ్ళింటికి వచ్చాను. అందుకే మనసునాపుకోలేక అమ్మ ఆ మాయ కంప్యూటర్ జోలికి వెళ్లకని వారిస్తున్నా...ఇలా వెంఠనే తపా రాయగలుగుతున్నాను...
నేను రాయబోయేది కధ కాదు...ఒక జరిగిన యదార్ధం...అది వింటూంటే అసలు దేముడు అంత నిర్దయంగా అయిపోయాడే అనిపిస్తుంది...మనసు వికలమౌతుంది...నేను ఈ సంగతి రాసేది ఎవరి మనసునీ భారం చెయ్యాలని కాదు. కానీ, జీవితంలో ఏదీ మన చేతుల్లో ఉండదు...మనం కేవలం నిమిత్తమాత్రులమే అని మనకు తెలియచెప్పటానికి నాకు ఎదురైన ఒక ఉదాహరణను తెలుపాలని ఇది రాస్తున్నాను..
ఒక అందమైన కుటుంబం. మావారి సమీప బంధువులు. భార్య,భర్త,అమ్మాయి,అబ్బయి. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ చదువుతున్న ఆ ఇరవై ఏళ్ళ అబ్బాయి హటాత్తుగా అలవిగాని అనారోగ్యం వచ్చి ఒక సంవత్సరం నానా యాతనా అనుభవించి ప్రాణాలు వదిలాడు. ప్రానం నిలవదని తెలిసినా లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించారు తల్లిదండ్రులు...అయినా ఫలితం దక్కలేదు.ఆ తల్లి బాధ వర్ణనాతీతం...మళ్ళీ రెందేళ్ళ తరువాత ఆమధ్యన ఆ తల్లిని చూసి నేను గుర్తుపట్తలెకపోయాను. అంతగా పాడయిపోయారు ఆవిడ .ఎంతో అందమైన రూపం ... అసలు గుర్తుపట్టలేనంతగా పాడయిపోయారు. మనోవ్యధకు మందు లేదంటే ఏమిటో ఆవిడను చూస్తే అర్ధమైంది..!
ఇక ఉద్యొగలరీత్యా భార్య ఒక చోటా,భర్త ఒక చోట,చదువు రీత్యా అమ్మాయి ఒక చోటా మూడు ఊర్లలో కాలం గడుపుతున్నారిన్నాళ్ళూ. పది రోజుల క్రితం కూడా మాతొ ఫొన్లో మాట్లాడారు ఆయన. ఎంతో మంచి మనిషి. బీ.పీ,సుగర్ ఎమీ లేవు.కొద్దిపాటి ఆస్థ్మా ఉంది. కొద్దిగా బాలేదని భార్య ఉన్న ఊరు స్వయంగా బస్సెక్కి వెళ్ళారు.
హటాత్తుగా ఫోను వారం క్రితం...ఆయన ఐ.సి.యూ లో ఉన్నారని. నాకు వెంథనే ఆవిడ ఎలా ఉన్నారో అనిపించింది. నాలుగు రోజుల క్రితం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారన్నారు...మావారు,బంధువులు వెళ్ళారు. నిన్న పొద్దున్నే తుది శ్వాస విడిచారని మావారు ఎస్.ఎం.ఎస్ వచ్చింది...
నాకసలు ఏం తోచలేదు..ఏది శాశ్వతం...ఏమిటి జీవితం...అని రకరకాల ప్రశ్నలు...మనసంతా వికలమైపోయింది. కొడుకుని పోగొట్టుకున్న బాధ నుండి కోలుకోకుండానే ఈ బాధ..ఇంతటి దెబ్బని అసలు తట్టుకోవటం ఆ తల్లికీ,అమ్మాయికీ ఎంతటి కష్టమో..అసలు వాళ్ళు ఎలా కోలుకుంటారు అన్న ప్రశ్నలకు నాకు సమాధానమే దొరకటం లేదు...అయ్యో దేవుడు కాస్తైనా దయ చూపలేదే అని బాధ కలిగింది..నిద్ర కూడా పట్టటం లేదు బాధతో...
రేపు ఏమి జరుగుతుందో తెలియని అసందిగ్ధ క్షణికమైన జీవితం కోసం మనమింత తాపత్రయ పడుతున్నామే అని నాకు విరక్తితో కూడిన భావనలు కలిగాయి. జీవితమే శాశ్వతం కానప్పుడు...కొన్ని సంఘటనల వల్ల కలిగే భావోద్వేగాలూ,కోపాలూ,తాపాలూ జివితాంతం మనతో మోసుకోవటం అనేది ఎంతటి అవివేకమైన పనో అనిపించింది...
ఇంతకానా ఎక్కువ కష్టాలు,బాధలు ఎందరి జీవితాల్లోనో ఉండి ఉండచ్చు..కాని ఎదురుగా కనిపించిన,నిన్ననే జరిగిన సంఘఠన కావటంతో బ్లాగ్లో రాయాలనిపించి రాసేస్తున్నాను...నా వేదనను బ్లాగ్మిత్రులతొ పంచుకోవాలని...
ఇంతకన్నా రాయాలని ఉన్నా రాయలేని నిస్సత్తువ...వెనుక నుంఛి అమ్మ అంటోంది...అందుకే మీ ఆయన కంప్యూటర్ బాగు చేయించటంలేదు...అది ఉంటే ఇక నిన్ను నువ్వు పట్టించుకోవు...అని..!!
ప్రస్తుతానికిక శెలవు మరీ...