"లిటిరేచర్" అధ్యయనం చేసేప్పుడు కామెడి లో రకాలు చెప్తూంటారు. Romantic comedy, Farce, Comedy of humours, comedy of manners, Satiric comedy, High comedy,Tragi-comedy అని బోలెడు రకాలు. హాస్యంలోని ఈ రకాలన్నింటినీ తెలుగు వెండితెరకు పరిచయం చేసిన ఘనత హాస్యబ్రహ్మ "జంధ్యాల" గారిది. ఇవాళ జనవరి 14న మనందరికీ "జంధ్యాల(14 Jan 1951 - 19 Jun2001)"గా తెలిసిన హస్యబ్రహ్మ "జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి"గారి పుట్టినరోజు.
హాస్య చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపు, తన సంభాషణలతో తెలుగు భాషలోనే గొప్ప మార్పు తెచ్చినవారు "జంధ్యాల" అనటం అతిశయోక్తి కాదేమో. "సుత్తి" అనే పదం మనందరి వాడుక భాషలో ఎంత సుస్థిరమైన స్థానం సంపాదించుకుందో వేరే చెప్పనక్కరలేదు. ఇలాంటి పదాలూ, పద ప్రయోగాలూ, మేనరిజమ్స్...ఆయన సినిమాల నిండా కోకొల్లలు. వాటిలో చాలామటుకు మన ప్రస్తుత భాషా ప్రయోగాల్లో కలిసిపోయినవనేకం. రెండు జెళ్ళ సీత, రెండు రెళ్ళు ఆరు, మొగుడు పెళ్ళాలు, చంటబ్బాయ్, పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్ళంత, వివాహ భోజనంబు, హై హై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, ఇష్..గప్ చుప్....ఇలాంటి సినిమాల పేర్లన్నీ తలుచుకుంటే చాలు తెలుగు ప్రేక్షకుల వదనాల్లో ఇప్పటికీ దరహాస మందారాలు పూయించగల సామర్ధ్యం ఉన్న చిత్రాలు.
కొత్తగా ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పటమంటే సూర్యునికి దివిటీ చూపించటమే అవుతుంది. ఆయన సినిమా ప్రస్థానం, వచ్చిన అవార్డులు, ఇతర జీవిత విశేషాలను గురించి "ఇక్కడ" చూడండి.
క్రితం అక్టోబర్లో "బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" కోసం నేను రాసిన "చంటబ్బాయ్" సినిమా కబుర్లు....ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారిని తలుచుకుంటూ....మరోసారి.
*** *** ***
ఆహాహా....సుహాసినీ సుమధుర హాసినీ...వందే...."
ఎవరది?వేళకాని వేళ వందేమాతరం పాడుతున్నారు..?
అయ్యో, మా నాన్నగారండి......గుమ్మం అటు....
నాకు తెలియదనుకున్నారా? వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు గృ..గృ..గృ...గృహం మధ్యదాకా వచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకనే..ఇలా...."
*** *** ***
"కఐ కలౌ కయూ..."
"కమి కటూ..."
ఏమిటిది మనిషంత మనిషిని పిల్లకి తండ్రిని నా ఎదురుగుండా నాకు అర్ధంకాని భాషలో మా అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదయ్యా వీల్లేదు..."
*** *** ***
"ఏమండేమండీ..మీరు సినిమా తీస్తున్నరాండీ...నా పేరు విశ్వనా"ధం" అండీ, చాలా నాటకాలు వేసానండి..ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమలో ఏక్ట్ చెయ్యాలని కోరికగా ఉందండి...ఒక్క చిన్న బిట్ ఏక్ట్ చేస్తాను...బాబ్బాబు కాదనకండి.."
"ఆల్ రైట్. ఆకలితో బాధ పడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా..?"
"నటిస్తానండి..బాగా ఆకలితో కదండి....అయ్యా, బాబూ...ధర్మం చెయ్యండి బాబూ...ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా హొటల్లో చికెన్ బిర్యానీ తింటాను తండ్రీ...బాబూ.....అయ్యో వాళ్ళేరీ?"
(ఇంతలో అతని తండ్రి వస్తాడు...)
"ఎవర్రా వాళ్ళు... సినిమానా నీ శార్ధమా? అడ్దగాడిద. ఏం మేమంతా చచ్చాం అనుకుంటున్నావా? అనాధ జన్మంటూ అడుక్కు తింటున్నావ్? ముప్పొద్దులా మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా..!"
"అది కాదు నాన్నా, సినిమాలో వేషం ఇస్తానంటేనూ..."
"ఫో రా, సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తింటూ బ్రతుకు.నా కొడుకు పుట్టగానే టి.వి. చూసి ఝడుసుకుని చచ్చాడనుకుంటాను..."
"నాన్నా...”
"ఫో...”
"నాన్నా... "
"ఫో...”
నాన్నా...
*** *** ***
"ఏమిటో...జరిగిందంతా విన్నాకా ఆశువుగా నాకొక కవిత వచ్చేస్తోంది....జీవితమంటే...."
"ఏమండీ...వన్ మినిట్...నేనలా బయటకు వెళ్ళాకా కన్టిన్యూ చేసుకోండి.."
*** *** ***
"నేను కొన్ని కవితలు రాసాను..మచ్చుక్కొకటి వినిపిస్తాను వినండి...
ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుండి? ఎర్రగా ఉంటే బాగుండదు కనుక.
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? నీలంగా ఉంటే బాగుండదు కనుక.
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు కనుక."
"ఇవి విన్నాకా కూడా నేను ఎందుకు బ్రతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనుక."
"చాలా బాగుందండి..ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను..వీటిని మీ పత్రికలో వేయించండి."
"ఇవిక్కడే ఉంచుతానమ్మా. మేమిక పత్రిక నడపలేము అని నిర్ణయించుకున్నాకా ప్రచురిస్తాము. ఇది రిలీజయే టైముకి మేము ఏ ఆఫ్రికానో, అండమానో పారిపోతామమ్మా !"
"థాంక్స్ అండి.....పోతే..."
ఎవరు పోతేనమ్మా, నేనా?
"ఇది కాస్త తినండి...”
పోవటానికేనామ్మా?
"నేనే స్వయంగా తయారు చేసిన స్వీటండి. వంటా-వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి.అతరిపండు లంబా లంబా అని దీని పేరు."
"(బొందా బొందా అనకపోయావ్). మళ్లీ తినటం ఎందుకు రిస్కు. జీవితం మీద ఆశున్నవాణ్ణి. ఇదిక్కడే పెట్టమ్మా."
"వస్తానండి.మళ్ళీ వచ్చేప్పుడు మరిన్ని కవితలూ,స్వీటు పట్టుకొస్తాను."
"...ఎప్పుడొస్తారో ముందుగా చెబితే సెలవు పెట్టుకుంటాను.."
"అబ్బే, సెలవు పెట్టుకుని మరీ వినాల్సిన అవసరం లేదండి...ఆఫీసులో వింటే చాలు...”
*** *** ***
"కాల యముడు కినుక వహించిన ఆ క్షణం తన కింకనులని పుణ్యమూర్తి ఆఫీసుకే పంపాడు పాడు యముడు."
చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి, చిత్రవధ చేసి, ఒకదానిక్రింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు.
"కవితనక పోతే ఏమంటారు?”
ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరూ ఏ పేరూ పెట్టలేదు.
"అయితే ఆ పేరూ నేనే పెడతాను... కవిత కాకపోతే తవిక."
తవికా..
"అవును. కవితను తిరగేసాను."
అద్భుతం. కవిత్వాన్నే తిరగేసిన మీకు పేర్లు తిరగేయటం ఒక లెఖ్ఖా..?
"ఇదిగోనండీ...ఇంకో తవిక..నోటికి మాట, నెత్తికి రీటా, కాలికి బాట, నాకిష్టం సపోటా..."
నీకూ నాకూ టాటా తొందరగా ఫో ఈ పూట.
"ఏమన్నారు..?"
అబ్బే ఏం లేదండీ..!!
*** *** ***
"ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏమి చెయ్యాలి?"
"రామకృష్ణా బీచ్ కెళ్ళి సముద్రంలో దూకాలి.
"ఎడిటర్ గారూ..."
"నోర్ముయ్! నెల రోజులుగా నా ప్రాణాలు పిచుమిఠాయిలా కొరుక్కు తినేసావు కదే రాక్షసీ...నీ పిచ్చిరాతలకి నా తల తిరిగిపోయి, మా ఆవిడని "సీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు" అని...మా ఆరేళ్ళ అమ్మాయిని "దీర్ఘ సుమంగళీ భవ" అనీ దీవించటం మొదలెట్టానే....
నోరెత్తావంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను....ఇవి తవికలా...పిడకలే....నీ పాడె మీద పెట్టుకునే పిడకలు.
ఇవేమిటి....ఇవి కధలా...ఆకుపచ్చని కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనుప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి...ఇవి కధలా?.....
*** *** ***
"ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చెయ్యటం. ఏం గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను? నాతో పెట్టుకోకొరేయ్... కుంతీస్ సెకెండ్ సన్స్ బూన్ (అదే..భీమవరం) లో వన్ పర్సన్ ని చావ కొట్టాను. పెట్టేయ్.. ఫోన్ కీప్ చెయ్.."
*** *** ***
ఈ డైలాగులన్నీ చదివాకా ఇదే చిత్రమో అర్ధం అయ్యే ఉంటుంది...క్లాసిక్ కామెడీ "చంటబ్బాయ్" లోని డైలాగ్స్ ఇవి.మా ఇంట్లో కేసెట్ అరిగిపోయే దాకా విని విని మాకు బట్టీ వచ్చేసిన డైలాగులివన్నీ..!!నా ఫేవరేట్ కమీడియన్ "శ్రీలక్షి"గారి "కవయిత్రి" పాత్ర ఈ చిత్ర విజయానికి బలమైన కారణం అంటే అతిశయోక్తి కాదు.
"చంటబ్బాయ్" చిత్రం గురించిన విశేషాలు:
1986లో జంధ్యాలగారి దర్శకత్వం లో వచ్చిన హాస్యచిత్రం ఈ "చంటబ్బాయ్". చిరంజీవి గారి సినీ కెరీర్ లోని ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. యాక్షన్ సినిమాలే కాదు, కామిడీని కూడా అద్భుతంగా పండించగలడు అని చిరంజీవి ఋజువు చేసారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల "చంటబ్బాయ్" ఈ సినిమా ఆధారం. ఇదే కాక బ్రిటిష్ కమిడియన్ Peter Sellers నటించిన A Shot in the Dark నుంచి ఈ సినిమా కధ తీసుకోబడిందని వినికిడి. ఏది ఏమైనా ఒక క్లాసిక్ హాస్య చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపొయిందీ సినిమా.
చిత్ర కధ:
"జేమ్స్ పాండ్" గా తనని తాను పిలుచుకునే పాండురంగారావు ఒక ప్రైవేటు డిటెక్టివ్. అతను ప్రేమించే టెలిఫోన్ డివైజ్ క్లీనరైన "జ్వాల" అనే అమాయకపు మంచి మనసున్న అమ్మాయి, ఒక హత్య కేసులో ఇరికించబడుతుంది. పాండు రంగంలోకి దిగి తాను పని చేసే డిటెక్టివ్ ఏజన్సీ బాస్ ఈ హత్య చేసినట్లు కనుక్కుని, నిరూపించి, జ్వాలను హత్య కేసు లోంచి విడిపిస్తాడు. ఇది విని జ్వాల స్నేహితురాలైన డాక్టర్ నిశ్చల, తన తండ్రికి వేరే వివాహం ద్వారా పుట్టిన తన అన్నయ్య "చంటబ్బాయ్" ను వెతికిపెట్టమని కోరుతుంది. ఆమె తండ్రి పేరుమోసిన వ్యాపారవేత్త కాబట్టి, దొరికిన "చంటబ్బాయ్" కాక మరో వ్యక్తి తానే "చంటబ్బాయ్" నని వస్తాడు. అసలు కొడుకు ఎవరన్నది సమస్యగా మారుతుంది.
ఎవరు అసలైన "చంటబ్బాయ్" అనే పరిశోధనలో, చివరిదాకా అనేక హాస్య సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. చివరికి పాండురంగారావే చంటబ్బాయ్ అని తెలుస్తుంది. చిత్రం లో చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రలు. సుహాసినికి చాలా సినిమాల్లో డబ్బింగ్ వాయిస్ అందించిన సరిత ఈ సినిమాలో కూడా చక్కని తన గాత్రంతో మెప్పిస్తారు. జగ్గయ్య, ముచ్చర్ల అరుణ, శ్రీలక్ష్మి, సుధాకర్, చంద్ర మోహన్, రావి కొండల రావు, పొట్టి ప్రసాద్ మొదలైన వారు మిగిలిన పాత్రధారులు. బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రానికి సాహిత్యం వేటూరి,సంగీతం చక్రవర్తి సమకూర్చారు. పాటలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల లు తమ గళాలనందించారు.