సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, January 8, 2010
A Patch of Blue
1961 లో ఆస్ట్రేలియన్ రైటర్ "Elizabeth Kata" రాసిన నవల "Be Ready With Bells and Drums" ఆధారంగా అమెరికన్ డైరెక్టర్ Guy Green 1965 లో తీసిన చిత్రం "A Patch of Blue". కలర్ లో తీసే అవకాశం ఉన్నా "బ్లాక్ అండ్ వైట్" లోనే ఈ సినిమా తీసాడు దర్శకుడు. నవలకు 'Writers Guild of America అవార్డు' కూడా వచ్చింది. కానీ నవల కన్నా ఎక్కువగా "సినిమా"కు బాగా ఆదరణ లభించింది. ఆఫ్రికన్-అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ జోరుగా సాగుతున్న నేపధ్యంలో "ప్రేమకు జాతి, వర్ణ భేదాలు ఉండవు" అనే సూత్రాన్ని తెలిపేలా తీసిన చిత్రం ఇది. Bahamian - American నటుడైన Sir Sidney Poitier నల్లజాతీయుడైన "Gordon" పాత్రలో నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పాలి. స్టేజ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా Sidney Poitier ఎంతో ప్రాఖ్యాతి గాంచారు. పేరు పొందిన ఆయన చిత్రాల్లో "టు సర్, విత్ లవ్" మరో ఉత్తమ చిత్రం.
టూకీగా చెప్పాలంటే ఇది "Gordon Ralfe" అనే ఒక నల్ల జాతీయునికీ, "Selina D'Arcey" అనే పధ్ధెనిమిదేళ్ళ అంధురాలైన అమెరికన్ యువతికీ మధ్య నడిచిన ప్రేమ కధ. ఐదేళ్ళ వయసులో తల్లి "Rose-Ann" వల్ల ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయిన Selina, నిర్దయురాలైన తల్లితో, తాగుబోతైన తాత "Ole' Pa" అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటుంది. స్కూల్ మొహం కూడా ఎరుగని ఒంటరి. ప్రపంచం తెలియని అమాయకురాలు. వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు క్లీన్ చేయటం, కౄరురాలైన తల్లి చేతిలో దెబ్బలు తినటం ఆమె దైనందిక చెర్యలు. "బీడ్స్" దండలుగా గుచ్చటం కొద్దిపాటి సంపాదనతో పాటూ ఆమెకున్న ఎకైక వ్యాపకం. రోజూ ఆమె వినే రేడియోనే ఆమెకు తోడు.
దగ్గరలోని పార్క్ కు రోజూ తీసుకువెళ్ళి, మళ్లీ పని నుంచి తిరిగి వచ్చేప్పుడు ఇంటికి తీసుకువెళ్ళేలా తల్లికి తెలియకుండా ఒప్పందం కుదురుతుంది Selina కు, ఆమె తాతకూ. ఇల్లు తప్ప మరో లోకం తెలీని Selina వెంఠనే ఒప్పుకుంటుంది. అక్కడ ఆమెకు Gordon పరిచయమౌతాడు. Selina - Gordon మొదట్లో పార్క్ లో కలుసుకున్న ఒకటి రెండు సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎనిమిది నిమిషాల ఈ క్రింది వీడియోలో ఆ సన్నివేశాలు చూడండి.
ఆ పరిచయం ఓ మంచి స్నేహంగా, హృద్యమైన ప్రేమగా మారుతుంది. నిరసన, చీత్కారాలు తప్ప ఆప్యాయతన్నది ఎరుగని Selina, Gordon మంచితనానికీ, అభిమానానికీ, దయార్ద్ర హృదయానికీ కదిలిపోతుంది. అతడి చుట్టూ తన ప్రపంచాన్ని,ఆశల్ని పెంచుకుంటుంది. ఆమెలోని నిర్మలత్వాన్ని, అమాయకతను, మంచితనాన్ని అతడు ప్రేమిస్తాడు. తాను నల్ల జాతీయుడినని తెలిస్తే ఆమె స్నేహాన్ని పోగొట్టుకుంటానన్న భయంతో అతను ఆ సంగతి దాస్తాడు. తన తమ్ముడు Mark కు పరిచయం చేసినప్పుడు అతడు కూడా జాతి భేదాన్ని గుర్తు చేసి వారి అనుబంధాన్ని నిరుత్సాహపరుస్తాడు. ఒకరోజు పక్కింటి స్నేహితురాలి ద్వారా Selina, Gordon ల స్నేహం గురించి తెలుసుకున్న ఆమె తల్లి వారిద్దరినీ విడదీయటానికీ తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తుంది. అవాంతరాలన్ని అధిగమించి వారిద్దరు కలుస్తారా? విడిపోతారా? అన్నది క్లైమాక్స్.
సూక్ష్మమైన భావాలను కూడా మొహంలో చూపెట్టిన Sidney Poitier నటన ఈ చిత్రానికి ప్రాణం. Jerry Goldsmith అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పియానో వాడిన విధానం ఆకట్టుకుంటుంది. Selina గా నటించిన "Elizabeth Hartman" నటన కూడా మనకు గుర్తుండిపోతుంది. నిర్దయురాలైన తల్లిగా నటించిన Shelley Winters కు ఆ సంవత్సరం "బెస్ట్ సపోర్టింగ్ ఏక్టర్" Oscar లభించింది. ఇంకా బెస్ట్ ఏక్ట్రస్, బెస్ట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మొదలైన కొన్ని కేటగిరీల్లో ఆ ఏటి అకాడమీ అవార్డ్ నోమినేషన్స్ సంపాదించుకుంది ఈ చిత్రం.
సున్నితమైన భావాలకూ, ఆర్ద్రమైన ప్రేమకూ భాష్యం చెప్పే ఈ సినిమా తప్పక చూడవలసిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం టి.వి.లో చూసిన ఈ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి.
Subscribe to:
Posts (Atom)