సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 22, 2009

సంతృప్తి


నా "మార్నింగ్ వాక్" అటకెక్కి సుమారు నాలుగైదు నెలలౌతోంది. కాని దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రోజులో ఎప్పుడో అప్పుడు వీలైనంత నడుస్తూ ఉంటాను. అది కాక మేమిద్దరం తరచూ "నైట్ వాక్స్" కు వెళుతూ ఉంటాము. మార్నింగ్ వాక్లో పొద్దున్నే తెలవారుతున్న సందడినీ, ఉదయిస్తున్న సూర్యుడినీ, ఫ్రెష్ ఏర్ నీ ఎంత ఆస్వాదిస్తామో, రాత్రిపూట సర్దుమణిగిన ట్రాఫిక్ ను, చీకటైనా ఆ నిశ్శబ్దంలోని హాయినీ, అంతే ఆస్వాదిస్తాము మేము. రోజులో జరిగిన విశేషాలో, మిగిలి ఉన్న పెండింగ్ పనుల గురించో, ఎప్పటినించో చెప్పాలనుకుని మర్చిపోయిన సంగతుల గురించో కబుర్లాడుకుంటూ నైట్ వాక్ పూర్తి చేస్తూంటాం మేము.

మొన్న అలానే వెళ్ళొస్తూంటే సందు చివర తెరిచి ఉన్న బేకరి కనిపించింది. మా పాపకు ఏమన్నా కొందామని బేకరీ లోకి వెళ్ళాం. ముందు ఒక పేస్ట్రీ అడిగి, ఆ ట్రేలో మిగిలి ఉన్నవి రెండే అని చూసి రెండూ ఇచ్చేయమని చెప్పి మేము ఇంకా ప్లమ్ కేకా, మఫెట్సా(కప్ కేక్స్) ఏది తీసుకుందాం అని మాట్లాడుకుంటున్నాం...ఇంతలో అద్దాల్లోంచి కనిపించిన రంగురంగుల పెద్ద కేక్స్ పై మా దృష్టి పడింది. గిటార్ షేప్ కేక్, ఇల్లు బొమ్మలాంటి కేక్, చుట్టూరా చెట్లు ఉండి మధ్యలో టెడ్డీ బొమ్మలున్న కేక్స్ ఇలా రకరకాలవి ఉన్నాయి...వాటిని చూస్తు ఏవో మాటాడుకుంటున్న మేము. అతను ఒక్క పేస్ట్రీనే పేక్ చేసి ఇచ్చేసరికీ "ఇదేమిటి? మేము మిగిలిన రెండూ ఇచ్చేయమన్నాం కదా" అన్నాం. "అవునా ? నేను వినలేదండీ. సోరీ" అని అతను మళ్ళీ రెండోది కూడా తీసాడు.ఈసారి మఫెట్స్ బాక్స్ కూడా కలిపి పేక్ చేయమన్నాం. అతను పేక్ చేస్తూ మాతో అన్నాడు..."నేను మీ ఇద్దరి కబుర్లు వినీ ఏవో ఊహల్లోకి వెళ్పోయానండీ...వ్యాపారస్తుడి కన్నా ముందు ఒక మనిషిని కదాండీ...అన్నాడు. మాకు అర్ధం కాలేదు...అయోమయంగా చూశాం.

అతను మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు...నేను మీ ఇద్దరి మాటలూ విని ఒక్క క్షణం అన్నీ మర్చిపోయానండీ.....అని తన కధ చెప్పటం మొదలెట్టాడు... బేకరీ అతను చెప్పిన కధ:
"నేను ఎనిమిదేళ్ళు అమెరికాలో ఉండి వచ్చాను. వ్యాపారం బాగా చేసాను. డబ్బులు సంపాదించాను. నా తండ్రి అప్పులు తీర్చాను. కుటుంబం కోసం డబ్బులు దాచాను. మధ్య మధ్య వస్తూ పోతూ ఉన్నాను. ఎన్ని చేసినా నా మనసుకు ప్రశాంతత దొరకలేదు. ఇక తల్లిదండ్రుల బలవంతం మీద ఇండియా వచ్చేసాను. ఇప్పుడు ఎనిమిదేళ్ళ తరువాత కుటుంబంతో గడుపుతూంటే తెలుస్తోంది నేను కోల్పోయిందేమిటో...! ఒకోసారి షాపు కట్టేసి వెళ్ళాకా మనసారా ఏడ్చేస్తాను. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఎందుకు బాధపడతారు? వచ్చేసారు కదా అంటుంది మా ఆవిడ. ఇప్పుడు నాకో విషయం అర్ధమైంది. మనిషి చేసే పనిలో ఎంత ప్రగతి సాధించినా, ఎంత కూడబెట్టినా ఎవరి కోసం? కుటుంబం కోసమే కదా? ఆ కుటుంబంతో గడపలేకపోతే, ఆ కుటుంబాన్ని సంతోషపెట్టలేకపోతే ఇంక ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటేనే నాకు ప్రశాంతత అని ఇప్పుడు అర్ధమైందమ్మా..." అన్నాడు ఉద్వేగంగా.

"ఇందాకా మీరిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూంటే నాకు చాలా సంతోషం వేసిందమ్మా...అలానే ఉండండి. అన్యోన్యంగా ఉండండి. ఆనందంగా ఉండండి. " అంటూ ఆశీర్వదించేసాడు. మేము మాట్లాడుకున్న మాటలు అతడిని ఎందుకు అంత ఉద్వేగానికి గురి చేసాయో అర్ధంకాలేదు కానీ అతని దీవెన నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది.ఆనందాన్ని, తెలియని సంతృప్తిని ఇచ్చింది. ఈ ఆనందానికి నేనొక్కదాన్నేనా బాధ్యురాలిని? ఎంతమాత్రం కాదు. నన్ను నన్నుగా అర్ధం చేసుకుని అడుగడుగునా నా తోడు నిలుస్తున్న మావారిది కూడాను. ఆ క్షణంలో బహుశా వెయ్యోసారి అనిపించింది....వివాహనికి, సహజీవనానికీ అభిరుచిలు కలిస్తే అదృష్టమే కానీ సంతోషంగా కలిసి బ్రతకటానికి ఇద్దరు మనుషుల మధ్యన కలవాల్సినవి అభిరుచులు కాదు ఒకరినొకరు అర్ధం చేసుకునే మనసులు అని...!!


* <-- ఇది ....కు ఓ చిన్న దిష్టి చుక్క..:)


(రెండు రోజుల క్రితం జరిగిన ఈ చిన్న సంఘటన ఈ టపా అయితే, ఇవాళ పొద్దున్నేనేను చూసిన ప్రియగారి వ్యాఖ్య నేను మళ్ళీ బ్లాగు తెరవటానికి కారణం. ప్రియగారికి ధన్యవాదాలు...)