సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, November 20, 2009
విశాలనేత్రాలు - 2
(నిన్నటి తరువాయి...)
హేమసుందరి పరిచర్యలకు, ఆమెకు తనపైగల అసూయారహిత మక్కువకు, గాధానురాగానికి రంగనాయకుడు చలించిపోతాడు. ఆమె అడుగుజాడలలో నిలబడటానికి అర్హత ఉందా అన్న సంశయానికి వస్తాడు...శ్రీరంగనాధుని కరుణవల్లనే అటువంటి "సాధ్వీమణి" తనకు లభించిందని ఎంతో ఉప్పొంగిపోతాడు. ఇక ఆలసించకుండా తన మొక్కుబడి తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. కార్తీక పూర్ణిమ నాడు అన్నివిధాలా మంచి ముహుర్తం ఉందని తెలుసుకుని ఆరోజున ఉప్పొంగిన హృదయాలతో దేవాలయానికి బయలుదేరుతారు వారిరువురూ.
కార్తీక పూర్ణిమ నాడు ప్రొద్దుటే సరిగంచు ఉత్తరీయం, కుడి ముంజేతికి శ్రీరంగం మల్లయుధ్ధ ప్రవీణులు అతడిని మెచ్చుకుని బహుకరించిన పైడి కంకణం ధరించి; పుజా ద్రవ్యాలతో, పుష్పాలతో నిండిన బంగారు పళ్ళెంలో మొక్కుబడి అయిన పైడితిలకము, సువర్ణ విలోచన యుగళి పట్టుకుని, పూజాపుష్పాలు వాడకుండా లేత లేత తాటి మొవ్వుల ఆకులతో, శ్రీచందనం చేవకామతో తయారుచేయించిన పెద్ద గొడుగు ఎడమ చేతితో పట్టుకు నడక సాగిస్తాడు రంగనాయకుడు. గొడుగు అంచులకున్న మువ్వల సవ్వడితో హేమ కాలి అందెల ఘలఘలలు కలసిపోతాయి. హేమసుందరి ఆ రోజు లేత చిలకాకుపచ్చ మధుర పట్టు చీర,ఊదా రంగు రవిక, రకరకాల ఆభరణాలు ధరించి, సుదీర్ఘమైన శ్రీచూర్ణ తిలకానికి, చిన్నరి నెలవంక ఆకారంలో కుంకుమ రేఖ దిద్దుకుని, రంగనాయకుని అడుగుజాడల్లో ముందుకు సాగుతుంది.
ఈ దృశ్యమే పుస్తకం అట్టమీద ఉన్న బాపూబొమ్మ. నవలలో ఈ రెండు పేజీలలో వారిద్దరి గూర్చీ, శ్రీరంగనాధస్వామి ఆలయం తాలూకూ వర్ణన అద్భుతం. ఇంతకు మునుపు భక్తులెవ్వరు ఇవ్వని వారి వింత కానుకలను చూసి అర్చకుడు ఆశ్చర్యపడతాడు. హేమాంబ ధనుర్ధాసులన్న కొత్త పేర్లతో ,తండ్రి గోత్రంతో తమ ఇద్దరి పేరా స్వామికి సహస్రనామ పుజ చేయిస్తాడు రంగనాయకుడు. ఆ విధంగా ఆ క్షణాన స్వామివారి సన్నిధిలో తమ వివాహకార్యక్రమం పరిసమాప్తి అయ్యిందని రంగనాయకుడు సంతోషిస్తాడు. హేమ కనుదోయి కొలతలతో చేయించిన స్వామివారి కానుకలు చక్కగా అమరినందుకు వారిద్దరు ఎంతగానో సంతోషిస్తారు. ఇంటికి వెళుతూ అపూర్వ సౌందర్యంతో చూపరుల దృష్టినిట్టే ఆకట్టుకుంటూన్న ఆమె అందం ఎండపొడికి కందుతున్నదని గ్రహించి ఆమెకు గొడుకు అడ్డుపెట్టి నడక సాగిస్తాడు. జనాలు విడ్డూరంగా చూస్తున్నారని హేమ ఎంత వారించినా సిగ్గుపడని అతని అపారమైన ప్రేమ మీద మనకు హఠాత్తుగా ఎంతో గౌరవం ఏర్పడిపోతుంది.
సరిగ్గా అప్పుడే అయిదారుగురు కాషాయాంబరధారులైన యతీశ్వరులు వారికెదురౌతారు. వారిలో ఆజానుబాహుడైన ఒక యతీశ్వరునడు నిశ్చల విశాల నేత్రాలతో, చిరునవ్వుతో రంగనాయకుని పరిశీలిస్తూ కనబడతారు. రంగనాయకుని ఆడుగులు రెండు,మూడు నిముషాలు ఆగిపోతాయి. హేమ కళ్ళ కన్నా సివిశాలమైన, ఠీవి,రాజసం నిండిన ఆ సుదీర్ఘమూర్తి గంభీరదృష్టి అతడిని ఆశ్చర్యపరుస్తుంది. తమని దాటిపోయాకా కూడా వెనుదిరిగి తనను పరిశీలిస్తున్న ఆ నిశ్చల దృషిని అతను అవగాహన చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఆయనే "శ్రీమద్రామానుజ యతీంద్రులు" అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరేసరికీ వీధి అరుగు మీద తనకోసం "శ్రీమద్రామానుజుల మఠం" నుంచి వారు తనను చూడాలంటున్నారని వచ్చిన ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి చూసి మరింత కలవరపడిపోతాడు రంగనాయకుడు. అది అనుగ్రహమా, ఆగ్రహమా అనే సందిగ్ధంలో పడతాడు. రామానుజయతీంద్రుల మఠానికి వెళ్ళాలో వద్దోనని సందేహిస్తూనే మరొక రోజు గడిపిన అతడికి మర్నాడు ఇల్లు చేరేసరికీ మళ్ళీ అరుగు మీద "దాశరధి" ఎదురౌతాడు. ఇక తప్పనిసరిగా అతనితో మఠంలోకి అడుగు పెడతాడు రంగనాయకుడు.
అనేక సందేహాలతో మఠంలోకి అడుగుపెట్టిన రంగనాయకునికి "వచ్చావా నాయనా! ఇన్నాళ్లనుంచీ నీకోసమే ఎదురు చూస్తున్నాను !" అన్న రామానుజుని ఆప్యాయమైన పలకరింపు విడ్డూరంగా తోస్తుంది. ఆ తరువాత రంగనాధస్వామికి సమర్పించిన వింత కానుకల గురించి అడిగి..."ఆ అమ్మాయి నేత్రాలంత విశాలమైనవా?" అని ప్రశ్నిస్తారు. యతీశ్వరుల ఆసక్తికి ఆశ్చర్యపడిన అతను తాను అంతటి చక్కని కన్నులజంట ఎక్కడా చూడలేదనీ..హేమ తన ఇంట కాలుపెడితే ఆమె కన్నుల కొలతలతో స్వామికి మొక్కుబడి చెల్లించుకోవాలనీ అనుకున్నట్లు చెబుతాడు. అప్పుడు రామానుజులు "ఇంతకు ముందు నువ్వు కని విని ఎరుగనంతటి పెద్ద పెద్ద కన్నులున్నవి. చూపించనా?" అని అడుగుతారు. ఈ కొంటె ప్రశ్నకు నిర్ఘాంతపోయిన రంగనాయకుడు తనకా జన్మకు ఇంకేమీ అవసరం లేదనీ, వేరొకరివైపు కన్నెత్తి చూడదలచలేదనీ చెప్తాడు.
ఎంతటి ఆత్మీయులతోనైనా ఎనాడూ ప్రసంగించని మౌనమూర్తి ఈవేళ ఒక సామాన్య మల్లునితో చిరకాల మిత్రునితో మాట్లాడినట్లు సంభాషించటం ఆశ్రమవాసులందరికీ విచిత్రమనిపిస్తుంది. తరువాత నాలుగైదు రోజులకొకసారి, ఆ పై ప్రతిరోజూ రామానుజుని సందర్శించటం మొదలుపెడతాడు రంగనాయకుడు. ఈ రాకపోకలు హేమసుందరిలో అంతులేని ఆవేదనని రేపుతాయి. అటు రంగనాయకుని ఎడల ఆచార్యునికెక్కువౌతున్న మక్కువ మఠవాసులలోనూ అలజడి రేపుతుంది.
ఈ రాకపోకలు రంగనాయకుని జీవితాన్ని ఎంత పెద్ద మలుపు తిప్పాయో....రేపు తెలుసుకుందాం...:) :)
Subscribe to:
Posts (Atom)