సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, September 4, 2009

నిశ్శబ్దంలో అంతరంగం ...

"నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ...
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్ట నడిమి పని నాటకము
ఎట్ట ఎదుట గలదీ ప్రపంచము కట్ట కటపటిదీ కైవల్యము .."


నిత్యశ్రీ గొంతులో అన్నమయ్యకృతి శ్రావ్యంగా వినిపిస్తోంది..

మొన్న పొద్దున్న మొదలు...నిన్న మద్యాహ్న్నం దాకా..
ఎంత ఉత్కంఠత..ఎంత ఆశ నిరాశల సమరం..
ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అసందిగ్ధ స్థితి..
మూడు గంటల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలదన్నే మిస్టరీ తేలక ఇరవైనాలుగు గంటలు యావత్ రాష్ట్ర ప్రజానీకం టివీలకు అతుక్కు పోయారు..
రాత్రంతా 3,4 సార్లు టివి పెడుతునే ఉన్నా నేనూ కూడా..పట్టిన కాస్తంత కలత నిద్దురా 'రోజా సైరనుతో' వదిలిపోయాకా మళ్ళీ టివి ఆన్ లోకి..
ఆశతో ఎదురుచూసిన అందరికళ్లనూ కన్నీళ్ళతో నింపి..కనపడని తీరాలకు చేరిపోయారు "వై.యస్..."
ఇది నిజమా కలా అని కళ్ళునులుముకునే లోపూ చిరునవ్వుతో నిండుగా ఉన్న ఆయన ఫోటోలు దండలతో నిండిపోయాయి..
ఇంకా ఎక్కడనుంచైనా వస్తారేమో అని మరి కాసేపు ఎదురు చూసాను..కాని శకలాల్లోంచి వెలికితీసిన దేహాలను చూసాకా నమ్మక తప్పలేదు..


నేను ఆయన అభిమానిని కాదు..
రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు..
డిగ్రీలో పొలిటికల్ సైన్స్ బుక్స్ లో తప్ప ఎన్నడూ నేను రాజకియపరమైన వార్తలు చదివిందీ లెదు..
నాకు తెలిసింది ఒక్కటే..
ఒక ముఖ్యమంత్రి ఆచూకీ 24గంటలు రాష్ట్రంలో,దేశంలో ఎవరికీ అంతుచిక్కలేదు..
ఒక భర్త,ఒక తండ్రి జాడతెలీని అజ్ఞాతంలో ఉండిపొయారు..
రారాజులా వెలిగిన ఒక పార్టీ అధినేత దయనీయమైన పరిస్థితిలో,తనకే తెలియని చివరి క్షణాల్లో ప్రాణాలు విడిచారు...
శత్రువుకైనా ఇలాంటి మరణం రాకూడదు...may his soul rest in peace...అని మనసు పదే పదే దేవుడిని ప్రార్ధించింది..


రాజివ్ గాంధీ, మాధవరావ్ సింధియా, బాలయొగి, సౌందర్య..అందరు కళ్ల ముందు మెదిలారు...
జీవితంలో అత్యున్నత శిఖరాలనధిరొహించీ ,ఎందరో జనాల కన్నీళ్లు తుడిచి,మన్ననలు పొంది...ప్రేమను సంపాదించుకున్న వాళ్లందరికీ చివరికి మిగిలిందేమిటి....
కన్నవాళ్లకూ,ప్రేమించినవాళ్లకూ,సుఖాలకు దూరంగా, ఆ..చివరి క్షణాల్లో వారెంత వేదనకు,శరీర బాధకు గురైఉంటారు...
ఆలోచిస్తే ఉహకే అందని సన్నని బాధ గుండెల్లోంచి తన్నుకు వస్తుంది...
దీనికి కారణం?కర్మ ఫలమా?దురదృష్టమా?విధి శాపమా?
దేవుడు తప్ప ఈ ప్రశ్నలకు ఎవ్వరు సమాధానం చెప్పలేరు..!!


కానీ అర్ధమైంది మాత్రం ఒకటి ఉంది..
భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని వీలైనంత సద్వినియొగం చేసుకోవాలి..
మనుషుల పట్లో,ఎదురైన పరిస్థితుల పట్లో క్రోధంతో,బాధతో,నిరాశతో వృధా చేసుకోకూడదు..
వేదికలెక్కి ఉపన్యాసాలివ్వకపోయినా,
రచనావ్యాసంగాలు చెసి జనాల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు చెయ్యకపోయినా,
వేరేమీ చెయ్యకపొయినా.....
ఎదుటి మనిషిని బాధ పెట్టే పనులు ప్రయత్నపూర్వకంగా చెయ్యకపోవటమే,ధర్మంగా నిలవటమే నా కర్తవ్యం అని నాకనిపించింది...
భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి..
I have to live everyday to the fullest as there is no tomorrow.. ..
ఇదే నా పుట్టినరోజు రిజొల్యుషన్ అనుకున్నాను..
...అరె నా పుట్టినరొజు వచ్చేసింది..నాకెంతో ఇష్టమైన రోజు..సంవత్సరమంతా నేను ఎదురు చూసే రోజు..!!

(ఘోరమైన వైరస్ వచ్చి 2,3రోజులుగా నిద్రోయిన నా కంప్యూటర్ ఈ సమయానికి బాగుపడటం కేవలం యాదృచ్చికం...నిన్న పొద్దున్నుంచీ రాయాలని కొట్టుకుపోతూంటే ఇప్పటికి కుదరటం...ఈ నిశ్శబ్ద సమయంలో ఓసారిలా ఆత్మావలోకనం చేసుకుందుకేనేమో...!)