సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, July 4, 2009

పాపిడీ!

మా అమ్మగారి పుట్టిల్లు రాజమండ్రీ..తాతయ్య మా చిన్నప్పుడే కాలం చేసారు.ఆయనకు 8మంది సంతానం.22మంది మనుమలం మేము.ప్రతి సంవత్సరం ఆయన ఆబ్దీకానికి తప్పనిసరిగా అందరం కలుసుకుంటూ ఉండేవాళ్ళం.ఆ వంకతో అయినా పిల్లలందరూ ఒకసారి మళ్ళీ సరదాగా కలుస్తారని మా పెద్దలందరూ మమ్మలను రాజమండ్రీ తీసుకెళ్ళేవారు.కనీసం 16మంది మనుమలమయినా తప్పకుండా జమయ్యేవాళ్ళాం.అందరి ఆటలు,అరుపులు,చంటిపిల్లల కేరింతలతో ఇల్లు మారుమోగుతూ ఉండేది.మా అందరినీ చూసి మా అమ్మమ్మ సంబరపడుతూ ఉండేది.మా ఆఖరు పిన్ని వచ్చేప్పుడు మా అందరు ఆడపిల్లలకి రిబ్బన్లు,రబ్బర్ బాండ్స్,అవి ఇవి తెచ్చి ఇస్తూ ఉండేది.అయితే మా అందరికీ అక్కడా ఇష్టమైనది ఇంకొకటి ఉండేది.మధ్యాహ్నం అయ్యేసరికి టంగ్,టంగ్ అని గంట కొట్టుకుంటూ వచ్చే "పాపిడీ బండి వాడు"!
అక్కడ ఉన్నన్ని రొజులూ మా పిన్ని మా అందరికీ రొజూ పాపిడీ కొనిపెట్టేది.మధ్యహ్న్నం అయ్యేసరికి అందరం అరుగుమీదకి చేరి ఎప్పుడు పాపిడీ బండివాడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళం.అంత ఇష్టం మాకందరికీ పాపిడీ అంటే.ఇంక కాలేజీల్లోకి వచ్చాకా నెమ్మదిగా కలవటాలు తక్కువైపోయి 2,3ఏళ్ళకి ఒక సారి మాత్రమే వెళ్ళేవాళ్ళం.ఇప్పుడు అదీ లేదు..కుదిరినఫ్ఫుడు ఎవరి ఊరన్న వెళ్ళాటం తప్ప!!
పెళ్ళయ్యాక ఒకరొజు మా వీధిలో 'పాపిడీ' అన్న అరుపు విని నేను చాలా సరదా పడ్డాను.నాకు చాల ఇష్టం అన్నానని పాపం మా మరిది 'నేను తెస్తాను ఉండు వదినా' అని వీధిలోకి వెళ్ళి 5నిమిషాల తరువాత ఒక ఆకు దొన్నెలో చెక్కప్పచ్చుల లాటిదాని మీద పెరుగు,ఇంకా ఏదొ చట్నీ ఉన్న ఒక పదార్ధం తెచ్చాడు.ఇదేమిటి?అన్నను.ఇదే పాపిడీ! అన్నడు.(అది పాపిడీ చాట్ అని నాకు తరువాత తెలిసింది) నేను అన్న పాపిడీ ఇది కాదు వేరెది అని..పాపిడీ ని వర్ణించటానికి ప్రయత్నించాను.ఆఖరుకి మా అత్తగారు,మరిది 'ఒహో పాపిడీ అంటే పీచుమిఠాయా?" అన్నారు.'అబ్బే పీచుమిఠాయి అంటే ఎక్ష్జిబిషన్లో అమ్ముతారు,పెద్ద పుల్లకి గులాబీ రంగులో చుట్టబడిన వేరే పదార్ధం ' అన్నాను.అదేమిటి వీళ్లకి పాపిడీ కూడా తెలేదా?అని ఆశ్చర్యపోయాను.తరువాత మాటల్లో తెలిసింది వాళ్ళు పాపిడీ ని "పీచుమిఠాయి" అనే పిలుస్తారని;అక్కడి వాళ్ళకి 'పాపిడీ' అంటే "పాపిడీ చట్" అని, "సోన్ పాపిడీ" అంటేనే నాకు తెలిసిన "పాపిడీ" అని !!
ఇప్పటికీ ఎక్కడైనా పాపిడీ కనిపిస్తే వెంటనే కొనేస్తూ ఉంటాను!