సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 4, 2010

పందార...పందార...


బాసుందీ, జీడిపప్పు పాకం, పూతరేకులు, గవ్వలు, బొబ్బట్లు, కాకినాడ కాజాలు,గులాబ్ జాం, మడత కాజాలూ, కజ్జికాయలు, పంచదార పూరీలు, పేటా(బుడిది గుమ్మడితో చేసే స్వీట్), బొంబే హల్వా, సేమ్యా హల్వా, చక్రపొంగలి.....ముఖ్యంగా ఇవి...ఇంకా కొన్ని...ఇవన్నీ ఏమిటి? అంటే నాకిష్టమైన తీపి పదార్ధాలు ! ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు "తియ్యగా" ఉంటే చాలు ఏవన్నా నోట్లోకి వెళ్పోయేవి ఒకప్పుడు...!

మేం అన్నిరకాలూ తినాలని మా అమ్మ అన్నింటిలో "పందార"(పంచదార కి కొల్లోక్వియల్ పదమన్నమాట) వేయటం మొదలెట్టింది. టమాటా, బీరకాయ, ఆనపకాయ, మొదలైన కూరల్లో, వాటి పచ్చళ్ళలో, ఆఖరుకి కొబ్బరి పచ్చడిలో కూడా పందారే..! ఉప్మా తింటే పైన పంచదార చల్లుకుని, పూరీలు తింటే, ఆఖరులో ఒక పూరీ పందార వేసుకుని తినకపోతే పూరీ తిన్న తృప్తే ఉండేది కాదు. చారులో, పులుసుల్లో కూడా పందారే. ఈ పదార్ధాలన్నీ పందార లేకుండా కూడా వండుకుంటారని అసలు తెలియనే తెలియదు. కాఫీలో,టీ లో కూడా మన పాళ్ళు ఎక్కువే. అలా పందార మా జీవితాల్లో ఒక భాగమైపోయింది.

కేనింగ్ సెంటర్(పదార్ధాలు మనం తీసుకువెళ్తే, జామ్లు అవీ మనతో చేయించే సెంటర్) కు వెళ్ళి మా కోసం పెద్ద హార్లిక్స్ సీసాడు(నే చాలా ఏళ్ళు తాగిన హెల్త్ డ్రింక్) మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఆపిల్ జామ్, ఇంకా రెమ్డు మూడు రకాల జూస్ లూ చేసి పట్టుకు వచ్చేది అమ్మ. ఇంక మజ్జిగలోకి,ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నింటిలోకీ జామే..! సీసా అయిపోయేదాకా నేనూ, మా తమ్ముడూ పోటీలుపడి తినేసేవాళ్ళం. శెలవులకు మా తమ్ముడు వస్తే వాడున్న వారం,పది రోజులూ రొజుకో రకం స్వీట్ చేసేసేదాన్ని.నా పెళ్ళయాకా అల్లుడికి లడ్డూలూ, సున్నుండలూ ఇష్టం అని తెలిసి మా అమ్మ తిరుపతి లడ్డు సైజులో మిఠాయీ, సున్నుండలు చేయించింది సారెలోకి. నా సీమంతానికి పన్నెండు రకాల స్వీట్లు తెచ్చింది మా అమ్మ.

ఆ విధంగా పందార తిని, తినీ పెరిగిన నేను అత్తారింట్లో వంటల స్పెషలిస్ట్ ననే ధీమాతో, అన్ని పనులు బాగా చేసేసి అందరి మన్ననలు పొందెయ్యాలనే "అజ్ఞానం"లో మొదటిసారి వంట చేసాను. అందరూ బావుందంటారనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చూస్తున్నా...."ఈ కూరలో ఎన్ని పచ్చిమెరపకాయలు వేసావమ్మా?" అనడిగారు మామగారు."ఈ పచ్చడేమిటి తియ్యగా ఉంది?" అనడిగారు శ్రీవారు. "ఇది చారా పానకమా?" అనడిగాడు మరిది. "మేము చారులో,పచ్చడిలో పంచదార వేసుకుంటాము" అన్నాను ఎర్రబడిన మొహంతో..! ఆ మర్నాడు మా అత్తగారు దగ్గరుండి కూరలో ఐదారు పచ్చిమెరపకాయలూ, తీపి లేని చారు, పందార లేని పచ్చడి చేయించారు. నాకు విడిగా కాస్త కారం తక్కువగా కూర, పందార వేసిన పచ్చడి చేసుకున్నా...!ఆ తర్వాత కొన్నాళ్ళు అలా విడిగా తీసుకున్నాకా విసుగొచ్చి మానేసి, నేనూ "వాళ్ళ మెనూ"లో జాయినయిపోయా. నేను తీపి వేసుకోవటం మానేసాను. కాలక్రమంలో వాళ్ళూ కారం కాస్త తగ్గించారు. ఇప్పుడిక ఇంటికి వెళ్తే తియ్యకూరలు వండకు అని నేనే చెప్తాను అమ్మకి. "పెళ్ళయాకా ఇది మారిపోయింది" అంటారు అమ్మావాళ్ళిప్పుడు.

చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూలు,కాలేజీ ఎగ్గొడదామంటే "జ్వరమన్నా రాదేమమ్మా...." అంటే అమ్మ తిట్టేది. అటువంటి రాయిలాంటి ఆరోగ్యం కాస్తా ఒక్క డెలివెరీ తో చిందర వందర అయిపోయింది. సిరియస్ వి కాకపోయినా ఏవేవో రకరకాల సమస్యలు. ఇక స్వీట్లు, ఫాటీ పదార్ధాలూ తినకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడో సుగరు,బి.పీలూ వచ్చాకా మానేయటం కన్నా ముందుగానే మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం శ్రేయస్కరం అనిపించింది. పైగా ఇప్పుటినుంచీ మానేయటం వల్ల ముందు ముందు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా, రక్తంలో కొవ్వు శాతం "మితంగా" ఉంటే ఆయా ఆరోగ్య సమస్యల వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా వరకూ తగ్గుతాయి అని నేను చేసిన నెట్ సర్వేతో నాకర్ధమైన విషయం. ఐదేళ్ళ నుంచీ టీ లో "పందార" కూడా వేసుకోవటం మానేసాను. ఏస్పర్టీమ్, సర్కోజ్ వంటి "ఆర్టిఫీషియల్ స్వీట్నర్లు" కాక ఒక "నేచురల్ స్వీట్నర్" గురించి తెలుసుకుని అది వాడటం మొదలెట్టాను. దాని గురించి తదుపరి టపాలో...

"ఏది జరిగినా మన మంచికే" అని నమ్మే మనిషిని నేను. తలెత్తిన ఆరోగ్య సమస్యలు "తీపి" మీద నాకున్న మోహాన్ని వదలగొట్టాయి. ఇప్పుడు ఐస్ క్రీం చూసినా, ఏదన్నా స్విట్ చూసినా తినాలనే ఏవ పూర్తిగా పోయింది. పెళ్ళిలలో, పండుగల్లో తప్ప "పందార" "స్విట్"ల జోలికే పోను.చేసి అందరికీ పెడతాను కానీ నేను మాత్రం తినను."దంపుడుబియ్యం" మంచిదని తెలుసుకుని అది కూడా తినటం మొదలుపెట్టాము ఇంట్లో."ఆరోగ్యమే మహాభాగ్యం" అనేసుకుని, ఇలా రకరకాల కారణాలతో నాకు చాలా ఇష్టమైన వాటి పట్ల నాకున్న మోహాన్ని పోగొడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.