అమ్మాయికి స్వయంగా చదువుకునే వయసు వచ్చాకా, బెడ్ టైం కథలు చెప్పటం మానేసి ఓ పుస్తకం ఇచ్చి నువ్వే కథ చదువుకో అని పుస్తకాలు అలవాటు చేసాను దానికి చిన్నప్పుడు. అలా అలవాటైన పుస్తక పఠనం ఇప్పుడు చదువు రీత్యా కాస్త తగ్గినా కూడా, ఇంకా కొనసాగటం ఆనందకరమే నాకు. ఈసారి తను కొన్న వాటిల్లో కాస్త భారీ పుస్తకం Yuval Noah Harari గారి Sapiens: A Brief History of Humankind.
ఇంకోటి నామరామాయణం లోని ప్రతి నామానికి వర్ణన ఉన్న ఒక పుస్తకం కొంది. కానీ బిల్లు చూసి ఇంటాయన కాస్త ఖంగుతిన్నమాట వాస్తవం :) పెద్ద ఏరు ఎలా పోతే... అన్న సామెత గుర్తుచేసుకున్నారు పాపం. నా బిల్లు ఇక తగ్గిపోయిందని వారు సంతోషించేలోపూ పిల్ల ఏరు తయారైంది. మరి ఏమాట కామాటే, ఉపయోగకరమైన విషయ పుస్తకాలే కొంటుందని నేనూ కాదనను.
ఇక నేను పుస్తక ప్రదర్శనలో గమనించినదేమిటంటే, ఈసారి చాలా కొత్త పుస్తకాలు పబ్లిష్ అయినట్లు కనిపించాయి. పాఠకులు కూడా ఎక్కువగానే కనిపించడం సంతోషకరమైన సంగతి. నూకల చిన్న సత్యనారాయణగారి "వాగ్గేయకారుల కృతిసాగరం" రెండు భాగాలు ఒక స్టాల్ లో దొరికాయి. కొద్దిగా డేమేజీ ఉంది వేరే పుస్తకాలు ఇమ్మని అడిగాను కానీ అసలు ఇంక ఎక్కడా కాపీలు లేవు.. ఇవే అఖరు కాపీలు అన్నారు. వెంటనే మారుమాటాడకుండా రెండు భాగాలు కొనేసాను. అందులో త్యాగరాజు తో సహా వివిధ వాగ్గేయకారుల కృతులన్నీ పొందుపరుచారు. చాలాసార్లు కొన్ని కృతులు వింటున్నప్పుడు సాహిత్యం కోసం నెట్ లో చాలా వెతుక్కోవలసి వస్తోంది. కాబట్టి అన్నీ ఒకేచోట ఉన్న ఇటువంటి అరుదైన పుస్తకాలు లభించడం అదృష్టంగా భావించాను.
ఈసారి యూనివర్సల్ పబ్లిషింగ్ వారి వద్ద మూడు పుస్తకాలు కొన్నాము. భారతదేశంలోని వివిధ ఆలయాల గురించిన వివరాలతో, శిలాశాసనాలు, విగ్రహాల రంగురంగుల ఫోటోలతో ఉన్న ఆ పుస్తకాలు నిజంగా కొనదగ్గవి. మేము కాశీ, అరుణాచలం, శ్రీశైలం ముడు ఆలయాల పుస్తకాలు కొన్నాము. నలభై శాతం డిస్కౌంట్ కూడా లభించింది మాకు. దానితో పాటే మల్లెపూల మీద రాసిన పుస్తకం ఒకటి కాంప్లిమెంటరీ అని ఇచ్చారు స్టాల్ యజమాని. వివిధ రకాల మల్లెపులతో, మల్లె దండల ఫోటోలతో ఉన్న ఆ పుస్తకం బహు అందంగా ఉంది.
మేము కొన్న మరో రెండు పుస్తకాలు - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి కథలు గాథలు 1& 2 భాగాలు. చదవదగ్గ, కొనుక్కోవలసిన పుస్తకాలు ఇవి. ముఖ్యంగా భావితరాలకు మన గత వైభవాన్ని కళ్ళకు కట్టేవి ఇలాంటి పుస్తకాలే.
భైరప్ప గారి "పర్వ" తెలుగు అనువాదం క్రితం సారే చూశాను కానీ ఇక మామూలు పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిపోవడం వల్ల కొనలేదు. కానీ కవర్ పేజిలో భైరప్ప గారి పేరు "బైరప్ప" అని వేశారు. మరి ప్రూఫ్ చూసినవాళ్ళు అది గమనించలేదో ఏమో తెలీదు. ఇటువంటి అచ్చుతప్పులు, అదీ కవర్ పేజీ మీద వెయ్యడం ఆశ్చర్యకరం. లోపలి పేజోలో మళ్ళీ సమంగానే "భైరప్ప" అని వేశారు.
ఇవీ క్లుప్తంగా ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు.






