సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 17, 2025

OTT Entertainment - 3 : 8 వసంతాలు

                                                    


నాలుగైదు సినిమాలు కలిపి ఒక టపా రాద్దామనుకుంటాను. ఈలోపూ మొత్తమంతా ఒకే సినిమా గురించి చెప్పాలనిపించేలాంటి సినిమా ఒకటి వస్తోంది. ఇది అలాంటి ప్రత్యేకమైన సినిమా! ఇంతకు ముందు ఏమి సినిమాలు తీశారో తెలీదు కానీ ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు ఫణింద్ర నర్సెట్టి గారికి అభినందనలు. ఇటువంటి మంచి తెలుగు సినిమాలు ఇంకా ఇంకా రావాలని మనస్ఫర్తిగా కోరుకుంటున్నాను. 


పదేళ్ళక్రితం నిత్య బంగారం నటించిన "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అని ఒక సినిమా వచ్చింది. యువతి యువకుల మధ్య ప్రేమ ఇలా ఉండాలి అనే ఒక గొప్ప నిర్వచనాన్ని చూపెట్టిందా కథ. మళ్ళీ ఇన్నేళ్లకు అటువంటి మరో గొప్ప నిర్వచనాన్ని ప్రేమకు ఆపాదించిన కథ ఈ ఎనిమిది వసంతాలు. ఒక ఆంగ్ల పత్రిక వారు ఎందుకనో మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోయారు కానీ నాకయితే ఏ వంకా కనిపించలేదు. హీరోయిన్ తల్లి చెప్పినట్లు ఈ "..కథలో రెక్కల గుర్రాల్లేవు, రాక్షసులతో యుధ్ధాల్లేవు, ఐనా ఇది చందమామ కథకు ఏ మాత్రం తీసిపోని కథ. మనిషి మీద, ప్రేమ మీద గౌరవాన్ని పెంచే కథ".


ఆ రోజు రిలీజయిన ఇంకేదో సినిమా కోసం ఓటీటీలో వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది. ట్రైలర్ ఆ మధ్యన చూశాను. ఆసక్తికరంగా ఉంది. సరే ఇది చూసేద్దాం అని మొదలుపెట్టాము. చివరి దాకా కదిలితే ఒట్టు. ఆ అమ్మాయి..అదే హీరోయిన్ పిల్లని ఇదివరకూ MAD సినిమాలో చూశాం. ఈ సినిమాలో ఇంకా బాగుంది. ముఖ్యంగా ఆ పాత్రను మలిచిన తీరు అద్భుతం. సావిత్రి పాత్ర కోసమే కీర్తి సురేష్ పుట్టిందనుకున్నాం మహానటి చూశాకా. అలా ఈ పాత్ర కోసమే ఈ పిల్ల పుట్టిందేమో అన్నట్లుంది. జీవితంలో evolutionతో ఎదిగే పాత్ర కాదు. మొదటి నుంచీ ఒకటే రకం. గొప్ప విలువలు ఉన్న గట్టి పిల్ల. మంచి పిల్ల. అందమైన పిల్ల. బహుశా ఈ పాత్ర దర్శకుడి dream girl అయ్యింటుంది. నాకయితే ఈ పిల్ల చాలా చాలా నచ్చేసింది. Pure Gold. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో తొంభై ఐదు శాతం హీరోయిన్లకి పాపం వంటి నిండా వేసుకోవడానికి బట్టలు ఉండవు. నోటి నిండా మాట్లాడడానికి రెండు లైన్ల డైలాగులు ఉండవు. గుర్తుంచుకోవడానికి సమమైన పాత్ర ఉండదు. వేస్తే నాలుగు డాన్సులు ఉంటాయి లేదా జీవితంలో మరో ధ్యేయం లేనట్లు హీరో చూట్టూరా తిరగడాలు ఉంటాయి. రుద్రవీణలో డైలాగ్ లాగ అంత చక్కని రూపేంటీ? ఆ పాత్రేంటి? అని వాపోయే స్టేజ్ మన తెలుగు హీరోయిన్ ది.(మిగతా భాషల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కానీ ప్రస్తుతానికి తెలుగు సినిమా గురించే మాట్లాడుకుందాం). అటువంటి poor state నుంచి ఇంతటి elivated state లో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రని చూస్తే నిజంగా కడుపు నిండిపోయింది. "ప్రేమ" అంటే అబ్బాయి లేదా అమ్మాయి ఒకరి కోసం ఒకరి జీవితాలను ఒకరు పాడు చేసుకోవడం, చంపుకోవడాలు, హత్యలు, గొడవలు, మొదలైన చెత్త కాకుండా "ప్రేమించడం" అంటే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవడం కూడా అనే గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు నాకు ఈ సినిమా నచ్చింది. ఈమధ్య ఇలాంటి బరువైన కంటెంట్ ఉన్న కొన్ని మంచి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫార్మ్ లో చూశాము. అసలు ఓటీటీ వల్లనే ఇంకా down to earth సినిమాలు, మంచి సినిమాలు, కుటుంబ సమేతంగా కూర్చుని చూసే సినిమాలు వస్తున్నాయేమో అనడం అతిశయోక్తి కాదేమో.


సినిమాలో అందరూ బాగా చేశారు కానీ ఆ రెండవ హీరో హెయిర్ స్టైల్ బాలేదు. ఏమిటో విగ్గు పెట్టినట్లు.. నచ్చలేదు. బహుశా డీ గ్లామరైజ్డ్ గా చూపించాలనేమో మరి. ఇంకా చాలా రాయాలని ఉంది కానీ ఏమీ రాయాలని కూడా లేదు.  సినిమా చూసి రేపటికి వారమేమో. అయినా ఆ అమ్మాయి వాయిస్, ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి - 


"నిజానికి ఎవ్వరి వల్లా ఎవ్వరూ ఏమీ అయిపోరు. ఏదో దాస్తూ, బయటకు నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి, చెడ్డోళ్లని చేసేసి, వదిలించేసుకుంటారు". 

"my mom raised me like a Queen and a Queen even at a funeral mourns with dignity. కన్నీళ్ళలో కూడా తన హుందాతనాన్ని కోల్పోదు"
ఈ సీన్ దగ్గర కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా రాలాయి!!


"ఎవరు తుఫాన్లు వాళ్లకుంటాయి. కొందరు బయటపడతారు. ఇంకొందరు ఎప్పటికీ బయటపడరు"


"పుస్తకం పూర్తిచేసే పాఠకుడి గుండెల్లో గుప్పెడు ఆశను నింపకపోతే మన చేతిలో అక్షరం ఉండీ ఎందుకండీ?"


చివరిగా సర్కులేట్ అవుతున్న, నాకు బాగా నచ్చిన రెండు వీడియో బిట్స్ పెడుతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారు నెట్ఫ్లిక్స్ లో ఎనిమిది వసంతాలు సినిమా (ఇంకా చూడకపోయి ఉంటే) తప్పకుండా చూడండి.



 


ఎంతో అందమైన ఫోటోగ్రఫీ కూడా ఉన్న ఈ చిత్రం నిజంగా ఒక దృశ్యకావ్యమే!