సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 29, 2024

OTT Entertainment : 2


కొన్నేళ్ల క్రితం మనందరమూ ఇళ్ళల్లో బందీలమైన pandemic కాలంలో ఈ ఓటిటి వినోదం చాలామందిని తన దాసులుగా చేసేసుకుంది. ఒక సినిమాకి వెళ్తే ఐదువందల నుంచీ వెయ్యి రూపాయిల దాకా అవలీలగా ఖర్చవుతున్న కాలంలో ఇంట్లో కూర్చోపెట్టి, మూడు వెబ్ సిరీస్ లు, ఆరు సినిమాలు కాదు ముఫ్ఫై వెబ్ సిరీస్ లు , ఆరువందల సినిమాలు చందాన వినోదాన్ని చూపెడుతుంటే నాబోటి మధ్య తరగతి ప్రేక్షకులు ఎక్కడ వద్దనగలరు? వద్దంటే సినిమాలు...సినిమాలు.. సినిమాలు!! బోర్ కొట్టినప్పుడో, బయటకు వెళ్ళలేకపోయినప్పుడో, ప్రపంచాన్ని మర్చిపోవాలనుకున్నప్పుడో.. ఈ ఓటిటి ప్రపంచం రెండు చేతులు చాచి మనల్ని తన కౌగిట్లోకి తీసుకుని ఎవరి అభిరుచికి తగ్గ సినిమాలు వారికి చూపించి ఆహ్లాదపరుస్తోంది. నేను కూడా నే చూసిన కొన్ని సినిమాల గురించి సిరీస్ రాద్దామని 2021లో ఒక సిరీస్ మొదలుపెట్టాను కానీ రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకూ మళ్ళీ రాయలేకపోయాను. ఇటీవలే ఓటిటిలో చూసిన ఒక చిత్రవిచిత్రమైన సినిమా గురించి రాయడానికి ఇవాళ్టికి కుదిరింది ! 


గత వారంలో అనుకుంటా ఒకానొక ఉదయాన 339వ సారి "సాగరసంగమం" అనే చిత్రరాజాన్ని పెట్టి, సగం అయ్యాకా ఆఫీసుకి వెళ్పోయారు ఇంటాయన. సరే మరింక మొదలుపెట్టాకా కట్టేయలేము గనుక చివరిదాకా చూసేసి, పక్కనే ఉన్న తువ్వాలుతో కళ్ళు తుడిచేసుకుని...వాటే మూవీ, వాటే డైరెక్టర్, వాటే స్టోరీ..అనేసుకుని, ఇంటి పనుల్లో పడిపోయాను. మధ్యాహ్నం మరోసారి టీవీ తిప్పుతూంటే ఒకానొక సినిమా కనబడింది. అంతకు ముందు నాలుగైదు సినిమాల్లో నటించినా గుర్తింపు పెద్దగా రాలేదు కానీ ఒక బ్లాక్బస్టర్ మూవీలో అమితంగా అందంగా కనిపించడం వల్ల అచానక్ సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ఒక అమ్మడు నటించిన సిన్మా! ఇంతకాలం ఒక హీరో ఇద్దరు లేక ముగ్గురు వీరోవిన్లను చూడడానికి అలవాటు పడ్డ కళ్ళకి ఒక వీరోవిన్, ఇద్దరు హీరోలు కనబడేసరికీ వింతగా ఉంది చూద్దాం అని మొదలుపెట్టాను. 


సినిమా గడుస్తున్న కొద్దీ దేదో సినిమాలో అల్లు అర్జున్ లా "దేవుడా..," అని కొన్నిసార్లు రిపీటేడ్ గా అనుకోవాల్సి వచ్చింది!!!! పొద్దున్న నేను చూసిన సినిమా ఏమిటీ...ఆ కథ ఏమిటీ...భారతీయ సనాతన సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన ఆ విలువలు ఏమిటీ...ఇప్పుడు నేను చూస్తున్న ఈ కథ ఏమిటి? దేవుడా! కలికాలం బాబూ కలికాలం అంటే ఇదే అనిపించింది. కథ కొంచెమైనా చెప్పకపోతే ఈ ఘోషకి అర్థం ఉండదు మరి. 


ఒకానొక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడి, వెంట పడి, ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు. కెరీర్ పరంగా ఆమెకు ఒక కల ఉంటుంది. దానికి సహాయపడతానన్న భర్తగారు పెళ్లవ్వగానే అదంతా మర్చిపోయి, తనను ఒక మామూలు హౌస్ వైఫ్ గా మాత్రమే చూడడం  అమ్మాయికి నచ్చదు. ఒక రెండు, మూడు దెబ్బలాటల తర్వాత కట్టీఫ్ అనేసుకుని ఇద్దరూ విడిపోతారు! విడాకుల కాగితాలు కూడా ఇచ్చిపుచ్చేసుకుంటారు. అమ్మాయి వేరే ఊరుకి వెళ్పోతుంది. ఇక్కడి దాకా బానే ఉంది. ఇప్పుడు ఆ కొత్త ఊరిలో ఆమె పని చేసే చోట మరో అబ్బాయి పరిచయమవుతాడు. ఒకానొక రోజున అమ్మాయికి కొంచెం మందు ఎక్కువవుతుంది. మీరు చదివినది నిజమే. గతంలో సినిమా కథల్లో అబ్బాయికి మందు ఎక్కువ అయ్యి పిచ్చి పిచ్చి పనులు చేసినట్లు చూపెట్టేవారు. వెనుకటి కాలపు నలుపు తెలుపు సినిమాల్లో కథానాయకులు తండ్రుల ముందర సిగ్రెట్లు వంటివి కాల్చేవారు కాదు. వాళ్లని చూసి పారేసినట్లు చూపెట్టేవారు. మా కాలంలో సినిమాల్లో తండ్రులు, పిల్లలని పక్కన కూర్చోపెట్టుకుని గ్లాసులు అందిస్తూ ఉండడమే చూశాము. ఇప్పుడు కాలం మారింది. ఇక అమ్మాయిలు సైతం - సిగరెట్లు మాత్రమే కాక పబ్బుల్లో గ్లాసులు, ఏకంగా సీసాలు కూడా ఖాళీ చెయ్యడం వినోదంగా చూపిస్తున్నారు చాలా సినిమాల్లో. అదేమిటంటే ఈట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మోడ్రన్ లైఫ్ స్టైల్ అనేస్తున్నారు ఈజీగా! స్వేచ్ఛ పేరుతో మహిళలకు మంచికన్నా చెడే ఎక్కువగా ఎదురౌతున్న కాలం అని ఎవరూ గమనించట్లేదో ఏమో తెలీదు మరి :( నవతరం సినిమాల్లో మహిళలు నిండుగా బట్టలు వేసుకోవడం అనే కాన్సెప్ట్ నే మర్చిపోయారు. పైగా సినిమాల్లో చూసి బయట కూడా అలాంటి దుస్తులే ధరిస్తున్నారు. అదే కల్చర్ ని ఫాలో అవుతున్నారు చాలామంది విద్యార్థినులు. వెరీ పిటీఫుల్!


 సరే ఇంతకీ ఈ చిత్రరాజం తాలుకు కథలోకి వచ్చేస్తే, కాస్త మందు ఎక్కువైన సదరు అందమైన వీరోవిను కొత్త వర్క్ ప్లేస్ లో స్నేహితుడైన అబ్బాయితో నైట్ స్టాండ్ చేస్తుంది. ఇదేమి కథరా అనుకునేలోగా కాసేపట్లో అక్కడికి "ఐ కాన్ట్ ఫర్గెట్ యూ" అనుకుంటూ విడాకులు ఇచ్చేసిన మొదటి భర్తగారు వస్తారు. ఆ తర్వాత జరిగిన కథను ఇక ఇక్కడ రాయలేను. "heteropaternal superfecundation" అనే ఒక అరుదైన, వింత  కాంప్లికేషన్ ని వీరోవిన్ ప్రెగ్నెన్సీకి తగిలిస్తారు. సిన్మా చివరికి మాత్రం భార్యాభర్తల్ని కలిపేసి కథ సుఖాంతం చేసేసారు. అసలు ఇలాంటి కథ రాసి "సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు బాబూ?" అని సదరు కథా రచయితని అడగాలని అనిపించింది.


వీరోవిన్ కి పెళ్ళి అయ్యిందని తెలియగానే తన ప్రేమని పాతాళానికి తొక్కిపెట్టేసి, భార్యా భర్తల్ని కలిపేసి, జీవితాంతం వాళ్లకి గుళ్ళో పూజలు చేయించే హీరో ఉన్న పొద్దుటి సినిమా కథకి, ఈ మధ్యాహ్నం చూసిన చిత్ర విచిత్రపు సినిమా కథకీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా! అంత నచ్చకపోతే చూడడం మానేయచ్చు కానీ అసలీ కథకు ముగింపు ఏమి ఇచ్చాడా అని చివరివరకూ చూసాను. కాకపోతే రిమోటు నా చేతిలో ఉంది కాబట్టి కాస్త ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తూ, చివరిగా మరోసారి ..  దేవుడా అనుకుని టివీ కట్టేసాను.


ఈ సిన్మాలో ఒక పాట మాత్రం బాగా హిట్ అయ్యింది. మూడు,నాలుగేళ్ళ బుడతలు కూడా ఆ డాన్స్ స్టెప్స్ వేసేసి రీల్స్ చేయడం చూసాను కానీ అది ఈ సినిమాలోదని చూసినప్పుడు తెలిసింది. 


Saturday, October 26, 2024

లేనేలేదు మన్నింపు !

 

ప్రారబ్ధమో, కర్మో, నిష్కపటమో, తెలియనితనమో.. 

దుస్సంగతో, దురాగతమో, పొరపాటో, వెన్నుపోటో.. 

కారణమేదైనా, పెట్టే పేరులో ఏముంది గానీ.. 

నష్టమెంతో కష్టమైంది, లోతెరగని గాయమైంది!


నేరం ఒప్పకపోయినా, కన్నీరు ఇంకిపోయినా,

మౌనమే ఆయుధమై పోరాటం ఒంటరిదయినా,

వెలుగు మరుగై వెతలు మిగిలినా,

నిక్కమెన్నటికైనా ఉదయించేనా?


ఇక పయనమాగినా, శ్వాస ఆగినా,

తీర్పు ఎవరిపరమైనా, తోడెవరూ నిలవకున్నా,

ఏ జ్ఞానమెంతపెరిగినా.. లేనేలేదు మన్నింపు !

మనమున లేనేలేదు మన్నింపు!!