"This is Raagam 24x7 DTH - Indian Classical Music Channel" అంటూ పలుమార్లు వినబడే ప్రకటనతో సాగే ఒక రేడియో ఛానల్ "రాగం". 2016, జనవరి26న మొదలైంది ఈ ఛానల్. ఇది ఒక 'AIR Mobile App'. Android, iOS , ఇంకా Windows లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఛానల్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఇరవై నాలుగు గంటలూ కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే వస్తుంది. సంగీతప్రియులకు ఇది ఒక మ్యూజికల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలతో పాటూ వాద్య సంగీతం కూడా ఇందులో ప్రసారమవుతుంది.

వీణ కచేరీ వింటుంటే ఏదో గంధర్వ లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. సంతూర్ వాదన వింటూంటే వర్షంలో తడుస్తున్నట్లు, జల తరంగిణి వింటుంటే ఉత్సాహంగానూ ఉంటుంది. సితార్ వాదన వింటూంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మా ఇంట్లో ఇదివరకటి ఎఫ్.ఎం ల స్థానంలో నిరంతరం ఇదే మోగుతూ ఉంటుంది ఇప్పుడు. మనసు ఏ రకమైన స్థితిలో ఉన్నా ఆహ్లాదకరమైన సాంగత్యాన్ని శాస్త్రీయ సంగీతం తప్ప మరేమి ఇవ్వగలదు?
ఈ కచేరీలలో ఎక్కువగా బాగా పేరున్న సంగీత విద్వాంసుల పాత రికార్డింగ్స్ ఎప్పటివో కూడా వేస్తూ ఉంటారు. అన్ని రేడియో స్టేషన్స్ వారి రికార్డింగ్స్ ఇందులో వంతులవారీగా ప్రసారమవుతూ ఉంటాయి.
మధ్య మధ్య కొన్ని ప్రత్యేకమైన సంగీత రూపకాలు, సంగీత విద్వాంసులతో ఇంటర్వ్యూలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. మనకు తెలియని ఎందరో గొప్ప కళాకారులు ఈ ఇంటర్వ్యూల ద్వారా మనకు పరిచయమౌతారు. ఏ భాష వారి అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఆ అనౌన్స్మెంట్ లకు ఆంగ్లంలో అనువాదం కూడా వస్తుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఇంత చక్కని ఛానల్ ని తయారు చేసిన All India Radio వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
ఇదివరకూ దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇలా రకరకాల సంగీతాలు వచ్చే రేడియో ఒకటి ఉండేది. క్లాసికల్, రాక్,జాజ్, వెస్టర్న్, పాత హిందీ పాటలు ఇలా రకరకాలు ఉండేవి. దానికి ఒక ప్రత్యేకమైన ఏంటన్నా కొనుక్కుంటే ఆ ప్రసారాలు వచ్చేవి. అందులో కూడా నిరంతరం శాస్త్రీయ సంగీతం వచ్చే ఛానల్ ఉండేది కానీ అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. నెలకో, ఆర్నెల్లకో పేమెంట్ ఉండి, ఏంటన్నా కూడా ఉండాల్సివచ్చేది ఆ రేడియోకి. ఇప్పుడా అవసరం లేదు. అన్ని యాప్స్ లాగ మొబైల్ లో డౌన్లోడ్ చేసేసుకుంటే, రాగంతో పాటూ మరో పది పదిహేను భాషల AIR వారి రేడియో ఛానల్స్ ఈ యాప్ లో ఉన్నాయి.
