Friday, March 27, 2015

CHAI - The Experience of Indian Tea

కేవలం ఉత్తర భారత దేశంలోనే కాదు ఇవాళ్టి రోజున దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వేకువ ఝామున, సాయంత్రాల్లోనూ.. వీధి సందు మలుపుల్లో, బజార్లలో, ఫంక్షన్ ప్లేసెస్ లో, సందర్శనా స్థలాల్లో ఓ నాలుగు చెక్రాల చెక్క బండి కనిపిస్తుంది. దాని మీద ఓ పక్కగా చిన్న స్టౌ, ఒక పొయ్యి మీద మరుగుతూన్న టీ పొడి, మరో పొయ్యి మీద మరుగుతున్న పాలు, పక్కనే సీసాల్లో పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలూ, టీ బిస్కెట్లు మొదలైనవి కనబడుతూ ఉంటాయి. బ్లాక్, పుదీనా, లెమన్, స్ట్రాంగ్, లైట్ అంటూ ఐదారు రకాల టీలను అవలీలగా క్షణాల్లో కలిపి ఇచ్చేస్తూ ఉంటారు బండి వాళ్ళు. వారిలో చిన్న చిన్న కుర్రాళ్ళు, ఆడవాళ్ళు, వయసు మీరిన తాతలూ కూడా గంటల తరబడి అలా టీలు చేస్తూనే ఉంటారు. ఆ టీ బండివాళ్ల చురుకుదనం చూస్తే ఆశ్చర్యం వేస్తూంటుంది ఒకోసారి. ప్రాంతాలను బట్టి టీ ఇచ్చే కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటి సైజులూ ఉంటాయి. కాలేజీలో ఉండగా మేము కలకత్తా వెళ్ళినప్పుడు మొదటిసారి టీని మట్టి ముంతల్లో తాగడం చూశాను. ఆ పధ్ధతి చాలా నచ్చింది కూడా. వేడి వేడి టీ తో పాటూ కలిసే ఆ మట్టి వాసన, ఆ రుచి చాలా స్పెషల్ గా, డిఫరెంట్ గా తోచాయి నాకు. 


 బేసిగ్గా నేను కాఫీ లవర్ ని. కానీ పదేళ్ళ క్రితం ఓ సందర్భంలో బాగా ఇష్టమైనదాన్ని వదిలేస్తానని అనుకున్నప్పటి నుండీ కాఫీ వదిలేసి టీ వాడకం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆ కాఫీ ఇష్టం అలానే ఉంది కానీ తాగాలనిపించే బలహీనతను, ఆలోచనను దరికి చేరనివ్వను. అందుకు బదులుగా బ్లాక్ టీ, గ్రీన్ టీ, లీఫ్ టీ, డస్ట్ టీ, ఆరెంజ్ టీ, లెమన్ టీ, గులాబీ టీ, ఐస్ టీ, జాస్మిన్ టీ, తులసీ టీ, ఆర్గానిక్ టీ, ఆయుర్వేదిక్ టీ, ఇన్స్టెంట్ టీ అంటూ రకరకాల టీల ప్రయోగాలు చేస్తూ, ఆస్వాదిస్తూ, టీ ప్రేమికురాలిగా మారిపోయాను. ఎక్కడైనా కొత్తరకం టీ రెసిపీ కనిపిస్తే ప్రయత్నించడం హాబీ అయిపోయింది.కొద్ది రోజుల క్రితం చైనా నుండి వచ్చిన ఫ్రెష్ గ్రీన్ టీ బాక్స్ + ఈ చాయ్ పుస్తకం తీసుకువచ్చారు శ్రీవారు. టీ నీకే గానీ పుస్తకం చూసి ఇచ్చేయాలి అన్నారు. ఎక్కడిదంటే ఫలానా ఫ్రెండ్ ఇచ్చారు.. ఈ పుస్తకం ఆయనకు గిఫ్ట్ గా వచ్చిందిట. నువ్వు చదువుతావని తెచ్చానన్నారు. కట్ చేస్తే ఇన్ని రోజులకి ఆ పుస్తకం చదవడం పూర్తి చేసాను. అది కూడా బుక్ ఇచ్చేయాలని అయ్యగారు తొందరపెడితే బలవంతాన చదివాను. ఈ పుస్తకం ప్రధానాకర్షణ అందులోని పెద్ద పెద్ద కలర్ఫుల్ ఫోటోస్. టీ ప్లాంటేషన్స్, జార్స్, సిటీస్, టీ దుకాణాలు, కలర్ఫుల్ సీల్డ్ టీ పేక్స్.. గట్రాలతో ఉన్న రంగురంగుల బొమ్మలు నిజంగా మనోహరంగా ఉన్నాయి. పుస్తకంలోని ఫోటోలను వాడుకోకూడదనే నిబంధన ప్రకారం అవేమీ ఈ పోస్ట్ లో పెట్టట్లేదు. కవర్ పేజీ మినహా టపాలోని ఫోటోలన్నీ గూగులమ్మ సహాయంతో సేకరించినవి.


2014 లో ప్రచురించబడిన అయిన ఈ పుస్తకానికి ఇద్దరు రచయితలు. రాజన్ కపూర్, రేఖా సరిన్. ఒకరు అవార్డ్ గ్రహీత అయిన ఫోటోగ్రాఫర్, ఒకరు అవార్డ్ గ్రహీత అయిన జర్నలిస్ట్ కమ్ ఎడిటర్. ముందుగా వారిద్దరూ పుస్తకాన్ని అంకితం చేసిన పధ్ధతి, ఆ మాటలు బావున్నాయి..

ఇక ఈ పుస్తకంలో ఏం కబుర్లు ఉన్నాయంటే.. అసలు మొట్టమొదట భారతదేశానికి టీ ఆకు ఎలా వచ్చి చేరింది, ఉత్తమమైన నాణ్యత ఉన్న టీ ఆకుని పండించడానికి కొందరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని పరిశోధనలు ప్రయత్నాలూ చేసారో వివరంగా వివరించారు. టీ తోటలు పెంచే ప్రదేశాలూ.. వాటి వివరాలు, ఆయా ప్రాంతాలు చేసే టీ ఉత్పత్తి, టీ ఆకు రకాలు  వివరాలు; అసలు టీ ఆకు ఎలా తయారవుతుంది? ఆ ఆకుపచ్చని లేత చిగుర్లు మన ఇంటికి చేరే రంగురంగుల టీ పేకెట్లలోకి టీ పొడిలా ఎలా మారతాయి.. మొదలైన వివరాలు వివరించారు రచయుత.


మొదటి అధ్యాయంలో దేశంలో రకరకాల ప్రాంతాల్లో టీ ఉపయోగాలనూ, పధ్ధతులనీ వివరించారు. కాశ్మీరు లోని కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టీ ఆకుతో kahwa అనే టీ తయారు చేస్తారుట. ఏలకులు, దాల్చిన చెక్క నీటిలో మరిగించి, తర్వాత టీ ఆకు కలిపి చివరగా అందులో కుంకుమపువ్వు (కాశ్మీరుప్రాంతంలో saffron పంటలు విరివిగా పండిస్తారు కదా అందుకని) కూడా కలుపుతారుట. ఇక ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది బ్లేక్ టీ పొడి, పాలు, కలిపి దాల్చినచెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు మొదలైన మసాలా మిశ్రమాలతో కలిపి టీ తయారు చేసుకుంటారు. అస్సాం లో అల్లం, బిర్యానీ ఆకు వేసిన స్ట్రాంగ్ గా, ఉప్పగా ఉండే టీ దొరుకుతుందిట. అక్కడ కొన్నిచోట్ల ఎక్కువగా ఉండే మలేరియాను పోగొడుతుందిట ఆలాంటి చాయ్. పంజాబ్ లో బ్రేక్ఫాస్ట్ టీతో పాటుగా స్టఫ్డ్ పరాటాలు కూడా ఉంటాయి. ఇంగ్లీషువారి కేక్లు, సేండ్ విచ్ లాగ. ఇంకా కొన్ని చోట్ల ఆలూ బోండాలు, పకోడీలు, సమోసాలు, పేస్ట్రీ పఫ్ లు మాత్రమే కాక జిలేబీ, రసగుల్లా, గులాబ్ జామూన్ మొదల్లైన స్వీట్లు కూడా టీ తో పాటూ ఆస్వాదిస్తూ ఉంటారు. చెన్నై లో ఒక ప్రాంతంలో ఉన్న మూసా టీ స్టాల్ కు ముఫ్ఫై ఏళ్ళ చరిత్ర ఉందిట. రోజుకు రెండు మూడొండల మంది కష్టమర్లు టీ తాగడానికి అక్కడకు వస్తారుట. కేరళలో దాల్చిన చెక్క, ఏలకుల తో పాటూ నట్ మెగ్ మిరియాలు కూడా వేస్తారుట టీలో. హైదరాబాదీలు ఆస్వాదించే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల గురించి చెప్పేదేముందీ!
తర్వాత టీ తయారీ ఎలా మొదలైందో వివరంగా తెలిపారు. టీ ఉత్పాదనలో  మొదటి స్థానంతో ఏకచ్ఛత్రాధిపత్యాన్నీ పొందుతున్న చైనా గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చెయ్యడానికి ఇండియాలో ఎక్కడ టీ ఉత్పాదనలు చేయవచ్చో ప్రయత్నించడం మొదలుపెట్టారుట బ్రిటిష్ వారు. ఆ వెతుకులాటలో అస్సాం అడవుల్లో చైనా టీ ఆకు కన్నా బలంగా ఉన్న టీ ఆకులను కనుగొన్నారుట. అస్సాం అడవుల్లో 600-700 cm ఎత్తు పెరిగిన టీ చెట్లను, వాటికి ఉన్న 20-22 cm పొడవు, 10 cm వెడల్పు ఉన్న టీ ఆకులను చూసి ఆశ్చర్యపోయారుట. మొదటిసారిగా ఒక స్కాటిష్ వ్యాపారస్థుడు అక్కడి ఆదివాసీలు టీ ఆకులను వాడడం చూశాడుట. చైనాలో కాక వేరే ప్రాంతాల్లో టీ ఆకు పండిచగలిగితే చరిత్ర సృష్టించచ్చని ఉత్సాహపడ్డాడుట కానీ అది ఫలరూపాన్ని పొండటానికి చాలా ఏళ్ళే పట్టిందిట. ఎంతో మంది బ్రిటిష్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తల కృషి ఫలితంగా 1839లో భారత దేశంలో మొట్టమొదటి టీ కంపెనీ.. "అస్సాం టీ కంపెనీ" స్థాపించబడింది. అప్పుడు అస్సాం లోనే కాక దేశంలో ఏ ఏ ఇతర ప్రాంతాల్లో టీ ఆకుని పండిచవచ్చో పరిశోధించడం మొదలుపెట్టారుట. అలా అస్సాం నుండి కలకత్తా, డార్జలింగ్, ఉత్తర హిమాలయాల్లోని కాంగ్రా వేలీ, తర్వాత దక్షిణంలో ఊటీ (నీలగిరీస్), కూనూర్, మున్నార్, చిక్ మంగుళూర్, కూర్గ్ మొదలైన ప్రదేశాల్లో టీ ఉత్పాదనలు మొదలైయ్యాయి. డార్జలింగ్ టీ, ఆర్థడాక్స్ అస్సాం టీస్, కాంగ్రా టీ, దూరాస్ & టెరై, నీల్గిరీ టీ మొదలైన టీ కంపెనీలు మొదలై పాపులర్ అయ్యాయి.
టీ ప్లాంటర్స్ అని పిలవబడే ఎస్టేట్ మేనేజర్లు, టీ గార్డెన్ లో వర్కర్లు, వాళ్ల జీవన విధానాలను గురించి ఒక పూర్తి అధ్యాయం ఉంది. తర్వాత అధ్యాయంలో టీ ఆకులు సేకరించడం మొదలు అవి పేక్ అయ్యేదాకా ఏం ప్రాసెస్ జరుగుతుంది అన్న సంగతులన్నీ విపులంగా వివరించారు. మొదట్లో టీ ఫాక్టరీలలో సరైన సదుపాయాలు లేక టీపొడి తయారీ చాలా కష్టతరంగా ఉండేదట. తర్వాతర్వాత నెమ్మదిగా మార్పులు వచ్చి ఇప్పుడు టీ ఫ్యాక్టరీలు చక్కని కంప్యూటర్ కంట్రోల్డ్ సొఫిస్టికేటేడ్ పరికరాలతో ఉండటం వల్ల టీ పొడి కూడా హైజినిక్ గా చక్కని అంతర్జాతీయ ప్రమాణాలతో గా తయారవుతోందిట. 
మూడు పద్ధతుల్లో టీ ఆకు తయారీ జరుగుతుందిట. మొదట ఆకుపచ్చని ఆకుల ఆక్సిడేషన్ ఆపివేసి గ్రీన్ టీ ఆకును, తర్వాత పార్షియల్ ఆక్సిడేషన్ ప్రక్రియతో బ్లాక్ టీ ఆకును, చివరగా టీ ఆకులను పూర్తిగా ఆక్సిడైజ్ చేసి Orthodox, CTC (crush-tear-and curl) అనే రెండు రకాల టీ ఆకులను తయారు చేస్తారుట. ఈ రకంగా అంచలంచలుగా ఎన్నో వ్యయప్రయాసల తర్వాత తయారైన టీ ఆకు, టీ పొడి "టీ టేస్టర్" దగ్గరకు వెళ్తుంది. అచ్చం ఒక లేబ్ టెక్నీషియన్ లాగ ప్రతి కంపెనీ లోని టీ టేస్టర్స్ తన వద్దకు వచ్చిన టీని పరీక్షించి, దాని నాణ్యతను సర్టిఫై చేస్తారు. ఈ పనికి గాని టీ టేస్టర్ కి ఐదేళ్ల అనుభవం అవసరమై ఉంటుందిట. నాణ్యత గల టీ గా ఎన్నికకాబడ్డ టీ   కి చివరగా ఆక్షన్స్ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఎన్నో ప్రైవేటు సంస్థల మధ్యన జె.థామస్ అనే కంపెని మాత్రం, ఏడాదికి కొన్ని మిలియన్ కిలోగ్రాముల టీ ఆక్షనింగ్ చేస్తూ 150ఏళ్ళగా ప్రముఖ టీ ఆక్షన్ సెంటర్ గా ప్రసిధ్ధి చెంది ఉందిట.


 చివరి అధ్యాయంలో రకరకాల దేశాల్లో టీ ని ఎలా తయారుచేస్తారు, ఎలా ఆస్వాదిస్తారు, టీ ఎన్ని రకాలుగా + ఎలా వాడితే శరీర అందానికీ, శరీరం రిలాక్సవడానికి ఉపయోగపడుతుంది అనే విషయాలు ఉన్నాయి. ఈ అధ్యాయం లో ఇచ్చిన రకరకాల టీలు.. వైట్ టీ, గ్రీన్ టీ, యెల్లో టీ, ఆర్గానిక్ టీ, ఫ్లేవర్డ్ టీ, సెంటెడ్ టి, హెర్బల్ టీ, ఇంస్టెంట్ టీ మొదలైనవాటి రంగులు, అవి ఉంచిన టీ జార్స్, కప్స్, కలర్ ఫుల్ సీల్డ్ పేక్స్ కళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. చిట్టచివరగా రకరకాల టీ ల తయారీలు, కొన్ని రకాల టీలతో చేసుకునే రెసిపీలు ఉన్నాయి. వాటి తాలూకూ రంగురంగుల ఫోటోలు కూడా నయనానందకరంగా ఉన్నాయి.

ఈ పుస్తకం ధర రీత్యా కొనుక్కోమని చెప్పను కానీ ఎక్కడైనా లైబ్రరీలోనో, ఓ హోటల్లోనో లభ్యమైతే తప్పకుండా ఓసారి పేజీలు తిరగేసి ఆనందించతగ్గ పుస్తకం అని మాత్రం చెప్తాను.
http://www.accdistribution.com/us/store/pv/9789381523919/chai/rekha-sarin-rajan-kapoor


చాయ్ బుక్ కబుర్లు అయిపోయాయి. ఇదిగోండి ఓ కప్పు టీ తాగండి..:)
Note: All the photos in this post are sourced from royalty free Google images. No authenticity claimed. No legal or any claims tenable.