Tuesday, August 19, 2014

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు
మూడేళ్ల క్రితమనుకుంటా ఒకసారి మా పిన్ని వాళ్ళమ్మాయి చెప్పింది.. నర్సాపురంలో నా చిన్నప్పటి క్లాస్ మేట్ ప్రసూన అనీ.. ఆ అమ్మాయికి కూడా బ్లాగ్ ఉంది.. కవితలు అవీ రాస్తుంది అని. అప్పుడు చూశాను రెక్కల సవ్వడి బ్లాగ్. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. తనతో వ్యక్తిగత పరిచయంలేకున్నా అప్పట్నుంచీ బ్లాగ్ లోనే కాక వివిధ జాల పత్రికల్లో తను రాసే కవితలూ, కథలూ కూడా చదువుతూన్నా! ఈ అమ్మాయీ మంచి ఆర్టిస్ట్ కూడా. బొమ్మలు వేస్తుంది. తన కథలకి తానే బొమ్మలు వేసుకోవడం విశేషం. 'వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో తన కవితకు బహుమతి వచ్చింది.

ఒక మెట్టు పైకెళ్ళి ఈ మధ్యన ప్రసూన ఒక నవల రాసింది. 'కినిగె తెలుగు నవలల పోటీ 2014' కోసం ప్రసూన నవలను రాసింది. ముఖచిత్రం కూడా తనే వేసుకుంది. పేరేమిటంటే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". పేరు తమాషాగా ఉందే అనుకుని.. ఏమి రాసిందా అని ఆసక్తిగా నవల చదివాను. ఇట్స్ డిఫరెంట్..! రొటీన్ లవ్ స్టోరీనో, ఏదో సోషల్ మెసేజ్ ఉన్న నవలికో కాదు. ఇది మన తెలుగు భాష గురించిన కథ. ఇంగ్లీషు చదువుల వల్ల మన పిల్లలకు దూరమైపోతోందేమో అని మనం భయపడుతున్న మన తెలుగు భాష ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి ఎలా తీసుకురావచ్చో.. ఎలా పిల్లలకు తెలుగు నేర్పవచ్చో.. ఒక ఆలోచన చేసి చూపించిందీ నవలలో ప్రసూన. నూతనమైన, ఆచరయోగ్యమైన ఆలోచన.


 
మార్కులు ఎక్కువ రావనో, వేరే భాష కంపల్సరీ అనో స్కూళ్ళలో తెలుగు భాషే ఉండట్లేదు కొందరు పిల్లలకు. సెకెండ్ లాంగ్వేజ్ స్పానిష్షో, ఫ్రెంచో ఉంటున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. ఇందువల్ల ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషలూ సులువుగా వచ్చేస్తున్నాయి పిల్లలకు కానీ మనదైన తెలుగు భాష మాత్రం సరిగ్గా పలకడానికి కూడా రావట్లేదు. కొందరు పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కూడా రాదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్ని పదాలకు అర్థాలే తెలీనివాళ్ళు కొందరైతే, అసలు తెలుగు చదవడమే రాని పిల్లలు కొందరు. మా అమ్మాయి రెండో తరగతి దాకా స్టేట్ సిలబస్ అవ్వడం వల్ల అప్పటిదాకా తెలుగు సబ్జెక్ట్ ఉండేది కానీ మూడవ తరగతిలో సెంట్రల్ స్కూల్ కి మార్చాకా తనకి స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేదు. వచ్చిన కొద్దిపాటి భాషా మర్చిపోకుండా ఇంట్లో రోజూ న్యూస్ పేపర్ చదివించడం, తెలుగు కథల పుస్తకాలు కొని చదివించడం, గుణింతాలూ, వత్తులూ రాయించడం చేస్తుంటాము మేము. నేనప్పుడప్పుడు అశ్రధ్ధ వహించి వదిలేస్తున్నానని వాళ్ళ నాన్నగారు రోజూ రాత్రి పాప చదువుకునే బెడ్ టైం స్టోరీస్ తెలుగు కథలే చదవాలని రూల్ పెట్టేసారు. ఆ విధంగానైనా తెలుగు మరిచిపోకుండా ఉంటుందని, తెలుగు చదవడం అలవాటవుతుందనీ మా ప్రయత్నం. అచ్చం ఇలానే ప్రసూన కూడా తన మొదటి నవలలో కూడా పిల్లలకు తెలుగు ఎలా నేర్పచ్చు అనే ఆలోచనకి ఓ ప్రణాలికని తెలిపింది.

 
హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చందన అనే పాప ఉంటుంది. ఊరు నుండి వచ్చిన వాళ్ళ స్వామి తాతయ్యగారు అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ తెలుగు ఎలా నేర్పించారు. తాతా మనవరాలు కలిసి "తెలుగు వెన్నెల" పేరుతో తెలుగు తరగతులను నడిపించి, ఎంతోమంది పిల్లలకు తెలుగు భాష ఎలా నేర్పించారో తెలిపే కథే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". మన బిజీ స్కెడ్యూల్స్ లోంచి కాస్తంత వెసులుబాటు చేసుకుని మన పిల్లలు మాతృభాష మర్చిపోకుండా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలదే అన్నది ఈ నవలలో అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇదొక్కటే కాక పిల్లలకు నేర్పించాల్సిన చెయ్యవలసిన కొన్ని మంచి అలవాట్లు, విషయాల ప్రస్తావన కూడా కథలో ఉంది. ఇది పిల్లల నవల.. అనుకోవచ్చు. పిల్లలకు మన మాతృభాష పట్ల మక్కువ ఎలా కలిగించాలో పెద్దలకు తెలిపే నవల అనుకోవచ్చు. కథ, కథాగమనం సంగతి ఎలా ఉన్నా, ఇదొక విభిన్నమైన మంచి ప్రయత్నమని ఖచ్చితంగా చెప్పచ్చు.  కథలో తాతామనవరాళ్ల మధ్యన ఉన్న గాఢానుబంధం నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు తాతయ్యలంటే మహా ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికీ ఇరువైపుల తాతయ్యలూ ఫోటోల్లో కనిపించారు మరి :(


అయితే, ఈ "తెలుగు వెన్నెల" తరగతులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందులో అమితోత్సాహంతో పాల్గోవడం వంటివి నాకు కొధ్దిగా హైలీ ఐడియలిస్టిక్ గా అనిపించాయి. ఈకాలంలో అసలు కొందరన్నా అలా ఉంటారా అన్నది నాకు సందేహమే! ఉంటారేమో మరి..!! కథాస్థలం హైదరాబాద్ కాకుండా ఏ అమెరికానో, మరో దేశమో అయి ఉంటే పాత్రల్లో తెలుగు భాష పట్ల కనిపించిన ఇంటెన్స్ ఫీలింగ్స్ ఏప్ట్ గా అనిపించేవేమో అనిపించింది నాకు. ప్రసూనకి ఇది మొదటి ప్రయత్నం కాబట్టి కథాగమనంలో లోటుపాట్లు పట్టడం సబబు కాదనిపించింది నాకు.
నే గమనించిన.. నాకు ఇబ్బంది కలిగించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్షర దోషాలు. నవలాంశమే తెలుగు భాష నేర్చుకోవడం అయినప్పుడు మరి అందులో అక్షర దోషాలు దొర్లితే చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. వీటిని సరిచేసే పధ్ధతి ఏదైనా ఉందేమో రచయిత్రి కనుక్కుని అవన్నీ సరిచేస్తే బాగుంటుంది. ఇదొక్కటీ తప్పిస్తే.. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సందేశం బాగుంది. ఇలా ఒక ప్రణాలిక ద్వారా కాకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళం మన పిల్లలకు అప్పుడప్పుడన్నా మాతృభాష పట్ల అభిమానం ఏర్పడే ప్రయత్నాలు చేస్తూంటే బాగుంటుంది. ఈ నవల కినిగె.కాం లో లభ్యమవుతోంది.
బ్లాగ్ముఖంగా ప్రసూన చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తన నుండి ఇంకొన్ని మంచి కథానికలూ, నవలలూ రావాలని కోరుకుంటున్నాను.