Thursday, November 6, 2014

శ్రీ శివమహాపురాణము


 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి దేవుడు మాకు మేలే చేసాడు. పెళ్ళయిన ఇన్నేళ్ళకి ఆ మూడువారాలు కాస్త ఖాళీగా తను ఇంట్లో ఉన్నారు. ఆ దెబ్బల వల్ల సత్కాలక్షేపం కూడా జరిగింది. తీరుబడిగా పనులు చేస్కోవడమే కాక తీరుబడిగా పురాణకాలక్షేపం చేసుకుని మహదానందాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నాము.. కుంటున్నాము కూడా! ( బయటకు వెళ్పోవడం మొదలెట్టాకా పురాణపఠనం స్పీడ్ తగ్గి, ఇంకా రెండు ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి.) మధ్యలో కొన్నాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నందున ఆవిడ కూడా పురాణశ్రవణం చేసుకున్నారు. 

మాకో అలవాటు ఉంది..(చాలామందికి ఉండే ఉంటుంది) చాలా బాగున్న పుస్తకం కలిసి చదవడం. ఒకళ్లతర్వాత ఒకళ్ళం తలో ఛాప్టర్ చదవడం. ప్రసాద్ గారి నాహం కర్తా హరి: కర్తా, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ, ఆ కుటుంబంతో ఒక రోజు, మోహన్ కందా గారి పుస్తకం... ఇలా కొన్ని పుస్తకాలు కంబైండ్ స్టడీ చేసాం. ఆమధ్యన కోటీలో పాత పుస్తకాల స్టాల్స్ దగ్గర ఏవో పుస్తకాలు కొంటుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి "శ్రీ శివమహాపురాణము" దొరికింది. పుస్తకం కొత్తగానే ఉన్నా పాతపుస్తకాల దగ్గర పెట్టీ మూడొందల ఏభైకే అమ్మేస్తున్నారు. క్రిందటి పుస్తకప్రదర్శనలో చాగంటివారి భాగవత,రామాయణ, శివమహాపురాణా ప్రవచనాల పుస్తకాలను మూడింటినీ కలిపి డిస్కౌంట్లో అమ్మారు. అప్పటికే చాలా కొనేసినందువల్ల ఇక అవి తీసుకోలేకపోయాము. మూడింటిలో అమ్మ దగ్గర భాగవతప్రవచనం ఉంది. (సగభాగం ఇంకా పూర్తి చెయ్యాల్సి ఉంది.)  మిగతావి కూడా కొనుక్కోవాలని మనసులో ఓ మూల కోరిక ఉంది. ఇప్పుడిలా అనుకోకుండా "శ్రీ శివమహాపురాణం" కొనడం జరిగింది. భగవత్ కృప!


కాకినాడలోని అయ్యప్పస్వామి గుడిలో మండలం రోజులు చాగంటివారు చెప్పిన ప్రవచనాలుట ఇవి. (టివీలో వచ్చే ఉంటాయి.) వాటికి పుణ్య దంపతులు శ్రీ పురిఘళ్ళ సత్యానంద శర్మ, శ్రీమతి భాస్కరం గార్లు అక్షరూపాన్ని అందించారు. ఆకర్షణీయమైన బాపూ బొమ్మలతో ఎమెస్కో బుక్స్ వాళ్ళు ప్రచురించారు. వినడం కన్నా పుస్తకం చదవడమే ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని మాకనిపించింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలను గురించి , వాటి చరిత్ర, కొన్ని ప్రదేశాల్లో ఉన్న విగ్రహామూర్తులను గురించీ చదువుతుంటే అసలు ఇప్పటిదాకా చూసిన కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. శివుడంటే ఇదివరకటి కంటే ఎక్కువగా ఆరాధన కలిగింది. నా రాముడితో సమానంగా నా మనస్సులో స్థానాన్నధిస్టించాడు ఈశ్వరుడు :)


పుస్తకంలో ముందర కొందరు నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. శివుని అనుగ్రహం వల్ల తరించిపోయిన మహాపురుషులైనవారీ నాయనార్లు. ఒక్కొక్కరి కథా ఒకో పాఠం అని చెప్పాలి. తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యాలనూ, వాటి చరిత్రనూ, ప్రాముఖ్యతనూ తెలియజేసారు. మాకు ఇప్పటికి శ్రీశైలంలో మల్లికార్జునుడు, త్ర్యంబకంలోని త్ర్యంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఘృష్ణేశ్వర్ లోని ఘుష్ణేశ్వరుడు, భీమశంకర్ లోని భీమేశ్వరుడూ ఐదు క్షేత్రాల్లోని శివలింగాలను చూసే సదవకాశం కలిగింది. అరుణాచల పర్వతం విశిష్ఠత, రమణ మహర్షి చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయం గురించీ చదువుతుంటే మాత్రం రెక్కలు కట్టుకుని ఆ కొండకు ఎగరి వెళ్ళాలనిపించింది. ఆ దర్శనం, గిరిప్రదక్షిణ ఎప్పటికి ప్రాప్తమో..


పుస్తకంలోని కొన్ని తెలియని, తెలిసిన మంచి విషయములు:

* మన శరీరంలో ఉండే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన్, నాగ, కూర్మ, క్రుకుర, ధనంజయ, దేవదత్తములనే పది వాయువులు, వాటి పనులూ చెప్పారు. శివుడి ఆజ్ఞ వలననే వాయువు జీవుల శరీరములందు ఉండి ఈ పదిరకముల వివిధ కర్మలనూ చేస్తాడుట.

* పూర్వం స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించి కట్టె వెలిగించి, మడిబట్ట కట్టుకుని అన్నం వండడం కూడా గౌరవంగా చేసేవారు. 

* "పిల్లలను పోటో పరీక్షలకు తయారుచేస్తున్నాం. కానీ పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్దచేస్తున్నాం. వాడు రోడ్డుమీదికి వెడితే వాడి కన్నులు చెదరగొట్టి పాపభూయిష్టమైన నడవడి వైపుకి తీసుకువెళ్ళే వాల్ పోస్టర్లు! ఏషాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడుచెయ్యగలిగిన పుస్తకాలు! ఎన్ని ఛానళ్ళు నొక్కినా అన్నింటిలో వ్యగ్రతతో కూడిన విశేషములు! మీరు వానికి మురికినీరు పట్టించి వాడు వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే వాడు ఎలా బ్రతుకుతాడు?ఈవేళ సమాజానికి భాద్యత లేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదు. పెద్దలకు బాధ్యత లేదు...." 
"పురాణముల ప్రయోజనం మీ బాధ్యతలను గుర్తు చెయ్యడం. పురాణం ఎప్పటిదోనని, అది పనికిమాలినదని మీరు అనవద్దు. అది ఎప్పటికీ నవీనమే. అది మీ బాధ్యతను మీకు గుర్తుచేస్తుంది. లోక సంక్షేమము ఎక్కడ ఉందో దానిని మీకు జ్ఞాపకము చేస్తుంది."

* తల్లిదండ్రులు ఏ ఏ సంస్కారములతో ఉన్నారో వి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కారరూపంలో సుఖమును గానీ, దు:ఖమును గానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుధ్ధి కొరకు, భావపరిపుష్టి కొరకుమనవాళ్ళు పూర్వం కొంతకాలం భార్యాభర్తలు దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమయిన తరువాత సంతానము కనేవారు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించినట్లయితే, నిష్ఠ లోపించినట్లయితే సంతానమునందు వ్యగ్రతతో కూడినవారు జన్మిస్తారు. కాబట్టి సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. ఇంత చేసినా దుర్మార్గుడో, దుర్మార్గురాలో పుడితే అది బిడ్డ ప్రారబ్ధం. దాని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది.

* ప్రదూషవేళ (కాలము స్ఫుటముగా మార్పు చెందే రెండు సంధ్యాసమయాలూ) జరుగుతూండే శివుడి ఆనందతాండవం సమయంలో శివస్వరూపాన్ని చూసే అధికారం నలుగురికే ఉందిట. నందీశ్వరుడు, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు.

* కావ్య కంఠగణపతి ముని కథ కమనీయం.

* మధురమైన ముత్తుస్వామి దీక్షితులు జీవిత కథ..

* శంకరాచార్యులవారు, శ్రీ చంద్రశేఖర పరమచార్యుల వారి గురించిన కొన్ని తెలియని విశేషాలు..

* భృగుమహర్షి కుమారుడైన భార్గవుడు మహాపురుషుడిగా ఎలా మారాడు, శుక్రాచార్యుడన్న పేరు ఎలా ప్రకాశించిందో తెలిపే కథ విచిత్రమైనది. ఈశ్వరుడి కృపాకటాక్షాలను తెలిపేదీనూ!

* శివకోటి, రామ కోటి రాసిన పుస్తకాలలో ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపము అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తికి ప్రసరించే లక్షణం ఉంది. ఊళ్ళో ఎవరికయినా ఆపద వచ్చినట్లయితే ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. స్తూపంలో ఉన్న శక్తి బయటకు తరంగములుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకా కష్టం పోతుందో ఆ శక్తి అందులోంచి మీ మనసు లోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుధ్ధిని మారుస్తుంది. కాబట్టి ఉళ్ళో ఉన్నవాళ్ళు ప్రమాత్మ ప్రు రాసిఉన్న స్తూపం కట్టుకోవాలి. రాననాం ఎంత గొప్పదో శివనామమూ అంతే గొప్పది.



* స్కందోత్పత్తి - కుమారసంభవం:
కాళిదాసు రచించిన "కుమారసంభవం" పేరు వినడమే తప్ప కథ తెలియదు. ఇంతకుమునుపెక్కడా కూడా కుమారస్వామి జననానికి సంబంధించిన కథ వినలేదు కూడా. మొత్తం పుస్తకంలో మేము ఆసక్తికరంగా చదివిన వృత్తాంతమిది. పార్వతీపరమేశ్వరులిద్దరి దయ,కారుణ్యము ఒకచోట ప్రోగు చెస్తే ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడుట. ఇది గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమయినదిట. ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ స్త్రీ వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని, అవి ఔషధాలుగా మారి లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. అందుకే స్కందోత్పత్తి గర్భిణి వినాలని శాస్త్రం చెప్పిందిట. ఆయురారోగ్యాలూ, వంశాభివృధ్ధి, ధనం, దీర్ఘమైన ఆరోగ్యం మొదలైనవి సుబ్రహ్మణ్యారాధన వల్ల కలుగుతాయిట.


ఇలా చెప్పుకుపోతే ఎన్నో కథలు, వింతలూ, విశేషాలూ..! మధ్యమధ్య చాగంటివారు ఉదహరించిన వివిధ సంస్కృత శ్లోకాలూ, శివానందలహరి, భాగవతం మొదలైనవాటి నుండి తీసుకున్న పద్యాలన్నీ కూడా మధురమైన భక్తితత్వంతో నిండి ఉన్నాయి.


ఇంకో మూడు,నాలుగు రోజుల్లో పారాయణ పూర్తవుతుంది. చదువుతున్న కాలంలో ఎదురైన చిన్న చిన్న విశేషాలు:

* గత రెండునెలల కాలం కూడా మాకెంతో పరీక్షాసమయం. కొన్ని చికాకులూ, సమస్యలతో సతమతమై అయోమయావస్థలో ఉన్న మాకు శివానుగ్రహం వల్లనే ఈ పురాణపఠనం చేసే సదవకాసాశం కలిగి, తద్వారా మా భారాలని తేలిక చేసుకోగలిగే మనస్థితిని శంకరుడే కల్పించాడని మేమిద్దరం కూడా విశ్వసిస్తున్నాం. 

* సెప్టెంబర్ లో ఒకనాడు మా అత్తగారు హాస్పటల్లో సీరియస్ గా ఉన్న రోజున.. ఆ అర్థరాత్రి పూట ఒక్కదాన్నీ హాల్లో కూచుని ఈ పుస్తకాన్ని కాగలించుకుని శివా..శివా.. శివా.. అన్న ఒక్క నామాన్ని మాత్రమే జపిస్తూ గడిపిన గంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వరానుగ్రహం వల్లనే ఆవిడ అప్పటికప్పుడు మామూలై ఆ పూటే మా ఇంటికి రాగలిగారని మేం నమ్మాము.

* సరిగ్గా శరన్నవరాత్రుల్లోనే "గౌరీపూజ", "అమ్మవారి రూపములు" ఛాప్టర్లు చదవడం చిత్రమనిపించింది. 

* నిన్న ఏదో పని మీద ఓ ఆఫీసుకి వెళ్తే అక్కడ మావారికి తెలిసినాయన, "పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి వచ్చాను.. ప్రసాదమిదిగో.." అని ఇచ్చారుట. మేం వెళ్ళలేకపోతున్నామని శివుడు ప్రసాదం పంపాడని మురిసిపోయాం ఇద్దరం.

ఇవి చిన్న విశేషాలే అయినా మా మనసులని ఎంతో ప్రభావితం చేసినవి. ఆసక్తి ఉన్నవారు తప్పక ఈ శివమహాపురాణపఠనాన్ని చేసి ఈశ్వరానుభూతిని పొందవలసినదని మనవి.

***

లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ
చీకాకున్ బడనీ మహాత్ముడననీ..
మూకీభా వమునన్ తిట్టనీ త్రోయనీ
నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!
(శంకరాచార్యులు)


మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!

Tuesday, November 4, 2014

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..



ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:
(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) 





తులసీ స్తోత్రం:
http://youtu.be/Dxptk_6cgss



తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :
http://youtu.be/cAvzwnc16Ag




తులసీ వివాహం :
 https://www.youtube.com/watch?v=iWs142GBCVs



తులసీ హారతి:
http://youtu.be/T9JH9h0qL6M

Saturday, November 1, 2014

Kishori Amonkar - Drishti songs


image from google


1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా హిందుస్తానీ శాస్త్రీయ బాణిలోనే ఉంటుంది. సాహిత్యం వసంత్ దేవ్. 



ఈ చిత్రంలో రెండు పాటలు యూట్యూబ్ లో దొరికాయి.. రెండూ చాలా బావుంటాయి. 

1.)మేఘా ఝర్ ఝర్ బర్సత్ రే.. 
ఇది ఏ రాగమో గానీ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట.. 
(సంగీతం మరియు గాయకురాలు: కిశోరీ ఆమోంకర్) 



 2) ఏక్ హి సంగ్ హోతే.. జో హమ్ తుమ్.. కాహే బిఛురారే... (ఈ పాట క్రింద ఇచ్చిన గానా.కామ్ లింక్ లో క్లియర్ గా ఉంది) ఈ పాట వింటుంటే 'రుడాలీ' లో "సునియో జీ అర్జ్ మ్హారీ.. " పాట గుర్తుకు వస్తుంది.. బహుశా రెండూ ఒకటే రాగమై ఉంటాయి. 

  

 'ఆలాప్' తో పాటూ చిత్రంలో అన్ని పాటలూ gaana.com లింక్ లో వినచ్చు: http://gaana.com/album/drishti-hindi



నవలానాయకులు - 11


ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. సందర్భానుసారం, పరిస్థితుల దృష్ట్యా అవి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని అతడు చేసే/చేసిన పనుల వల్ల అంచనా వెయ్యడం అనేది సబబు కాదు. అసలలా ఎందుకు చేసాడు అనే కారణాలను అన్వేషించడం, వాటిని తెలుసుకున్న తరువాత ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సరైన పని అని ఈ నవల ద్వారా రచయిత తెలియపరుస్తారు. ప్రపంచమంతా కౄరుడు, నిర్దయుడు, పాషాణహృదయుడు, రక్తపిపాసి, రాక్షసుడు అని ముద్ర వేసిన మంగోల్ జాతి నాయకుడు "టెమూజిన్" కథను ఒక కొత్త కోణంలో మనకి చూపెడుతూ ఒక మహోన్నతమైన మానవతావాదిగా అతగాడిని మనకి పరిచయం చేసారు ప్రముఖ అభ్యుదయ కవి, కథారచయిత, నాటక కర్త శ్రీ తెన్నేటి సూరి. "ఛెంఘిజ్ ఖాన్" లోని కౌర్యం వెనుక కారణాలు చరిత్రని తవ్వితే గానీ బయటపడవు. ఈ నవలా నాయకుడి జీవితాన్ని గురించిన వివరాలు క్రింద లింక్ లో:
http://koumudi.net/Monthly/2014/november/nov_2014_navalaa_nayakulu.pdf






దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ నవల ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకం గా తయారైంది. శ్రీకాంతశర్మ గారు ఆ పాత్రపై ఎంతో అభిమానంతో నాటకరూపాన్ని అందించారు. నాన్నగారు శబ్దరూపాన్ని ఇచ్చారు. రికార్డింగ్ సమయంలోనూ, ఆ తరవాత ఎన్నో ప్రశంసలను అందుకుందీ నాటకం. గుర్రపు డెక్కల చప్పుడు, అరుపులు, కోలాహలాలూ, ఆర్తనాదాలు, హుంకారాలు, యుధ్ధపు వాతావరణం మొదలైన ఎఫెక్ట్స్ శబ్ద రూపంలో తేవడం కోసం నాన్న ఎంతగానో శ్రమించారు.  పూర్తయిన ఈ నాటకం కేసెట్ ను ఎన్నోసార్లో నాన్న వింటుంటే వినీ వినీ విసిగిపోయి అబ్బా..ఆపేద్దూ గోల అని మేము విసుక్కున్న రోజులు నాకు బాగా గుర్తు :) 
..వెరీ నాస్టాల్జిక్.. అబౌట్ దిస్ ప్లే!!

నవల చదివిన ప్రతిసారీ చాలా రోజుల వరకూ యాసుఖై, యూలన్, టెమూజిన్, సుబూటిన్, చమూగా, కరాచర్,బుర్టీ, కూలన్.. మొదలైన పాత్రలు మదిలో మెదులుతూ కలవరపెడతాయి. అసలు వీళ్ళ మూలాలేమిటి.. వీరందరి నిజమైన చరిత్ర తెలిస్తే బాగుండు.. అని మనసంతా గోబీ ఎడారి చూట్టూ ప్రదక్షిణలు చేస్తుంది!!!

Friday, October 31, 2014

Surdas Bhajans - M.S. Subbalakshmi

ఫోటో కర్టసీ: గూగుల్

పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ సూరదాసు(सूरदास) ప్రసిధ్ధి చెందిన కవి, వాగ్గేయకారుడు, కృష్ణభక్తుడు. పుట్టుకతో అంధుడైన సూరదాసుకి పేదరికం మూలానో ఏమో తల్లిదండ్రుల లాలన అందక ఆరేళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టేసి వ్రజ్ లో స్థిరపడిపోయాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురానగరి సమీపంలోని ప్రాంతం ఇది. సుధ్ధాద్వైత గురువు వల్లభాచార్యులు అతడిని శిష్యుడిగా స్వీకరించి ఆదరించాకా అతని జీవితం మెరుగుపడి భక్తిమార్గంలో పయనించింది. ఉత్తర భారతదేశంలో అప్పట్లో ప్రబలంగా ఉన్న Bhakti movementలో సగుణ భక్తి , నిర్గుణ భక్తి అని రెండు శాఖలుండేవి. సగుణ భక్తి శాఖలో కృష్ణ భక్తి, రామ భక్తి అని మళ్ళీ రెండు శాఖలు. అందులో 'కృష్ణభక్తి శాఖ'కి సూరదాసు చెందుతాడు. 


సూరదాసు రచనలన్నీ 'సూర్ సారావళి', 'సాహిత్య లహరి', 'సూర్ సాగర్'  అనే మూడు గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సూరదాసు వందలు వేలల్లో రాసిన రచనలు చాలావరకూ అందుబాటులో లేవని చెప్తారు. మూడూ గ్రంధాల్లోనూ కృష్ణుడి లీలాగానామృతంతో నిండి ఉన్న 'సూర్ సాగర్' బాగా ప్రసిధ్ధి చెందింది. అంధుడైన వ్యక్తి కృష్ణలీలలను అంత అద్భుతంగా కన్నులకు కట్టినట్లు ఎలా రచించగలిగాడని అంతా ఆశ్చర్యపోయేవారుట. కృష్ణలోలలను వర్ణిస్తూ సాగే సూరదాసు భజనలు పిక్చరస్క్ గా , 'మధురాష్టకం'లాగ ఎంత మధురంగా ఉంటాయో మాటల్లో చెప్పడం కష్టం. 


ఇటువంటి మధురమైన సూరదాసు భజనలు కొన్నింటిని గానకోకిల ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో పాడించారు HMVవారు పదిహేనేళ్ళ క్రితం. కేసెట్ లో మొత్తం ఎనిమిది భజనలు ఉన్నాయి. అవన్నీ క్రిం ఉన్న raaga.com లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/The-Spiritual-Voice-Of-MSS-Surdas-Bhajans-hd001394

Track list:  
1) Prabhuji tum bin kaun sahaai
2) Nis din basrat nain hamaari
3) Raakho laaj hari tum meri
4) Kunjani kunjani Bbjati murli
5) Akhiyan hari darshan ki pyasi
6) Madhuban tum kyon rahat hare
7) He deen dayal gopal hari
8) Suneri maine nirmal ke balram


యూట్యూబ్ లో ఒక మూడు భజనలు దొరికాయి..
1) అఖియా హరి దర్శన్ కీ ప్యాసీ...

 


 2) ప్రభుజీ తుమ్ బిన్ కౌన్ సహాయ్.. 





3) "మైయ్యా మోరీ మై నహీ మాఖన్ ఖాయో..." (ఇది కేసెట్ లో లేదు కానీ సూరదాసు భజనే)






 *** *** ***

3) "ప్రభుజీ మోరే అవగుణ్ చిత్ న ధరో.. " అని సాగే ఈ సూరదాస్ భజన నాకు చాలా ఇష్టం. "స్వామి వివేకానంద" చిత్రంలోనిది.
గాయని: కవితా కృష్ణమూర్తి

  

Thursday, October 30, 2014

Meghadutam - Vishwa Mohan Bhatt


భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో ప్రాచుర్యం లోకి తెచ్చారు హిందుస్తానీ సంగీత కళాకారులు, గ్రామీ అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్ గారు.

శ్రీ విశ్వమోహన్ భట్ గారు వాద్యకారులే కాక సంగీతకారులు కూడా. కాళిదాసు 'మేఘదూతం' లోంచి ఒక పన్నెండు శ్లోకాలను తీసుకుని వాటికి విశ్వమోహన్ భట్ గారితో స్వరాలను ఆడియో కేసెట్ గా చేయించారు 'MUSICTODAY' వాళ్ళు 2002లో. ప్రముఖ గాయకులు హరిహరన్, కవితా కృష్ణమూర్తి, రవీంద్ర సాఠే గార్లు ఆ సంస్కృత శ్లోకాలకు స్వరాలాపన చేసారు. ఇందులో వాడిన వాయిద్యాల్లో 'మోహన వీణ' విశ్వమోహన్ భట్ గారే వాయించారు. మ్యూజిక్ ఎరేంజ్మెంట్ పండిట్ రోనూ మజుందార్ చేసారు. మధ్య మధ్య ఉపయోగించిన సంతూర్ వాదన కూడా చాలా మనోహరంగా ఉంటుంది.


 చాలారోజుల నుండీ ఆ కేసెట్ గురించి పోస్ట్ రాద్దామని.. ఇన్నాళ్ళకు కుదిరింది. లక్కీగా యూ ట్యూబ్ లో కవితా కృష్ణమూర్తి పాడిన ఒక్క ట్రాక్ (On Amrakuta Peak) దొరికింది..




Track list:
1. The Forlorn Yaksha 
Hariharan

2. Invocation To The Cloud 
Hariharan

3.The Path Of The Cloud
Hariharan

4. On Amrakuta Peak
Kavitha Krishna Murthy

5. Ripening Earth
Ravindra Sathe

6. Detour To Ujjain
Vishwa Mohan Bhatt(Instrumental)

7. The River Nirvindhya
Kavitha Krishna Murthy

8. The Mansions Of Ujjain
Kavitha Krishna Murthy

9. The Majesty Of Kailash
Ravindra Sathe

10. The Beautiful Yakshi
Kavitha Krishna Murthy

11. Lovelorn Yaksha
Ravindra Sathe

12. Farewell To The Cloud

Ravindra Sathe

raaga.com వాళ్ల దగ్గర ఈ కేసెట్ ఆడియో లింక్ ఉంది. మొత్తం పన్నెండు ట్రాక్స్ audio క్రింద ఉన్న రెండు లింక్స్ లో దేనిలోనైనా వినవచ్చు:

http://play.raaga.com/worldmusic/album/Kalidasas-Meghdutam-The-Cloud-Messenger-WM00111
or 
http://www.napster.de/artist/various-artists/album/kalidasas-meghdutam-the-cloud-messenger/

Wednesday, October 29, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -2


అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..


(నిన్నటి తరువాయి.. )

దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు.." అని చదివిన గుర్తు. బిక్కవోలు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్లి వచ్చేద్దాం అని డిసైడయ్యాం. 

శనివారం పొద్దున్నే తయారయ్యి ఏడున్నరకల్లా బస్టాండు కి చేరిపోయాం. అప్పటికే ఎండ వేసవిలా చికాకు పెట్టేస్తోంది. బిక్కవోలు మీదుగా వెళ్ళే బస్సు ఎక్కాం. కడియం, ద్వారపూడి రూటు. ఒకవైపు కడియం నర్సరీలు, మరోవైపు ఏదో కాలువ ఉంది. రోడ్డు పొడువునా చాలా దూరం మాతో పాటూ వచ్చిందది. ఆ కాలువకు అటు ఇటు కొన్ని చోట్ల తెల్లని రెల్లుదుబ్బులు, మరి కొన్ని చెట్లు, పొలాలు.. పైన నీలాకాశంలో తెల్లని మబ్బులు.. అసలా అందం వర్ణనాతీతం. ఎండగా ఉన్నా కూడా ఎంత బాగుందో..! 





కడియం సెంటర్లో ఈ అమ్మవారి విగ్రహం ఉంది. బస్సులోంచే రెండు మూడు పిక్స్ తీస్తే ఇది బాగా వచ్చింది..


ద్వారపూడిలో విగ్రహాలు ఇదివరకటి కన్నా ఇంకా కట్టినట్లున్నారు. బయట వైపు కృష్ణార్జునుల గీతోపదేశం విగ్రహం కొత్తది. చాలా బాగా చేసారు. అది ఫోటో తీసేలోపూ బస్సు ముందుకెళ్ళిపోయింది :( కెమేరా అయితే క్లిక్ దొరికుండేది. ఫోన్ కెమేరాకి అందలేదు. సుమారు గంటన్నరకి బిక్కవోలు చేరాం. ఎలానూ వచ్చాం కదా ముందర అన్నగారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. గుడి కిలోమీటర్ దూరం అన్నారు. నడుచుకుపోదాం సరదాగా అని బయదేరాం. దారిలో ఒక ఇల్లు అచ్చం 'లేడీస్ టైలర్' ఇల్లులా ఉంది. మరీ ఎదురుగా ఫోటో తీస్తే బాగోదని ముందుకెళ్ళి పక్కనుండి తీసా..




తర్వాత ఒక ఇంటి ముందు రెండు మూడు గుత్తులతో ద్రాక్ష తీగ ఉంది! భలే భలే అని దానికీ ఫోటో తీసా :)




ఆ పక్కనే నిత్యమల్లి చెట్టు చూసి ఆహా ఓహో అని గంతులేసేసా. గత కొన్నాళ్ళుగా ఈ విత్తనాల కోసం కనబడినవారినీ, కనబడని వారినీ.. అందరినీ అడుగుతున్నా. ఒక మొక్క ఉంటే ఇంక దేవుడికి పూలే పూలు. ఈ పూలు తెల్లవి కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. సరే ఆ విత్తనాలు కాసిని కోసి పొట్లం కట్టా. కాస్త ముందుకి వెళ్లాకా ఓ పక్కగా దడికి అల్లించిన పెద్ద పెద్ద ఆకుల బచ్చలితీగ ఉంది. విత్తనాలు లేవు. చిన్న ముక్క కట్ చేయచ్చు కానీ ఇంక అది పీకలేదు. ఊరెళ్ళేదాకా కాపాడ్డం కష్టమని :)




దారిలో కనబడ్డ విచిత్ర వేషధారి..

కాస్త ముందుకెళ్లగానే రోడ్డుకి కుడిపక్కన లోపలికి ఓ పాత గోపురం కనబడింది. ఏమీటా అని వెళ్లి చూస్తే ఏదో గుడి.. దగ్గరకు వెళ్ళి అడిగాము. 1100 ఏళ్ళ క్రితం కట్టిన పాత శివాలయమట అది. ఎవరు కట్టారో తెలీదుట. అప్పుడే గేటు తెరిచి తుడుస్తున్నాడు ఒకతను. గుడి చుట్టూరా బట్టలు ఆరేసి ఉన్నాయి. అది గుడి అనే స్పృహ లేనట్టే..! ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకున్నాం. చిన్న గుడి.. లోపల బాగా చీకటిగా ఇరుకుగా ఉంది. కాసేపు ఆ గోడలూ అవీ పరీక్షించేసి బయటకు వచ్చేసాం.





లక్ష్మీగణపతి దేవాలయానికి చేరాం. నాలుగేళ్ల క్రితం చూసిప్పుడు గుడి చుట్టూ పొలాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలో గుడి ఉన్నట్లు ఉంది! బయట తెల్ల తామరలు అమ్ముతుంటే కొన్నాం. లోపల చాలామంది అయ్యప్ప భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాస్త ఖాళీ అయ్యాకా మేము దర్శనం చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినలేదేమో గుడిలో పెట్టిన వేడి వేడి పులిహోర ప్రసాదం అమృతంలా అనిపించింది. గుడికి ఒకవైపు వరి పైరు, మరో వైపు చిన్న కొలను దాని చుట్టూ కొబ్బరిచెట్లు.. ఆ దృశ్యం చాలా బాగుందని కెమేరాలో బంధించా! 

best pic of the trip అన్నమాట :)


అక్కడ నుండి కుమారస్వామి గుడి దగ్గరే అని చెప్పారు. దారిలో ఎడమ పక్కన మళ్ళీ పొలాలు. కాస్త దూరంలో ఇందాకా చూసినలాంటి గుడి ఉంది పొలాల మధ్యన. అది కూడా శివాలయమే కానీ మూసేసారు. వెళ్ళేదారి లేదు అన్నారు అక్కడ పొలాల్లో పని చేస్కుంటున్నవారు.






కుమారస్వామి ఉన్నది ఒక శివాలయం.  గుడిలో మొత్తం శివ కుటుంబం ఉంది. చాళుక్యులు కట్టిన గుడిట అది. చాలా విశాలంగా ఉంది ఈ ప్రాంగణం కూడా. ప్రధానద్వారం ఎదురుగా గోలింగేశ్వరుడు పేరుతో శివలింగం ఉంది. ఇంకా మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహాలు, గణపతి విగ్రహం మరో పక్క కుమారస్వామి విగ్రహం ఉన్నాయి. ఈ కుమారస్వామి విగ్రహమే మహిమాన్వితమైనదిట. కానీ లోపల విగ్రహం పక్కగా గోడవారగా అభిషేకం చేసిన తేనె సీసాలూ, కొబ్బరి పీచు తుక్కూ అలానే పడేసి ఉన్నాయి.. ఏమిటో కాస్త బాధనిపించింది. తమిళనాడులో పురాతన ఆలయాలను వాళ్ళు ఎంత బాగా పరిరక్షించుకుంటారో.. మనవాళ్ళకు అసలు శ్రధ్ధే లేదు.. వాటి విలువే తెలుసుకోరు అనిపిస్తుంది కొన్ని ఆలయాల్లో ఇటువంటి అపరిశుభ్రపు వాతావరణాన్ని చూసినప్పుడల్లా! అక్కడే గుమ్మం పక్కగా "రుద్రిణి దేవి" పేరుతో ఒక ప్రతిమ ఉంది. ఆ దేవత ఎవరో.. ఎప్పుడూ వినలేదు పేరు. పూజారి ఇచ్చిన పుట్టమన్ను, విభూతి పెట్టుకుని బయటకు నడిచాం.


పొద్దున్న దిగిన బస్ స్టాప్ వద్దకు వచ్చేసాం. టిఫిన్ తినలేదు, ఎండలో నడిచి నడిచి ఉన్నామేమో బాగా అలసటగా అనిపించింది. కొబ్బరినీళ్ళు తాగి లేత కొబ్బరి తినేసాం. ఉడకపెట్టిన మొక్కజొన్నలు అమ్ముతుంటే చెరోటీ కొనుక్కుని తినేసాం. రెష్ గా ఉందని ఓ బస్సు వదిలేసిన అరగంటకు మరో రెష్ గా ఉన్న బస్సు వచ్చింది. ఇంక అదే ఎక్కేసాం. అరగంట నించున్నాకా సీటు దొరికింది. మొత్తానికలా 'దేవ్డా..' అనుకుంటూ రామిండ్రీ చేరాం. 

నిన్న సాయంత్రం మా బంధువులింటికి వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఇవాళ భోంచేసాకా అమ్మ కోరిక ప్రకారం ఉప్పాడ చీరల కోసం"తాడితోట" అనే చీరల దుకాణాల సముదాయానికి వెళ్ళాం అందరం. ఎప్పుడూ మావయ్యావాళ్ళు వెళ్ళే కొట్లోకి వెళ్ళి పర్సులు ఖాళీ చేసేసి.. హమ్మయ్య ఓ పనైపోయింది అనేస్కున్నాం. ఆ తర్వాత ఓ మాంచి స్వీట్ షాప్ కి వెళ్ళి పూతరేకులూ, తాపేశ్వరం కాజాలు, స్వీట్ బుందీ.. గట్రా గట్రా కొనేసాం. ఇంటికొచ్చి పెట్టెలు సర్దేసి, టిఫినీలు చేసేసి, మావయ్యని స్టేషన్ కు రావద్దని వారించి ఆటో ఏక్కేసాం. రైల్వేస్టేషన్లో పాపిడీ దొరికింది. అది కూడా కొనేస్కుని రైలెక్కేసాం. తత్కాల్లో బుక్ చేస్కోవడం వల్ల నాకు మళ్ళీ అప్పర్ బెర్త్ శిక్ష తప్పలేదు :(  తనకు తోడొచ్చినందుకు అమ్మ థాంక్యూలు చేప్పేసింది. రెండునెల్లుగా నానాగందరగోళాల్లో ఉన్న నాకూ రిలీఫ్ ఇచ్చావని నేనూ అమ్మకి థాంక్స్ చెప్పేసా.  

ఏదో మా ఆసామి ఆఫీసు పని మీద ఊరెళ్లబట్టి అమ్మకు తోడెళ్ళాను గానీ నేనెప్పుడు తన్ను వదిలి ఊరెళ్ళాననీ..?! వదిలేసి వెళ్లడమే... సుఖపడిపోరూ :-))))



Pandit Jasraj's charukesi..



నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు...
సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు. 


పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత విద్వాంసులు..


Tuesday, October 28, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -1




చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా వీలైనన్ని చూడని ప్రదేశాలు చూసిరావాలని అనుకున్నాం మేము. గత ఆరేళ్లలో రెండుసార్లు మా గోదావరి వైపుకి వెళ్ళాను. వేరే పనుల మీద వెళ్ళినా సమయం కుదుర్చుకుని కొన్ని ప్రదేశాలు చూసాం అప్పట్లో. అప్పుడా ప్రయాణం కబుర్లతో రెండు సిరీస్ లు నా బ్లాగ్ లో ఙ్ఞాపకాల గుర్తుగా పదిలపరుచుకున్నాను. 

ఆసక్తి ఉన్నవారి కోసం ఆ లింక్స్:
తూర్పుగోదావరి ప్రయాణం కబుర్లు:

యానాం - పాపికొండలు - పట్టిసీమ ప్రయాణం కబుర్లు:


ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా పదిరోజుల క్రితం మళ్ళీ అమ్మతో వాళ్ల పుట్టింటికి(రాజమండ్రి) బయల్దేరాం. ఎప్పటిలానే ట్రైన్ విజయవాడ చేరేసరికీ మెలకువ వచ్చేసింది. అప్పర్ బెర్త్ మీద ఉన్నందువల్ల క్రిందకిదిగలేకపోయా:( ఇక నిద్రపట్టలేదు. ఐదున్నరవుతూండగా పక్కసీట్లు ఖాళీ అవ్వగానే క్రిందకి దిగి హాయిగా కిటికీ పక్కన సెటిలయ్యా. వెలుతురు వస్తూనే పచ్చని పొలాలు.. వాటి వెనుక రారామ్మని మాకు ఆహ్వానం పలుకుతున్నటుగా వరుసగా నిఠారైన కొబ్బరిచెట్లు.. కొబ్బరాకుల వెనుక నుండి ఎర్రటి సూర్యకిరణాలు.. ఒక్కసారిగా నిద్రలేమి తాలూకూ చికాకు మాయమై మనసంతా హాయిగా అయిపోయింది. గబగబా ఫోన్ తీసి నాలుగు ఫోటోలు క్లిక్కుమనిపించా. 








అదేమిటోగానీ ఇన్నాళ్ళూ ఎక్కడో ఉన్న ప్రాణం ఒక్కసారిగా ఇప్పుడే తనువులో ప్రవేశించినట్లు నూతనోత్సాహంతో మనసంతా నిండిపోయింది. కిటికీలోంచి కనబడుతున్న ప్రతి చెట్టూ, ప్రతి పైరూ, ప్రతి ఆకూ పలకరిస్తున్నట్టే అనిపించింది. సూర్యుడు పైకి వచ్చేసాకా అసలా ఆకుపచ్చని పచ్చదనం చూడగానే ఆనందంతో పాటుగా.. ఈ నేలని ఈ మట్టినీ వదిలి ఆ దూర తీరంలో ఆ పొరుగూరిలో ఎందుకున్నట్లో.. అని పుట్టెడు దిగులు పుట్టింది. ఇలా అప్పుడప్పుడూ వచ్చిపోకపోతే ఇక్కడి మట్టివాసనని కూడా మర్చిపోతామేమో అనే బరువు ఆలోచన కలిగింది. ఇంతలో గోదావరి చూద్దువు లేవమని అమ్మ పాపని లేపి తీసుకువచ్చింది. కాస్త ఊహ వచ్చింది కదా.. కొత్తగా గోదారమ్మని చూస్తోంది అమ్మాయ్..! "అదిగో పాత బ్రిడ్జ్.. ఆ బ్రిడ్జ్ మించే సర్కార్లో కాకినాడ వెళ్ళేవాళ్ళం తెల్సా... చివరచివర్లో ఆ బ్రిడ్జ్ ఊగేది కూడానూ... అదిగో ఆ మధ్యలో కనబడుతున్న ద్వీపంలాంటిది లేనప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాం తెలుసా.. ప్రతిసారీ వెళ్ళీనప్పుడల్లా కాస్త కాస్త చప్పున పెరుగుతూ ఇలా ద్వీపంలా అయిపోయిందిది.. ఇలా కాయిన్స్ నీళ్ళల్లో వేసేవాళ్ళం..." అంటూ గబగబా కబుర్లు చెప్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ... "ఒకటే బ్రిడ్జికి ఎన్ని ఫోటోలు తీస్తావూ.." అని వేళాకోళం చేసింది. ఎన్ని ఫోటోలు తీసుకుంటే తనివితీరుతుందని చెప్పనూ...!?





 రాజమండ్రిలో మావయ్య ఇల్లు చేరాం. ఈసారి కూడా వేరే పని మీద వెళ్ళినా, ఉన్న రెండురోజుల్లో ఏవన్నా చూడని ప్రదేశాలు చూడాలని మా మావయ్య అనుమతితో వాళ్ల మనవరాలిని తీసుకుని బయల్దేరా..! నా పెళ్ళికి తోడపెళ్ళికూతురైన ఆ బుల్లి మేనకోడలు ఇప్పుడు వైజాగ్ లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసేసి నాకు గైడ్ అయ్యేంత పెద్దదైపోయింది.. ఇదే కాలం మహిమ :) 


ఆ రోజు శుక్రవారం. పిఠాపురంలో శక్తిపీఠం చూడాలని ఎప్పటి నుండో కోరిక. బస్ కాంప్లెక్స్ కి వెళ్తే సామర్లకోట వెళ్ళి, అక్కడ నుండి ఆటోలో పిఠాపురం వెళ్ళచ్చని చెప్పారు. కాకినాడ  బస్సు ఎక్కేసాం. దాదాపు గంటన్నరకి సామర్లకోట చేరిపోయాం. ఇంట్లో మేము బయల్దేరడమే లేటయినందువల్ల సామర్లకోట చేరేసరికీ పావుతక్కువ పన్నెండయ్యింది. గుడి పన్నెండింటికి మూసేస్తారేమో, ప్రయాణం వృధా అవుతుందని భయం. అందుకని షేరాటో ఎక్కకుండా డైరెక్ట్ గా పిఠాపురానికి ఆటో మాట్లాడేసుకున్నాం. గుడి చేరేసరికీ పన్నెండూ పది. ఇరవై నిమిషాల్లో చేరాం. చిన్నప్పుడు అమ్మో పిఠాపురం, అమ్మో రాజోలు.. అనుకునేవాళ్ళం. సిటీ దూరాలతో పోలిస్తే ఇవసలు దూరాలే కాదనిపిస్తుందిప్పుడు. ఇక్కడ అమ్మావాళ్ళింటికి నలభై కిలోమీటర్ల దూరం. మూడు బస్సులు మారి, ఒక షేర్ ఆటోలో వెళ్ళాలి. తరచూ వెళ్లట్లేదు కానీ పనున్నప్పుడు పొద్దున్నకెళ్ళి రాత్రికి వచ్చేస్తూ ఉంటాను.




పిఠాపురం గుడి పన్నెండున్నరదాకానని రాసి ఉన్న బోర్డు చూసి హమ్మయ్యా అనుకుని లోనికి అడుగుపెట్టాం. విశాలమైన ప్రాంగణం. దీనినే "పాద గయ"అని కూడా పిలుస్తారుట. ఈశ్వరుడు కుక్కుటేశ్వరస్వామి గా ఇక్కడ వెలిసాడు. అమ్మవారి పేరు పురుహూతిక. అమ్మవారి పీఠభాగం ఇక్కడ పడినందువల్ల ఈ ఊరికి పీఠికాపురం అని పేరు వచ్చి అదే పిఠాపురం అయ్యిందిట. ఈ క్షేత్రం తాలూకూ పురాణకథ ఇక్కడ .

శుక్రవారమైనా జనం ఎక్కువ లేరు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది గుడి. ముందర ప్రాంగణంలో ఉన్న మిగిలిన విగ్రహాలను చూశాము. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద వల్లభస్వామి గుడి అక్కడ ఉంది. శ్రీపాద వల్లభస్వామి ఈ క్షేత్రంలోనే ఆవిర్భవించారని ఇక్కడి స్థలపురాణంట. తెల్ల తామరతో అలంకరించిన విగ్రహం ఎంత బాగుందో చెప్పలేను. ఆలయం బయట పాదుకలు, మరో పక్క శంకరాచార్యులవారి విగ్రహం ఉన్నాయి. ఈ దత్తాత్రేయ అవతారం గురించిన వివరాలు, అక్కడ మిగతా ఫోటోలు క్రింద  లింక్ లో చూడచ్చు.

ఇక్కడ ప్రస్తుతం ఉన్నది అసలు అమ్మవారి శక్తిపీఠం ఉన్న స్థలం కాదట. దానిని గురించి రెండు మూడు కథనాలు విన్నాను. కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం పక్కగా దక్షిణముఖంగా ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అదే అసలు శక్తిరూపం అని అక్కడి అర్చకులు చెప్పారు. పదిరూపాయిలు టికెట్టు కి లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోనిచ్చారు. విగ్రహం పూర్తిగా బయటకు కనబడేలా కుడి పక్కన ఐమూలగా అద్దం అమర్చారు. అందులోంచి అమ్మావారు బాగా కనబడ్డారు. కాసేపు అలా నింఛుని ప్రార్థించి బయటకు వచ్చేసాం. ఆ పక్కగా కొత్తగా కట్టిన అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము గుడి మూసేసారు.

గుడి వెనుక వైపు ఉన్న తటాకాన్ని "పాదగయ" అంటారుట. అక్కడ స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన పుణ్యంట. మరణానంతరం గయుడనే రాక్షసుడి పాదాలు అక్కడ పడినందువల్ల పాదగయ అని పేరు వచ్చిందిట. ఆ రాక్షసుడి కథ  ఇక్కడ ఉంది. ఆ తటాకం పక్కనే గయాసురుడు పడి ఉన్న విగ్రహం, చుట్టూ త్రిమూర్తుల విగ్రహాలు అవీ ఉన్నాయి. 




ఆలయప్రాంగణంలో శారదాదేవి గుడి కడుతున్నారు.

తటాకానికి వెనుకవైపు ఉన్న గోశాల కూడా చూసేసి బయటకు వచ్చేసరికీ పన్నెండున్నర. కాసేపు ఎదురుచూశాకా షేర్ ఆటో దొరికింది. తిరిగి సామర్లకోట వచ్చేసి రాజమండ్రి బస్సు ఎక్కేసాం. సామర్ల కోటలో భీమేశ్వరస్వామిని కూడా చూద్దామనుకున్నా కానీ గుడి నాలుగింటికి గాని తెరవరన్నరని ఇంక బయల్దేరిపోయాం. అయినా అది చిన్నప్పుడోసారి చూసేసాను :)  

"కుక్కుటేశ్వరస్వామి గుడి వీధిలోనే ఇంకా ముందుకి వెళ్తే ఇంద్రుడు నిర్మించిన ఐదు మాధవాలయాలలో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉంది తప్పక చూడాల్సిన గుడి.. అదీ చూసి రండి.." అని మావయ్య చెప్పిన మాటలు మర్చిపోయాం!ఇంటికొచ్చాకా మావయ్య అడిగాకా గానీ గుర్తురాలే:(  ఇంక రేపు ఇంట్లో ఉండండని మిగతా పెద్దలన్నారు కానీ "ఇంత దూరం వచ్చారు కదా వెళ్ళనియ్యండి..ఇంట్లో కూచుని చేసేదేముంది.." అని మావయ్య మమ్మల్ని సపోర్ట్ చేసాడు పాపం. హమ్మయ్య అనుకుని రేపటి ట్రిప్ కి ప్లాస్ మొదలెట్టాం..


***     ***    ***

ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ..
http://lookingwiththeheart.blogspot.in/2014/10/blog-post.html







Wednesday, October 15, 2014

Uyire Uyire, Vennilave Vennilave.. & others


అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది.. అందుకని ఈ టపాతో ఈ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను.. నా లిస్ట్ లో మిగిలినవన్నీ కలిపి ఒకే టపాలో ఇరింకించేస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి :)


***   ***    ***


ఇవాళ మొదట బొంబాయి సినిమాలో నాకెంతో ఇష్టమైన + నా ఫేవొరేట్ సింగర్ పాడిన పాట..  Uyire  Uyire..






Minsara Kanavu



తమిళంలో "Minsara Kanavu", తెలుగులో "మెరుపు కలలు", హిందీలో "సప్నే" పేర్లతో వచ్చిన మూడు భాషల్లోని పాటలూ బోల్డంత పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా "Ooh la la la.."!! నాకింకా "Anbendra.."(చర్చ్ లో జీసస్ దగ్గర కాజోల్ పాడే పాట), "Vennilave Vennilave.." పాటలు ఇష్టం. ఇది కూడా హరిహరన్ పాడినదే :)

అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు: http://play.raaga.com/tamil/album/minsara-kanavu-t0000099 


బాగా ఇష్టమైన Vennilave Vennilave.. 




Kandukondain Kandukondain 


ప్రముఖ ఆంగ్లరచయిత్రి జేన్ ఆస్టిన్ నవల 'Sense and Sensibility'  ఆధారంగా తీసిన Kandukondain Kandukondain కూడా తెలుగులో 'ప్రియురాలు పిలిచింది' పేరుతో వచ్చింది. నాకిష్టమైన చిత్రాల్లో ఒకటి..:)
రెండు భాషల్లోని పాటలూ చాలా బావుంటాయి. రెహ్మాన్ ట్యూన్స్ కి వైరముత్తు సాహిత్యం. ఈ చిత్రంలో ఒకటీ, రెండూ అని చెప్పలేనంతగా పాటలు అన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకని అన్ని పాటలూ వరుసగా ఉన్న లింక్ ఇస్తున్నాను. 

 




                                        Rhythm




మళ్ళీ రెహ్మాన్ స్వరాలనందించిన మరో చిత్రం "రిథిమ్". సిన్మా బావుంటుంది. ఇందులో పాటలన్నీ ఫైవ్ ఎలిమెంట్స్(గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు) ని గుర్తు చేసేవిగా స్వరపరిచారు. 

ఈ ఐదు పాటల్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Rhythm-T0000257 

యూట్యూబ్ లో అయితే ఇక్కడ వినచ్చు. 



Julie Ganapathy


బాలూ మహేంద్ర దర్శకత్వం వహించిన "Julie Ganapathy" చిత్రానికి 'Misery' అనే ఆంగ్ల చిత్రం ఆధారం. ఇందులో సరిత, జయరామ్, రమ్యకృష్ణ ముఖ్యతారాగణం. మెలోడియస్ గా ఉండే ఈ చిత్రగీతాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రెండు పాటల్ని అప్పట్లోనే(అంటే సుమారు పంతొమ్మిది ఇరవై ఏళ్ల వయసులోనే) శ్రేయా ఘోషాల్ పాడారు. ఇతర భాషా గాయని అని పట్టుకోలేని విధంగా పాడగలగమే ఈ అమ్మాయిలోని టాలెంట్. మరోటి ఏసుదాస్, ఇంకోటి వారబ్బాయి విజయ్ ఏసుదాస్ పాడారు. చివరి పాట ప్రసన్న పాడారు. ఇది రమ్యకృష్ణ సోలో హాట్ సాంగ్ . ట్యూన్ బావుంటుంది. అందులో ముఫ్ఫై ఐదేళ్ళు దాటిన నటిలా ఏమాత్రం కనబడదీవిడ. అందుకే మరి రెండు మూడేళ్ళకే కనుమరుగయ్యే ఇప్పటి హీరోయిన్స్ లా కాక చాలా ఏళ్ల పాటు దక్షిణాది భాషాచిత్రాలన్నింటిలో తన ప్రతిభను కనబరచగలిగారు. 

ఈ చిత్రంలో పాటలన్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Julie-Ganapathy-T0000469


 *** *** *** 

ఈ సిరీస్ ని మొదటి నుండీ ఫాలో అయినవారెవరైనా ఉంటే.. ఓపిగ్గా చదివినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.


Tuesday, October 14, 2014

'Minnale' songs


మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే అటు, ఇటు రెండు పక్కాలా అయ్యేకే ఆపేవాళ్ళం మేము. పాటల కోసం, మాధవన్ కోసం సినిమా చూసాం కానీ భరించడం చాలా కష్టం అయ్యింది. కేవలం పాటల్ని విని ఆస్వాదించాల్సిందే తప్ప కథ జోలికి, సినిమా జోలికీ వెళ్ళకూడని సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా! 

చాలా మొదట్లో మాధవన్ జీ టివీలో "బనేగీ అప్నీ బాత్" అనే సీరియల్ లో వేసేవాడు. అప్పట్లోనే మా ఫ్రెండ్స్ అందరం తెగ మెచ్చేసుకునేవాళ్ళం భలే ఉంటాడు, బాగా ఏక్ట్ చేస్తాడని. ఆ సీరియల్ కూడా బావుండేది. సాగీ..సాగి..సాగీ...ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ టైటిల్ సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నా అప్పట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడీ అబ్బాయ్. ఇతని నవ్వు చాలా బావుంటుంది. Sweet smile!


మళ్ళీ పాటల్లోకి వచ్చేస్తే... ఈ పిక్చర్ థీమ్ మ్యూజిక్ ను ఫోన్లలో కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ పెట్టుకుంటున్నవాళ్ళు ఉన్నారు. 

 థీమ్ మ్యూజిక్ ..



అన్నింటిలోకీ నాకు బాంబే జయశ్రీ పాడిన "వసీగరా.." చాలా చాలా ఇష్టం. ఏ రాగమో కనుక్కోవాలి.. 

 



అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు:



Monday, October 13, 2014

'Duet' songs


పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ కేసెట్ కొనుక్కుని అవే వినేదాన్ని. బాలూ కూడా ఎంతో అద్భుతంగా పాడారా పాటలను. అన్నింటికీ సాహిత్యం వైరముత్తు రాసారుట.


ఈ ఆల్బం కి 'రాజు' ఏ.ఆర్.రెహ్మాన్ అయినా 'మంత్రి' మాత్రం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ గారే! ఆ Sax.. మెస్మరైజింగ్ అసలు!! ఈ ఆల్బంలో టైటిల్ ట్రాక్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న Sax bits రాజు అనే ఆర్టిస్ట్ ప్లే చేసారని వికీ చెప్పింది. మొత్తం పాటలు saxophone instrumental bitsతో పాటుగా వినాలంటే క్రింద ఉన్న రాగా.కామ్ లింక్ లో  వినవచ్చు :  http://play.raaga.com/tamil/album/duet-t0000042


యూట్యూబ్ లింక్స్ నాకు బాగా నచ్చే మూడూ పాటలకి మాత్రమే పెడుతున్నాను.. 

1) ఎన్ కాదలే ఎన్ కాదలే.. 

SPB voice అల్టిమేట్ అసలీపాటలో..




2)Vennilaavin Therileri.. 

amazing interlude bits..
 


3) anjali anjali..

just for the tune.. 
 


ఇంకా ఇవి కూడా సరదాగా బావుంటాయి...
 Kulicha Kuttalam 

Katheerika Gundu Katheerika 

Sunday, October 12, 2014

Veesum Kaatrukku..


"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించేది. ఓ రోజు నాన్న కేసేట్లలో వెతికి ఈ పాట అసలు మాతృక కనిపెట్టాను. ఉల్లాసం సినిమా రాక ముందు "Pocahontas" అనే యేనిమేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. నాకు బాగా నచ్చే యేనిమేషన్స్ లో ఒకటి అది. ఇందులో "Can you paint with all the Colors of the Wind" అనే పాటకు అకాడమీ అవార్డ్ వచ్చింది. చాలా బావుంటుందా పాట . ఇది కాక అందులో "Listen With Your Heart.. you will understand " అనే మరో పాట ఉంది. ఈ పాట పల్లవి, పల్లవి ముందర వచ్చే వేణువాదన tune ఆ పాటలోనిదే. ముందర తమిళ్ సాంగ్ వినేసి, తర్వాత క్రింద ఉన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వినండి.. తెలుస్తుంది మీకు.





Pocahontas - Listen With Your Heart  


ఈ సిన్మాలో ఇంకా Yaro yar yaro... , Muthae muthamma పాటలు బావుంటాయి.