Monday, September 24, 2012

శ్రావ్యమైన గజల్ "బర్ఫీ"





మంచి గజల్ వినటానికి శ్రావ్యంగా ఉంటుంది. కానీ ప్రతి గజల్ సాహిత్యంలోనూ అంతర్లీనంగా ఒక వేదన దాగి ఉంటుంది. అయినా కూడా ఏదైనా మంచి శ్రావ్యమైన గజల్ విన్నంత సేపూ హాయిగా ఎక్కడెక్కడో తేలిపోతాము. అచ్చం అలాంటి భావనే "బర్ఫీ " సినిమా చూస్తున్నంతసేపూ నాకు కలిగింది.
శ్రావ్యమైన గజల్ లా..
 ఐస్క్రీం అంత చల్లగా
వెన్నలాగ స్వచ్ఛంగా తెల్లగా
పట్టులాగ మృదువుగా
నెయ్యి అంత కమ్మగా 
చాక్లేట్ లాగ తియ్యగా..
ఉంది సినిమా.

హాయిగా తమదైన లోకంలో తిరగాడే బర్ఫీ,ఝిల్మిల్,శ్రుతి లతో పాటూ వెనక వెనకే తిరుగుతూ, బర్ఫీ చేసే చిలిపి పనులను చూస్తూ నవ్వుకుంటూ గడిపేసా నేనూ. ఒక భారమైన కథను ఎంతో హృద్యంగా, మన మనసులు బరువెక్కకుండా కథనానికి హాస్యపు రంగు వేసి lighter vein లో చూపించటం ఈ దర్శకుడిలోని అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి సబ్జెక్ట్ తో కోషిష్, ఖామోషీ, బ్లాక్ మొదలైన సినిమాలు వచ్చినా, మనకు నచ్చినా ఆ సినిమాలు చూస్తే మనసులు మరింత భారం అవుతాయి తప్ప తేలికవ్వవు. బర్ఫీ సినిమా చూస్తే మాత్రం కళ్ళు చెమ్మగిల్లినా మనసు తేలికౌతుంది. రెగులర్ ఫార్ములాసినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ వైవిధ్యమైన సినిమాలు నచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతితో, ఆనందంతో హాల్ లోంచి బయటకు వస్తారు.


 అనురాగ్ తీసిన సినిమాల్లో "Kites"  నన్ను చాలా disappoint చేసినా "Life in a... Metro", "Gangster" రెండూ కూడా నాకు బాగా నచ్చాయి. Gangster చూసిన కొన్నిరోజులపాటు అసలు నేను అదే సినిమా గురించి ఆలోచించాను. ఇతని గురించిన మరిన్ని వివరాల కోసం వికీ లోకి వెళ్లిన నేను అనురాగ్ ఆరోగ్యం గురించిన విషయాలు చదివి షాక్ అయ్యాను..! great guy..


And apart from all the other things in the film, Ranbir is amazing ! షమ్మీకపూర్ చిలిపితనాన్ని,అల్లరిని; రాజ్ కపూర్ నటననూ; శశికపూర్, రిషి కపూర్ నీతూసింగ్ ల అందం,హావభావాలు అన్నీ తనలో కలిపేసుకున్న ఈ ప్రతిభావంతుడైన కుర్రాడికి ఉజ్వలమైన భవిష్యత్తు తప్పక ఉందని మరోసారి గట్టిగా అనిపించింది. మొదటి సినిమా(Saawariya) ఫ్లాప్ అయినా అందులో కూడా పరిణితి ఉన్న నటుడిలానే కనిపించాడీ కుర్రాడు. "Rockstar" అయితే పూర్తిగా ఇతని సినిమానే. ఇక బర్ఫీ లో మూగ,చెవిటి కుర్రాడిలాక ఇతను కనబరిచిన నటన అత్యుత్తమం అనే చెప్పాలి. Silence speaks volumes అన్నట్లుగానే కేవలం facial expressions తోనే ఒక పేరాగ్రాఫ్ డైలాగ్ ఇవ్వగలిగిన ఇంప్రెషన్ ని ఇతను ప్రేక్షకుల్లో కలిగించాడు. 





 

పొగరు నిండిన కళ్ళతో నాకస్సలు నచ్చేది కాదు ప్రియాంక. అలాంటిది "What's Your Raashee?" లో పన్నెండు పాత్రల్లో జీవం నింపి నన్ను ఆశ్చర్యపరిచింది. "Fashion" లో మోడల్ గా నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె "Don 2" లో ఏక్షన్ హీరోయిన్ గా అందరినీ(నన్నూ) ఆకట్టుకుంది. ఇక "బర్ఫీ"లో ఒక డీగ్లామరైజ్డ్ పాత్రలో ఆమె నటనకు huge applause ఇవ్వాలనిపించింది. అందం,నటన,గ్లామర్ మూడూ ఉన్న చోట మరి ఆ మాత్రం గర్వం,పొగరు ఉండవా అనుకున్నా..!”వసంతకోకిల ’ సినిమాలో శ్రీదేవి పాత్ర కన్నా కష్టమైనది, ఎక్కువ లోతైనది బర్ఫీలో ’ఝిల్మిల్ ’ పాత్ర.. అటువంటి చాలెంజింగ్ పాత్రలో ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేకుండా ఒదిగిపోయింది ప్రియాంక.


చాలీచాలని బట్టలతో, హీరోతో డాన్సులు మాత్రం చేసే టిపికల్ తెలుగు హీరోయిన్ లాగ, ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో మాత్రమే ఇన్నాళ్ళు చూసిన ఇలియానా ను బర్ఫీలో ఒక బరువైన పాత్రలో చూడటం ఓ పేద్ద సర్ప్రైజ్ నాకు. నటీనటుల నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తెలిసిన దర్శకులు ఉండటం కూడా చాలా ముఖ్యమని మరోసారి ఇలియానా ఋజువు చేసింది. ఎర్రని బొట్టు, కళ్లనిండా కాటుక ఆ అమ్మాయి మొహానికి ఎంత అందాన్ని ఇచ్చిందో! కాటుక నిండిన ఆ పెద్ద పెద్ద కళ్ళని చూస్తే బాపూ ఈ అమ్మయితో ఓ సినిమా తీసేస్తాడేమో అనిపించింది. బస్సులో బర్ఫీ,ఝిల్మిల్ ల మధ్యన కూచున్నప్పుడు తన మొహంలో చూపిన భావాలు, బర్ఫీ మనసులో ఝిల్మిల్ ఉందని అర్ధమైనప్పుడు ఆమె కళ్ళతో కనబరిచే భావాలు నిజంగా ప్రశంసాపూర్వకంగా ఉన్నాయి.

 

గుర్తుండిపోయే కొన్ని సన్నివేశాల గురించి: 

చిన్నదైనా రూపా గంగూలీ(టివీ మహాభారత్ సీరియల్లో ద్రౌపది) పాత్ర గుర్తుండిపోతుంది. ఆమె కూతురికి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సన్నివేశం; బర్ఫీ మొదటిసారి శృతిని చూసే సన్నివేశం; శృతి ని పెళ్ళాడతానని అడగటానికి వచ్చి మళ్ళి తనంతట తానే వెళ్పోతూ ఆమెకు తాను తగనని బర్ఫి చెప్పే సన్నివేశం; బర్ఫీ ఝిల్మిల్ కోసం వచ్చి నిరాశతో వెనుతిరిగినప్పుడు ఝిల్మిల్ పిలుస్తోందని శృతి చెప్పే సన్నివేశం; ఝిల్మిల్ 'ముస్కాన్' తాతగారి వేలు వదిలాకా మళ్ళీ బర్ఫీ వేలు పట్టుకునే సన్నివేశం; చివరలో బర్ఫీ పక్కన ఝిల్మిల్ ఒదిగి పడుకునే సన్నివేశం.. మొదలైన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ గుర్తుండిపోతాయి. నాకు బాగా నచ్చింది బర్ఫీ తనకు ముఖ్యమని నమ్మిన మిత్రులందరినీ ల్యాంప్ పోస్ట్ దగ్గర పరీక్షించే సన్నివేశం. శృతి కూడా బర్ఫీ వేలు వదిలి ఆమడ దూరం పరిగెడుతుంది కానీ ఝిల్మిల్ అలానే నించుంటుంది. నిజంగా కళ్ళు చెమర్చాయి ఆ సన్నివేశంలో నాకు. స్వచ్ఛమైన ప్రేమకీ, స్నేహానికీ నిదర్శనం ఈ సన్నివేశం. మిన్ను విరిగి మీదపడ్డా మనల్ని వదిలివెళ్లని ఒక్క స్నేహం ఉన్నా చాలు కదా జీవితానికి అనిపించింది!! సినిమా చివరలో శృతి చెప్పే మాటలు కూడా అవే కదా. "నాది షరతులతో నిండిన పిరికి ప్రేమ... వాళ్ల ప్రేమ స్వచ్ఛమైనది.. నిబంధనారహితమైనది(Unconditional)...అందుకే వాళ్ల ప్రేమ గెలిచింది..." అంటుంది. 


 డైలాగులు ఎక్కువగా లేని ఈ సినిమాకి నేపధ్యసంగీతమే ప్రాణం. ప్రతి ఫ్రేం లోనూ కూడా వెనుక నుంచి వినబడే నేపథ్యసంగీతం మనసును ఆకట్టుకుంటుంది. ప్రీతమ్(సంగీత దర్శకుడు),అనురాగ్ ల జోడీ ఇంతకు ముందులాగనే బాగా కుదిరింది. "గేంగ్ స్టర్" కూడా ప్రీతమ్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందించాడు. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అసలు స్టన్నింగ్ విజువల్స్ అన్నమాట. వెంఠనే డార్జలింగ్ కి వెళ్పోవాలి అన్నంత అందమైన లొకేషన్స్ చూపెట్టారు. కథ ఎలాంటిదైన ప్రేక్షకుల్లో ఉత్సాహం,ఆతృత తగ్గకుండా ఉండేలాంటి కథనం ఉంటేనే సినిమా ఆకట్టుకుంటుంది. దర్శకుడివే కథ,స్క్రీన్ ప్లే కూడా. అందువల్ల మూడు విభాగాల్లోనూ కూడా అనురాగ్ సమతుల్యం చూపెడుతూ వచ్చాడు. మొత్తమ్మీద ఇది ఒక్కరి సినిమా కాదు.. పూర్తి టీమ్ వర్క్ ఈ సినిమా విజయానికి కారణం. 


బర్ఫీ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యిందని తెలిసాకా, ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈ దర్శకుడి ఆరోగ్యం బాగుండి, ఇతను మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని మనసారా కోరుకున్నా!


Saturday, September 15, 2012

Is life beautiful?


Is life beautiful?

yes Of course...! But if it comes to the telugu film.."Life is beautiful"..i felt.. some colours are really missing ! అందుకే ఆ జీవితం నాకు పెద్దగా అందంగా కనబడలేదు:(

మళ్లీ మరోసారి స్టుడెంట్స్ ..కాలేజ్ లైఫ్ చుట్టూ మనల్ని తిప్పే ఈ కథకు కాసింత ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతఅయ్యింది. కొత్త పిల్లలు(నటులు) తమవంతు కృషిని, శ్రమను తెరపై చూపెట్టగలిగారు కానీ ఎందుకో నాకు సినిమాలో ఏదో మిస్సయింది అనిపించింది నాకు. చాలారోజులకు అమల ను చూద్దాం అని ఉత్సాహపడిన నాకు తన పాత్ర ఎక్కువలేకపోవటం నిరుత్సాహాన్ని కలిగించింది. బహుశా నేను సినిమా నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానేమో అనిపించింది.

శేఖర్ కమ్ముల మొదటి సినిమాను చూడలేదు కానీ 'ఆనంద్', 'గోదావరి', 'హేపిడేస్' మూడు బాగా నచ్చాయి నాకు. ఆవకాయ్ బిర్యాని, లీడర్ పర్వాలేదు అనుకున్నా. ఇక ఈసారి అమల, కొత్త నటులు, రెఫ్రెషింగ్ థీమ్,కాన్సెప్ట్ కూడా బాగుంది....ఇవన్నీ విని,చదివి ఎక్కువే ఆశ పడిపోయాను. mother sentiment, చిన్న పాప నటన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో పాప మాటలు బాగున్నాయి. కంట తడి తెప్పించాయి..! కానీ సంగీతం కూడా శేఖర్ పాత సినిమాల ధోరణిలోనే కాస్త డల్ గా అనిపించింది.

ఇక నాకు అస్సలు నచ్చని విషయం చిన్నపిల్లలా ప్రేమ వ్యవహారాలూ. పదహారు,పదిహేడు వయసు పిల్లలతో తీసే ప్రేమ సినిమాలు అంటే నాకు భలే కోపం అసలు. ఎందుకని ఇలా ? చివరికి ఏం నీతి చెప్తే ఏమిటి? సినిమా అంతా చూపిస్తున్నారా లేదా? మన ఇంట్లో మనం మన ఇళ్ళల్లో అ వయసులో అలాంటి వ్యవహారాల్లోకి దిగితే సహించగలమా? ఎంసెట్ కి ప్రిపెరయ్యే పిల్లలు, డిగ్రి చదివే పిల్లలు.. కాలం అలానే ఉంది ప్రపంచాన్ని చూసి మాట్లాడు తల్లీ అనొచ్చు ఎవరన్నా! కానీ ఎందుకో నాకైతే చిన్న పిల్లలతో అలా సినిమాల్లో ప్రేమ,దోమ చూపిస్తే నచ్చదు. అసలు 'శ్రియ' లాంటి సీనియర్ నటిని ఆ చిన్న పిల్లాడి పక్కన చూస్తేనే నాకు వికారం వచ్చింది. 'u too brutus?' అన్నట్లు 'u too sekhar?' అని అడగాలనిపించింది. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన జంధ్యాల చదువుకునే పిల్లలతో తీసిన సినిమాలనే నేను విమర్శించేదాన్ని. ఏదో కొత్త రకంగా తీస్తున్నాడని, తెలుగు తెరకు మరో విభిన్న దర్శకుడు దొరికాడేమో అని సరదాపడ్డాను. ప్చ్..!

తన టార్గెట్ ప్రేక్షకులు మధ్యతరగతి యువత అని ఒక ఎఫ్ ఎం.రేడియోలో శేఖర్ చెప్పినట్లు ఈ సినిమా యువతకు బాగా నచ్చవచ్చు. But i feel sekhar has definetly lost his magic somewhere around "happy days" itself! ఇకపోతే, "Beauty lies in the eyes of the beholder " అన్నట్లు చూసే కళ్ళను బట్టే కదా.. నా కళ్ళలోనే ఏదన్నా దోషం ఉందేమో మరి..అందుకేనేమో నాకు ఈ 'లైఫ్' బ్యూటిఫుల్ గా ఉన్నా కాస్త రంగు తక్కువగానే కనపడింది..

Tuesday, September 4, 2012

పుట్టినరోజు


" అమెరికా ప్రెసిడెంట్ పుట్టినరోజు ఎప్పుడో తెలిస్తే, ఆయనకు కూడా తలంటు పోసేసి, హేపీ బర్త్ డే చెప్పేసి వస్తుంది మీఅమ్మ" అనేవారు నాన్న. " పాలవాడిదీ, పేపరబ్బాయిదీ కూడా పుట్టినరోజులు కనుక్కోవే.." అనీ, " అసలుజంధ్యాలకు చెప్పు నాన్నా.. శ్రీలక్ష్మితో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నెక్స్ట్ సినిమాకి తయారుచేసుకుంటారు" అనీ అనేవాళ్లంమేము. అలా మేం ఎన్ని వేళాకోళాలు చేసినా అమ్మ మాత్రం ఇప్పటికీ తన హాబీ కంటిన్యూ చేస్తూనే ఉంది. అదేమిటంటేతనకు తెలిసిన బంధుమిత్రులందరి పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ గుర్తు ఉంచుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పటం. మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డో, ఇన్లాండ్ కవరో లేదా కనీసం కార్డ్ ముక్క లో అయినా విషెస్ రాసేసేది. ఇప్పుడుఫోన్లు చేస్తోంది. అంతే తేడా.

సన్నిహిత మిత్రులకూ, సమీప బంధువులకూ శుభాకాంక్షలు చాలా మంది చెప్తారు. కానీ అమ్మ వెరైటీగా పక్కింట్లో ఖాళీచేసి వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని "వదినగారూ మీ రెండోవాడి పుట్టినరోజు రేపు. మా అందరి విషెస్చెప్పండి..." అంటూ కార్డ్ రాసి పోస్ట్ చేసేది. ఇది విజయవాడలో మా పక్కన ఉండి వెళ్ళిపోయినవాళ్ళ సంగతి మాత్రమే. కాకినాడలో మా పై ఇంట్లో అద్దెకు ఉండి వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని కూడా శుభాకాంక్షలు తెలపటం మాకునవ్వు తెప్పించేది. ఒకళ్ళు బ్యాంక్లో చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీలేదు. విజయవాడలో మాకు తెలిసినవాళ్లఅబ్బాయి పెళ్ళి కుదిరితే, పెళ్ళికూతురు కూడా అదే బ్యాంక్ అని తెలిసి, అమ్మ వాళ్ల బ్యాంక్ కు వెళ్ళి అమ్మాయినిపరిచయం చేసుకుని ఫలానావాళ్ళు తెలుసా? ఫలానా సంవత్సరంలో ఫలానా ఊళ్ళో చేసారు.. అంటూ వివరాలు చెప్పి పెళ్ళికూతురు ద్వారా మొత్తానికి వాళ్ల అడ్రసు సంపాదించింది. చిన్నప్పుడు వేళాకోళం చేసినా పెద్దయ్యాకా నాకూ పిచ్చిఅంటుకుంది. చాలా ఏళ్ళపాటు బంధుమిత్రులందరికీ స్వయంగా గ్రీటింగ్స్ తయారు చేసి మరీ పంపేదాన్ని. ఈమధ్యఈమధ్యనే విసుగెత్తి చాలావరకూ పంపటం మానేసాను. అతిమంచితనానికి పోయి విషేస్ చెప్తే జవాబివ్వనివారుకొందరైతే, ఏదో అవసరం ఉండి వంకతో పలకరిస్తున్నాననుకుని అపార్ధాలు చేసుకునేవారు కొందరు. అమ్మ మాత్రంఇప్పటికీ అక్కచెళ్ళెళ్ళ,అన్నయ్యల పిల్లలవీ, వాళ్ళ మనవలవీ, సన్నిహిత మిత్రులందరివీ పుట్టినరోజులన్నీ గుర్తుఉంచుకుని అందరికీ ఫోన్ చేసి విషెస్ చెప్తుంటుంది.

ఊళ్ళోవాళ్ళ సంగతి ఇలా ఉంటే ఇక ఇక ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు అమ్మ ఎలా చేస్తుంది? మా అందరికీ డేట్స్ ప్రకారం, తిథుల ప్రకారం రెండు పుట్టినరోజులూ జరిపేది. అలా ఏటా మాకు రెండుపుట్టినరోజులు చేసుకోవటం అలవాటేపోయింది. అంతేకాక నాకూ, నాన్నకూ స్పెషల్గా మూడు పుట్టినరోజులు ఉన్నాయి. ఎలాగంటే ఓసారి ఒకాయన మాఇంట్లోవాళ్లజాతకాలన్నీ వేసి, నాన్న పుట్టినరోజు ఎప్పుడూ చేసుకునే రోజు కాదనీ, ఆయన పుట్టిన సంవత్సరంలో ఫలానానెలలో ఫలానాతారీఖనీ చెప్పారు. కానీ అప్పటికి నలభైఏళ్లపైగా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్న తారీఖునిమార్చలేక అదీ, కొత్తగా తెలిసిన తారీఖుదీ, తిథుల ప్రకారం కలిపి నాన్నకు మూడు పుట్టినరోజులూ చేసేయటంమొదలెట్టింది అమ్మ. ఇక నేనేమో అసలు అధికమాసంలో పుట్టానుట. కానీ అధికమాసం అస్తమానం రాదుకదా...వచ్చినప్పుడు మూడూ చేసేసేది అమ్మ. అందుకని నావీ మూడు పుట్టినరోజులే!

విధంగా రెండేసి,మూడేసి పుట్టినరోజులు జరుపుకునే సరదాని మా అందరి నరనరాల్లో జీర్ణింపచేసింది మా అమ్మ. నాపెళ్ళి కుదిరిన తర్వాత జాతకాల నిమిత్తం అబ్బాయి జాతకం పంపారు పెళ్ళివారు. మరో వారంలో అబ్బాయి పుట్టినరోజని కాయితంలో చూసి అందరం హడావిడి పడిపోయాం. నేనేమో కష్టపడి నాన్న కేసెట్లన్నీ వెతికి
వివాల్డీ, మొజార్ట్ దగ్గరనుండీ ఎల్.సుబ్రహ్మణ్యం వరకూ నానారకాల సంగీతాలతో ఒక సీడీ తయారుచేసి అబ్బాయికి పంపించాను. ఏంఅంటాడో అని ఆత్రంగా ఎదురుచూస్తూంటే అబ్బాయి ఫోన్ వచ్చింది... "సీడీ విన్నాను..బాగుంది. కానీ నాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు..." అన్నాడు. దాందేముంది పెళ్లయాకా మాకులాగానే రెండుకాకపోయినా ఒక్క పుట్టినరోజన్నా చేద్దాంలే అనుకున్నా నేను. తీరా పెళ్లయ్యాకా చూస్తే సెలబ్రేషన్ సంగతటుంచి అసలుపుట్టినరోజుకి అయ్యగారు కొత్త బట్టలు కూడా కొనుక్కోరని తెలిసి అవాక్కయ్యాను. 'రేపు మీ పుట్టినరోజండి..' అని నేనేగుర్తుచేసాను. అంతలో మరో కొత్త విషయం చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చారు..

తన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో డౌట్ ఉందని చెప్పేసరికీ ముచ్చెమటలు పోసాయి నాకు. పుట్టినరోజు అంటే అదోఅద్భుతమైన రోజని నమ్ముతూ సంవత్సరం అంతా రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను నేను. ఊరందరికీపుట్టినరోజులు చేసేస్తుంది మా అమ్మ. అలాంటిది శ్రీవారి డేట్ ఆఫ్ బర్తే డౌటంటే... ఎలా? అని తెగ బాధ పడిపోయాను. అప్పుడిక లాభం లేదని విక్రమార్కుడి చెల్లెల్లు అవతారం ఎత్తేసాను. మా అత్తగారి ఊళ్ళో ఆయన హాస్పటల్లో పుట్టారోకనుక్కుని, అక్కడికి మనిషిని పంపి, నానా తంటాలు పడి మొత్తానికి నెలరోజుల్లో శ్రీవారి అసలైన పుట్టినరోజుకనుక్కున్నా. అదృష్టవశాత్తు పాత రిజిస్టర్లు ఇంకా హాస్పటల్లోవాళ్ల దగ్గర ఉండటం వల్ల అది సాధ్యమైంది. హమ్మయ్య! అనుకుని అప్పటినుండీ చక్కగా తన పుట్టినరోజు కూడా నేనే చేసేసుకుంటున్నా. అంటే పట్టుబట్టి సెలబ్రేట్ చేసేది నేనేకాబట్టి విధంగా ఇదీ నా పుట్టినరోజు క్రిందే లెఖ్ఖలోకి వస్తుందన్నమాట..:)

ఇంతకీ అసలు చెప్పొచ్చేదేమిటంటే
ఇవాళ నా పుట్టినరోజు! ఇది అధికబాధ్రపదం కాబట్టి నా నిజమైన తిథులపుట్టినరోజుకూడా నిన్ననే అయ్యింది. ఇంకా ఎప్పుడూ చేసుకునే తిథులపుట్టిన్రోజు మళ్ళీ నెల్లో ఇంకోటి ఉంది :)


Sunday, August 19, 2012

ఇదీ కథ !




.....ఎక్కడ నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు... అసలు నా బ్లాగ్ నేను మళ్ళీ ఇన్నాళ్లకు.. దాదాపు రెండు నెలల తర్వాత చూసుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది ! మూడేళ్ళ మూడు నెలల ప్రియమైన బుజ్జాయి నా ఈ బ్లాగ్. అసలు ఇన్నాళ్ళు రాయకపోవటం అటుంచి అసలు చూసుకోవటం కూడా కుదరలేదు :( ఆ మధ్యన ఒకసారి నెట్ సెంటర్ కి వచ్చినా బ్లాగ్ చూసుకోవటం కుదరలేదు. జీవితం ఎంతో చిత్రంగా మలుపులు తిప్పుతూ వేగంగా తనప్రవాహంతో పాటుగా ఎటు తీసుకుపోతోందో తెలీకుండా రోజులు గడిచిపోతున్నాయి. బ్లాగ్ రాయలేకపొతున్నానన్న బాధ ఉన్నా.. బావుంది.. ఇలానే బావుంది.

గడిచిన మూడు నెలల కాలంలో రకరకాల సమస్యలు; ఆ తర్వాత ప్రియబ్లాగ్మిత్రుడు, తమ్ముడు శంకర్ హఠాన్మరణం... అన్నీ ఒక్కసారిగా జీవితాన్నీ,మనసునీ కుదిపేసాయి. ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేసాయి... ఏం జరుగుతోందో తెలీని అయోమయంలో,వేదనలో కొట్టుకుపోతున్న సమయంలో చీకటి వెనుక ఓ వెలుగురేఖ కనపడింది. కష్టకాలంలో అభయమిచ్చి నేనున్నానని తెలిపే భగవంతుడు నిజంగా మాకొక వరాన్నే అందించాడు. ఎటువంటి రికమెండేషన్ లేకుండా మేము నాలుగునెలలుగా ఎదురుచూస్తున్న మంచి స్కూల్ లో పాపకు సీట్ వచ్చింది. అప్పటికి మేము ఆశ వదిలేసుకుని పాపను పాత స్కూల్లోనే చేర్చేసాము. చేర్చిన పదిరోజులకి, చివరిసారి రిజల్ట్ కోసం చాలా నిస్తేజంగా నేను ఆ స్కూల్ కి వెళ్ళాను. నోటీస్ బోర్డ్ లో చివరి సీట్ మా పాపకు వచ్చినట్లు చూడగానే కళ్లవెంట నీళ్ళు జలజలా కారాయి..! తనకు ఫోన్ చేసాను కానీ నోట మాట రావట్లేదు చెప్పటానికి.. ఆ ఆనందం మరవలేనిది ! ఇక పాప భవిష్యత్తు గురించిన బెంగ లేదు !


ఆ తర్వాత జీవితంలో ఎంతో కాలంగా మేము ఎదురుచూస్తున్న మార్పులన్నీ ఒకదాని వెనుక ఒకటి వాటంతట అవే జరిగిపోయాయి. మరో పదిరోజుల్లో పాపస్కూల్ కు దగ్గరగా ఇల్లు మారటం, పాపని కొత్త స్కూల్లో చేర్చటం, పొద్దుటే నాకు కేరేజీలు కట్టే హడావుడి.. మొదలైపోయింది. అయితే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వీలయినన్నాళ్ళు ఇంటర్నెట్ కానీ, కేబుల్ కనక్షన్ కానీ పెట్టించుకోకూడదు అని. న్యూస్ పేపర్ మాత్రం వేయించుకుంటున్నాం. పని చేసుకుంటూ వినటానికి రేడియో, ఎఫ్.ఎంలు ఉన్నాయి. ఖాళీ దొరికితే చూడటానికి సీడిలు, చదవటానికి పుస్తకాలు ఉన్నాయి. ఇక టివి,నెట్ కనక్షన్ అనవసరం అనిపించింది. నెట్ సెంటర్ కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కావాలన్నా వెళ్లలేనంత దూరం. నేనయితే ఆలోచనలకు కూడా ఖాళీ అనేది ఉండకూడదు అని పనిమనిషిని కూడా పెట్టుకోలేదు. రోజంతా పనులతోనే గడిచిపోతోంది. ప్రస్తుతానికి పాప వచ్చాకా మిస్సయిన రెండు నెలల పాఠాలూ, హోంవర్క్ చేయించటం సరిపోతోంది. కొన్నాళ్ళపాటు ఇలానే ఉండాలని కోరిక. అయితే అమ్మావాళ్ళే నలభై కిలోమీటర్ల దూరం అయిపోయారు. తరచూ వెళ్లటం చాలా కష్టం ఇకపై..!


నా మొక్కలు ఓ పదిహేను కుండీలు తెచ్చుకున్నాను. ఇంక లారీలో పట్టలేదని మరో పదో పన్నెండో ఉండిపోయాయి... ఎప్పటికి తెచ్చుకుంటానో అని వాటిని రోజూ తలుచుకుంటూ ఉంటాను. మొత్తం సామానంతా కొత్తింట్లో సర్దేసరికీ విరక్తి వచ్చింది. అసలు ఎందుకు ఇంత సామాను పెంచుకున్నానా అని నన్ను నేనే తిట్టేసుకున్నాను. ఏదీ పడేయలేను...ఉంచలేను. నిజం చెప్పాలంటే మూడొంతులు సామానంతా నేను పోగేసినదే!! నాలుగైదు పెద్ద అట్టపెట్టల పుస్తకాలు అన్నీ నావే. పుస్తకాల అట్టపెట్టెలు తెరవకుండా ఇంకా అలానే ఉంచేసాను. అసలు నేను చనిపోతే నా తాలూకు సామానంతా ఏమౌతుందా అని ప్రశ్న కలిగింది..?! పాకల్లో ఉండేవాళ్లకు ఇంత సామాను ఉండదు కదా? అయినా వాళ్ళు బ్రతకటం లేదా? మరి నాకెందుకు ఇంత సామాను? ఈసారి సమయం లేకపోయింది కానీ మళ్ళీ ఇల్లు మారే సమయానికి వీలయినంత సామాను ఎలిమినేట్ చేసేయాలని నిర్ణయించుకున్నాను.









ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం అవటం వల్ల మా ఇంటి చుట్టురా చాలా వరకూ పెద్దపెద్ద చెట్లు, పొలాలు, కూరగాయల పొలాలు ఉన్నాయి. అసలు సిటిలో ఉన్న భావనే లేదు. ఇటువంటి ప్రశాంత పల్లెవాతావరణంలో ఉండగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాకింగ్ కి ఆదివారాలు కూడా మానకుండా తప్పనిసరిగా వెళ్తున్నాను. పొద్దుటే కాలుష్యంలేని చల్లని గాలి, చుట్టూరా పచ్చదనం చూస్తుంటే అసలు కొత్త ఉత్సాహం మనసంతా నిండిపోతుంది. చుట్టురా బోలెడు రకల మొక్కలు.. అన్నీ ఆకుపచ్చ రంగువే కానీ అందులోనే ఎన్ని రంగులో.. అసలు ఆకుపచ్చ రంగులో ఇన్ని షేడ్స్ ఎలా ఉన్నాయబ్బా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ చుట్టుపక్కలమొక్కలన్నీ చూస్తుంటే. "ఎన్నెన్నో వర్ణాలు.." అని పాడాలనిపిస్తుంది. క్రమం తప్పని ఉదయపు నడక, రోజంతా శరీరానికి కావాల్సినంత శ్రమ ఇక నిద్రలేమిని దూరం చేసేసాయి. నిద్రపోయే సమయానికి ఆటోమెటిక్ గా కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు. టివీ, ఇంటర్నెట్ ఉంటే ఎంత సమయం వృధా అయిపోయేదో కదా అనుకుంటూ ఉంటాము మేమిద్దరమూ.


ఇప్పుడు మాదేమో గేటేడ్ కమ్యూనిటీ. ఇక్కడి మనుషులనూ, ఫ్లాట్స్ ని చూసినప్పుడల్లా బ్లాగ్మిత్రులు కృష్ణప్రియ గారి గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు గుర్తుకువస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనుషులను వారివారి ఫ్లాట్ల నంబర్లతోనే గుర్తిస్తారు. అవన్నీ మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే కబుర్లు ! మా ఇంటి చుట్టూరా ఉన్న పొలాల ఫోటోలు కొన్ని తీసాను అవి ఇక్కడ -http://lookingwiththeheart.blogspot.in/2012/08/blog-post.html చూడండి.. ఇంకా తీద్దామంటే ఇల్లుమారిన తర్వాత కెమేరా ఛార్జర్ ఇంకా దొరకలేదు..:( అది దొరికితే మరికొన్ని తీయగలుగుతాను. ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఇంకా ఎక్కువ కాయగూరల పొలాలు ఉన్నాయి. చాలా బావున్నాయి. మొన్నసారి వెళ్ళినప్పుడు కెమేరా మర్చిపోయాను. మళ్ళీ ఎప్పుడన్నా బ్లాగ్ రాసినప్పుడూ ఆ ఫోటోలు పెడతాను..


ఇదీ కథ ! ఇందుమూలంగా నాకర్ధమైందేమిటంటే మనకి జీవితంలో ఏది ఎప్పుడు అవసరమో అది భగవంతుడే ఇస్తాడు. అవసరం లేనిది ప్రాకులాడినా రాదు. మనకు అవసరం ఉన్నది వద్దన్నా మనకు దక్కకుండా ఎక్కడికీ పోదు..!! రాసే అలవాటు పోయి వేలు నెప్పెడుతోంది టైప్ చేస్తుంటే..:) ఇలా పచ్చదనంతో పాటుగా సాగుతోంది జీవితం... ఇక్కడ మజిలీ ఎన్నాళ్ళో..ఏమో.. !!


Monday, June 18, 2012

"మెహదీ హసన్" స్మృత్యర్థం.."రంజిషీ సహీ..."


ఇటీవలే స్వర్గస్థులైన గజల్ రారాజు "మెహదీ హసన్" స్మృత్యర్థం... నాకు బాగా ఇష్టమైన గజల్ "రంజిషీ సహీ..." !


ఈ గజల్ మొదట పాపులర్ అయ్యింది "మెహదీ హసన్" గళంలో. తర్వాత రూనాలైలా, ఆశాభోంస్లే తదితరులు పాడిన వెర్షన్స్ కూడా ఉన్నాయి. రూనాలైలా పాడిన ఈ గజల్ గురించి గతంలో రాసిన టపా.. http://samgeetapriyaa.blogspot.in/2010/08/runa-lailas.html



రచన: Ahmed Faraz








సాహిత్యం నాకు అర్థమైన అర్ధాలతో పాటూ:


रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिए आ ।


रंजिश= వైరం/శతృత్వం


पहले से मरासिम न सही फिर भी कभी तो
रस्म-ओ-रह-ए-दुनिया ही निभाने के लिए आ ।


मरासिम=ఒప్పందం/బంధుత్వం
रस्म-ओ-रह-ए-दुनिया= సమాజపు కట్టుబాట్లు

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से ख़फ़ा है तो ज़माने के लिए आ ।


सबब= కారణం
ख़फ़ा= కోపం


कुछ तो मेरे पिन्दार-ए-मुहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिए आ ।


पिन्दार= స్వాభిమానం


एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ ।


लज़्ज़त-ए-गिरिया= బాధ/కన్నీరు తాలూకు రుచి
महरूम= లేకుండా
राहत-ए-जाँ=ప్రశాంత జీవితం


अब तक दिल-ए-ख़ुश’फ़हम को तुझ से हैं उम्मीदें
ये आख़िरी शम्में भी बुझाने के लिए आ ।


दिल-ए-ख़ुश’फ़हम= ఆశావాద హృదయానికి,
शम्में= కొవ్వొత్తి





తొలకరి వర్షపు హేల


వర్షాకాలం వస్తోంది అంటే "బాబోయ్ వర్షం" అని భయపడిపోయే నేను ఈసారి ఎప్పుడెప్పుడు వాన పడుతుందా అని చాతకంలా ఎదురుచూసాను. మరి ఈసారి వేసవి మనసునీ, శరీరాన్నీ కూడా అంతగా మండించింది. చిన్నప్పటి నుండీ విజయవాడ మండుటెండలకు అలవాటుపడిన ప్రాణం కూడా ఈఏటి వేడిమిని భరించలేకపోయింది. ఈ ఇంట్లోని సదుపాయాలను సరిగ్గా చూసుకోకుండా అద్దెకు చేరటం మేము చేసిన పేద్ద పొరపాటని ఈ వేసవి వచ్చేదాకా తెలీలేదు మాకు:( చాలాఏళ్ల తరువాత కూలర్లు, ఏసీ, కనీసం వట్టివేళ్ల తడికలు కూడా లేకుండా నానారకాల ఇబ్బందులతో రెండునెలలూ ఎలానో గడిపేసాము..! నాలుగురోజుల క్రితం ఊళ్ళో చాల చోట్ల వాన పడిందిట కానీ మా దగ్గరకి రాలేదు. ఇక మేము ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది.. నిన్న !




ఎన్నాళ్లకెన్నాళ్ళకెన్నాళ్ళకన్నట్లుగా నిన్నటి రోజంతా కురిసి కురిసి మురిపించి పులకింతలు రేపి వెళ్ళింది వాన. వర్షానికి తోడొచ్చిన చల్లని గాలి మనసు నిండా ఆనందం నింపింది. రెండ్రోజుల క్రితమే వాతావరణం చల్లబడిందని చల్లిన విత్తనాల్లోంచి తలలెత్తిన బుల్లి బుల్లి ఆకులు కూడా నిన్ననే ఆకాశాన్ని చూశాయి. మేఘాలు గొంతులెత్తాయి.. చెట్టు, చేమా, పుట్టా, గట్టూ, రోడ్డు, మట్టీ, మనిషీ, మనసూ.. అన్నీ తడిసి చల్లబడ్డాయి. పచ్చదనం కొత్త అందాలను సంతరించుకుంది. అప్రయత్నంగా "చినుకు చినుకు చినుకు చినుకు..." పాట గుర్తుకొచ్చింది. ఎండ వేడికి ఎండిన మట్టిపై కురిసిన పన్నీటి జల్లుల తొలకరి వాన తెచ్చిన కమ్మని మట్టివాసనను పీల్చుకుని మనసు ఉప్పొంగిపోయింది. కష్టమంటే ఏమిటో తెలిస్తేనే సుఖంలోని ఆనందం బోధపడేది. చల్లదనం కోసం, తొలకరి చినుకు కోసం తపించిపోయాకా.. ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్ష్యమై వరమిచ్చినట్లుగా రోజంతా వర్షం కురవటం చెప్పలేని సంబరాన్ని కలిగించింది.






కాస్తంత నలతగా ఉండటం వల్ల వర్షంలోకి వెళ్ళి తడవలేకపోయినా ఇంట్లోంచే చూసి ఆనందించాను. గత రెండు నెలలుగా భరించలేకపోతున్న పవర్ కట్స్ వల్ల ...కరెంటు పీకగానే మళ్ళీ ఇచ్చేదాకా ఆ కరెంటుఆఫీసు వాళ్లని వచ్చిన నానారకాల తిట్లన్నీ తిట్టేసుకునే నేను నిన్న సాయంత్రం నాలుగింటికి తీసేసి పన్నెండు దాటినా పవర్ ఇవ్వని కరెంట్ఆఫీసువాళ్ళని ఒక్కసారి కూడా తిట్టుకోలేదంటే అదంతా వర్షం మహిమే. వానలో ఆడుకుని ఆడుకుని పిల్లది కూడా గుమ్మంలోనే తలగడ వేసుకుని నిద్రోయింది. కేండిల్ లైట్ లోనే వంట చేసి, red fm వాళ్లు వినిపిస్తున్న తియ్యని ఆపాత మధురాలను వింటూ కేండిల్ లైట్ డిన్నర్ కూడా చేసేసాం. ఒకదాని తర్వాత ఒకటిగా అద్భుతమైన పాటలు మనసుల్ని రంజింపజేసాయి. బయట చల్లదనానికి కరెంట్ లేకపోయినా నిద్ర ముంచుకొచ్చేసింది.



ఎటొచ్చీ డాబా పైనుంచి క్రిందకు పారిన వర్షపు నీరంతా వృధా అయ్యిందని మాత్రం బాధ కలిగింది. అదంతా నిలువ చేస్తే నాలుగు రోజులు రెండువాటాల వాళ్లం వాడుకోదగ్గ నీరు ఉంటుంది. ఈ ఇల్లుగలాయనకు దూరాలోచన లేదు అనుకున్నాం. ఏదేమైనా నిన్నటి తొలకరి వర్షపుచినుకులు మాత్రం చాలా ఉల్లాసపరిచాయి. నిన్న నాకు గుర్తుకొచ్చిన పాట మీరూ ఓసారి వినేయండి...



చిత్రం: సిరివెన్నెల, రచన : సీతారామశాస్త్రి

చినుకు చినుకు చినుకు చినుకు

తొలితొలి తొలకరి చిలికిన చినుకు

పిలుపు పిలుపు పిలుపు పిలుపు

పుడమికి పులకల మొలకల పిలుపు

ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన

ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన

మేఘాల రాగాల ఆలాపన...


Wednesday, June 13, 2012

మల్లాది సూరిబాబు గారి "వేదనలో హాయికై.."



మల్లాది సూరిబాబు గారి గురించీ, ఆయన పాడిన "వీడకుమా విడనాడకుమా" పాటతో పాటుగా తృష్ణ లో ఓ టపాలో రాసాను. (http://trishnaventa.blogspot.in/2011/03/blog-post_16.html)

నాకెంతో ఇష్టమైన వారి గళం నుండి మరో లలిత గీతం.. " వేదనలో హాయికై వెదకువాడను నేను" చాలా బావుంటుంది. ఆయనే స్వరపరుచుకున్నారు ఈ పాట. విని ఆ హాయిలోని వేదనని మీరూ వినేయండి..





వేదనలో హాయికై వెదకువాడను నేను
వెతనైనా నన్నేలా బ్రతుకనీయవే చెలీ
వేదనలో హాయికై...(2)

కోమలీ...(2) నీ కన్నుల కోపాగ్ని రగిలినా(2)
కోరి చేరితిని..
ప్రళమమో విలయమో(2)
((వేదనలో))

తరుణీ...(2) నీ మృదుమోవి దూషణలే దూసినా(2)
తపియింతును వాటికై
విరహమో వివశమో(2)
((వేదనలో))

వెలది చషకము బూని దోసిళ్ళే నింపినా
వెలది...(2) వెలది చషకము బూని దోసిళ్ళే నింపినా
విషమై నను గ్రోలెదనో...(2)
తాపమో దాహమో...(2)
((వేదనలో))


చాలా తక్కువ క్వాలిటి తో ఉన్న ఈ ఆడియోను ఈమాత్రం వినేలా బాగుచేసిపెట్టిన మా అన్నయ్యకి బోలెడు థాంక్యూలు.


Saturday, June 9, 2012

బాపు చిత్రకళా ప్రదర్శన 24-2-74



ఆ మధ్యన నాన్నగారి పుస్తకాలు సర్దుతూంటే ఈ ప్రత్యేక సంచిక దొరికింది. '74 లో రాజమండ్రి లో జరిగిన బాపూ బొమ్మల కొలువన్నమాట ! ఆ పుస్తకం ఇప్పుడు దొరకటం అరుదు కాబట్టి అందులోని చాలామటుకు చిత్రాలకు ఫోటోలు తీసాను బ్లాగ్మిత్రుల కోసం. క్రిందన ఉన్న ఆ చిత్రాలు మీరూ చూసి ఆనందించండి..




పుస్తకం ముందు భాగంలో ఆరుద్ర గారు రాసిన కవిత, శ్రీ ఎం.వీ.ఎల్ గారు బాపూ గారి గురించి రాసిన వ్యాసం కూడా ఫోటోల్లో పెడుతున్నాను. ఫోటో సైజ్ పెద్దగా చేసుకుని ఎం.వీ.ఎల్ గారి వ్యాసం చదవవచ్చు.





















Tuesday, June 5, 2012

Oats Oats...


ఈమధ్య అన్ని సూపర్మార్కెట్ల లో, చాలా మంది ఇళ్ళల్లో కనబడుతున్న Oatsను చూస్తుంటే "అంతా ఓట్స్ మయం..జగమంతా ఓట్స్ మయం..." అని పాడాలనిపిస్తూ ఉంటుంది నాకు. నా కాలేజీ చదివే రోజుల్లో చపాతీలే ఆరోగ్యకరం అని అంతా చపాతీల్లోకి దిగారు. రెండో పూట భోజనం మానేసి చాలా మంది చపాతీలు చేసుకునేవారు. అప్పట్లో రోటీ మేకర్లు విరివిగా అమ్ముడుపోయాయి. నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన హీరోయినయిపోయింది చపాతీ. ఆ ప్లేస్ ని ఇప్పుడు ఓట్స్ భర్తీ చేసింది. ఇవి నిజంగా ఉపయోగకరమే కానీ మార్కెట్లో వస్తున్న రకరకాల ఓట్స్ చూస్తూంటే జనాలకి ఏ పిచ్చి పడితే పిచ్చే అన్నట్లుగా ఉంది పరిస్థితి.


మొదట్లో క్వేకర్స్ ఓట్స్ మాత్రం దొరికేవి. ఇప్పుడు ఐదారు రకాల ఓట్స్ పేకెట్లు బజార్లో లభ్యమౌతున్నాయి. కొన్ని కంపెనీలవాళ్ళు ఓట్స్ రెసీపీలు ఏకంగా వాళ్ల వెబ్సైట్స్ లో పెట్టేసారు. క్రింద ఉన్న "సఫోలా" వాళ్ల లింక్ లో ఏ వంటకం తాలూకూ బొమ్మపై క్లిక్ చెస్తే ఆ రెసిపీ నిమిషంలో మనకు కనబడుతుంది.
http://www.saffolalife.com/saffola-oats/do-more-with-saffola-natural-oats

క్రింద ఉన్న క్వేకర్స్ ఓట్స్ వాళ్ల లింక్లో ఏకంగా ఓట్స్ రెసిపిల పి.డిఎఫ్.ని డౌలోడ్ కి పెట్టేసారు.
http://www.quakeroats.com/cooking-and-recipes.aspx

కొన్ని ఓట్స్ పేకెట్లతో పాటూ రెసిపీ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నారు. ఆ పుస్తకాల్లో అదీ ఇదీ అని లేదు.. ఇడ్లీ దగ్గర నుండీ లడ్డూ వరకూ అన్నీ ఓట్స్ తో చేసేస్కోండి..సింపుల్ అంటాడు. రెగులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు నేను ఓట్స్ ఉప్మా తింటూంటాను. ఎవరికి తెలీకుండా కాస్త ఓట్స్ దోశల పిండిలో, చపాతి పిండిలో కలిపేస్తూ ఉంటాను..:) సరదాగా ఈ రెసిపి బుక్స్ లోంచి ఏవైనా ట్రై చెయ్యనా అంటే "తల్లీ, నీ ఓట్స్ కీ నీకూ ఓ దణ్ణం..నన్నొదిలెయ్..ఏం పెట్టినా తింటా ఈ ఓట్స్ తప్ప " అంటారు శ్రీవారు.



ఇప్పుడు చిన్న చిన్న 20gms ఓట్స్ పేకెట్లు వస్తున్నాయి. పొద్దున్నే పాలల్లో కలుపుకునేవీ, లేదా ఇన్స్టెంట్ ఉప్మా చేసుకునేవీ. వీటిలో కూడా రకరకాల ప్లేవర్లు. మసాలా, వెజిటబుల్, చిల్లీపెప్పర్ మొదలైన ఇన్స్ టెంట్ ఉప్మా రకాలు నాకంతగా నచ్చలేదు కానీ పాలల్లో కలుపుకునే పోరిడ్జ్ మిక్స్ లు నాకు బాగా నచ్చాయి. వాటిల్లో కేసర్, ఏపిల్ కిస్మిస్, స్ట్రాబెర్రీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. పొద్దున్నే టీ, కాఫీ లేదా టిఫిన్ లేటయితే ఆకలి వేయకుండా ఈ చిన్నపేకెట్ అర గ్లాసుడు పాలల్లో వేసుకుని తినేయచ్చు. కాస్త ఆకలి ఆగుతుంది. ఆ వేసుకునే అరగ్లాసుడూ డైట్ పాలు అయితే ఇంకా మంచిది.


 
ఏదైనా నచ్చితే మనం తింటే పర్వాలేదు. కానీ ఇంట్లో అందరూ అదే తినాలంటే కష్టం కదా. మా కజిన్ వాళ్ల ఆఫీసులో బాసుగారికి బొజ్జెక్కువైందని వాళ్ళావిడ ఇంట్లో అందరికీ ఓట్స్ మాత్రమే టిఫిన్ పెడుతుందిట. సాయంత్రం కూడా ఓట్స్ టిఫినేట. ఆయన ఇంట్లో విధేయంగా ఓట్స్ తినేసొచ్చి, ఆఫీసులో ఎవరు దొరికితే వాళ్ళని అలా సమోసా తినొద్దాం వస్తావా? అని తీస్కెళ్ళి బయట దొరికిన నానారకాలూ తినేసి, తినిపించేసి వచ్చేస్తుంటాడుట. సాయంత్రం వాళ్ళావిడకు ఫోన్ చేసి "డార్లింగ్ బోలెడు ఆకలివేసేస్తోందిరా... పొద్దున్న నువ్వు పెట్టిన టిఫినే.. ఇంకేమీ తిన్లేదు.." అంటాడుట. పాపం వాళ్ళావిడ నమ్మేస్తూ ఉంటుందిట. మా కజిన్ కలిసినప్పుడల్లా ఆ బాసు గురించి చెప్పనూ నవ్వనూ..:) నెయ్యి వాడకం కూడా మాననివారు సైతం పాలల్లో ఓట్స్, మజ్జిగలో ఓట్స్ వేసుకుని తాగేయ్యటం ఆశ్చర్యకరమైనా ఇది ఖచ్చితంగా ఓట్స్ వ్యాపారస్తుల ప్రకటనాఫలితమే.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. ఓట్స్ తింటే సన్నబడటం నిజమే కావచ్చు కానీ ఓట్స్ మాత్రమే శరీరాన్ని ఆరోగ్యమయం చేసేస్తాయన్నది కేవలం భ్రమ. వ్యాపార చిట్కా అంటే. ఆహార నియమాలతో పాటూ శరీరానికి వ్యాయామం కూడా అవసరమన్న సంగతి ఓట్స్ ని అమ్మేవాళ్ళూ, వాటిని నమ్ముకున్నవాళ్ళు మరిచిపోతున్నారేమో !!








Saturday, June 2, 2012

Songs of Cliff Richard



ప్రఖ్యాత బ్రిటిష్ పాప్ గాయకుడు
క్లిఫ్ రిచార్డ్(Cliff Richard) పేరు తెలియని వారు ఉండరు. గాయకుడు, స్వరకర్త, నటుడు, మానవతావాది అయిన క్లిఫ్ రిచార్డ్ పాటంటే చెవికోసుకునేవారు అరవైల్లో కుర్రకారు. పాట పాడటంలో అతనిది ఒక విలక్షణమైన శైలి. అతని మెత్తనిగళం నుండి జాలువారిన ఏ పాటైనా జనాదరణ పొందేసేదిట అప్పటి రోజుల్లో. చిన్నప్పుడు నాన్న కేసెట్ పెట్టుకుని వింటుంటే మేం కూడా తనతో పాటే శ్రధ్ధగా అతని పాటలు వింటూ ఉండేవాళ్ళం.

ప్రఖ్యాతి గాంచిన క్లిఫ్ రిచార్డ్ పాడిన మెస్మరైజింగ్ పాటలు కొన్ని...


1)Evergreen tree



--------

2)congratulations


-------------

3)fall in love with you



-----------

4) The twelfth of never


------------

5) miss you nights


-------------
6) spanish harlem


----------

7)we don't talk anymore



-----------------

8)the bachelor boy


---------------------

9)all my love




-------------------

10)Constantly

Wednesday, May 30, 2012

నీరాజనం(1988)

1988లో వచ్చిన "నీరాజనం" సినిమాలో పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయేంత మధురంగా ట్యూన్ చేసారు ఓ.పి.నయ్యర్. ఈ సినిమాలో ఏ పాట వింటున్నా మొత్తం ఇంటర్లూడ్ మ్యూజిక్ తో సహా మనం పాడేసుకునేంత దగ్గరయిపోయాయీ పాటలు. నేనీ సినిమా ఇంతవరకూ చూడలేదు కానీ పాటలన్నీ కంఠస్థం. పాటలు హిట్ అయ్యాకా చివరలో శ్రీ ఎమ్.ఎస్.రామారావు గారితో మళ్ళీ ఓ పాట పాడించారు అని గుర్తు. అందుకే మొదటి కేసెట్ ఎడిషన్ లో ఈ పాట ఉండదు. ఈ పాట విడిగా రికార్డ్ చేసుకున్నాం మేము అప్పట్లో.

కేసెట్ లో అన్ని పాటలు ఒక ఎత్తు ఐతే "
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో " పాట ఒక ఎత్తు. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. నిజంగా షాజహాన్ అంత హాయిగా నిదురించాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటున్నంత సేపు మనం మాత్రం హాయిగా సేదతీరుతాము.



ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..



పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా ..



నీ జీవితజ్యోతీ నీ మధురమూర్తి
ముంతాజ్ సతిసమాధి సమీపాన
నిదురించూ జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..

----------------


ప్రేమ వెలిసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవనలా







------------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం..



-------------------

ఘల్లు ఘల్లున గుండె ఝల్లునా
పిల్లఈడు తుళ్ళిపడ్డదీ
మనసుతీరగా మాటలాడక మౌనం ఎందుకన్నదీ




-------------------

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినది
ఒక తియ్యనీ పరితాపమై




---------------------

నాప్రేమకే శలవు నా దారికే శలవు
కాలానికే శలవు దైవానికే శలవు
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శలవు
మదిలోని రూపం మొదలంట చెరిపి
మనసారా ఏడ్చానులే ((నాప్రేమకే))

కనరాని కసితీర కుదిపి కడుపారా నవ్వానులే
అనుకున్న దీవి అది ఎండమావి
ఆ నీరు జలతారులే
నను నీడ తానే ననువీడగానే
మిగిలింది కన్నీరులే ((నాప్రేమకే))



---------

నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏజన్మ కైనా ఇలాగే..





----------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం



------------------


ఇంకా "ఊహల ఊయలలో", "నేనే సాక్ష్యాము", "నీ వదనం విరిసే కమలం" పాటలు దొరకలేదు...:(
కానీ రాగా.కాం లింక్ లో మొత్తం పది పాటలూ వినచ్చు:






Tuesday, May 29, 2012

ऎ दिलॆ नादान..


కొన్ని పాటలు వింటూంటే మనకు తెలియకుండానే ఆ ట్యూన్ కి మనం ట్యూన్ అయిపోతాం. అలా మనల్ని తన లోకంలోకి తిసుకువెళ్పోయే ఈ పాట "రజియా సుల్తానా" సినిమా లోని "ఏ దిలే నాదాన్..". ఖయ్యాం సమకూర్చిన అద్భుతమైన సంగీతం ఈ పాట సాహిత్యపు అందాన్ని ఇంకా పెంచుతుంది. మొదట్లో వినిపించే సంతూర్, ధుమ్.. ధమ్.. అని వినిపించే ఢోలక్(?), మధ్య మధ్య వినిపించే సెకెన్ నిశ్శబ్దం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.



movie: Razia Sultan(1983)
singer : Lata Mangeshkar
music: khaiyyam
lyrics: jan nisar akhtar

Lyrics:

ऎ दिलॆ नादान
आरजू क्या है
जुस्तजु क्या है

हम भटकतॆ है ..क्यॊं भटकतॆ है
दश्ता-ऒ-सेहरा मॆं
ऐसा लगता है .. मौज प्यासी है
अपनी दरिया मॆं
कैसी उल्झन है..क्यॊं यॆ उल्झन है..
एक साया सा रूबरु क्या है
ऎ दिलॆ नादान(२)



क्या कयामत है..क्या मुसीबत है
केह नही सकतॆ..किस्का अरमा है
जिंन्दजी जैसॆ खॊयी खॊयी है
हैरा हैरा है..
यॆ जमी चुप है..आस्मा चुप है
फिर ये धड्कन सी चारसू क्या है
ऎ दिलॆ नादान(२)