సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 8, 2020

Pressure cooker



మూడు రోజుల క్రితం amazon prime లో ఈ సినిమా చూశాం. బావుంది. రచన, దర్శకత్వం: సుజోయ్, సునిల్ ! మంచి సబ్జక్ట్ ఎన్నుకున్నారు. నిత్యం మన చుట్టూ చూస్తున్న అనేక జీవితాలను, వందల,వేల తల్లిదండ్రుల అగచాట్లను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. డైలాగ్స్ చాలా బావున్నాయి. మరీ సీరియస్ గా కాకుండా lighter veinలో కథ నడిపించారు. 


కొన్ని నచ్చిన అంశాలు:

* పెద్ద ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా, ఖాళీగా ఉండి, డిగ్రీకీ ఉద్యోగానికీ గ్యాప్ పెంచేసుకోకుండా చిన్నవైనా ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి. 

* మన దేశం కోసం పనిచెయ్యాలి, మన వాళ్లకి ఉపయోగపడాలి, 
* స్టార్టప్స్ ని ఎంకరేజ్ చెయ్యాలి.

* మనం మోసే కలల బరువు మనదా? తల్లిదండ్రులదా? అసలు మన కలల వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి?

* కెరీర్ పరమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

* ఎవరూ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది?

* కలలు,కెరీర్ కన్నా, కని పెంచిన తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

- ఇలా కొన్ని పనికివచ్చే ఉపయోగకరమైన విషయాలు చక్కగా యువతకి అర్థమయ్యేలా ఉన్నాయి.


హీరో సాయి రోనక్, హీరోయిన్ ప్రీతి అస్రానీ, హీరో స్నేహితుడిగా రాహుల్ రామకృష్ణ, అమ్రీకా సంస్కృతిలో ఇరుక్కుపోయిన పిల్లల తల్లిదండ్రులుగా తనికెళ్ల భరణి, సంగీత - అంతా చక్కగా నటించారు. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలీదు కానీ మొత్తానికి ఒక చక్కని ఉపయోగకరమైన సినిమా వచ్చిందని ఆనందం కలిగింది. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూసి ఆనందించండి.


Trailer:



సినిమాలో " ఒగ్గు కథ" పెట్టడం బావుంది..




ఈ పాట బావుంది -


Thursday, April 30, 2020

Remembering Irfhan..




చిన్నప్పుడు టీవీ తో ఉన్న గాఢమైన అనుబంధం వల్ల ఆనాటి నటీనటులు, ఆనాటి సీరియల్స్, ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఆ అనుబంధం వల్లే ఆనటి నటీనటుల పట్ల కూడా అభిమానం నిలిచిపోయింది. హిందీ ఛానల్స్ మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎందరో గొప్ప నటులు ఉండేవారు. వారిలో అతికొద్ది మందికే వెండితెరపై వెలిగే అవకాశం దక్కింది.  వారందరిలోకీ ఒక విలక్షణ నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు  ఇర్ఫాన్ ఖాన్! 

ఇర్ఫాన్ ఖాన్ పేరు వినగానే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది "బనేగీ అప్నీ బాత్(Banegi Apni Baat)" అనే టివీ సీరియల్. Madhavan, shefali chaya, Irfhan khan మొదలైన నటులను నాకు పరిచయం చేసిన ఆ సీరియల్ ఎంతో బావుండేది. కథ, కథనం, నటీనటుల అద్భుతమైన అభినయం అన్నీ బావుండేవి. కాలేజీ రోజుల్లో అస్సలు మిస్సవకుండా చూసేవాళ్లం.. నేను, నా స్నేహితురాళ్ళూ. అప్పట్లో ఇర్ఫాన్ ని ఇంకా మరెన్నో సీరియల్స్ లో చూసేదాన్ని. నాకు బాగా గుర్తున్నవి - 'చంద్రకాంత', 'చాణక్య', 'శ్రీకాంత్', 'స్పర్ష్'  సీరియల్స్. మంచి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకునేవాడు ఇర్ఫాన్. మంచి పాత్రలను ఎంత బాగా చేసేవాడో, నెగెటివ్ రోల్స్ లో కూడా అంతే బాగా నటించడం అతడి ప్రత్యేకత. అందుకేనేమో అంతమంది టీవీ ఆర్టిస్టుల్లో బాగా గుర్తుండిపోయాడు. 

సినిమాల్లో అవకాశాలు లేటుగా వచ్చినా అదృష్టవశాత్తూ మంచి memorable roles లభించాయి ఇతనికి. తను నటించిన సినిమాల్లో నేను చూసినవి చాలా తక్కువే. తపన్ సిన్హా తీసిన "ఏక్ డాక్టర్ కీ మౌత్", విశాల్ భరద్వాజ్ తీసిన "మక్బూల్", తెలుగులో విలన్ గా నటించిన "సైనికుడు", Salaam bombay, Slumdog millionaire,  New york, New york, I love you, Life in a - Metro, Life of Pi,  The lunch box, Piku మొదలైనవి గుర్తున్నాయి. అన్నింటిలోనూ Piku బాగా గుర్తుంది. ముఖ్యంగా చిత్రంలో వంద శాతం మార్కులు అమితాబ్ నటనకే అయినా, దీపిక తో పాటూ అంతే దీటుగా నటించిన ఇర్ఫాన్  పాత్ర కూడా గుర్తుండిపోయింది.

తన కృషికీ, కష్టానికీ ఫలితంగా పద్మశ్రీ పురస్కారాన్ని సగర్వంగా అందుకోగలగడం ఒకవిధంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ప్రతిభ ఉండి, ఎంతో కళాసేవ చేసిన ఎందరో మహానుభావులు, కళాకారులు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వెళ్పోయారు. ఇర్ఫాన్ ఇక లేడన్న వార్త చదవగానే బాధతో పాటూ ఒక నిట్టూర్పూ... ఇతని ఆయుష్షు సంగతి తెలిసేనేమో భగవంతుడు పిన్న వయసులోనే ఆ పురస్కారాన్ని ఇర్ఫాన్ కి అందించేశాడనిపించింది.

హాస్పటల్ లో తన అభిమానుల కోసం రికార్డ్ చేసిన తన చివరి సందేశం గురించి చదివి మనసు ఎంతో ఆర్ద్రమైంది..! చివరి క్షాణాలని ఎదుర్కోవడానికి కూడా ఎంతో bravery ఉండాలి. 
అవే చివరి క్షణాలు అని తెలియకుండా వెళ్పోయేవారు దురదృష్టవంతులే కానీ అవే చివరి క్షణాలు అని తెలిసాకా చెప్పే మాటల్లో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈమధ్యన near death experiences గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాను. 

హ్మ్!! ఏదేమైనా ఇర్ఫాన్ ఆత్మకి శాంతి కలుగుగాక! 
ఈ సందర్భంలో H.W.long fellow పద్యంలోని 
నాలుగు వాక్యాలు ...
  
"Lives of great men all remind us
 We can make our lives sublime,
And, departing, leave behind us
Footprints on the sands of time"

Wednesday, March 11, 2020

మల్లేశం




ఎప్పుడు  విడుదల అయ్యాయో కూడా తెలీకుండా కొన్ని అరుదైన చిత్రాలు విడుదలై అతి త్వరగా మయమైపోతూ ఉంటాయి. మన జీవన శైలి, గమ్యం ఏవైనా, ఆ సినిమా చూసిన ప్రతి వ్యక్తికీ స్ఫూర్తిని అందించి, ఒక నూతనోత్సాహాన్ని నింపే పనిని ఇటువంటి అరుదైన చిత్రాలు చేస్తూ ఉంటాయి. అటువంటి కోవకి చెందిన అరుదైన ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". తెలుగు సినిమా వెలుగుని తళుక్కుమని చూపెట్టే అతికొద్ది మెరుపుల్లాంటి సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుంది.

పెళ్ళిచూపులు సినిమాలో "నా చావు నే చస్తా నీకెందుకు?" అనే డైలాగ్ తో ఫేమస్ అయిన నటుడు ప్రియదర్శి ప్రతిభావంతుడైన కళాకారుడిగా తనను తాను నిరూపించుకున్న ఒక ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". 2017లో తాను తయారుచేసిన "లక్ష్మీ ఆసు చేనేత యంత్రం" ఆవిష్కారానికి గానూ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. చింతకింది మల్లేశం వృత్తిరీత్యా ఒక చేనేత కార్మికుడు. తెలంగాణా లోని నల్గొండ జిల్లాకు చెందిన షార్జిపేట గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న పోచంపల్లి పట్టుచీరల నేతపని చేసే కుటుంబం వారిది. చిన్ననాటి నుంచీ తన గ్రామంలో చేనేత పని చేసే కుటుంబాలలో మహిళలు పడే శ్రమనూ, ఇబ్బందులనూ చూస్తూ పెరుగుతాడు మల్లేశం. ముఖ్యంగా తన ఇంట్లో తల్లి పడే కష్టాన్ని దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న ఆపిల్లాడికి ఒకటే తపన - తల్లిని సుఖపెట్టాలని; నేత పనిలో ఉన్న ఇబ్బందుల నుండి తల్లికీ, తన గ్రామంలోని ఇతర మహిళలకూ శ్రమను తగ్గించాలని! తమ ఇంట్లోని బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరవ తరగతితో మల్లేశం చదువు ఆపేయాల్సివస్తుంది. విషయం కనుక్కోవడానికి ఇంటికి వచ్చిన మాష్టారు ఒక డిక్షనరీ ఇచ్చారనీ, అది తనకెంతో ఉపయోగపడిందని సినిమా చివర్లో చూపించిన ఉపన్యాసంలో చెప్తాడు చింతకింది మల్లేశం.

మషీన్ తయారుచెయ్యాలని సంకల్పం అయితే చేసుకుంటాడు కానీ సరైన(సాంకేతికపరమైన) చదువులేకపోవడం వల్ల అది ఎలా తయారుచెయ్యాలో తెలీక సతమతమౌతాడు మల్లేశం. కొన్నేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ, కుటుంబానికి దూరంగా పట్నంలో ఉంటూ, చివరికి అనుకున్నది సాధిస్తాడు అతను. తయారు చేసిన మషీన్ కు తన తల్లి పేరు పెట్టి, అందరికీ చూపెడతాడు.

ఒక జీవిత కథను సినిమాగా మలిచేప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయి. కానీ ఈ అసలు కథలో నిబిడీకృతమైన స్ఫూర్తిని ప్రేక్షకుల మనసుల దాకా తీసుకురావడంలో దర్శకుడు రాజ్ రాచకొండ సఫలీకృతమయ్యారు. నటి ఝాన్సీ తానొక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ నని మరోసారి నిరూపించుకుంది. కమెడియన్ గానే ఎక్కువగా పాపులర్ అయిన ప్రియదర్శి కూడా అవకాశం ఇస్తే ఎటువంటి పాత్రనైనా సులువుగా చెయ్యగలనని మల్లేశం పాత్రతో నిరూపించాడు. చక్కని పల్లె వాతావరణం, నటీనటుల సహజమైన నటన, ముఖ్యంగా వారి సహజమైన మేకప్, పల్లెల్లో జరుపుకునే పండుగలు, ఉత్సవాలు అన్నీ బాగా చూపెట్టారు. 

ఏ పాటలు పెట్టకపోతే కూడా ఇంకా సహజంగా ఉండేదేమో అనిపించింది కానీ ఈ జానపద గీతం బావుంది -




చింతకింది మల్లేశం inspirational TEDx speech:





ఈ చిత్రాన్ని Netflix లో చూడవచ్చు. ఇటువంటి మంచి చిత్రాలు మరిన్ని ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ఏర్పాటు జరిగితే బావుంటుంది.

Saturday, March 7, 2020

చిllలllసౌll



2018లో విడుదలైన "చిllలllసౌll " చిత్రం విడుదలైనప్పుడు,  టైటిల్ తమాషాగా ఉందే చూద్దామనికునేలోగా, చాలా త్వరగా వెళ్పోయింది. గత ఏడాదిలో నాకు ఈ చిత్రం చూడడం కుదిరింది. చాలా బావుందని బంధుమిత్రులందరికీ వీలైతే చూడమని సజెస్ట్ చేశాను.  దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఇది మొదటి చిత్రమని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి సినిమా ఇంత పర్ఫెక్ట్ గానా అని. ఆ తర్వాత ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే కు గానూ జాతీయ బహుమతి లభించిందని చదివి చాలా ఆనందించాను.

’పెళ్ళిచూపులు ’ అనే తతంగం ఒక సమరంలాగ, జీవన్మరణ సమస్య లాగ సాగిన రోజుల్లో, ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్ళిచూపులకి కూర్చున్న ప్రతి అమ్మాయీ ఈ కథకు కనక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన రుహానీ శర్మ ఎంతో బాగా తన పాత్రను ప్రెజెంట్ చేసింది. ఆమె పాత్రకు ప్రాణం పోసిన క్రెడిట్ మాత్రం ఆమెకు గాత్రదానం చేసిన చిన్మయి శ్రీపాదకి దక్కుతుంది. అసలా అమ్మాయి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది. పాడే పాటకూ , చేప్పే డబ్బింగ్ కూ - రెండిటికీ ప్రాణం పోసేస్తుంది. గిఫ్టెడ్ వాయిస్ అనాలేమో!

ఇంక కథలోకి వస్తే  "ఐదేళ్ల వరకూ అసలు పెళ్ళే వద్దు" అంటున్న ఒక అబ్బాయిని పెళ్ళి చూపులకి ఒప్పిస్తారు అతడి అమ్మానాన్నా. పేరు అర్జున్. పెళ్ళిచూపులకి వెళ్లడం అర్జున్ కి ఇష్టం లేదు కాబట్టి ఓ సంబంధం చూసి, ఆ అమ్మాయిని వాళ్ల ఇంటికే రావడానికి ఒప్పించి, ఓ సాయంత్రం పూట - "ఆ అమ్మాయి వచ్చేస్తోంది రెడీగా ఉండు" అని కొడుక్కి చెప్పేసి, వాళ్ళు షికారుకి వెళ్పోతారు. అయోమయంగా మారిన ఆ అబ్బాయి వచ్చిన అమ్మాయితో సరిగ్గా మట్లాడడు. ఇష్టం లేకపోతే నన్నెందుకు పిలిచారు అని ఆ అమ్మాయి కోప్పడేస్తుంది. "ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి.." అని అనుకుంటూ ఆ మాట బయటకు అనేస్తుంది. అదేమిటని అబ్బాయి అడుగుతాడు. అప్పుడు తన కథ చెప్పుకొస్తుంది అంజలి(వచ్చిన పెళ్ళికూతురు). తన తల్లికి బైపోలార్ డిజాడర్ ఉందనీ, అందువల్ల ఇంతకు ముందు తప్పిపోయిన రెండు సంబంధాల గురించీ, ఇప్పుడు కూడా ఇలాంటి ఆక్వార్డ్ పెళ్ళిచూపులకి ఎందుకు ఒప్పుకున్నదీ చెప్తుంది. ఇద్దరికీ స్నేహం కుదిరి కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా ఆ అమ్మయి వెళ్పోతుంది. ఎందుకనో వెళ్ళాలనిపించి, వెనకాలే తలుపు తీసుకుని వచ్చిన ఆ అబ్బాయికి మెట్ల మీద గోడకి తల ఆనించి, బాధగా నిల్చున్న ఆ అమ్మాయి కనిపించి దగ్గరకు వెళ్తాడు. ఆ క్షణంలో విపరీతమైన బాధలో అతడి భుజానికి తల ఆనించి ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. మొత్తం సినిమాలోకెల్లా నాకు బాగా నచ్చిన సీన్ అది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఆబ్బాయిని తనకి దూరంగా ఉండమని, తన బాధలేవో తానే పడతానని చెప్పి వెళ్పోతుంది. కానీ మన కన్ఫ్యూజింగ్ పెళ్లికొడుకు వెనకాలే వెళ్తాడు. తర్వాత ఆ రాత్రంతా జరిగే కథే మిగిలిన చిత్రకథ !

చాలా స్ట్రాంగ్ గా portray చేసిన అంజలి కేరక్టర్ ఎంతో కాలం గుర్తుండిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరోయినే కాదు హీరో కూడా అంజలే ! పెళ్ళికొడుకు పాత్రధారి సుశాంత్. నాగార్జున పోలికలు బాగానే కనిపించాయి. ఇంతకు ముందు సుశాంత్ సినిమాలేవీ చూడలేదు నేను. ఇలాగే కంటిన్యూ అయితే నటుడిగా నిలబడగలడు అనిపించింది. అంజలి తల్లిగా రోహిణిది కూడా గుర్తుండిపోయే పాత్ర. డి-గ్లామరస్ రోల్ ప్లే చేయడం సామాన్యమైన విషయం కాదు.

ఇంతకన్నా సినిమా గురించి ఏమీ రాయను. వీలైతే చూడమనే చెప్తాను. ట్రైలర్ :




చిత్రంలో ప్రశాంత్.ఆర్.విహారి సంగీతాన్ని సమకూర్చిన రెండు పాటలూ బావున్నాయి. రెండు పాటలలో  నాకు నచ్చిన  ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది కిట్టూ  విస్సాప్రగడ . 



నీ పెదవంచున విరబూసిన చిరునవ్వులో
ఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవో  

వర్షించే అదే నింగికీ, హర్షించే ఇదే నేలకీ
మేఘంలా మదే భారమై, నడుమ నలిగి కుమిలి కరిగే   

సంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకి   
ఎదురేగే కథే నీది అని తెలిసి మనసు నిలవగలదా?


***     ***     ***


మరో పాట "తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా..." కూడా బావుంది. ఆ సాహిత్యాన్ని అందించింది శ్రీ సాయి కిరణ్.





Wednesday, March 4, 2020

ఇప్పుడన్నీ తేలికే..



ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన చాలా ఇష్టమైన కొన్ని పనులు.. మధ్యలో వదిలేయడం చాలా కష్టమే. కానీ ఆ పనులు మన మార్గానికే ఆటంకమై, ముందడుగు పడనీయనప్పుడు, ఆగిపోవడమో, వేరే దారిని వెతుక్కోవడమో.. ఏదో ఒకటి చెయ్యాలి. 

నాలుగేళ్ల క్రితం టువంటి  టంకం ఏర్పడినప్పుడు.. ఇది నా సమయం కాదు అనుకుని మౌనంగా ఆగిపోయాను. నాకు ప్రాణ కన్నా ఎక్కువైన ఈ బ్లాగుని కూడా మూసేసాను. వెనక్కు తిరిగి చూసిందే లేదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటైన పనే. ఈసారి భగవంతుడు నాకు మరో చక్కని మార్గాన్ని చూపెట్టాడు. ఆరేళ్ల బ్లాగ్ రాత వెతను మిగిల్చినా, మరో విధంగా ఉపయోగపడింది.. ఒక పనిలో ఒదగగలిగాను. ఇక తీరదనుకున్న ఒక చిరకాల కోరిక నెరవేరింది ! స్వల్పమే అయినా సొంత సంపాదన ఎంత ఆనందాన్ని ఇస్తుందో, వాటితో కావాలనుకున్న వస్తువులు కొనుక్కోవడం అంతకు మించిన తృప్తిని ఇస్తుంది.

కానీ రాయాలనే బలమైన కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. మనకి ఆనందాన్ని కలిగించి, మనసు పెట్టి చేసే ఏ పనినీ ఆపకూడదంటారు పెద్దలు. చేతనయినంతలో ఏ కోరికనూ మిగిలిపోనీయకూడదనే ఆలోచనతో నాలుగేళ్ళ తరువాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. కేవలం రాయడం మాత్రమే..! కామెంట్ బాక్స్ ని తొలగించడం కూడా చాలా తేలిగ్గా చేసిన పని. ఎప్పుడో చెయ్యాల్సినది.. ఇప్పటికైనా ఆలస్యంగా చేసాను.

ఇవాళ ఇంకో పని చేసాను..నా 'సంగీతప్రియ ', 'సినిమా పేజీ' బ్లాగులను డిలీట్ చేసేసాను. అందులోని టపాలన్నీ ఈ బ్లాగ్ లోకి ఇంపోర్ట్ చేశాను. అప్పట్లో.. ఏడు నెలలు మోసిన బిడ్డను కోల్పోయినప్పుడు, ఆ బాధను మరవటానికి నాలుగు కొత్త బ్లాగులు కావాలని మొదలుపెట్టి, మరో ఆలోచన అనేది రాకుండా బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ బాధను మరిచేదాన్ని! ఇవాళ నా చేతులతో నేనే ఆ బ్లాగులు డిలీట్ చేశాను.  ఒకప్పుడైతే బాధపడేదాన్నే.. కానీ ఇప్పుడు చాలా బావుంది. తేలికగా ఉంది. ఓడిపోయాననిపించడం లేదు. అల్లిబిల్లిగా పెరిగిన మొక్కలను ప్రూనింగ్ చేసినట్లు ఉంది. చిన్న మొక్క నుండీ చెట్లు గా మారిన తోటలో మందారాలు, నందివర్ధనాలూ శుభ్రంగా ట్రిమ్ చేసినట్లు! కొమ్మలు కట్ చేసేప్పుడు చివుక్కుమనిపిస్తుంది, చేతులు రావసలు. కానీ కొత్త చిగుర్లు కనబడగానే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకనో అనిపించింది..డిలీట్ చేసేసాను.

అయినా చెట్టంత మనుషులే పుటుక్కున మాయమైపోతున్నారు... వాటితో పోలిస్తే ఇదెంతనీ!!


Friday, February 21, 2020

October



2018లో అనుకుంటా ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా చూశాను. చాలా చిత్రమైన కథ. 

ఒక స్టార్ హోటల్లో intern స్టూడెంట్స్ కొందరు పనిచేస్తూ ఉంటారు. ఒకే గ్రూప్ కాబట్టి అందరూ కలివిడిగా, స్నేహంగా ఉంటారు. కానీ Dan అనే కుర్రాడు కొంచెం రెక్లెస్ గా, ఇర్రెగులర్ గా, ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. మిగతావారితో కూడా పేచీలు పడుతూ ఉంటాడు. గ్రూప్ లో ఒకరిద్దరు మిత్రులు మాత్రమే ఉంటారు. కొత్తగా వచ్చిన జూనియర్ ఒకమ్మాయి పారిజాతం పూలు ఏరుతూండగా చూస్తాడు. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోరు కానీ ఒకర్ని ఒకరు గమనిస్తూ ఉంటారు. Dan స్నేహితురాలికి ఈ అమ్మాయి ఫ్రెండ్ అన్నమాట. ఆ అమ్మాయి పేరు షూలీ అయ్యర్. పారిజాతాలని "షూలీ" అంటారు. ఆ అమ్మాయికి ఆ పూలు ఇష్టం అని అదే పేరు పెడతారు ఇంట్లోవాళ్ళు.

ఒకరోజు హోటల్ టేర్రేస్ మీద ఏదో పార్టీ జరుగుతుండగా ఆ కొత్తమ్మాయి పిట్టగోడని ఆనుకుందామని వెనక్కి జరిగి పొరపాటున పైనుంచి క్రిందకి పడిపోతుంది. చనిపోదు కానీ మేజర్ ఇంజరీస్ కారణంగా కోమాలోకి వెళ్పోతుంది. Dan రెండురోజుల తర్వాత డ్యూటీకి వచ్చాకా విషయం వింటాడు. ఆ పిల్ల పడిపోయే ముందు మాటాడిన ఆఖరి మాట "where is Dan?" అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అప్పటిదాకా ఎంతో రెక్లెస్ గా ఉండే అతడు విచిత్రంగా ఎంతో మారిపోతాడు.. "నా గురించి అడిగిందా? నా గురించా..? " అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. హాస్పటల్ బెడ్ మీద ఏ మాత్రం స్పృహ లేకుండా ఉన్న ఆ అమ్మాయిని చూసి కదిలిపోతాడు. "ఎందుకు నా గురించి అడిగావు?" అంటూ ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెడతాడు. నెమ్మదిగా రోజూ వచ్చి కాసేపు ఆ అమ్మాయి దగ్గర కూర్చుని మాట్లడుతూ ఉంటాడు. కోమా లో ఉన్న అమ్మాయికీ , అతడికీ చిత్రమైన బంధం ఏర్పడుతుంది. పెద్దగా పరిచయం కూడా లేని ఆ అమ్మాయి కోసం ఓ కుటుంభసభ్యుడిలా సహాయం చేయడం మొదలుపెడతాడు. ఉద్యోగం చేసే తల్లి మాత్రమే వారి కుటుంబానికి ఆధారం అని తెలుసుని, తన డ్యూటీలు ఎడ్జస్ట్ చేసుకుంటూ వారికి సాయం చేయడం మొదలుపెడతాడు. చిత్రంగా ఆ అమ్మాయితో అతడికి ఎంతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. బాధ్యతగా తన పనులు చేసుకుంటూ, ఎంతో శ్రధ్ధగా ఆ అమ్మాయిని చూసుకోవడం మొదలుపెడతాడు. 

అసలు లేస్తుందో లేదో తెలియని ఆ అమ్మాయి కోసం జీవితం వృధా చేసుకోవద్దని చాలామంది చెప్తారు. షూలీ తల్లి కూడా నచ్చ చెప్పి అతడిని పంపేస్తుంది. వేరే ఊరు వెళ్పోతాడు. ఆ అమ్మాయి కోమాలోంచి లేచిందని ఒకరోజు ఫోన్ వస్తే తిరిగి వస్తాడు. వీల్ చైర్ లో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చేదాకా తోడు ఉండి ఎంతో సహాయం చేస్తాడు. వారిద్దరి మధ్యా పెరిగిన bond, ఆ అబ్బాయి తపన చూసి తీరాల్సిందే! శారీరిక ఆకర్షణలకు అతీతమైన బంధం కూడా ఉంటుంది అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ కథ. కోమాలో ఉన్న పేషేంట్స్ తో మాట్లాడుతూ ఉంటే వారికి వినిపిస్తుంది. నెమ్మదిగా మార్పు కూడా వస్తుంది అనే కొన్ని వార్తాపత్రికల వ్యాసల ఆధారంగా ఈ కథ తయారైందిట.

అయితే ఈ కథ క్లైమాక్స్ నాకు నచ్చలేదు :( 
i don't like tragedies..!

దర్శకుడు Shoojit Sircar మంచి వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీస్తూంటాడు. Dan పాత్రలో వరుణ్ ధవన్ జీవించాడనే చెప్పాలి. ఈ కుర్రాడి సినిమాలు రెండు,మూడు చూశాను. బాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ నటుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ఈ పాత్ర కోసం వరుణ్ కొన్నాళ్ళు ఒక స్టార్ హోటల్లో పనిచేశాడట కూడా! షూలీ పాత్రను బందిత అనే బ్రిటిష్ నటి పోషించింది. ఎక్కువ సినిమాలు చెయ్యలేదనుకుంటా. భారీ డవిలాగులు చెప్పేస్తూ నటించడం కన్నా ఏ డవిలాగులూ లేకుండా మంచానికి అతుక్కుపోయి, డిగ్లామరస్ రోల్ ప్లే చేయడం చాలా కష్టమైన పని. ఈ పిల్ల కళ్ళు చాలా బావున్నాయి. పేధ్ధవి! 

ట్రైలర్:


Thursday, February 20, 2020

'రంగపుర విహార' గానామృతం




దక్షిణ భారత కర్ణాటక సంగీత విద్వాంసులలో చెప్పుకుని తీరాల్సిన కళాకారుడు టి.ఎం. కృష్ణ. గాయకుడే కాక మంచి రచయిత కూడా. కొన్నేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈయన గురించి నేను చదివింది హిందూ దినపత్రికలో. ఈయన పుస్తకం ఒకటి రిలీజ్ అయినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ వేశారు పేపర్ లో. అది చదివి ఆసక్తి కలిగి ఈయన సంగీతామృతాన్ని వినడం జరిగింది. అది మొదలు నాకు అత్యంత ఇష్టమైన గాయకుల జాబితాలో చేరిపోయారు టి.ఎం. కృష్ణ. ఆసక్తి ఉన్నవారు ఈయన గురించిన మరిన్ని వివరాలు క్రింద లింక్స్ లో తెలుసుకోవచ్చు.
https://en.wikipedia.org/wiki/T._M._Krishna 
https://tmkrishna.com/

టి.ఎం. కృష్ణ కాన్సర్ట్స్ లో అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ముత్తుస్వామి దీక్షితార్ రచన "రంగపుర విహారా.." ! ఈ కృతి వేరే ఎవరు పాడినదీ నాకు అంతగా రుచించదు. ఈయన పాడినది మాత్రం అసలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. వింటూంటే... ఏవో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లు, అమృతం ఇలా ఎవరో చెవిలో పోస్తున్నట్లు, మనసంతా హాయిగా దూదిలా తేలికగా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది నాకు. ఆసక్తి ఉన్నవారు వినండి -




సాహిత్యం:

రచన : ముత్తుస్వామి దీక్షితార్
రాగం: బృందావనసారంగ


పల్లవి:
రంగపుర విహార జయ కోదండరామావతార  రఘువీర 
శ్రీ రంగపుర విహార ll ప  ll

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగ  
శ్యామళాంగ విహంగ తురంగ 
సదయాపాంగ సత్సంగ ll ప  ll

చరణం:
పంకజాప్త కులజలనిధిసోమ 
వరపంకజముఖ పట్టాభిరామ 
పదపంకజజితకామ రఘురామ 
వామాంక గత సీతా వరవేష
శేషాంకశయన భక్తసంతోష 
ఏణాంక రవినయన మృదుతర భాష 
అకళంక దర్పణ కపోల విశేష 
మునిసంకట హరణ గోవింద 
వేంకటరమణ  ముకుంద 
సంకర్షణ మూలకంద
శంకర గురుగుహానంద విహార ll ప  ll

Tuesday, February 18, 2020

కుసుమత్త

                                         
                                


మొన్న ఆదివారం పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేసాడు. "కుసుమత్త ఫోన్ చేసిందే. వాళ్లమ్మాయి పెళ్ళట. అందరూ తప్పకుండా రావాలని చెప్పింది. పిల్లాడి పెళ్ళికి ఎవరూ రాలేదు. అమ్మయి పెళ్ళికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది" అన్నాడు. ఉత్సాహంగా వెళ్దామంటే వెళ్దాం అనేసుకుని కాసేపు కుసుమత్త కబుర్లు చెప్పుకున్నాం. కానీ తారీఖు చూస్తే పరీక్షల సమయంలో.. కుదురుతుందో లేదో తెలీదు! కుసుమత్త ని తల్చుకుంటే చల్లని తెమ్మెర మొహాన్ని తాకినట్లుంటుంది. అంత హాయి కలుగుతుంది మనసుకి. ఇన్నేళ్ళు గడిచిపోయినా అదే ఆప్యాయత, అదే అభిమానం!! ఈనాటి పరిచయాలకి అటువంటి విలువ ఎక్కడ..?!

కొన్ని కారణాల వల్ల ప్రతి రెండు మూడు నెలలకి ఓసారి కాకినాడ వెళ్ళివచ్చిన చిన్ననాటి రోజులు అవి. ఇరుగుపొరుగువాళ్లని అత్త, పిన్ని, అక్క అంటూ వరసలతో ఆప్యాయంగా పిలుచుకునే రోజులు! ఐదో, ఆరో క్లాసు. మా కాకినాడ ఇంట్లో నాలుగు వాటాలు, ముందర వైపు రెండు గదుల చిన్న షెడ్డు ఉండేవి. షేడ్ లోనూ, మూడు వాటాల్లోనూ అద్దెకు ఉండేవారు. చాలా కుటుంబాలవారు ఉద్యోగ రీత్యా మారుతూ ఉండేవారు. ఒకసారి మేము కాకినాడ వెళ్ళినప్పుడు పొద్దున్నే రోజూ వచ్చే కూరలబ్బాయి సైకిల్ మీద వచ్చాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు! మా మామ్మయ్య కూరలు తీసుకుంటూ నన్ను పిలిచింది. "ఒసేయ్ పైకి వెళ్ళి కుసుమత్తని కూరలబ్బాయి వచ్చాడని పిలుచుకురా" అంది. "కుసుమత్త ఎవరు?" అన్నాన్నేను. "ఈమధ్య కొత్తగా వచ్చారు. వెళ్ళు త్వరగా" అంది మళ్ళీ. "కొత్తవాళ్ళా.. నాకు తెలీదుగా...అత్తా అని ఎందుకు పిలవాలి.." అని నేను నసిగాను. "నోరుమూసుకుని వెళ్ళూ...కుసుమత్తా అని పిలువు" అని మామ్మయ్య గట్టిగా ఆర్డర్ వేసింది. ఇంక పిల్లిలా నెమ్మదిగా మెట్లెక్కి వెళ్తే తలుపు వేసి ఉంది. సందులో బట్టలు ఆరేసి ఉన్నాయి, అవి తోసుకుంటూ వెళ్తే వంటింటివైపు తలుపు తీసి ఉంది. ఒకావిడ కనబడింది. "కుసుమత్తా..." అని కిటికీలోంచి పిలిస్తే ఇటు చూసింది. "కూరలబ్బాయి వచ్చాడని మామ్మయ్య చెప్పమంది" అనేసి పరిగెత్తుకుని వచ్చేసా. తను కిందకి వచ్చి కూరలు కొంటూంటే మామ్మయ్య తనతో చెప్పింది.. "మా అబ్బాయివాళ్ళు వస్తారని చెప్పా కదా...ఇది నా మనవరాలు" అని చెప్పింది.

టి.వి లేని రోజులు అవి. అన్నయ్య స్కూలుకి వెళ్పోయాడు. దోడ్లో మొక్కల్లో తిరగడం అయిపోయింది. ఇంక ఏమీ తోచట్లేదు అని పేచీ పెడుతుంటే "పైకి వెళ్ళు..కుసుమత్తతో కబుర్లు చెప్పిరా.." అంది మామ్మయ్య. చేసేదేమీ లేక మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు వేసి ఉంది. కొట్టాలా వద్దా అనుకుంటూ సందులోకి వెళ్తే కిటికీ తలుపు తీసి ఉంది. కుసుమత్త ఏదో కుట్టుకుంటోంది. నన్ను చూసి వచ్చి తలుపు తీసింది నవ్వుతూ. చక్కగా చీర కట్టుకుని అమ్మంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. అది మా మొదటి పరిచయం. అలా భయపడుతూ వెళ్ళినదాన్ని, కాకినాడ వెళ్ళినప్పుడల్లా అన్నానికి తప్పించి మిగతా సమయం అంతా మేడ మీద కుసుమత్త ఇంట్లోనే పొద్దున్నుంచీ సాయంత్రం దాకా గడపడం వరకూ మా స్నేహం పెరిగింది. కుసుమత్తకి అప్పటికి పాతికేళ్ళు ఉంటాయేమో. కొత్తగా పెళ్ళయిన జంట. ఇద్దరే ఉండేవారు. మావయ్యగారికి బ్యాంక్ లో పని. "మావయ్యగారు రాగానే వచ్చేయాలి. అల్లరి చేయకూడదు." అని చెప్పి పైకి పంపించేవారు ఇంట్లో. మావయ్యగారు కూడా చాలా మంచాయన. మాతో(నేను ,తమ్ముడు) బాగా ఆడేవారు. కబుర్లు చెప్పేవారు. మా ఇద్దరికీ చెస్, పేక ఆడటం రెండూ వాళ్ళే నేర్పించారు. నలుగురం కలిసి ఇవే మార్చి మార్చి ఆడుతూ ఉండేవాళ్ళం. బెజవాడ వచ్చాకా కూడా చెస్ బోర్డ్ కొనుక్కుని నేనూ, తమ్ముడూ అడుతూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా మరో కొత్త పేకల సెట్ కూడా ఇచ్చేది కుసుమత్త. 

కుసుమత్తావాళ్ళింట్లో నాకు మరో అట్రాక్షన్ ఉండేది. పుస్తకాలు, వార పత్రికలు. నాకు తెలుగు చదవడం వచ్చాకా అదీ, ఇదీ అని లేదు పుస్తకం, కాయితం  ఏది దొరికితే అది చదివేసేదాన్ని. బజ్జీలు, పిడతకింద పప్పు కట్టి ఇచ్చే కాయితాలు కూడా తిన్నాకా చదివేసి పాడేసేదాన్ని. మా ఇంట్లో వారపత్రికలు ఉండేవి కావు. కాబట్టి అదో కొత్త సరదా నాకు. అన్నీ కాదు కానీ బావున్న సీరియల్స్ చదివేదాన్ని కుసుమత్త ఇంట్లో. వెళ్ళినప్పుడల్లా పాతవి  వెతుక్కుని ఐదారు పుస్తకాలు తెచ్చుకుని సీరియల్ భాగాలన్నీ ఒకేసారి చదివేదాన్ని. ఎదురుచూడక్కర్లేకుండా ఒకేసారి అంత కథ తెలిసిపోతే భలే ఉంటుంది. ఓ పక్క అమ్మ తిడుతూ ఉండేది. నీకెందుకే ఆ పత్రికలు అని. అప్పుడేమో పైనే కుసుమత్త ఇంట్లోనే అన్నీ చదివేసి వచ్చేసేదాన్ని. సాయంత్రాలు పార్క్ కో, ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికో మమ్మల్ని వాళ్లతో పాటూ తీసుకెళ్ళేవారు కుసుమత్తా వాళ్ళు. 

ఒకసారి అమ్మావాళ్లు  బెజవాడ వెళ్పోయారు. ఎందుకో నేనూ, తమ్ముడూ ఉండిపోయాం కాకినాడలో. కుసుమత్తా వాళ్ళింట్లో చుట్టాల పిల్లలెవరో ఉన్నారు అప్పుడు. వాళ్ళని దింపడానికి బెజవాడ వచ్చారు వాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకువచ్చేసారు. వేసవి సెలవలు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. విపరీతమైన ఎండ. వేడి. కుసుమత్త తన చీరొకటి తీసి, తడిపి కిటికీలకు,సీట్లకూ అడ్డుగా కట్టింది. చల్లగా భలే బావుంది. నలుగురు పిల్లలం,వాళ్ళిద్దరూ - మొత్తం ఆరుగురం పేకాట ఆడుకుంటూ, రకరకాల చిరుతిళ్ళు తింటూ బెజవాడ వచ్చేసాం. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము.

ఒక అబ్బాయి మా ఇంట్లో ఉండగానే పుట్టాడు. తర్వాత మావయ్యగారికి ట్రాన్ఫర్ అయి వేరే ఊరు వెళ్పోయారు. తర్వాత అమ్మాయి కూడా పుట్టిందని తెలిసింది. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. అప్పుడప్పుడూ ఉత్తరాలు ఉండేవి. తర్వాత ఏ కబురూ తెలీదు. చాలా ఏళ్ల తర్వాత మాకు బెజవాడలో తెలిసినవాళ్ల అబ్బాయి పెళ్ళి కుదిరితే, ఆ పెళ్ళికూతురు ఫలానా బ్యాంక్ అని తెలిసి, కుసుమత్త మావయ్యగారు కూడా అదే బ్యాంక్ కదా అని అమ్మ ఆ పెళ్ళికూతురుని అడిగి ఎలాగైతేనేం వాళ్ల అడ్రస్ సాధించింది. మా తమ్ముడి పెళ్ళి సమయం అది. శుభలేఖ వేస్తే మొత్తం నలుగురూ వచ్చారు. పెద్దవాళ్ళయి ఇంజినీరింగ్ చదువుతున్న కుసుమత్త పిల్లల్ని చూస్తే చాలా ఆనందం వేసింది. కుసుమత్త ఏ మాత్రం మారలేదు. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత. నా చేతులు పట్టుకుని ఎంత సేపో కబుర్లు చెప్పింది. పిల్లల చదువుల వివరలు అడుగుతూ అమ్మాయి పేరేమిటి అని అడిగాను. చెప్పింది. "అయ్యో... నా పేరు.." అన్నాను. అవునంది. ఆశ్చర్యంతో "నా పేరని తెలుసా?" అన్నాను. "అందుకే పెట్టుకున్నాం." అంది. "నిజమా" అన్నాను. నిజమే అంది. మళ్ళీ అడిగాను "నిజంగానా" అని. "నిజమేరా" అంది. నా జీవితంలోని మెమొరబుల్ ఎమోషనల్ మోమెంట్స్ లో అదీ ఒకటి!! 

రెండుమూడేళ్ళ క్రితం వాళ్ల అబ్బాయి పెళ్ళని పిలిచింది కుసుమత్త. ఫోన్ చేసి మాట్లాడింది కూడా. ముఫై ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ నిండిన స్వరం. అదే అభిమానం..! కానీ అప్పుడు మా అత్తయ్యగారికి ఒంట్లో బాలేక నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ల అమ్మాయి పెళ్ళి. నా పేరు పెట్టిన అమ్మాయి పెళ్ళి! కానీ మా అమ్మాయి పరీక్షల సమయం, వేరే పనులు కూడా ఉన్నాయి.. వెళ్లలేనేమో..:( 

అన్నయ్య తప్పకుండా వెళ్తాడు. వెళ్లలేకపోయినా కుసుమత్త అర్థం చేసుకుంటుంది అని నమ్మకం. ఆనాటి ఆప్యాయతల గట్టిదనం అలాంటిది.

****  ****

వెళ్ళాను. వెళ్లగలిగాను! ఫంక్షన్ హాల్ గుమ్మంలో కుసుమత్త మావయ్యగారు కనబడ్డారు. "ఎవరో చెప్పుకోండి..." అనడిగాను. గుర్తుపట్టలేదు. అన్నయ్యని చూసి గుర్తుపట్టారు. అది కూడా వాట్సప్ లో వాడి ఫోటో చూశారుట, అలా గుర్తుపట్టారు. కుమత్తేదీ అని అడిగితే, ఎటో వెళ్తున్న తనని చూపించారు. గభాలున వెనక్కి వెళ్ళి, భుజాలు పట్టుకుని " నేనెవరో చెప్పుకో" అన్నాను.. నవ్వుతూనే ఆలోచిస్తూ చూసింది.. మళ్ళీ అడిగాను "నేనెవరో చెప్పుకో.." అని...హా...అనేసి గుర్తుపట్టేసిందిభలే అనిపించింది. "హ్మ్మ్...నువ్వు గుర్తుపట్టావు. మావయ్యగారు గుర్తుపట్టలేదు" అన్నాను. "ఎంత మారిపోయావూ.. పదేళ్లవుతోంది నిన్ను చూసి.."అంది. 


పెళ్ళి బాగా జరిగింది. మధ్యాన్నం, రాత్రి రెండు భోజనాలూ బాగున్నాయి. పొద్దున్నేమో చక్కగా సొజ్జప్పం వేశారు. వంకాయ పులుసు పచ్చడి కూడా. ఈ రెండు ఐటెమ్స్ నేనైతే పెళ్ళిళ్ళలో చూడలేదు.  రాత్రి టిఫిన్స్ తో పాటూ లక్కీగా నేను తినదగ్గ ఐటెమ్ దొరికింది -"కొర్రలతో బిసిబెళెబాత్". పెళ్ళయ్యాకా, టైమైపోతోందని పరుగులెడుతూ స్టేషన్ కి వెళ్ళాం. ఎక్కి కూర్చున్నాం. రైలు కదిలింది.



Sunday, January 19, 2020

భగవంతుడి దయ


భగవంతుడి దయ ఉండబట్టి ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం కూరలు కొనుక్కుని రోడ్దుకి ఎడమ పక్కగానే మెల్లగా నడిచి వస్తున్నాను. బరువుగా ఉందని కూరల సంచీ భూజానికి వేసుకున్నాను.. మరుక్షణంలో వెనుకనుంచి ఒక ట్రాలీ వాడు గుద్దేశాడు. బండి నా వీపుకున్న బ్యాగ్ కి గుద్దుకుంది. అమాంతం ముందుకు బోర్లా పడిపోయాను. బ్యాగ్ దూరంగా పడి కూరలన్నీ దొర్లిపోయాయి. వాడు ట్రాలీ ఆపి, దిగి వచ్చి సారి సారీ అనేసి వెళ్పోయాడు. నేను వాడి వైపు కూడా చూడలేదు. ఆ అదురుకి కాసేపు అసలు లేవలేకపోయాను. ఎవరో ఒకామె వచ్చి లేపింది. అదృష్టం బాగుండి చిన్న చిన్న కముకు దెబ్బలతో బయటపడ్డాను. ఏ చెయ్యో కాలో విరిగి ఉంటే, నే మంచాన పడితే ఇల్లెలా గడుస్తుంది?
అరచేతితో అనుకోవడం వల్ల అరచేతి నెప్పి
  బాగా ఉంది.. నిజంగా ఎంతటి అదృష్టం నాయందు ఉందో ఇవాళ! లేచిన వేళ మంచిది. భగవంతుడి కృప గట్టిది.

Saturday, December 28, 2019

కథ లాంటి నిజం


సినిమాల్లో మాత్రమే చూసేలాంటి కథ ఒకటి ఎదురుగా కనబడితే? సినిమా కష్టాలు అనేలాంటి కష్టాలన్నీ మూకుమ్మడిగా ఒకరి జీవితంలో కనబడితే? వినడానికే హృదయం పగిలిపోతూంటే అనుభవించే ఆ మనసుకు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు..ఎన్ని సమస్యలో!! అసలు ఒకే మనిషిని ఇన్ని కష్టాలు చుట్టుముట్టగలవా? అంటే ఆ కర్మఫలం ఎంత ఎక్కువ ఉందో...!! ఎవరా జీవి? ఏమిటా కష్టాలు అంటే చెప్పలేను. మరొకరి జీవితాన్ని గురించి రాసే హక్కు నాకెక్కడిది? నాకా హక్కు లేదు. అది తప్పు కూడా. కానీ బాధను తట్టుకోలేక నా సొంతమనుకునే ఈ బ్లాగులో ఈ నాలుగు వాక్యాలూ రాసుకుంటున్నాను. 
అబ్బా! నిజంగా పొద్దున్నుంచీ తట్టుకోలేకుండా ఉంది. ఆ మనిషికి దేవుడు అలా అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసేసుకుంటూంటే అసలు ఏమనాలో నాకైతే తెలీట్లేదు. అవును.. ప్రాప్తం, పూర్వజన్మ పాపం, కర్మఫలం, ఋణాలూ ఎక్సట్రా ఎక్సట్రా... అన్నీ తెలుసు. అందులో సత్యం ఉంది. అయినా కూడా పాపం కదా..అయ్యో.. అనుకుంటూ ఎన్ని అఫ్సోస్ లు పడ్డా దు:ఖం తీరట్లేదు..అయ్యో, నేనా మనిషికి ఏ సహాయమూ చెయ్యలేనే అనే బాధ నన్ను తొలిచేస్తోంది.. :( 
అనుభవాలు మనిషికి గట్టిదనాన్ని నేర్పుతాయి అంటారు. రాటుదేలాలి అంటారు. నేనేమిటో రాను రానూ ఇంకా ఇంకా బలహీనంగా, ఏదీ తట్టుకోలేనంత సెన్సిటివ్ గా అయిపోతున్నాను. ఇది తప్పు అని తెలుసు. జీవితంలో అన్నింటినీ తట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కొన్నింటిని మర్చిపోవాలి. నిలబడాలి. పోరాడాలి. బతకాలి. ఉదాహరణగా మిగలాలి.. అంటారు జ్ఞానులు. ఎవరి ఊతమూ లేకుండా నిలబడడం అయితే వచ్చింది ఇన్నేళ్లకి. కానీ ఒక దు:ఖాన్ని చూసి చలించిపోయి, అతలాకుతలం అయిపోయే బలహీనత మాత్రం పోవట్లేదు. ఇలా అన్నింటికీ కదిలిపోతుంటే ఎన్ని వందల మైళ్ళు నడిచి, ఎన్ని రకాల మిల్లెట్లు తిని, ఎన్ని కషాయలు తాగితే మాత్రం లోనున్న రోగం తగ్గుతుంది? నా ఆరోగ్యం కూడా నేను చూసుకోవాలిగా! తామరాకు మీద నీటిబొట్టు స్థాయికి రావాలంటే ఎంతో సాధన కావాలి. భగవంతుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు. శక్తిని ఇవ్వు. అన్నట్లు, నేనొక పనిచెయ్యగలను...అవును.. ఆ మనిషికి సరైన సహాయాన్ని, మార్గాన్ని చూపెట్టమని భగవంతుడిని ప్రార్థించగలను. ఇప్పుడు ఇలా రాయడం వల్లే ఇంత మంచి ఆలోచన వచ్చింది. అవును..ఆ పని చేస్తాను. ప్రార్థిస్తాను. ఆ మనిషి కోసం, నా కోసం కూడా..! ఇలా అనుకుంటే కాస్త ఊరటగా బావుంది.

Thursday, November 28, 2019

రామ్ గారు !!



బ్లాగ్ మొదలెట్టిన ఏడాది తర్వాతేమో నాన్న గురించి సిరీస్ రాసిన తర్వాత ఒకరోజు ఒక కామెంట్ వచ్చింది. కాకినాడలో మీ అన్నయ్యగారి ఫ్రెండ్ ని. నేను ఫలానా. మీ అన్నయ్య మెయిల్ ఐడీ ఇవ్వగలరా? అని. అలా మొదలైన ఒక చిన్న పరిచయం స్నేహశీలత నిండిన ఒక ఆత్మీయ పరిచయంగా మారింది. పరిచయానికీ, స్నేహానికీ మధ్యన ఎక్కడో ఉండే ఒక మధ్య మెట్టులోనే ఆ పరిచయం ఉండేది. అయితే, ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగే రెండు వాక్యాల పలకరింపుల్లో కూడా ఎంతో స్నేహశీలత, ఆప్యాయత తొంగిచూసేవి. సద్భావన, సచ్ఛీలత, సహృదయత నిండుగా మూర్తీభవించిన మనిషి రామ్ గారు. సుప్రసిధ్ధ రచయిత, ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత శ్రీ ఎం.వీ.ఎల్ గారి అబ్బాయి శ్రీ ఎమ్.వీ.ఎస్.రామ్ ప్రసాద్ గారు. ఇది ఆయన బ్లాగ్ లింక్ -
http://mvl-yuvajyothi.blogspot.com/

దాదాపు నేను రెగులర్ గా బ్లాగ్ రాసినన్నాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. చివర చివరలో ఆఫీసు పని వత్తిడులలో చాలా బిజీ అయిపోయారు ఆయన. నేనూ బ్లాగ్ మూసేసాకా అసలు ముఖ పుస్తకం, బ్లాగులు, బ్లాగిళ్ళు...వేటి వంకా కన్నెత్తయినా చూడని కారణంగా గత ఐదేళ్ళుగా అసలు ఏ పలకరింపులూ లేవు. ఆ స్నేహపరిచయం అలా ఆగిపోయింది. 2017 చివర్లో ఎం.వీ.ఎల్ గారి రచనల పుస్తకావిష్కరణ జరిగిందని, మొదటి పేజీలో కృతజ్ఞతలలో మీ పేరు కూడా ఉందని ఆ పేజీ కాపీ పంపించారు. ధన్యవాదాలు తెలిపాను. అదే చివరి ఈ-మెయిల్. 

ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మాత్రం నాన్నగారింట్లో రామ్ గారూ, అన్నయ్య, నేనూ, మా వారూ అంతా కలిసాము. వారం రోజుల క్రితం అన్నయ్య నుంచి వచ్చిన మెసేజ్ చదివి దిగ్భ్రాంతి చెందాను. రామ్ గారి హఠాన్మరణం గురించి!!! ఎంతో దారుణమైన వార్త! నమ్మశక్యం కాని ఆ వార్తను జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇవాళ పొద్దున్నకి ఆయన భౌతికశరీరం ఇండియా వస్తుందని, ఎయిర్పోర్ట్ కి వెళ్తానని అన్నయ్య రాత్రి చెప్పాడు. బహుశా ఈ సమయానికి ఆయన సొంతఊరైన నూజివీడు లో అంతిమకార్యక్రమాలు జరుగుతూ ఉండిఉంటాయి. ఆ ఊరంటే ఎంతో ప్రేమ రామ్ గారికి. కనీసం ఈరకంగా అయినా ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. 

వాళ్ల నాన్నగారి రచనలను వెతికి, వాటిని ప్రచురణ వరకు తీసుకువెళ్లడమే భగవంతుడు ఆయనకు కేటాయించిన ముఖ్యమైన పనేమో! ఆ రకంగా బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఎంతో ప్రతిభ ఉన్న ఒక మంచి మనిషి ఇలా అర్థాంతరంగా వెళ్పోవడం చాలా బాధాకరం. ఆయన ప్రతి మాట, ప్రతి అక్షరం ఎంతో మాజికల్ గా ఉండేవి. ఆయన శ్రధ్ధ పెట్టలేదు కానీ ఎంతో గొప్ప కవి లేదా రచయిత అయి ఉండేవారు రచనా ప్రపంచంలోకి గనుక వచ్చి ఉంటే!  అక్షరాలతో మేజికల్ గా పదాలల్లడంలో ఆయనకు ఆయనే సాటి. రామ్ గారు పండుగలకు శుభాకాంక్షలు తెలుపడం కూడా గమ్మత్తుగా ఉండేది. తెల్ల కాగితంపై అందమైన చేతి వ్రాత తో, ఏ పండగ అయితే ఆ పండుగకు సంబంధించిన పదాలతో అల్లిన ఒక అద్భుతమైన కవిత పి.డి.ఎఫ్ రూపంలో ఈమయిల్ కు అటాచ్ అయి వచ్చేది. అందులో పన్లు,సెటైర్ లు, ప్రాసలూ అనేకం కలగలిపి ఉండేవి. ఈకాలంలో అటువంటి ప్రజ్ఞాశాలిని అరుదుగా చూస్తాము. It's a great loss. I express my deepest condolences to his family.

క్రితం వారం కలిసినప్పుడు అన్నయ్య, రామ్ గారితో తన మొదటి పరిచయం గురించి చెప్పాడు. కాకినాడలో ఓ పాటల పొటీకి వెళ్ళారుట. రామ్ గారు "బ్రోచేవారెవరురా" పాడితే, అన్నయ్య "ఊహా పథాలలో..." అనే లైట్ మ్యూజిక్ సాంగ్ పాడాడుట. "లిరిక్ చాలా బావుంది.. మీరెవరు?" అంటూ వచ్చి పరిచయం చేసుకున్నారుట రామ్ గారు. ఇంజినీరింగ్ కాలేజీలో రామ్ గారు తనకు సీనియర్ అని అప్పుడు తెలిసిందిట. 

కొన్ని పరిచయాలకి పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు కానీ మనసులో ఆ పరిచయానికి ఓ పేరు ఎప్పుడూ ఉంటుంది. రామ్ గారు అనగానే ఆప్యాయంగా పలకరించే ఓ పెద్దన్నయ్య అనిపించేవారు నాకు. బ్లాగింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎన్నో సలహాలు, సూచనలు అందించేవారు. బ్లాగులో ఫీడ్జిట్ కౌంటర్ ఇస్టాల్ చేసుకోమని ఎన్నో సార్లు చెప్పారు. లింక్ కూడా మెయిల్ చేశారు. అప్పట్లో ఎందుకో అది ఇన్స్టాల్ చేయడం సరిగ్గా తెలియలేదు నాకు. ఇందాకా ప్రయత్నించాను కానీ పనిచేయట్లేదు. వేరే ఏదైనా తప్పకుండా ఇన్స్టాల్
చేయడానికి ఇప్పుడన్నా ఆయన కోరిక మేరకు ప్రయత్నిస్తాను. 

రామ్ గారూ! మీరు ఎప్పుడూ చెప్పేవారు కదా.. రాస్తూనే ఉండమని! తప్పకుండా గుర్తుంచుకుంటానండీ! మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
సెలవు...

Friday, November 22, 2019

HINDI RETRO - myTuner Radio app




" my Tuner Radio " ! నా ఫోన్ లో ఇదిక inbuilt app. చాలా కాలంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. కొన్ని అద్భుతమైన వస్తువులు/విషయాలు వాటి విలువ తెలిసేవరకూ అలా అజ్ఞాతంలోనే ఉంటాయి. వాకింగ్ లో వీలుగా ఉంటుందని hands free earphones కొనుక్కున్నాకా సదుపాయం బాగా కుదిరింది కానీ రోజూ వినే ఎఫ్.ఎమ్ రేడియో అందులో వినపడ్డం మానేసింది. గంటకు పైగా ఏమీ వినకుండా నడవడం నావల్ల కాదు. సో, ఆల్టర్నేట్ కోసం వెతుకుతుంటే నా ఫోన్ లోనే ఇన్నాళ్ళూ మూగగా పడి ఉన్న ఈ యాప్ కనబడింది. ట్రై  చేస్తే hands free earphones లో వినపడుతోంది.  ఇదేదో బానే ఉంది అని అన్ని ఛానల్సూ వింటూ వెళ్తూంటే అందులో "HINDI RETRO" స్టేషన్ దగ్గర నా చెవులు ఆగిపోయాయి. ఆ రోజు నుంచీ ఇంట్లో కూడా చెవుల్లో అదే మోగుతోంది. ఈ మత్తు కొన్నాళ్ళలో దిగేది కాదని అర్థమైంది.  ఆ అమృతాన్ని ఇంకెవరన్నా ఆస్వాదించి శ్రవణానందాన్ని పొందుతారని ఇక్కడ రాయడం! ఈ యాప్ ని విడిగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంతకీ "HINDI RETRO" లోని ప్రత్యేకత ఏమిటంటే ఈ స్టేషన్లో నిరంతరం 70s&80s లోని హిట్ హిందీ సాంగ్స్ వస్తూ ఉంటాయి.  ఏ సమయంలో పెట్టినా ఏదో ఒక అద్భుతమైన పాట అమాంతం మన మూడ్ ని మార్చేసి ఆనందంలో ముంచెత్తేస్తుంది. కాబట్టి పాత హిందీ పాటల మీద మక్కువ ఉన్న వారు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఛానల్ ని తప్పకుండా ఆస్వాదించాలని ప్రార్థన :) 
జయహో HINDI RETRO !!

Thursday, November 21, 2019

నిట్టూర్పే మివులు !





కలలు 
కోరికలు
ఆశలు
ఆశయాలు
అపారం!
నిరాశ 
నిట్టూర్పు
అవమానం
అభిమానం
వాటికి అడ్డకట్ట!

గాయాలు మానినా
గురుతులు మానవు
తేదీలు మారినా
తేడాలు మాయవు!

ఉషోదయాల వెంబడి
జ్ఞాపకాల నిశీధి వెన్నంటు!

కనుగొనే ఆనందాలకి 
కన్నీటి పొర ఆకట్టు
చిరునవ్వు చివరన 
నిట్టూర్పే మివులు !

Thursday, September 26, 2019

"జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి" దిగిపోయారుగా!!



రెండేళ్ల క్రితం అనుకుంటా అనుకోకుండా మీ రేడియో టాక్ ఒకటి విన్నాను. మీరు ఎలా రాయటం మొదలుపెట్టారు దగ్గర నుంచీ రచనలు ఎలా చెయ్యాలి మొదలైన విషయాలు టూకీగా పది నిమిషాల్లో చెప్పేసారు. ఒక కన్యాశుల్కం, ఒక బారిస్టర్ పార్వతీశం, ఒక బుడుగు, ఒక మిథునం, ఇల్లేరమ్మ కతలు! అలా గుర్తుండిపోతాయి. అంతే!

Satirical Comedy రాయడంలో మీకు మీరే సాటి. ఆలస్యంగా మొదలుపెట్టినా అతి కొద్ది రచనలతోనే తెలుగు పాఠకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించేసుకున్నారు. Your works will live long సుశీల గారూ. నిండైన జీవితాన్ని చూశారు. ధన్యులు.


సాయంత్రం ఎవరో చెప్తే నమ్మలేదు.. నిజం కాదేమో అనుకున్నాను. కానీ రెండో మెసేజ్ వచ్చేసరికీ నమ్మక తప్పలేదు. చెప్పింది చెప్పినట్లు చెయ్యడం మీకు చిన్నప్పటి నుండీ అలవాటే కదండీ! "జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమే" అని ఎంత తేలికగా చెప్పారు ! అలా అన్నట్టుగానే హటాత్తుగా దిగిపోయారు కూడా :((
చాలా రోజుల క్రితం ఫార్వార్డ్ లో వచ్చింది మీ "ప్రయాణం"! ఎంతగానో నచ్చేసి దాచుకున్నాను.. ఇవాళ ఇలా మీరెళ్ళిపోయాకా ఇక్కడ పోస్ట్ చేస్తానని అనుకోలేదు.



ప్రయాణం                     
-- డా. సోమరాజు సుశీల


పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా?
అప్పుడే వచ్చేసిందా?
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసిమురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!

ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!

నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !

అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, 'మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !

అయినా ఏం లోటయిందని ?వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!

ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….
ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !

ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?

పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు… గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…ఎంత హాయిగా వుందో!
ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!
సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!

ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ .. మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!
అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !

ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
 కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.

అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! 

చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.

అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!

***    ****

మీ పుస్తకం - ముగ్గురు కొలంబస్ లు  గురించి నాలుగు మాటలు..

Monday, August 5, 2019

స్నేహితులు




పైన పద్యంలో చెప్పినట్లుగా ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ద్రవించింది మనసు నిన్న. నా ప్రియమైన స్నేహితులందరినీ కలిసిన తరువాత. అచ్చంగా పాతికేళ్ళ తరువాత ఐదేళ్ళపాటు కలిసి చదువుకున్న మా మారిస్ స్టేల్లా కాలేజీ మిత్రురాళ్ళము కొందరం నిన్న బెజవాడలో కలుసుకున్నాం. టీనేజ్ లో విడిపోయిన మేము మళ్ళీ టీనేజీ పిల్లల తల్లులుగా మారాకా జరిగిన ఈ కలయిక మాలో ఎంత అద్భుతమైన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ నింపిందో అసలు మాటల్లో చెప్పలేను. మరీ దూరాల్లో ఉన్న స్నేహితులను వీడియో కాల్స్ చేసి పలకరించాము. అందరి కళ్ళల్లో సంబరం, ఆశ్చర్యం, ఆత్మీయత! ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు అన్నీ మర్చిపోయి, సంసారాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మేము చిన్నపిల్లలమైపోయి అప్పట్లో క్లాస్ లో లాగ గలగలా గట్టిగట్టిగా మాట్లాడుకుని, ఏమే, ఒసేయ్ అని పిలుచుకుంటూ మహా ఆనందపడిపోయాం. మేము ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా నిన్న "ఫ్రెండ్ షిప్ డే " అవ్వడం మరో గొప్ప కోయిన్సిడెన్స్!!

నాది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా సెక్లూడెడ్ లివింగే. నా కొకూన్ లో, నా కంఫర్ట్ జోన్ లో జీవిస్తూ గడపడం నా స్వభావం. మధ్యలో ఒక్క రెండు మూడేళ్ళు మాత్రం మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాటిని మర్చిపోవడానికి ఎక్కువ భాగం ల్యాప్టాప్ ముందర గడిపాను. అదే నేను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకేలాంటి ఆసక్తులు ఉన్న మనుషులందరూ ఒక్కలాగ ఆలోచిస్తారనుకునే పిచ్చి భ్రమలో ఉండి జీవితాంతం మర్చిపోలేని అవమానాల్ని భరించాల్సి వచ్చింది!! దైవికంగా ఇప్పుడు నా మిత్రురాళ్ల కలయికతో ఆ బాధ అంతమైంది. అంత స్నేహమూ, అంత ప్రేమాభిమానాలూ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదు? కనీసం ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళి, సంసార బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగాలూ, వయసుతో పాటూ వచ్చిన ఆరోగ్య సమస్యలూ... ఒకటా రెండా? సవాలక్ష కారణాలు. నామటుకు నేను గుర్తుకొచ్చినప్పుడు తలుచుకోవడం తప్ప ఏనాడూ గట్టిగా కలవడానికి గానీ, కనీసం మాట్లాడడానికి గానీ ప్రయత్నించలేదు. ఏమో...అలా గడిచిపోయాయి రోజులు.. అంతే. 


" बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम..."
అందరమూ పాతికేళ్ల తర్వాత కలిసినా అదే స్నేహభావం, అదే ఆప్యాయత, అందరి కళ్ళల్లో అదే ప్రేమ. ఇది కదా నిజమైన స్నేహం అంటే. చెప్పుడు మాటలు విని అకారణ ద్వేషభావాల్ని పెంచుకుని మనసుని ముక్కలుచేసే వర్చువల్ స్నేహాల్లాంటివి కావవి. అందరమూ మొత్తం ఐదేళ్ళు 9a.m to 4p.m కలిసిమెలసి గడిపినవాళ్ళం.ఒకరిగురించి ఒకరం పూర్తిగా ఎరిగిన మనుషులము.


ఇంటర్ లో మా స్పెషల్ ఇంగ్లీష్(HSC) గ్రూప్ లో మొత్తం నలభై మందిమి. తర్వాత B.A లో కూడా సేమ్ బ్యాచ్. ఎకనామిక్స్ గ్రూప్, Eng.Litt రెండు గ్రూప్స్ నీ కలిసి ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవారు. క్లాస్ లో మొత్తం ఎనభై, తొంభై మందిమి ఉండేవాళ్ళం. ఆ రెండు సబ్జెక్ట్స్ కీ, లాంగ్వేజెస్ కీ రూమ్స్ మారేవాళ్ళం. లంచ్ టైమ్ లో మా లిట్రేచర్ వాళ్లమందరమూ రౌండ్ గా కూచుని ఒకరి బాక్సెస్ ఒకరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ లంచ్ చేసేవాళ్ళం. పాటలు పాడే అమ్మాయిగా నేను అందరికీ బాగా తెలిసేదాన్ని. మేడమ్ రాకపోతే లీజర్ పిరియడ్ లో నాతో పాటలు పాడించుకునేవారు. డిగ్రీలో నాకు తోడు మరొక సింగర్ క్లాస్ లో జాయిన్ అయ్యాకా నాకు కాస్త రెస్ట్ వచ్చింది. తను చాలా బాగా పాడేది. బోల్డు హై పిచ్. ముఖ్యంగా మల్లీశ్వరిలో పాటలు ఎంత బాగా పాడేదో. నేనైతే "ఎందుకే నీకింత తొందర.." పాటని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేదాన్ని. ఆ పాటల వల్లే నాకు మంచి స్నేహితురాలైంది కూడా తర్వాతర్వాత. ఇప్పుడు కెనడాలో ఉంటోందా రాక్షసి.

విజయవాడకు దగ్గరలో ఉన్న ఊళ్ళవాళ్లందరూ నిన్న వచ్చారు. ఇంతకీ నిన్న కలిసిన వాళ్ళల్లో చాలా మటుకు అందరూ మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీలలో టీచింగ్ ప్రెఫెషన్ లోనే ఉన్నారు. చాలావరకూ పి.హెచ్.డీ కేండిడేట్ లే. ప్రెఫెసర్ గిరీలే! వివరాలు అప్రస్తుతం కానీ ఇలా మంచి పొజిషన్స్ లోకి ఎదిగినవాళ్ళు మా బ్యాచ్లో ఇంకా కొందరున్నారు.

దాదాపు అందరూ వర్కింగే అవడం వల్ల పని ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలూ కూడా కామన్ గానే కనబడ్డాయి మాలో! కానీ నాకు ముఖ్యంగా సంతోషం కలిగించిన విషయం పిల్లలు. అందరూ కూడా పిల్లలని చక్కని క్రమశిక్షణతో, ఉన్నతమైన చదువులు చదివించారు. చదివిస్తున్నారు. బుధ్ధిమంతులుగా పెంచుతున్నారు. మన మంచితనం, మన బాధ్యతా నిర్వహణలే మన పిల్లలకూ మార్గదర్శకంగా మారతాయి. ఇవే కదా మనం పిల్లలకు ఇచ్చే ఆస్తులు. 

నేను గమనించిన ఇంకో సరదా విషయం మా మానసిక ఎదుగుదల. ఒకప్పుడు టీనేజ్ ఆలోచనలతో ఉన్న మేమే మాకు తెలుసు. ఇప్పుడు అందరమూ దాదాపు సగం జీవితాన్ని చూసిన, గడిపిన అనుభవంతో ఉన్నాము. అందువల్ల అందరి మాటల్లోనూ లోతైన అవగాహన, చక్కని పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదంతా జీవితంలో నేర్చుకున్న పాఠలు అనేకన్నా మా కాలేజీ మాకు ఇచ్చిన శిక్షణ వల్లనే అనుకోవడమే సబబు. అప్పట్లో అధ్యాపకులు కూడా ఎంతో ఆదర్శవంతంగా, విజ్ఞానవంతులుగా ఉండేవారు. అలానే బోధించేవారు. ఇప్పుడు కూడా క్లాస్ చెప్పేప్పుడూ ఫలానా మేడమ్ మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాము అని కూడా ఒకరిద్దరు స్నేహితురాళ్ళు అన్నారు నిన్న. అందరు అధ్యాపకులనూ పేరు పేరునా తల్చుకున్నాం. నాలుగైదు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. 

గిఫ్ట్స్ ఎక్ఛెంజ్ చేసుకుని, నెక్స్ట్ మీట్ లోపూ మరికొందరు మిత్రులని వెతికిపట్టుకోవాలనే నిశ్చయంతో, భారమైన హృదయాలతో, కళ్లల్లో నీళ్ళతో, కౌగిలింతలతో వీడ్కోలు చెప్పుకున్నాం. ఏడాదిలో ఒక్కసారైనా ఇలా కలుస్తూ ఉందామర్రా! అని గట్టిగా చెప్పుకున్నాం. అప్పటికే లేటయిపోవడం వల్ల ఇంక వేరే ఎవరినీ కలవకుండానే ఇంటిదారి పట్టాను. దారిలో కృష్ణా బ్యారేజ్ దాటాకా అదేదో పవిత్ర సంగమంట. కృష్ణా,గోదావరుల కలయికా స్థలం. పార్క్ లా డేవలప్ చేశారు. అది మాత్రం చూశాము. రాత్రి ఇల్లు చేరేసరికీ పన్నెండైంది. ఆదివారం కాబట్టి ఇలా కలవడం సాధ్యమైంది అందరికీ. కానీ మరొక్కసారి టీనేజ్ లోకి వెళ్ళి వచ్చినట్లు ఉన్న magical intoxication లోంచి మాత్రం ఎవ్వరమూ ఇంకా బయటకురాలేదు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మా కాలేజీ వాట్సప్ గ్రూప్ లో ఇందాకటిదాకా టింగ్ టింగ్ మని వస్తున్న మెసేజెస్ అందుకు సాక్ష్యం :-)

 స్నేహసుగంధాల మత్తులో, ఈ జ్ఞాపకాలతో మరోసారి మేమందరమూ కలిసే వరకూ బహుసంతోషంతో బతికేయచ్చు అని మాత్రం ధీమాగా అనిపించింది.









Friday, August 2, 2019

ఇప్పపూలు

  


                                                  

ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని  తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత. "ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి. ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద, గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..! వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు, దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.

2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో ఒక  కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావుజీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన, సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు. పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.." అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.

కథాన్వేషణలో 1930 మొదలు 1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా, ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.

ఈ పుస్తకంలోని ముందుమాటలు చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం, శృంగారం, స్త్రీవాదం, కుటుంబ సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం, నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ, గోండు, పరిధాను, బంజార, సవర, మేరియా, చెంచు, కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.

సంకలనంలోని మొదటిదైన "చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది. ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..! " అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను, దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక, తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్ మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.

వాడ్రేవు వీరలక్ష్మి గారి "కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది. "అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం" రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు ’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది. ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి, యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం, ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి. "ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..", "అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..", "గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.

ఇటువంటి గుర్తుండిపోయే కథల ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో, పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా, ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం పట్ల వారి తపన వెల్లడౌతాయి.


Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )